ఆప్గన్ వాస్తవాలను వక్రీకరిస్తున్న దెవరు?

(ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

దోహా కేంద్రంగా అనేక రౌండ్ల చర్చల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుండి విదేశీ సైనిక నిష్క్రమణ పై 29-2-2020న అమెరికా, తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరిందని పైన పేర్కొనడం జరిగింది. ఆ ఒప్పందంలో ఘనీ ప్రభుత్వం భాగస్వామి కాదు. దాన్ని చర్చల్లో భాగస్వామిని చేయాలని అమెరికా చేసిన ప్రయత్నాన్ని తాలిబన్లు ఒప్పుకోలేదు. దానికి తాలిబన్ల వాదన క్రింది విధంగా ఉంది.

“మా ఆఫ్ఘనిస్తాన్ దేశం పై మీఅమెరికా యుద్ధం చేసింది. మా దేశాన్ని ఇరవై ఏళ్లు మీ అమెరికాయే దౌర్జన్యంతో పరిపాలించింది. మా దేశాన్ని అణిచి పాలించిన రాజ్యంగా స్వంత ఉనికి మీ అమెరికాకి వుంది. మీ అమెరికా చేతిలో పెంపుడు బిడ్డ వంటి ఘనీ సర్కార్ కి స్వంత ఉనికిలేదు. అమెరికా లేకుండా ఒక్కరోజు కూడా ఘనీ సర్కార్ మా దేశాన్ని పరిపాలించలేదు. దౌర్జన్య రాజ్య పాలననైనా, 20 ఏళ్ళ పాటు పాలించిన చరిత్ర మీ అమెరికాకి ఉంది. మా ఆఫ్ఘనిస్తాన్ ని పాలించే అధికారాన్ని శాశ్వతంగా వదిలేసే ఏకైక ప్రాతిపదికన మాత్రమే మీ అమెరికాతో మా చర్చలకు అర్ధం వుంది. ఆఫ్ఘనిస్తాన్ ని ఆఫ్ఘనిస్తాన్ సర్కారే పరిపాలిస్తున్నట్లుగా ప్రపంచ ప్రజల్ని వంచించే దురుద్దేశ్యంతో మీ అమెరికా నియమించిన కీలుబొమ్మ ఘనీ సర్కార్ కి ఈ చర్చల్లో పాల్గొనడానికి ఆమోదించే ప్రాతిపదిక లేదు. దాన్ని గుర్తించడమంటే, మా దేశ ప్రజల భాగస్వామ్యత లేకుండా ఎన్నికైన మీ తొత్తు సర్కార్ కి రాజకీయంగా మేం ఆమోదం తెలపడమే. మీ తొత్తు సర్కార్ ఎన్నిక కోసం ఓ దురాక్రమణ రాజ్యంగా మీ అమెరికా నిర్వహించిన బూటకపు ఎన్నికల తంతుకి ఆమోదం తెలపడమే. అది మా దేశ సార్వభౌమాధికార హక్కును నిరాకరించడమే. మాదేశాన్ని మీకు మీరే నాడు యుద్ధంతో దురాక్రమించారు. నేడు మీ అమెరికాయే తనకు తానే మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్నది. మా దేశాన్ని విడిచి వెళ్లే ప్రాతిపదికపై మాత్రమే మా దేశ ప్రజల తరపున మేం పాల్గొనే ఈ చర్చల్లో ఏ రీత్యా కూడా మీ కీలుబొమ్మ ఘనీ సర్కార్ భాగస్వామి అయ్యే రాజకీయ, భౌతిక ప్రాతిపదిక లేదు. గాన ఘనీ సర్కార్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు.”


ఆఫ్ఘన్ పై సామ్రాజ్యవాద మీడియా నిందా ప్రచారం : నిజాలు -8


దోహా చర్చల్లో ఘనీ సర్కార్ భాగస్వామ్యతను కోరుతూ అమెరికా చేసిన ప్రతిపాదనపై తాలిబన్ల వాదనల సారాంశాన్ని పై పేరాలో పేర్కొనడమైనది.

ఈ వాదనలు ఏవీ సామ్రాజ్యవాద మీడియాలో చోటుచేసుకోలేదు. పైగా తద్భిన్నమైన ప్రచారం జరిగింది. “పరాయి అమెరికాని సైతం గుర్తిస్తోన్న తాలిబన్లు తమ స్వంత ఆఫ్ఘన్ సర్కార్ ని గుర్తించక పోవడంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు నేడు వెల్లువెత్తుతున్నాయి” అంటూ మీడియా ప్రచారం సాగింది. “విశ్వసనీయ వార్తల” పేరిట సామ్రాజ్యవాద మీడియా వార్తల్ని వండి వార్చింది. ఘనీ సర్కార్ తో చర్చకపోవడం అప్రజాస్వామికమని గానీ, బాధ్యతారాహిత్యం అని గానీ తాలిబన్లని విమర్శించే హక్కు ఉంది. కానీ వాస్తవాలను వక్రీకరించడం సరికాదు. అదే సామ్రాజ్యవాద మీడియా వైపు నుంచి జరిగడం గమనార్హం.

మరో ప్రస్తావానాంశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి శాశ్వత నిష్క్రమణ ప్రక్రియలో భాగంగా ఎవరిని తరలించాలన్నా, అట్టి బాధ్యత అమెరికాపై ఉందని తాలిబన్లు వాదించారు. తన యంత్రాంగంతో పాటు, నాటో కూటమి దేశాల యంత్రాంగాన్ని తరలించే బాధ్యతని తీసుకొని, తాను తప్పించుకోవాలని ఒక దశలో అమెరికా ప్రయత్నం చేసింది. కానీ తాలిబన్లు అంగీకరించలేదు. వారి వాదన క్రింది విధంగా వుంది.

“మా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ఇప్పటి వరకు పరిపాలించిన దురాక్రమణ శక్తి (occupied force)గా అమెరికా దేశాన్ని గుర్తిస్తున్నాం. మీ అమెరికా, నాటో కూటమి దేశాలు తప్ప మిగిలిన ప్రపంచ దేశాలేవీ మా దేశాన్ని పాలించాలని ఇక్కడకి రాలేదు. వాటిని మీ అమెరికా సొంత బాధ్యతతో ఆహ్వానించింది. కాబూల్ లో దేశదేశాల ఎంబసీల్ని మీ ఆమెరికా నెలకొల్పించింది. ఆయాదేశాల కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు, వ్యాపార, వర్తక, వాణిజ్యాధి విభాగాలు మీ అమెరికాయే తన  సొంత బాధ్యతతో మా ఆఫ్ఘనిస్తాన్ కి వచ్చాయి. మీ అమెరికా సైన్యం లేకుండా అవేవీ మా దేశం రాలేదు. మీ బాధ్యతతో మా ఆఫ్ఘనిస్తాన్ కి వచ్చిన ప్రపంచ దేశాలను వెనక్కి తరలిస్తూ వేర్వేరు ఒప్పందాలు చేసే బాధ్యత మాది కాదు. మా దేశాన్ని విడిచి వెళ్తున్న వేళ, మీరు తీసుకొచ్చిన ప్రపంచ దేశాల యంత్రాoగాల్ని కూడా మీ అమెరికా సొంత బాధ్యతతో తీసుకెళ్లాలి. వారిని తీసుకెళ్లే తుది గడువుకు ముందే మా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని పాలించే అవకాశం మాకు లభించినా, ప్రభుత్వ పాలనా బాధ్యతల్ని చేపట్టబోము. గడువు ముగిసే వరకూ కాబూల్ నుండి మీ అమెరికా చేపట్టే తరలింపు ప్రక్రియకి ఎలాంటి ఆటంకం రానివ్వకుండా, మా వైపు నుండి సాయం ఉంటుంది”

పైన పేర్కొన్న తాలిబన్ల వాదనలకి అమెరికా తలొగ్గింది. ఇండియాతో సహా ప్రపంచ దేశాల పౌరుల తరలింపు బాధ్యత ప్రధానంగా అమెరికా మీద పడింది. ఈ క్షేత్రస్థాయి వాస్తవ భౌతిక స్థితి తెలియక పోతే, కాబూల్ ఎయిర్ పోర్టు దుర్ఘటన యొక్క నేపధ్యం కూడా అర్ధం కాదు.

మరో ప్రస్తావానాంశం కూడా ఉంది. కాబూల్ నుండి నాటో కూటమి, అమెరికా దేశాల సేన సహా పౌరుల తరలింపుకి విధివిధానాల (Modalities) పై కూడా అమెరికా, తాలిబన్ల మధ్య అవగాహన కుదిరింది. ఆ ప్రకారం ఏఏ దేశాల నుంచి ఎవరెవరు ఏఏ రోజుల్లో ఏఏ టైమింగ్స్ లో ఎయిర్ పోర్టు కి చేరతారో, అట్టి పేర్ల జాబితాను తాలిబన్లకు ముందే అమెరికా అధికార్లు అందించాలి. కాబూల్ లోని తమ నివాసాలు లేదా కార్యాలయాల నుండి ఎయిర్ పోర్టుకు వచ్చే సందర్భాలలో వారికి ఇబ్బందులు కలగకుండా తాలిబన్లు సహకరించాలి.

