ఆఫ్గన్ లో అమెరికా చేసిన యుద్ధ స్వభావం ఏమిటి?

రచన : పాట్రిక్ మార్టిన్WSWS.org  ప్రచురణ. 20/08/2021;  

 అనువాదం: డాక్టర్. యస్. జతిన్ కుమార్ 

ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ దళాలు పరాజయ పరాభవంతో, నిరాశాజనకంగా వెనుదిరిగిన తరువాత, కార్పొరేట్ పత్రికలు మధ్య ఆసియా దేశ నివాసితుల “మానవ హక్కుల” కోసం తెగ బాధపడిపోతూ ఆందోళనలను లేవనెత్తే అంతర్జాతీయ ప్రచారాన్ని ప్రారంభించాయి.

గత 20 సంవత్సరాలుగా, ప్రపంచంలోని కార్పొరేట్ మీడియా, సామ్రాజ్యవాద శక్తులు [అమెరికా] 100,000 మందికి పైగా ఆఫ్ఘాన్లను చంపుతున్నప్పుడు, బ్లాక్ సైట్ హింసా గదులను ఏర్పాటు చేసినప్పుడు, డ్రోన్ హత్యలు చేస్తున్నప్పుడు, ఆ దేశం యొక్క వనరులను దోచుకుంటున్నప్పుడు ఎటువంటి అభ్యంతరాలను లేవనెత్తలేదు. ఇతర సామ్రాజ్యవాద శక్తులు ఈ దురాక్రమణలో అమెరికాతో చేరాయి. కార్పొరేట్ పత్రికలు ఆఫ్ఘన్ యుద్ధాన్ని “న్యాయమైన కారణం”తో జరుగుతున్నదని  అభివర్ణించడం  ద్వారా సామ్రాజ్యవాదుల  భయంకరమైన నేరాలను సమర్ధించుకోవడం సులభతరం అయ్యింది. ఇది సెప్టెంబర్ 11, 2001 ఘటనకు అవసరమైన ప్రతిస్పందన అని సమర్థించారు. అదే సమయంలో-జూలియన్ అసాంజే, చెల్సియా మానింగ్, డేనియల్ హేల్ వంటి అనేకమందిని-  ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా చేస్తున్నయుద్ధం యొక్క నిజ స్వభావం బహిర్గతం చేసిన వారిని- జైలులో బంధించారు..

2001 లో ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా దురాక్రమణ సక్రమమైనదనే అభిప్రాయం ప్రపంచ ప్రజలకు”విక్రయించడానికి” కార్పొరేట్ మీడియా ఇప్పటివరకూ ఉపయోగించిన అన్నికథనాలు, వ్యాఖ్యానాలు అరిగిపోయినప్పటికీ, ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించ బడుతున్నాయి. ఇది రెండు ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది: గతంలో అమెరికా చేసిన యుద్ధ నేరాలను కప్పి పుచ్చడానికి,  యుద్ధంతో దెబ్బతిన్నజనాభాపై సామ్రాజ్యవాద ఒత్తిడిని తీవ్రతరం చేయడానికి,ఈ స్థితిని అంగీకరించేలా ప్రజాభిప్రాయాన్ని సిద్ధం చేయడానికి  ఉపయోగ పడుతుంది. 

 


ఆఫ్ఘనిస్థాన్ పై ముమ్మరంగా అబద్ధాల ప్రచార యుద్ధం


కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన కొన్ని చిన్న నిరసనలను అణచివేసినట్లు వస్తున్ననివేదికలు, ఆ “వ్యతిరేకత” యొక్క స్వభావం గురించి కొన్ని వివరాలను ఇస్తున్నాయి. నిరసనలలో నిమగ్నమైన వారు అమెరికా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ లో వదిలిపెట్టిన వేలాది మంది సిఐఎ ఏజెంట్లు,”కాంట్రాక్టర్ల” ప్రేరణతో వ్యవహరిస్తున్నారని  అవి తెలియ జేస్తాయి. 

అయితే, అణచివేతపై మీడియా ప్రచారానిది రెండు నాల్కల ధోరణి. ఈ వారం జలాలాబాద్ లేదా కాబూల్ లో జరిగిన  హత్యాకాండ, గత 20 సంవత్సరాల కాలమంతా వారానికోసారి అమెరికా నిర్వహిస్తూ వచ్చిన సామూహిక హత్యాకాండలతో పోలిస్తే ఏ మాత్రం గణనీయమైనది కాదు. అప్పుడు నోరెత్తని మీడియా ఇప్పుడు ఇంత తీవ్రమైన వ్యతిరేకతతో అభిశంసించటం అర్ధ విహీనం.

ఈజిప్టు సైనిక నియంత అబ్దెల్ ఫతా ఎల్-సిసి పై మీడియా ఏనాడూ విమర్శనాయుధాలు సంధించలేదు. ఆయన నాయకత్వంలో 2013లో  సైనిక తిరుగుబాటు జరిగిన తరువాత, ప్రజలు నిర్వహించిన ఒక ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనమీద విరుచుకుపడి అతని దళాలు, పోలీసులు వెయ్యిమందికి పైగా నిరసనకారులను చంపారు. వేలాదిమందిని ఖైదు చేశారు. ఎందరికో మరణశిక్ష విధించారు. అలాటి అబ్దుల్ ఫతాహ్ ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో యుఎస్ విదేశాంగ విధానాన్ని సమర్థించే మూలస్తంభాలలో ఒకరు. 

డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు, మొత్తం కార్పొరేట్ మీడియా  మొత్తం ఆఫ్ఘన్ మహిళల దుస్థితి పట్ల బహుళ శ్రద్ధ ఆసక్తులతో చేస్తున్న పవిత్రమైన ఖండనలతో నిండి వుంటున్నాయి. అమెరికా సైనికులు, డ్రోన్ దాడుల్లో వందలాది మహిళలను చంపి వేసినప్పుడు, లేదా వారి దురాక్రమణ, దండయాత్రలతో  విధ్వంసమై పోయిన జీవితాలతో  సామాజిక పతనం ద్వారా పదుల సంఖ్యలో ఆఫ్ఘన్ మహిళలు మరణించినప్పుడు, ఇదే రిపబ్లిక్, డెమక్రాటిక్ రాజకీయ వ్యవస్థ ఎందుకని ఏమాత్రం  పట్టించుకోలేదు?

డెమొక్రటిక్ పార్టీకీ, గుర్తింపు రాజకీయాలకీ  గొంతులా వ్యవహరించే న్యూయార్క్ టైమ్స్ ఈ విషయం లో ముందుండి  నాయకత్వం వహిస్తోంది. బాలికల విద్య కోసం ఒకనాడు గొంతెత్తి నినదించిన యువతి, పాకిస్తాన్  తాలిబన్ల హత్యా ప్రయత్నం నుండి బయటపడిన మలాలా యూసెఫ్జాయ్ యొక్క’ఆప్-ఎడ్’ కాలమ్ ను ప్రచురించింది. “ఆఫ్ఘన్ మహిళలు, బాలికల స్వరాలను వినమని ఆమె అమెరికన్లను కోరుతోంది. ఆ బాలికలు రక్షణ కోసం, విద్య కోసం, స్వేచ్ఛ కోసం, వారికి వాగ్దానం చేయబడ్డ భవిష్యత్తు కోసం అడుగుతున్నారు …” అని మలాల అంటోంది. 

మీడియా పాటిస్తున్న  ద్వంద్వ ప్రమాణాలు చూస్తే దిగ్భ్రాంతికరంగా వుంటుంది. అరబ్ దేశాలలో అమెరికాకు  అత్యంత  మిత్రదేశం సౌదీ అరేబియా. అక్కడ మహిళలు ఒక పురుష బంధువు తోడు వుంటేనే తప్ప డ్రైవింగ్చేయ కూడదు. ఓటు కోసం రాకూడదు. అసలు మగవాడి తోడు లేకుండా ఆ మహిళలు బహిరంగంగా కనిపించనే లేరు. వ్యభిచారం అనేది మరణశిక్ష విధించే నేరం, సున్నీ-ఆధారిత రాచరికానికి రాజకీయ వ్యతిరేకతలో నిమగ్నమైన షియా వ్యక్తుల సామూహిక శిరచ్ఛేదనలు ఎన్నిజరిగాయో లెక్క లేదు. .

ఈ అనాగరిక పద్ధతులేవీ  యెమెన్ లో కొనసాగుతున్న సౌదీ యుద్ధాన్ని సాధ్యం చేసే పెంటగాన్ యొక్క సన్నిహిత సహకారాన్ని ప్రశ్నించలేదు. సౌదీ, ఎమన్ పై యుద్ధంలో సామూహిక ఆకలిని ఒక ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తోంది, ఇది అమెరికా ఉపగ్రహ ఇంటెలిజెన్స్ మార్గనిర్దేశం చేస్తున్న వైమానిక దాడుల ద్వారా, నావికా దిగ్బంధం ద్వారా అమలు చేయబడుతోంది. 

మీడియా, సైనిక-రాజకీయ వ్యవస్థ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇక పై అల్ ఖైదాకు “సురక్షిత స్వర్గం” [ఆశ్రయం] గా మారుతుందనే ఆందోళనలను వెలిబుచ్చుతోంది. పునరావృతం చేస్తోంది. ఈ ప్రచారం ఇంతకు ముందు నుంచీ వింటున్నదే. సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడులు జరిగిన నెల తర్వాత 2001 అక్టోబరులో అమెరికా ఆక్రమణకు పూనుకోవటానికి చెప్పిన ప్రధానమైన సాకు ఇదే.

ఆఫ్ఘనిస్థాన్లో  సోవియట్ మద్దతు గల ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన గెరిల్లా యుద్ధంలో భాగంగా,ఇస్లామిక్ ఛాందస వాదులు 1980లలో ఒసామా బిన్ లాడెన్ నాయకత్వంలో అల్ ఖైదాను మొదటిసారి ఏర్పాటు చేశారని దానికి అమెరికా మద్దతు ఇచ్చిందనీ  చాలా కాలంగా తెలుసు. అయితే తరువాతి పరిణామాలలో  అమెరికా పట్ల కొంతకాలం పరమ శత్రుత్వం వహించింది అల్ ఖైదా సంస్థ. అమెరికా పై 2001లో  ఉగ్రవాద దాడులు కూడా నిర్వహించింది .కానీ ఆ తరువాత లిబియా,సిరియా రెండింటిలోనూ అమెరికా సామ్రాజ్యవాదానికి సాధనంగా ఉపయోగ పడింది. తన మూలాలకు తిరిగి వచ్చింది.

గడాఫీ పాలనకు వ్యతిరేకంగా ఇస్లామిస్టులు భూయుద్ధాన్ని నిర్వహించిన సమయంలో, నాటో బాంబు దాడి దళాల  కమాండర్;  లిబియాలో తమ పాత్రను “అల్ ఖైదా వైమానిక దళం” గా వ్యవహరించడమే నని  అభివర్ణించు కున్నాడు.  సిరియాలో అల్ ఖైదా, దాని శాఖ ఐసిస్- రెండూ సౌదీ అరేబియా,ఖతార్ వంటి అమెరికా మిత్రదేశాల నుండి మద్దతును పొందాయి, అలాగే సిఐఎ నుండి ప్రత్యక్ష మద్దతును కూడా పొందాయి.

ఇంతలో, ఆఫ్ఘనిస్తాన్ లో పట్టు సాధించడానికి ఐసిస్ చేసిన ప్రయత్నాలు; తాలిబాన్లు,హక్కానీ నెట్ వర్క్ వంటి వారి మిత్రుల మిలీషియాతో హింసాత్మక ఘర్షణలకు దారితీసాయి. ఆఫ్ఘనిస్తాన్ నుండి పుట్టుకొస్తున్నఅమెరికా వ్యతిరేక ఉగ్రవాదం యొక్క ప్రమాదం గురించి పదే పదే లేవనెత్తే వారు కాబూల్ లో కొత్త పాలన ద్వారా వాస్తవంగా  ఏ  ఉగ్రవాదులు బలపడుతున్నారో ఇంతవరకూ గుర్తించ లేకపోయారు.

గురువారం ఉదయం ఎబిసి న్యూస్ ప్రసారానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బైడన్, కాబూల్ విమానాశ్రయం నుండి యుఎస్ దళాల  తరలింపు కార్యకలాపాలను పూర్తి చేయడానికి ఆగస్టు 31 అంతిమగడువు కాదనీ  “అమెరికన్ పౌరులు మిగిలి ఉంటే, వారందరినీ బయటకు తీసుకువచ్చే వరకు తాము అక్కడే  ఉంటాము,” అని స్పష్టంగా  చెప్పారు . ఇది గతంలో ప్రకటించిన  దానికి భిన్నంగా వుండటమే కాదు, ఆ విధానాన్ని తిప్పికొట్టాలనే వారి ఒత్తిడికి లోనయి, బైడన్  తన విధానాన్ని కొంత సడలించి నట్లు కూడ వుంది. అంతే కాదు ఈ సూత్రీకరణ తో  కాబూల్ విమానాశ్రయంపై అమెరికా తన ఆక్రమణను దాదాపు నిరవధికంగా పొడిగించడాన్ని సమర్థించు కోవడానికి, ఆఫ్ఘన్ దేశానికి వ్యతిరేకంగా అమెరికన్ సైనిక దురాక్రమణను పునరుద్ధరించడానికి కూడా ఉపయోగపడుతుంది.

అయితే, ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా దురాక్రమణ పునరుద్ధరణకు మరింత ప్రాథమిక అడ్డంకి ఆ హింసకు గురిఅయిన   ఆ దేశంలో లేదు. యునైటెడ్ స్టేట్స్ లోనే ఆ వ్యతిరేకత వుంది. ఆఫ్ఘన్ తోలుబొమ్మ పాలన పతనం యొక్క చివరి వారంలో అసోసియేటెడ్ ప్రెస్ నిర్వహించిన ఒక పోల్ లో ఇంటర్వ్యూ చేయబడిన వారిలో దాదాపు మూడింట రెండు వంతులు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ”పోరాడటానికి తగినది కాద”ని భావించారు.

ఆఫ్ఘనిస్తాన్ లో తదుపరి జోక్యాన్ని అమెరికన్ ప్రజలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. యుద్ధం కోసం మీడియా చేస్తున్న  ప్రచారం యొక్క ఉన్మాద స్వభావానికి ఇదీ ఒక కారణం. యుఎస్ జనాభాలో అధిక సంఖ్యాకులపై తన రాజకీయ పట్టును కోల్పోతున్నాననే యుఎస్ పాలక వర్గం భయాన్నిఇది వ్యక్తం చేస్తోంది. మీడియా సంస్థల ప్రచారం  ద్వారా  తన పట్టును తిరిగి సాధించే ప్రయత్నం చేస్తోంది. అమెరికన్ ప్రజలు, అన్నింటికంటే ముఖ్యంగా అమెరికన్ కార్మిక వర్గం, యుద్ధం-శాంతి యొక్క కీలకమైన ప్రశ్నల గురించి తమ స్వంత నిర్ధారణలకు వస్తున్నారు. అమెరికన్ పెట్టుబడిదారీ విధానం యొక్క సామాజిక, ఆర్థిక,రాజకీయ నిర్మాణాలను వారు ప్రశ్నిస్తున్నారు.

(డా. జతిన్ కుమార్, ఆర్థోపెడిక్ సర్జన్, హైదరాబాద్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *