పచ్చదనం పరుచుకున్న ఎర్రకోట
ఎర్రకోట ఎరుపెక్కింది
అన్నదాతల నినాదాల హోరులో
పచ్చదనం పరుచుకున్న ప్రాంగణం
చరిత్రను కొత్తగా లిఖిస్తూ
మువ్వన్నెల పతాకం
రెపరెపలాడే రోజున
రైతుపోరాట జెండాలుఎగురుతున్నాయి
పచ్చదనాన్ని పండించే రైతన్నలు
రాజధాని నడివీదుల్లో
ఆకు పచ్చ కండువాలను ఎగరేస్తూ
ఆక్రోశంతో అన్యాయ చట్టాలను
వ్యతిరేకిస్తూ ఉప్పెనలై
కదిలి తరలి వస్తున్న
జనసంద్రం హోరులో
గణతంత్ర ఉత్సవాలు
జన తంత్ర ఊరేగింపులైన
రోజు నేడు !
రెండు నెలల మౌన ప్రదర్శనలు
అధికారం అలుసుగా చర్చల
చదరంగం ఆటతో వారి
సహన పరీక్ష ముగిసిన రోజు
హలాలన్నీ పొలాలు వీడి
అన్నదాతల గళాలన్నీ
అలసి ఆవేదనతో, అలజడితో,
ఆగ్రహంతో హక్కుల సాధనకై
ఆక్రోశంతో హస్తిన చేరి
వందకు పైగా ప్రాణాలొదిలినా వెరవక గణతంత్ర దినోత్సవాన
రణతంత్ర బాట పట్టి
ఎర్రకోటను కంపింపచేసే వారి
72 రోజుల మహా సంగ్రామమే
నేటి 72 వ గణతంత్రదినం
నాణానికి మరోవేపు
తెలుపు చాటున కనిపించని నలుపు ధైర్యం వదలక సాగుతున్న
మెతుకు వీరుల పోరుకు
అందరం సంఘీభావం
తెలపాల్సిన జనతంత్రపు రోజిది
ప్రశాంత సముద్రులైన
రైతన్నల ఆగ్రహజ్వాలలు
రాజ్యాన్ని కుదిపేయక ముందే
వారి ఉనికిని హరించే
క్రూర చట్టాలను రద్దుచేసి
దేశపు ఆకలిని తీర్చే
అన్నదాతలను వారి
మెతుకు స్వర్గసీమ పొలాలకు
ఆనందంగా సగౌరవంగా
సాగనంపక తప్పదని ఏలేవారు
అహం విడిచి తెలుసుకోవాలి
(ఆగ్రహించిన రైతన్నలు ఎర్ర కోటను ఆక్రమించి రైతు జండాలను ఆవిష్కరించడం TV లో చూసి )
డా. కె. దివాకరా చారి; 9391018972