మరో ప్రస్తావనాంశం కూడా ఉంది. 31-8-2021లోపు సంకీర్ణ సేనలు, ఇతర విదేశీ పౌరులు ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలగాలి. ఆ లోపు వారిపై దాడులు చేయబోమని అమెరికాకి తాలిబన్లు హామీ ఇచ్చారు. వారిచ్చిన హామీలలో ఘనీ ప్రభుత్వ సైనిక బలగాల పై పోరాడబోమనే హామీ లేదు. ఘనీ సర్కార్ పై యుద్ధం చేసే హక్కుని రిజర్వ్ చేసుకున్నారు. దాన్ని కూల్చివేసే అవకాశం కూడా తాలిబన్లకు వుంటుంది. ఐతే, నిష్క్రమణ గడువుకు ముందే కాబూల్ ని ఒకవేళ తాలిబన్లు కైవసం చేసుకున్నా, ఆగస్టు 31 లోపు కాబూల్ లో వారు అధికారం చేపట్టబోరు. అప్పటివరకూ అమెరికాయే అధికారిక స్థానంలో ఉంటుంది.

మరో ప్రస్తావనాంశం కూడా ఉంది. కాబూల్ ఎయిర్ పోర్టు నిర్వాహణ బాధ్యత ఆగస్టు 31న అర్ధరాత్రి 12 గంటల వరకు అధికారికంగా అమెరికా సైన్యం చేతుల్లోనే ఉంటుంది. ఆరు వేల మంది అమెరికన్ సైనికుల కాపలాగా వుంటారు. మరో 900 మంది బ్రిటీష్ సైనికులు కూడా వుంటారు. సాపేక్షికంగా సైనిక సాంద్రత అత్యధికంగా ఉన్నట్లే! ఇంకా, వివిధ విదేశీ రాయబార కార్యాలయాలు అమెరికా పర్యవేక్షణలో ఉంటాయి. (చివరి రోజుల్లో అమెరికా సేనల ఆధ్వర్యంలో వాటిని కాబూల్ నగరం నుండి క్రమంగా ఖాళీ చేసి, కాబూల్ ఎయిర్ పోర్టుకు తరలించడం గమనార్హం) అదే విధంగా అమెరికా సహా విదేశీ మీడియా వర్గాలు ఎయిర్ పోర్టును కేంద్రంగా చేసుకుని, వార్తా ప్రసారం, ప్రచారం చేస్తూ ఉన్నాయి. అంటే సమాచార సామ్రాజ్యవాద వ్యవస్థ ఇంకా కాబూల్ కేంద్రంగా వర్ధిల్లుతూనే ఉండటం గమనార్హం.

ఆగస్టు 14 వ తేదీ తాలిబాన్ సాయుధ గెరిల్లా సైనిక దళాలు కాబూల్ శివార్లకి చేరాయి. 15 న నగరంలోకి ప్రవేశించాయి. ఇరవై ఏళ్ళ పాటు పరస్పరం భీకర యుద్ధం చేసిన రెండు శత్రు సైన్యాలు కాబూల్ నగరం లో పరస్పరం ముఖముఖిగా తుపాకులతో సాయుధంగా నిలబడి, పరస్పరం కాల్పులు సాగించుకోకుండా ప్రశాంతంగా ఉన్న అపురూప రాజకీయ దృశ్యం ఆగస్టు 15న కాబూల్ లో అవిష్కృతం కావడం ఓ విశేషం.

చరిత్రలో “మహా సామ్రాజ్యాలకు శ్మశాన వాటిక” (Grave yard of great empires) గా పేరొందిన ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఈ అపురూప, అపూర్వ, అనూహ్య రాజకీయ సన్నివేశం తటష్టించడం నాడు ప్రపంచ రాజకీయ పరిశీలక వర్గాల్ని విస్మయానికి గురి చేసింది. ఆ మరునాడే 16న “కాబూల్ ఎయిర్ పోర్టు మానవ విషాదం” ఎందుకు జరిగింది?

పైన పేర్కొన్న ఆనాటి వాస్తవిక భౌతిక పరిస్థితి పట్ల స్పష్టత ఉంటేనే, ఆగస్టు16న జరిగిన దుర్ఘటనకు కారణాల్ని అర్ధం చేసుకోగలం. అందుకే నేపధ్యం (Back ground) ని వివరించాల్సి వచ్చింది. 16న కాబూల్ ఎయిర్ పోర్టు దుర్ఘటన ఎందుకు జరిగిందో రేపు 9వ భాగంలో తెలుసుకుందాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *