తెలుగుభాష (కవిత)

తెలుగుభాష

తే.దేశభాషలందు
తేజరిల్లెడుభాష
అందచందముల
“అజంతభాష”
పలుకులందుతేనె
లొలుకుచుండెడిభాష
పలుకవలయుగాదె
*తెలుగుభాష*

పదము పదము చూడ
ముదమైన నడకయే
పలుకు పలుకు నందు
నొలుకు తేనె,
అక్షరమ్ములన్ని
అందచందాలతో
నలరుగాదె నాదు
*తెలుగుభాష*

బాసలోని తీపి,
ప్రాంతీయమగుపల్కు
యాసలోని సొంపు,
అక్షరాల-
అందమైనరూపు
డెందమ్మునలరించు,
పలుకవలయుగాదె
*తెలుగుభాష*

రమ్యమైన అక్షరాల
పంక్తులు చూప-
రులకు కనులవిందు
కలుగజేయు,
తేనెలొలుకు పలుకు
వీనులకునువిందు
కలుగజేయు నాదు
*తెలుగుభాష*

భావ సుప్రకటన
గావింపగా తెల్గు
బాసకన్న మిన్న
బాసలేదు,
అన్యభాష మాట
లాడనేలకొ!పల్కు
తెలుగువా‌రితోడ
*తెలుగుభాష*

వాసికెక్కినట్టి
బాసలందెన్నగా
తెలుగుబాసయందు
నలరినట్టి
అక్షరాలసంఖ్య
అధికమ్ముగావున
తలపు దెలుప సులువు
*తెలుగుభాష*

వాక్కులందు స్వీయ
భావాలు చిత్రించి
రససమర్పణమ్ము
వెసదలిర్ప
దేవభాషతోడ
దీటుగా పలుకును
లలిత వాగ్విభూష
*తెలుగుభాష*

తరతరాలుగాను
తరలివచ్చిన పూర్వ
వైభవాలచాటు
పలుకు లెన్నొ!
తెలుగువారి సంస్కృ
తులు గర్భితమ్మైన
పలుకు లలరు గాదె!
*తెలుగుభాష*

తెలుగుపలుకుతీపి,
తెలుగక్షరమ్ములు
మురువులొలుకు గుండు
ముత్తియములు,
మాటతీరునెన్న
మరిచాల మృదులమ్ము
లలిత పద విభాస
*తెలుగుభాష*

అమరవాణి బింక,
మరవ మెత్తదనమ్ము,
తత్సమాలు,దేశ్య,
తద్భవాలు-
పుష్కలమ్ముగాను
పొలుపొందు సుమధుర
లలితవాగ్విలాస
*తెలుగుభాష*

భారతోర్వినున్న
బాసలందెన్నగా
తెలుగుబాసకున్న
ఘనగుణాల
నెరుక గలిగిచూడ
నే భాషకునులేవు
లలిత పద విభాస
*తెలుగుభాష*

అరవబాసనెన్న
అమృతాన్నమది కదా!
కన్నడమ్మునెన్న
కస్తురి కద!
తెనుగుబాసనెన్న
తియ్యతేనియ కదా!
పలుకవలయు మనము
*తెలుగుభాష*

గానమునకు ననువుగానుండి
పొలుపారు
చెవులకింపు నింపి
చెలువు మీ‌రు,
ఇద్ది ప్రాచ్యఖండ ”పిటలిభాషయె”
యంచు
పలికినాడు “హెన్రి”
*తెలుగుభాష*

తెలుగువర్ణమాల
తెలిముత్యములహేల
తెలుగుపలుకు తియ్య
తేనె లొలుకు
తియ్యదనముగలుగు
తెలుగుమాటాడుమా!
లలితమృదువిలాస
*తెలుగుభాష*
ఓ నా అమ్మ భాస

-వైద్యం వేంకటేశ్వరాచార్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *