రచన: నిధి
స్వేచ్ఛ కోసం పోరాడ్డం అంటే
ప్రాణాలకు తెగించడమే అని
ఆప్ఘాన్ మహిళలు ప్రపంచానికి మరోసారి చాటారు
సైన్యం తోక ముడిచి అధ్యక్షుడు పారిపోయినా
మాట వినకుంటే చంపడం తప్ప
మరో భాష తెలియని తాలిబాన్లు కు
వీధుల్లో నినాదాల సవాలై ఎదురు తిరిగారు
ఎవ్వడి చాకిరీ సౌఖ్యం కోసమో బ్రతికే బానిస బ్రతుక్కంటే
పోరాడి చచ్చి చరిత్ర లో స్పూర్తి నింపుదాం
వస్తే స్వేచ్ఛ పోతే ప్రాణం అని
రాకెట్ లాంచర్లకు ప్లకార్డులను ఎదురు నిలిపారు
వాళ్ళు ఆప్ఘాన్ పౌరుల గుండెల్లో అగ్ని రగిలించారు
అవి పెను మంటలై పంజ్ షేర్
బాగ్లాన్ లలో
తాలిబాన్లను చుట్టు ముట్టాయి
రేపోమాపో అవి ఆప్ఘాన్ అంత ఆవరిస్తాయి
ఇప్పుడక్కడ
మధ్య యుగానికి ఆధునికతకు యుద్ధం జరుగుతుంది
మతం సామ్రాజ్యవాదం ఆడే
చదరంగం లో
ఆప్ఘాన్లు పావులై
తరతరాలుగా తమను తామ
చంపుకుంటూనే ఉన్నారు
మూఢత్వం మూర్ఖత్వం వీరత్వంగా జడలు విప్పి
తమ వాళ్ళను చంపడం కూడ పవిత్ర కార్యంగా మార్చింది
ప్రాచీన కాలం నుండి నేటివరకు
ఆ నేల పై రక్తం పారని రోజులు
వేళ్ళపై లెక్కించగలన్నే
చరిత్ర లో దండయాత్రల
ముఖద్వారామై
దురాక్రమణలు రాజ్యవిస్తరణలు లూటీలతో
ప్రచ్ఛన్న యుద్ధ రాజకీయాలు
మతమౌడ్యపు అతి విశ్వాసాలతో
గాంధారం చరిత్రంతా
రక్తం వాసన పులుముకుంది
ప్రపంచానికి బౌద్ధం పై సిద్దాంత పాఠాలు చెప్పిన
ఆ నేల పై ఇకనైనా
శాంతి సమతలు వికసించి
గాంధార శిల్పం సొగసులా
ఆప్ఘాన్ మెరుపులీనాలి
** ***
(ఆప్ఘాన్ లో మొదటగా ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చిన మహిళలకు అంకితం)