చీకట్లో వెలుగురేఖ
అనువాదమే కావచ్చు,కానీ తిరిగి నేను రచనా వ్యాసంగంలో ప్రవేశించేంతగా నా ఆరోగ్యం మెరుగుపడడమే ఒక వింత.ఈ సంవత్సరం మొదట్లో, నేను ఎక్కవ రోజులు బ్రతకలేనంత తీవ్రంగా నా జబ్బు ముదిరింది.హైదరాబాద్ వరకు తీసుకుపోగలమన్న నమ్మకం లేక నన్ను కర్నూలు ఆస్పత్రిలో చేర్చారు.అప్పటికి నేను వ్రాస్తూవచ్చిన ‘ టూకీగా ప్రపంచ చరిత్ర ‘ 4 వ భాగం ముగింపులో ఉంది. ప్రపంచచరిత్రలో చివరిదైన 4 వ భాగాన్ని ప్రచురించలేకపోతాననే దిగులే తప్ప చనిపోతాననే దిగులు నన్ను సోకలేదు.
రెండురోజుల చికిత్స తరువాత,నా స్పెషలిస్టు డాక్టరుతో కాదూకూడదని డిశ్చార్జి చేయించుకొని ఇంటికి తిరిగి వచ్చాను.అప్పటికి కూడా నేను స్వయంగా లేచి కూర్చునే స్థితిలో లేను.కావలసిన వారి సహాయంతో కుర్చీలో కూర్చుని, కొదవున్న అధ్యాయం వరకూ పూరించగలిగానేగానీ,అనుకున్న ముగింపుకు చేర్చలేకపోయాను.
చనిపోయే ముందు ప్రచురితమైన 4వ భాగాన్ని కళ్ళతో చూస్తే చాలానే తపనతో,ముగింపుకు మరో మూడు అధ్యాయాలు కొరతగా ఉన్నా దాన్ని ముద్రణకు పంపించాను. పదిరోజుల తరువాత అచ్చై వచ్చిన ప్రతిని చూసి నా మనసు నిండి పోయింది.
తిరిగి ఆస్పత్రిలో చేరాను.నా మానసికోల్లాసం నా అవయవాలకు బలాన్ని చేకూర్చింది.ఆరోగ్యం వీలైనంతగా కోలుకొని ఇంటికి తిరిగి వచ్చాను.వచ్చింది ఎక్కడికైనా స్వేచ్చగా ఎక్కడికైనా వెళ్లగల మనిషిగా కాదు. అహర్నిశలూ ఆక్సిజన్ సహాయంతో మంచం దిగకూడని మనిషిగా.రెండు నెలలకు నాకై నేను కూచోగలిగిన స్థితికి కోలుకున్నాను.
బలహీనతతో చేతులు విపరీతంగా వణికేవి.మంచినీళ్ళు కూడా మరొకరు తాపవలసిందే.
రోజంతా ఇంటికి పరిమితమై,పొద్దు పుచ్చు కోవడం కష్టమై,ఇష్టమైన పుస్తకాలు చదవటం మొదలు పెట్టాను.తెలుగులో ప్రాచీన సాహిత్యం మొత్తం పూర్తిచేశాను. ఇంగ్లీషు సాహిత్యం చదువుతున్న సందర్భంలో మ్యాగ్జిం గోర్కి(Maxim Gorky) గారి ‘ మదర్ ‘ (Mother) నవల తారస పడింది. యాభైయ్యేళ్ళ క్రితం అది ఎంతోమంది మహా రచయితలతో తెలుగులోకి అనువదించబడి, ప్రాచుర్యం పొందిన నవల.ఆ అనువాదాలేవీ ఇప్పుడు అందుబాటులో లేవు.మళ్ళీ అనువదిస్తే మంచిదని తోచింది.నా చేతుల వణుకు చాలా వరకు తగ్గడం నా ప్రయత్నానికి అనుకూలించింది. నాకిదొక మహత్తరమైన అవకాశం.
– ఎం.వి.రమణారెడ్డి
(Shared by Dr.c.obula Reddy)