కృష్ణా బోర్డుకు నీటి వాటా తేల్చేఅధికారముందా?

(వి. శంకరయ్య)

పిల్లి గుడ్డిదైతే ఎలుక భరత నాట్యం చేసిందనే సామెతను తలపిస్తోంది – కృష్ణ బోర్డు సమావేశంపై తెలంగాణ ప్రభుత్వం వైఖరి. కేంద్ర ప్రభుత్వం అలుసు చూచు కొని తుదకు ముఖ్యమంత్రి కెసిఆర్ తనే సమావేశంలో పాల్గొని తాడో పేడో తేల్చుకుంటానని చెప్పడం మరీ చోద్యంగా వుంది. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి కెసిఆర్ పలు సమావేశాలు నిర్వహించుతూ సెప్టెంబర్ ఒకటిన జరగబోయే బోర్డు సమావేశంలో సకల అస్త్రాలతో వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. అటు తెలంగాణ గాని ఇటు ఆంధ్ర ప్రదేశ్ గాని తమ తమ వాదనలు విన్పించడంలో తప్పులేదు. కాని బోర్డు సమావేశానికి మునుపే చట్ట పరంగా కృష్ణ బోర్డుకు ఏ మాత్రం అధికారంలేని నీటి వాటాల గురించి తెలంగాణ లేఖ రాయడం గమనార్హం. అటు తెలంగాణ గాని ఇటు ఆంధ్ర ప్రదేశ్ గాని తమ తమ రాష్ట్రాల్లో గొంతెండి పోతున్న దక్షిణ తెలంగాణ రాయలసీమ ప్రాంతాలకు ఎంతో కొంత సాగు తాగు నీరు అందించాలంటే ఇరు రాష్ట్రాలు సామరస్యానికి లాకులు ఎత్త వలసి వుంది. కాని రాజకీయ భావోద్వేగాల్లో తల మునకలైనందున పరిస్థితి ఈ పాటికే చేయి దాటి పోయింది. తత్ఫలితంగానే నీటి పంపణి అధికారంలేని బోర్డు సమాశానికి కత్తులు నూరు తున్నారు.

వాస్తవంలో ఈ రోజు వరకు కృష్ణ బోర్డు కేవలం పోష్టాఫీసు పని చేస్తోంది. ఇంకా చెప్పాలంటే మేక చన్ను మాత్రమే. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ అమలులోనికి వచ్చిన తర్వాత దానికి చట్ట బద్దత ఏర్పడుతుంది. గత ఆరేదేల్లుగా తెలంగాణ రాసిన లేఖలు ఎపికి పంపడం ఎపి రాసిన లేఖలు తెలంగాణ పంపడం చేస్తోంది. ఎవర్నీ అదుపు చేసే స్థితిలో లేదు. ఇప్పుడు కూడా కృష్ణ జలాలు ఫిఫ్టీ ఫిఫ్టీ పంచాలని తెలంగాణ రాసిన లేఖను ఎపికి పంపింది. అందుకు ఎపి జవాబు ఇచ్చింది. అంత వరకు బాగానే వుంది. సెప్టెంబర్ ఒకటవ తేదీ జరగబోయే బోర్డు సమావేశంలో ఎవరు ఎన్ని వాదనలు చేసినా కృష్ణ జలాలను చట్ట విరుద్ధంగా పైగా తనకు లేని అధికారాలను బోర్డు చేపట్టే అవకాశం లేదు. ఏ చట్టం కింద అయితే బోర్డు ఏర్పాటు చేయబడిందో ఆ చట్టం మేరకే బోర్డు వ్యవహరిస్తుంది. అయితే తెలంగాణ ఇంత హంగామా ఎందుకు చేస్తోంది? తను కృష్ణ జలాలు అధిక వాటా కోసం పోరాడుతున్నానని రాష్ట్ర ప్రజలకు చెప్పుకోవడానికి తప్ప వేరు కాదు.

రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 85 మేరకు కృష్ణ నది యాజమాన్య బోర్డు ఏర్పడింది. రాష్ట్ర విభజన చట్టం నదీ జలాల పంపిణీ విషయంలో ఏం చెప్పిందో అంతకు మించి ఒక ఇంచి కూడా వ్యవహరించే అవకాశం లేదు. ఒక వేళ రెండు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వస్తే దాన్ని అమలు జరుపుతుంది. ఈ విషయం తెలంగాణ జల వనరుల శాఖాధికారులకు గాని ముఖ్యమంత్రి కెసిఆర్ గాని తెలియదని భావించ లేము. రాష్ట్ర విభజన చట్టంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ గురించి సెక్షన్ 85 సబ్ సెక్షన్ 8 (a) (i) లో పూర్తిగా స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం అమలులో వున్న 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం కింద నియమింప బడి అమలులో వున్న ట్రిబ్యునల్ అవార్డు మేరకు నీటిని రెండు రాష్ట్రాల మధ్య బోర్డు పంపిణీ చేయ వలసి వుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమలులో వున్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకే రెండు రాష్ట్రాల మధ్య బోర్డు నీటిని పంపిణీ చేయాలి. . బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వద్ద రెండు రాష్ట్రాలు తమ తమ వాదనలు డిమాండ్లు పెట్టి వుండ వచ్చు. కాని బోర్డు దాని అవార్డు ( ఒరిజినల్ అవార్డు లేక రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89) ను పరిగణన లోనికి తీసుకొనే అవకాశం లేదు. ఎందుకంటే అది నోటిఫై చేయ బడలేదు.

గత సంవత్సరం అక్టోబర్ లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బచావత్ అవార్డు తమకు న్యాయ సమ్మతంగా లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టులో వున్న కేసు వెనక్కి తీసుకొంటే న్యాయ పరమైన చిక్కులు లేకుంటే కొత్త ట్రిబ్యునల్ లేక ఇప్పుడు వున్న ట్రిబ్యునల్ కు నివేదించుతానని కేంద్ర మంత్రి షెకావత్ చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ కేసు వెనక్కి తీసుకొనేందుకు చిక్కులు ఏర్పడ్డాయి.
ఈ పరిస్థితుల్లో కొత్త ట్రిబ్యునల్ ఏర్పడి తీర్పు వచ్చే వరకు అమలులో వున్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పును అమలు జరపడం గురించి తెలంగాణ అంగీకరించినట్లే కదా? కాని ఏ ప్రాతిపదికన ఫిఫ్టీ ఫిఫ్టీ వాదన తీసుకువచ్చిందో వివరణ లేదు
తాజాగా బోర్డుకు తెలంగాణ రాసిన లేఖ పరిశీలించితే ప్రస్తుతం అమలులో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పరిగణన లోనికి తీసుకున్నట్లు లేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారో రేపు బోర్డు సమావేశం అనంతరం వారే వివరణ ఇచ్చుకోవాలి.

రాష్ట్ర విభజన అనంతరం బోర్డు ఏర్పాటు జరిగి బోర్డు మ్యాన్యుయల్ నిర్థారించే సమయంలో కూడా 2015 లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు మేరకే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు అది తాత్కాలికమని తెలంగాణ చెబుతోంది. ఒప్పందం తాత్కాలికమో శాశ్వతమో పక్కన బెడితే ఆ రోజు ఒప్పందానికి ప్రాతిపదికైన బచావత్ ట్రిబ్యునల్ అవార్డు మాత్రం తాత్కాలికం కాదు. ఈ అవార్డులో తెలంగాణకు అన్యాయం జరిగినదని భావించినా మరో ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు వేచి వుండక తప్పదు. ఇప్పుడు కృష్ణ నదీ జలాలను తిరిగి పంపిణీ చేసేందుకు బోర్డుకే కాదు. కేంద్ర ప్రభుత్వానికి తుదకు సుప్రీంకోర్టుకు కూడా అధికారం లేదు. దేశంలో ఏ నదీ ట్రిబ్యునల్ తీర్పు అయినా ఒక దఫా నోటిఫై చేయబడితే మరో ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు భాగ స్వామ్య రాష్ట్రాలు వేచి వుండ వలసినదే. ఈ అంశాలన్నీ తెలంగాణ జల వనరుల శాఖ ఎందుకు మరుగు పర్చుతుందో అనూహ్యం.

ఈ రగడ రెండు రాష్ట్రాలకు అపకారం చేస్తుంది. దిగువ రాష్ట్రాలైన రెండు తెలుగు రాష్ట్రాలు దెబ్బలాటకు దిగితే మున్ముందు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు నోటిఫై జరిగితే రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. కృష్ణ బోర్డు ఏర్పడినప్ఫటి నుంచి దాని పరిధి నిర్ణయించేందుకు తెలంగాణ అంగీకరించ లేదు. ఏడేళ్ల తర్వాత కేంద్రం నోటిఫై చేస్తే దానిపై ఇంత వరకు నోరు విప్ప లేదు. తొలుత బోర్డు సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తే దాని కన్నా ముందుగా బోర్డు పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు కోరింది. తుదకు ఆ సమావేశం ఏర్పాటు జరిగితే దానికి డుమ్మా కొట్టింది. ఇప్పుడు నోటిఫికేషన్ అమలు గురించి బోర్డుల సమావేశం ఏర్పాటు జరిగితే నీటి పంపకం వాటా ముందుకు తెచ్చింది. వాస్తవంలో కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ లో రెండు రాష్ట్రాలకు చెంది మార్పులు చేయ వలసినవి చాలా వున్నాయి. కాని తెలంగాణ దానిపై దృష్టి పెట్టడం లేదు. రేపు సమావేశంలో ఏం జరుగుతుందో పక్కన బెడితే బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా కృష్ణ జలాలను బోర్డు రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే అవకాశం లేదు.

(వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *