ఎన్నాళ్లింకా ఎన్నాళ్ళు!?
తానేమయినా …
జాతికి పట్టెడన్నం పెట్టేవాడు
ఎంత హింసించినా
ఎదురుతిరగనివాడు
శాసించనివాడు శపించనివాడు
జారిపోతున్నాడు – రాలిపోతున్నాడు
ఆరుగాలం కష్టించే
ఆడబిడ్డల అయిదోతనాన్ని
అప్పుల ఊబి బలిగొంటోంది
ప్రజాస్వామ్య గద్దెపై నియంతృత్వ వీరంగం
“నీ కష్టం – దానిపై నా ఇష్టం” అంటోంది
అనుకూల చట్టాల్ని తెగ నూరుతోంది
అదేమని అడగ వీల్లేదంటోంది
శ్రమదోపిడీ అరిష్టం దేశాన్ని ఆవహిస్తోంది
“ఇంకానా ఇకపై చెల్లద”ని
పైపంచను విదిలించి నడుంగట్టిన రైతన్నను
గద్దెనెక్కినోడు గుడ్లురుముతున్నాడు
ఊరూరా ఖాకీలను ఉసిగొల్పుతున్నాడు
బువ్వబెట్టేవాడన్న జ్ఞానమన్నా లేకుండ
పంటపండించే చేతిని విరగ్గొట్టిస్తున్నాడు
ద్రవ్యపెట్టుబడి విషకన్య కౌగిట
అర్థశాస్త్ర మేథావులు అలసిపోయారు
దుర్మార్గంపై గర్జించాల్సిన గళాలు
గడ్డిమేస్తున్నాయి
అక్షరాగ్ని గోళాలు కురిపించాల్సిన కాలాలు
అస్త్రసన్యాసం చేశాయి
భస్మాసుర హస్తం కింద మైమరచిన నృత్యాలు
ఎన్నాళ్లింకా ఎన్నాళ్ళు!?
-కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