పోడు వ్యవసాయదారుల హక్కులు పట్టించుకోరా ?

డాక్టర్. యస్. జతిన్ కుమార్   

కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో జూన్జూలై నెలలు వస్తున్నాయంటే లక్షలాది పోడు రైతుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. వాళ్ళ జీవితాల్లో అల్లకల్లోలం, ఫారెస్టు ఆఫీసర్లు, పోలీసులు, రెవిన్యూ అధికారుల దాడులతో, దొంగ దెబ్బలతో కంటిమీద కునుకు దూరమై, సాగు భూముల్లోనే కాపురం చేస్తూ, అక్కడే వంటా వార్పూ చేసుకుంటూ,పిల్లలు, వృద్ధులతో సహా ఇంటిల్లాదులు కంటికి రెప్పలా తమ పోడుభూమిని కాచుకో వలసిన దుస్థితి నెలకొంటున్నది. అనేకసార్లు, ముఖ్యంగా 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోను,ఆతరువాత ఎన్నికల సందర్భాలలోనూ  పోడు సాగుదారు లందరికీ ఆరు నెలల్లో పట్టా లిస్తామని వాగ్దానాలుచేసి, నమ్మబలికి ఓట్లు మూట గట్టుకని సీట్లు సాధించిన ప్రభుత్వం పోడు రైతుల మీదికి ఫారెస్టు ఆఫీసర్లను ఎగదోయటం, హరిత హారం మొక్కల పెంపకం, అడవుల రక్షణ పేరుతో సాయుధ చెక్ పోస్టులు పెంచడం, తమ భూముల్లో పనులు చేసుకుంటున్న రైతులను వెళ్ళగొట్టడం, వారి భూముల చుట్టూ కందకాలు తవ్వటం, వారు వేసిన పంటలు పీకివేయటం, రైతులపై కేసులు పెట్టడం, అరెస్టులు సాగించడం,జైలు పాలుచేయడం నిత్యకృత్యమైపోయింది. గత రెండు నెలలుగా ఈ వార్తలు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ పోడు రైతులు ప్రభుత్వాన్ని నిలదీయటం, ఆఫీసర్లను ఎదుర్కోవడం, తమ పంటలు కాపాడుకోవటానికి ప్రభుత్వ ట్రాక్టర్లు, బుల్ డోజర్లకు ఎదురొడ్డి నిలవడం – తెలంగాణ అటవీ (ఏజెన్సీ) ప్రాంతాలలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసినవారు రైతులమీద యుద్ధాన్ని ఎందుకు ప్రకటిస్తున్నట్లు? రైతుబంధు, దళితబంధు అని మీడియాల నిండా తెగ ప్రచారం చేసుకుంటున్న ప్రజా ప్రభుత్వం వాస్తవంలో రైతులపట్ల ఏ వైఖరి ప్రదర్శిస్తోంది

 రైతుల అరెస్టులు, కేసులు ఏమిటి అనే విషయంలో వాస్తవాలు పరిశీలించటానికి, ఆ రైతులను కలిసి, మాట్లాడి విషయ సేకరణ చేసి, వాస్తవాలను నివేదించటానికి ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణ సంస్థ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ వివిధప్రాంతాలు పర్యటించి వందలాది పోడు రైతులను ప్రత్యక్షంగా కలుసుకుని వారి కథనాలను, వాదనలను, ఆవేదనలను రికార్డు చేసింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలను, దౌర్జన్యాలను ప్రభుత్వ వేధింపులను గమనించి,  దుస్థితిని విశాల ప్రజానీకం దృష్టికి తేవాలని సంకల్పించి ఈ వ్యాసంద్వారా తెలియ జేస్తున్నాను.సాగుదార్లు మాతో చెప్పిన విషయాలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నాను.[ కమిటీ ప్రత్యేకంగా పూర్తి నివేదికను  విడుదల చేసింది. రైతుల డిమాండ్లతో  ప్రభుత్వానికి 19-08-21 న  మెమొరాండం  ఇచ్చింది]   

4-8-20211న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సర్కపల్లి గ్రామంలో కమిటీ 50మంది రైతులతో, సిర్పూర్ (యు) మండలం పంగిడి గ్రామంలో 25 మందితో, ఉట్నూరు పట్టణం (ఆదిలాబాద్ జిల్లా)లో వివిధ గ్రామాలనుండి వచ్చిన 30 మంది తో,  6-8-21 నాడు కమిటీ ఖమ్మంజిల్లా ఏన్కూరు మండలంలో వంద మంది రైతులు, కార్యకర్తలతో   విస్తృతంగా సమావేశాలు  జరిపింది.

 ఆ సభలలో 95 సంవత్సరాల వృద్ధులనుండి, పాతికేళ్ళ యువకులు, బిడ్డలను ఒడిలో వేసుకొని మహిళలు కన్నీరు మున్నీరు గా తమపై జరుగుతున్న దౌర్జన్యాలను, ప్రభుత్వం దశాబ్దాలుగా దొంగ మాటలతో పనికిరాని పత్రాలతో తమను మోసంచేస్తున్న తీరును వివరించారు. 1963 నుండి భూమి కాస్తు చేస్తున్నప్పటికీ హక్కు పత్రాలు గానీ, పాసు బుక్కులు గానీ ఇవ్వటం లేదనీ, అన్ని గ్రామాలలోను ఇదే సమస్య వుందని కమిటీ దృష్టికి తెచ్చారు.  ఉట్నూరు నాలుగు జిల్లాలకు సెంటర్, ఏడు మండలాలకు కేంద్రం. ఐటిడి, పిఏ ఆఫీసు ఇక్కడే వుంది. అందువల్ల పోడు రైతుల ధర్నాలతో, నినాదాలతో, సమావేశాలతో ఆ ప్రాంతం నిత్య సమరశీలంగా వుంటుంది. జన్నారం మండలం గడ్డి గూడ, దేవుని గూడెం, పొనకల్లు గ్రామపంచాయతీ , సోనాపూర్ తండా, ఆస్తర్ తండా, కొత్తూరుపల్లి, మన్నెం గూడ, జువ్వి గూడ, రేళ్ళగూడ  గ్రామాలు, ఉట్నూరు మండలం ధర్మాజి పేట, చింతల గూడ తండా, అల్లంపల్లి తదితర గ్రామాల నుండి రైతులు, తమ గ్రామాలలో లెక్క లేనన్ని కేసులు పెట్టారు కానీ, పట్టాలు మాత్రం ఇవ్వలేదని బాధ వెలి బుచ్చారు. 1996 నుండి ఈ ప్రాంతంలో జరుగుతున్న పోడు రైతుల ఉద్యమాలను సోదాహరణంగా వివరిస్తూ ఎక్కడైతే బలమైన ఉద్యమం వుందో అక్కడే కొన్ని పట్టాలు వచ్చాయి. ఇళ్ళ జాగాలు దక్కాయి. కానీ మిగతా చోట్ల గిరిజన, గిరిజనేతర, ఆదివాసీ, లంబాడీ అంటూ విభేదాలు కల్పిస్తూ ప్రజలను చీల్చివేసి ఉద్యమాలను అణచి వేయాలనుకోవటం తప్ప అర్హులైన పేదవారికి పట్టాలు ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని భావిస్తున్నట్లు వారు చెప్పారు. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన అనేక మండలాలనుండి సమావేశానికి హాజరైన పోడు  రైతులు  అనేక సమస్యలు, సంఘటనలు, పోలీసుల నిర్బంధాలు, ఆఫీసర్ల బూటకపు వాదనలను కమిటీ దృష్టికి తెచ్చారు. ఈ ప్రాంతం  పోడు రైతుల ఆగ్రహ జ్వాలలతో, వారి కన్నీటి ఆవిరులతో మండుతున్న అగ్నిగుండంలా వుంది.  

మామూలు చట్టాలు, అరెస్టులే కాక పిడి యాక్ట్ కింద అరెస్టు చేస్తామనే బెదిరించటం , హత్యాకాండకు పాల్పడ్డారని బూటకపు కేసులు పెట్టడం జరుగుతొంది . సమావేశం జరుగుతున్న సమయంలోనే కొణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో  హత్య ప్రయత్నం చట్టం క్రింద పోడు  రైతుల అరెస్టులు జరిగాయి. ఆ గ్రామంనుంచి వచ్చిన కార్యకర్తలు ఆ సంఘటనల పూర్వాపరాలు వివరించి అన్ని ప్రాంతాల రైతులు తమకు అండగా నిలవాలని, మా ఉద్యమాన్ని నిలబెట్టండి – మాకు పట్టాలువచ్చే వరకూ పోరాడుతాం అని విజ్ఞప్తి చేశారు.ఏన్కూరు, కామేపల్లి, కొణిజర్ల, కూసుమంచి, పెనుబలి, రఘునాధపాలెం, తిరుమలాయపాలెం, అశ్వారావుపేట, అశ్వాపురం, చండ్రుగొండ, దమ్మపేట, దుమ్ముగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, బయ్యారం, గంగారం, మరిపెడ, మహబూబాబాద్ వంటి అనేక మండలాల రైతులు “మా భూములకు పట్టాలిచ్చేదెన్నడు?” అనే ప్రశ్నను సంధించారు.

గిరిజన, గిరిజనేతర, గ్రామీణ పేదలు, పట్టణ పేదలు, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, తమ  ప్రాంతాలలోని పోడు వ్యవసాయ సమస్యలు, ఆ భూముల పై హక్కులకోసం తాము చేస్తున్న పోరాటాలు, ఎదుర్కొంటున్న నిర్బంధాలు సవివరం గా చెప్పారు. ప్రజలలో భ్రమలు కల్పించటానికి, ఐక్యంగా పోరాడుతున్న పేదలను చీల్చటానికి స్థానిక పెత్తందారులు, వివిధ అధికార రాజకీయ పక్షాల నాయకులు. అధికారులు అనుసరిస్తున్న మాయోపాయాలను, విచ్ఛిన్నాలను వివరించారు. ముఖ్యంగా గిరిజన, గిరిజనేతర, దళిత, ఇతర కుల విభేదాలను ప్రయోగించి వాటిని విద్వేషాలుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారనీ అయితే గ్రామీణ పేదల సంఘం వున్నచోట్ల వాటిని విజయవంతంగా తిప్పికొట్టి ప్రజలను ఒక్క తాటిపై నిలబెట్టి కొన్నయినా పట్టాలు సాధించుకో గలిగామని వారన్నారు.

 వందలాది ఎకరాల భూములను అభివృద్ధి పేర బడా కంపెనీలకు, ధనవంతులకు,[ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి అనేక పేర్లతో] కట్టబెడుతూ ప్రభుత్వమే లక్షల ఎకరాల అడవుల విధ్వంసానికి, పర్యావరణ విలయానికి కారణమవుతోందని వారు చెబుతున్నారు  దశాబ్దాలుగా అవే భూముల్లో పోడు వ్యవసాయం చేస్తూ పర్యావరణ హితంగా వాటిని పంట భూములుగా మార్చుకుంటూ, భూమిని కేవలం తమ జీవనానికి ఆధరువుగా మలచుకుంటూ జీవిస్తున్న పేదలను ఆ భూములనుండి వెళ్ళగొడుతోంది. అడవిబిడ్డలను అడవితల్లికి దూరంచేస్తూ, లేనిపోని కేసులు పెడుతూ నేరస్తులుగా చిత్రించి అనేక ఇడుములకు గురిచేస్తుంది. అదే సమయంలో అడవులను నాశనం చేసే ఫాక్టరీలను  కలప దొంగలను అడవిలోకి ప్రవేశపెడుతోంది. ఈ కర్మాగారాల వల్ల  అక్కడి పేద ప్రజల జీవన ప్రమాణం పెరగక పోగా వారు మరింత శ్రమదోపిడికి గురవుతున్నారు. వాళ్ళ అమ్మలాటి అడవీ నాశనమవుతోంది. “ పేదలను తమ భూములనుంచి వెళ్లగొట్టే కుట్ర తప్ప ఇందులో అడవులు పెంచేది, రక్షించేది ఏమీలేదు.

ప్రభుత్వమే  దాడులు, దౌర్జన్యాలు చేస్తూ, మమ్ముల్ని హింసా వాదులుగా చిత్రిస్తున్నది. మేము చేస్తున్నదల్లా మా భూములు, పంటలు కాపాడుకోవటమే-దానికోసం ఎవ్వరినయినా ఎదిరిస్తాము. ప్రభుత్వమే  వ్యవసాయ భూములను రిజర్వ్ ఫారెస్టుగా ప్రకటిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం క్రింద కోట్లాది రూపాయల అవినీతికి దారులు వేస్తోంది. లక్షలాది పేదల కడుపు కొడుతోంది.  తాతల తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న కొద్దిపాటి పోడుభూమిని వదలి వేస్తే ఇక మాకు  జీవనమే కాదు, అన్నం కూడా కరువై పోతుంది. రైతులను కూలీలుగా మార్చుతూ , భూములను కార్పోరేట్లకు అంటగట్టే ప్రయత్నమే అడవుల రక్షణ పేరు క్రింద జరుగుతున్నది” అని రైతులు కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు. నోరు తిరగని పేర్లతో రైతుల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామంటున్న ప్రభుత్వం ఆదివాసీ, గిరిజన, గిరిజనేతర పేదల వ్యవసాయదారులను అసలు రైతులుగానే గుర్తించటం లేదు. వారి కున్న హక్కులనూ, భూములను అధికారులు ఒక్క కలంపోటుతో హరించి వేస్తున్నారు. “కందకాలు తవ్వుతూ, కంచెలువేస్తూ మా భూముల్లోకి మమ్మల్ని కాలుబెట్టనీక పోవటమేనా రైతు సంక్షేమం అంటే” అని నిలదీసి ప్రశ్నిస్తున్నారు.

“తరతరాలుగా పంటలు పెంచుతూ భూమికి పచ్చని హారం వేస్తున్నది మేము. పెరిగిన వృక్షాలను మొదలంటా నరికి కలప, పేపరు మిల్లులకు ధారాదత్తం చేసి అడవులను ధ్వంసం చేస్తున్నది వాళ్ళు. పేద కాకులను కొట్టి పెద్ద గద్దలకు పెట్టటమే కదా ఇది. ఇందుకోసమే తప్ప మాకు పట్టాలు ఇవ్వకపోవటానికి మరే కారణమూ లేదు. ఇది సామాన్య ప్రజలకు పూర్తిగా వ్యతిరేకంగా వున్న ప్రభుత్వం” అని వారు ఎలుగెత్తి చాటుతున్నారు.

“ఫారెస్టు అదికారులు, పోలీసుల సహాయంతోను, రెవిన్యూ అధికారులు  రాజకీయ నాయకుల ప్రాపకంకోసం సాగిస్తున్న అరాచకాలకు ఇకనైనా ముగింపు పలకాలి. అటవీ హక్కులను, వ్యవసాయం చేసుకునే హక్కును, అసలు తమకు వున్న జీవించే హక్కును ఎట్టి స్థితిలోనూ వదులుకోలేము. ఎంత నిర్బంధం ప్రయోగించినా, మా ప్రాణాలు పోయినా మా హక్కులను వదులుకోము. ప్రభుత్వం దిగి వచ్చి, మా న్యాయమైన హక్కులు గుర్తించి పట్టాలు ఇచ్చేవరకూ గిరిజన, గిరిజనేతర భేదాలు లేకుండా గ్రామీణ పేదల మంతా కలిసి వుంటాం. మా సాగు భూము లు కాపాడుకుంటాం. సహాయమో, సంక్షేమమో, నష్టపరిహారమో, మరోచోట భూమి చూపిస్తామనో ఎప్పటికప్పుడు ఏవో మాయమాటలు చెబుతూ మమల్ని భూములకు దూరం చేస్తున్నారు.మోసం చేస్తున్నారు వాళ్ళిచ్చే లక్షల మూటలు మాకొద్దు. బంగారు తెలంగాణ మాటలు మాకొద్దు. హరిత హారం కబుర్లు మాకొద్దు. మా కుంట భూమే మాకు ప్రాణం. మా భూమిని ఫారెస్టు భూమి అని చెప్పి ప్రభుత్వం కట్టా చేస్తూ వుంటే మేము చేతులు ముడుచుకుని కూర్చోము. మా భూములకు పట్టాలు సాధించుకుంటాము. అప్పటివరకు పోరు జండాను వదిలేది లేదు” అని వారు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

“మీలాంటి చదువుకున్న వాళ్ళు, చట్టాలు తెలిసినవాళ్ళు ప్రభుత్వం చేసే మోసకారి వాదనలను బట్టబయలు చేయండి, మా బాధనీ, మా మీద అన్యాయంగా చూపిస్తున్న దౌర్జన్యాన్ని ఈ లోకానికి చెప్పండి. మా గురించి  ప్రభుత్వంతో మాట్లాడండి. మా హక్కులు కాపాడండి. మా పోరాటాలకు మీ మద్దతు తెలపండి” అని ఆ పేదలు నాగరిక ప్రపంచానికి, హక్కుల ఉద్యమకారులకి విజ్ఞప్తి చేస్తున్నారు.

“ఏనాడు మాకు ఎటువంటి పొందు పత్రాలు, హక్కుపత్రాలు ఇవ్వకుండా ఈ రోజు ఆధారాలు తెమ్మంటే మేము అ పత్రాలు ఎట్లా తేగలము? మీరు మా తాతలు కట్టిన భూమి శిస్తు రశీదులు ఒప్పుకోవటం లేదు. ఎన్నో ఏండ్లుగా పహణీలోవున్న పేర్లను, సరిహద్దులను అంగీకరించటం లేదు. ఏదో ఒక సమయంలో ఇచ్చినట్టే ఇచ్చి రద్దుచేసుకున్న పాసుబుక్కులు పనికి రావంటున్నారు. బ్యాంకు రుణాలకోసం ఒకప్పుడు ఇచ్చిన హక్కు పత్రాలను ఈరోజు మీరే కాదంటున్నారు. చివరకు ఆ భూముల్లో అక్రమంగా సాగు చేస్తున్నామని మీరు పెట్టిన కేసులు కూడా   మా సాగుకు రుజువుగా మీరు ఒప్పుకోవటం లేదు. మేము తిన్న లాఠీ దెబ్బలు, మేము గడిపిన జైలు జీవితాలు. అనుభవించిన శిక్షలు కూడా మీకు రుజువులు గా కనిపించటం లేదు. మీరు చేసిన లాఠీచార్జీలు, మాపై పెట్టిన  కేసులు కూడా భూమి మాదని ఘోష పెట్టటం లేదా? మీరు నాశనం చేసిన పంటలు, కొల్ల గొట్టుకు పోయిన ధాన్యం కుండలు ఆధారం కాదా? ఈ భూమికోసం మేము కార్చిన కన్నీరు తప్ప, భూమికోసం మేము చిందించిన నెత్తురు తప్ప మేము ఇంకేం ఆధారాలు చూపగలము?” అని ఆ పేద ఆదివాసీ పోడు రైతులు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఏమిటి?

భూమి హక్కు పత్రాలు అంటుండ నిచ్చి ఎక్కడ గిరిజన ప్రాంతాల జనాభా పెరిగినట్లు అంగీకరించవలసి వస్తుందో అని,  ఎక్కడ తాము ఇచ్చే  సంక్షేమ నిధులు పెంచవలసి వస్తుందో అని వారికి అసలు ఆధార్ కార్డులు సైతం ఇవ్వని ఈ నాగరిక పాలకులను ఏమని పిలవాలి?

బ్రిటిష్ కాలం నుండి చేస్తున్న చట్టాల నుండి ఇప్పటి 2006 అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓయస్ఆర్) వరకు  అనేక చట్టాలు, తీర్పులు వున్నాయి. అవన్నీ చివరకు పేదలను భూములనుంచి వెళ్ళగొట్టటానికి ఉపయోగ పడుతున్నాయి తప్ప నిజంగా ఆదివాసుల హక్కులనే మాత్రం కాపాడటం లేదు. 2 లక్షల మందికి వైగా పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే 82వేల దరఖాస్తులు తిరస్కరించారు. కొద్దిమందికి పట్టాల నిచ్చారు. వేలమంది పట్టాలకోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అందువల్ల  ఈ సమస్యను సత్వరమే పరిష్కరించవలసిన అవసరం వుంది.  

 పోడు వ్యవసాయం ఒక  జీవనవిధానం. అడవివాసుల జీవన హక్కు. వారికి వున్న సహజ జీవన హక్కులన్నీ కాపాడాలి. పోడు వ్యవసాయ సాగు చేసుకుంటున్న వారికి ఆ భూములపై హక్కు కల్పించాలి. గిరిజన, గిరిజనేతర విభేదాలు కల్పించటంకాక అర్హులైన పేదలందరికీ ఈ హక్కు ఇవ్వాలి. భూమి లేని వారికి భూమిని, దున్నేవానికి భూమిని కల్పించటం కనీస బాధ్యత.

 శాశ్వత పరిష్కారం చూపే లోపు కనీసం ఏజెన్సీ, ఇతర ప్రాంతాలలోని  గిరిజన, గిరిజనేతర ప్రజలపై ప్రభుత్వం , పోలీసు, ఫారెస్టు, రెవిన్యూ శాఖలు సాగిస్తున్న అరాచకాలకు అంతం పలకాలి. దమన కాండను ఆపివేయాలి. అక్రమ కేసులు ఎత్తివేయాలి. పోడు సాగుదారులపై వేధింపులు, దాడులు అటకాయింపులు  ఆపివేసి వారి భూములలో స్వేచ్ఛగా సాగు చేసుకొనివ్వాలి. 

అలా కాని నాడు జీవన భద్రతకై, తమసహజ హక్కుల పరిరక్షణకై వారు సాగించే అన్ని ఉద్యమాలు ధర్మబద్ధమే. వారి ఉద్యమాలకు అన్నిరంగాల ప్రజలు మద్దతు పలకాలి.

 నిర్బంధాలకు వెరవక దశాబ్దాల తరబడి అనుభవిస్తున్న కష్టాలకు బెదరక ఒకరు నడిస్తేనే కాలిదోవ తయారవుతుంది అనే విశ్వాసంతో తమ హక్కుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న అసామాన్య పోడు రైతాంగానికి వారి  పోరాటాలకు మద్దతుగా నిలవాలి , వారి పోరాటాలకు సమాజమంత రక్షణ కవచంగా నిలవాలి.

                                                                         

                                                        

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *