కెసిఆర్ ప్రభుత్వంలో దళిత అధికారులకు ప్రాధాన్యత ఏదీ?: డాక్టర్ మల్లు

తెలంగాణలో ఒక వైపు దళిత బంధు మరొక వైపు దళిత ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు డా. మల్లు రవి విమర్శించారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ద్వంద్వ వైఖరిని ఖండించారు.

తెలంగాణ వచ్చాక కేసీఆర్ దళిత గిరిజనులకు అణచి వేస్తున్నారని చెబుతూ అర్హులైన దళిత గిరిజన అధికారులను ప్రాధాన్యత లేని  పోస్ట్ లను ఇస్తున్నారని ఆయన చెప్పారు.

“అగ్రవర్ణాల అధికారులు రిటైర్డ్ అయ్యాక కూడా తిరిగి పోస్ట్ లలో కొనసాగిస్తున్నారు. రిటైరైన సీనియర్ దళిత అధికారులను కనీసం గౌరవ ప్రదంగా కూడా సాగనపండం లేదు.  సీఎం ఆఫీస్ లో పనిచేసే మెజారిటీ ఉన్నత ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులే. దళితులకు పాలనలో, నిర్ణయాత్మక పోస్టులలో ప్రాతినిధ్యం ఎక్కడుంది, కెసిఆర్ సమాధానం చెప్పాలి,” అని మల్లు అన్నారు.

కేసీఆర్ నియంతృత్వ ధోరణి, అణచివేత ధోరణిలోనే అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగం వదిలి బయటికి వచ్చారని ఆయన అన్నారు.

డాక్టర్ మల్లు రవి ఇంకా ఏమన్నారంటే..

ఉన్నత చదువులు చదువుకొని వచ్చిన దళిత గిరిజన ఉద్యోగులను ఇలా అనగా దొక్కడం ఎంత వరకు సమంజసం. బడ్జెట్ లో దళిత గిరిజనుల కు కేటాయించిన నిధులు ఎందుకు పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదు

కేసీఆర్ అవలంభిస్తున్న దళిత గిరిజన అణచివేత చర్యలకు నిరసిస్తూనే కాంగ్రెస్ దండోరా కార్యక్రమం చేపట్టాం. అది విజయవంతమయింది. రేవంత్ రెడ్డి చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కు ఊహించిన దానికంటే ఎక్కువ జనం వస్తున్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలిచ్చిన దళితుల భూముల ఎందుకు గుంజుకుంటున్నారు. పోడు భూములనేవి ఏవీ లేవు. అన్నీ వ్యవసాయ భూములే. వాటిని దశాబ్దాలుగా దున్నుకుంటూ గిరిజనలు బతుకుతున్నారు. వాటికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హక్కుల పత్రాలు ఇచ్చింది.  అయితే, ఈ పత్రాలను లాక్కుని ఆ భూముల్లో హరితహారం చెట్లునాటుతున్నారు.

మూడు చింతల పల్లి లో కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళే రోడ్డు ఎత్తు పెంచడం ద్వారా దళితుల ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఆ గ్రామంలో దళితుల కష్టాలను ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో మూడెకరాల భూమి ఇవ్వలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వలేదు.

దళిత గిరిజనుల కు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు

ఈటెల మీదేనా విచారణ , మల్లారెడ్డి మీద లేదా?

ఈ సమస్యలపై రేవంత్ రెడ్డి మాట్లాడితే మంత్రి మల్లా రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారు. మంత్రిగా ఉండి ఇష్టం వచ్చినట్లు రేవంత్ పై బూత్ లు మాట్లాడటం సరైందేనా మల్లారెడ్డి కి చిత్త శుద్ది ఉంటే తనపై వచ్చిన ఆరోపణలకు విచారణ చేయించాలి.

ఈటెల రాజేందర్ పై విచారణ జరిపినట్లు మల్లారెడ్డి పై విచారణ జరిపించాలి. మల్లారెడ్డి రాజ్యాంగేతర శక్తిలాగా ప్రవర్తిస్తున్నారు. మల్లారెడ్డి మంత్రిగా ఉండేందుకు ఏ మాత్రం అర్హుడు కాడు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే మల్లారెడ్డి ని కూడా  బర్తరఫ్ చేయాలి. కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఎమ్మెల్యేలు, మంత్రులు చదువుతున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *