(టి లక్ష్మీనారాయణ)
1. ప్రభుత్వం వ్యాపారం చేయదు, పరిశ్రమలు నెలకొల్పదు, నిర్వహించదు.
2. పెట్టుబడుల ఉపసంహరణ (Disinvestment)కు కాలం చెల్లిపోయింది, లాభ నష్టాలతో నిమిత్తం లేదు, ప్రభుత్వ రంగ సంస్థలను 100% అమ్మకమే మా విధానం.
3. డీమోనిటైజేషన్ (Demonetization) ద్వారా పెద్ద నోట్లను రద్దు చేశారు. ఆర్థిక వ్యవస్థను ఊబిలోకి నెట్టేశారు. అసంఘటిత, వ్యవసాయం, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగాలు కుదేలైపోయాయి. కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. సామాన్య, మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా క్షిణించింది.
4. ఒకే దేశం – ఒకే పన్ను అంటూ జీ.ఎస్.టి (GST). విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రజలు దుష్ఫలితాలను అనుభవిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ను జీ.ఎస్.టి. పరిధిలోకి తేకుండా విచ్చలవిడిగా ధరలు పెంచుతూ ప్రభుత్వమే దారుణంగా దోపిడీ చేసున్నది.
5. “మోనిటైజేషన్” అంటూ ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు, మౌలిక సదుపాయాల నిర్వహణ బాధ్యతలను కార్పోరేట్ సంస్థలకు అప్పజెప్పే “నగదీకరణ” విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే, జాతి సంపద అయిన రైల్వే స్టేషన్లు – రైల్వే లైన్లు – రైళ్ళు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, ఓడరేవులు, విద్యుత్ సరఫరా వ్యవస్థ మరియు ఉత్ఫత్తి, పెట్రోల్ మరియు గ్యాస్ పైప్ లైన్స్, గోడౌన్స్, గనులు, టెలికమ్యూనికేషన్స్, జాతీయ క్రీడా మైదానాలను దేశీయ కార్పోరేట్ దిగ్గజాలైన అంబానీ, ఆదానీ, తదితరులకు మరియు బహుళజాతి సంస్థలకు పళ్ళెంలో పెట్టి అప్పజెప్పబోతున్నారు. ఆస్తులు ప్రజలవి, పెత్తనం – నిర్వహణ – ఆదాయం కార్పోరేట్ సంస్థలది, వార్షిక లోటు బడ్జెటును పూడ్చుకోవడానికి మోడీ ప్రభుత్వానికి అద్దె/కౌలు/ప్రీమియం/కమిషన్, పేరేదైనా పన్నేతర ఆదాయం సమకూరుతుంది.
6. “స్వయం సమృద్ధి ఆర్థిక విధానం” అంటూ వినాశనకరమైన ఆర్థిక విధానాలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం ఊబిలోకి నెట్టి, దేశ ఆర్థిక స్వావలంబనకు మోడీ ప్రభుత్వం తీవ్రమైన ముప్పు తెచ్చిపెడుతున్నది.
(టి.లక్ష్మీనారాయణ, కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)