ఆఫ్ఘనిస్తాన్ పై సామ్రాజ్యవాద మీడియా నిందా ప్రచారం (నిజాలు-7)

(ఇఫ్టూ ప్రసాద్- పిపి)

16-8-2021న కాబూల్ ఎయిర్ పోర్టు విషాదకాండకు కారకులు ఎవరు? ఆనాటి మానవ విపత్తుకు బాధ్యులు ఎవరు? ఇదే ఇక్కడి ప్రశ్న!

“సైగాన్ మూమెంట్” నేడు కాబూల్ లో పునరావృతం ఐనట్లుగా సామ్రాజ్యవాద మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. వియత్నాం నుంచి ఆఖరి హెలికాప్టర్ ని అధికంగా, అదనంగా ఎక్కిన ఫలితంగా జరిగిన ఆనాటి మానవ విపాత్తే నేడు కాబూల్ లో పునరావృతం ఐనట్లుగా ప్రపంచ ప్రజల మనస్సుల్లో చిత్రించడంలో అమెరికా కుట్ర దాగిఉంది. దాన్ని మరుగుపరిచే కుటిల ప్రయత్నంతోనే రెండింటి మధ్య పోలిక ఉందనే పబ్లిసిటీ చేస్తోంది. నిజానికి పై రెండింటికి మధ్య పోలికే లేదు. కనీసం పై రెండింటి మధ్య కనిష్ట తేడాల్ని సైతం బయటకి వ్యక్తంకానివ్వని కుటిల యత్నం అమెరికా వైపు నుంచి ఉంది. యురోపియన్ మీడియాలో అదేపనిగా పై రెండింటి మధ్య పొలికపెట్టే ప్రచార యత్నాల్ని చూస్తే, ఏదో ఆంతర్యం ఉందనే సందేహం శాస్త్రీయ ఆలోచనాపరులకు కలుగుతోంది. అది ఓ స్టేజ్ కూప్ ని దాచిపెట్టే ప్రయత్నం తప్ప మరేదీ కాదని కూడా తెలిగ్గానే అర్ధమవుతుంది. అమెరికా సామ్రాజ్యవాద చరిత్రని మనం నిశితంగా పరిశీలించినా, అదే చేదునిజం బోధపడుతుంది.

మహోన్నత కమ్యూనిస్టు సిద్ధాంత నిబద్ధతతో నూతన సమాజ స్థాపన లక్ష్యం కోసం విప్లవ మార్గం చేపట్టిన వీర వియత్నాం విప్లవ పోరాటానికీ, సామాజిక ప్రగతి వ్యతిరేక మత మౌడ్యoతో తిరుగుబాటు చేసే ఆఫ్ఘనిస్తాన్ పోరాటానికీ మధ్య పోలిక లేదు. చర్చనీయాంశం అది కాదు. తాను దురాక్రమణ చేసిన దేశాన్ని అమెరికా విడిచి పెట్టి వెనక్కి వెళ్లే విధానంలో పై రెండు సందర్భాల మధ్య పోలిక ఉందా అనేదే ఇక్కడ ప్రధాన పరిశీలనాంశం. ఈ పరిధికి లోబడి మాత్రమే పై రెండు నిష్క్రమణ సంఘటనల మధ్య తులనాత్మక పరిశీలన చేద్దాం.

ప్రధానమైన తేడాలలోకి వెళ్లే ముందు, పై రెండింటి మధ్య ఒకట్రెండు పొలికల్ని ముందుగా ఈ క్రింద చూద్దాం.

👉🏿రెండు దేశాల్లో కూడా తిరుగుబాటు సేనలు తొలుత గ్రామీణ ప్రాంతాల్ని నియంత్రణ లోకి తెచ్చుకొని, ఆ తర్వాత పట్టణ ప్రాంతాలకూ, తుదకు కీలుబొమ్మ ప్రభుత్వాల కేంద్రం వుండే నగరాలను ముట్టడి చేసే విధానాన్ని అవలంబించాయి.

👉🏿రెండు చోట్ల కూడా ఆయా కీలుబొమ్మ ప్రభుత్వాధినేతలు తమ పాలనా యంత్రాంగాలను అర్ధాంతరంగా వదిలేసి వేరొక దేశాలకు పారిపోయారు. నేడు కాబూల్ నుంచి ఘనీ ఒకరోజు ముందే పారిపోనట్లే,నాడు ఎన్ గూఎన్ కూడా రెండు రోజుల ముందే పారిపోయాడు.

ఇప్పుడు పై రెండింటి మధ్య ప్రధానమైన మౌలిక తేడాల్ని ఈ క్రింద చూద్దాం.

👉🏿అమెరికా నిష్క్రమణ సమయంలో వియత్నం విప్లవ సేనకూ అమెరికాకీ మధ్య ఒప్పందం లేదు. ఉత్తర వియత్నం ప్రభుత్వంతో దౌత్యం కోసం అమెరికా ఓ ప్రయత్నం చేసింది. ఐతే అది ఫలించలేదు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉపసంహరణ ప్రక్రియ శాంతియుతంగా జరిగే ఒప్పందం నేడు అమెరికా కీ, తాలిబన్ల కీ మధ్య కుదిరింది.

👉🏿నిష్క్రమించే నిర్ణయాన్ని అమెరికా తీసుకున్న తర్వాత కాలవ్యవధి వియత్నంలో చాలా త్వరితంగా ముంచుకొచ్చింది. అందుకు భిన్నంగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉపసంహరణ ఒడంబడిక కూ, ఆచరణలో నిష్క్రమించే తుది గడువుకూ మధ్య సుదీర్ఘ కాలవ్యవది ఉంది. ఒడంబడిక తేదీ 2020 ఫిబ్రవరి 29. తుది గడువు 2021 ఆగస్టు 31. ఈ రెండింటి మధ్య కాలవ్యవది 18 నెలలు. వెనుదిరిగే తమ సేనల వెంటబడి తరుముకొచ్చే వత్తిడి పరిస్థితి వియత్నాంలో ఉంది. అది ఆఫ్ఘనిస్తాన్ లో లేదు.

👉🏿దక్షిణ వియత్నాం నాడు యుద్ధ కేంద్రంగా ఉంది. దానికి వెన్నుదన్నుగా అప్పటికే ఉత్తర వియత్నాం ఓ స్వాతంత్ర్య దేశం గా ఉంది. రెండు వియత్నాం ల మధ్య ఏకీకరణ కోసం అమెరికా పై యుద్ధంలో దక్షిణ వియత్నాం ఎర్రసేనతో ఉత్తర వియత్నాం భుజం కలిపింది. అది 1975 ఏప్రిల్ కి ప్రత్యక్ష యుద్దానికి కూడా దిగింది. అట్టి పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ లో లేదు. నాడు వియత్నాం నుండి బ్రతుకు జీవుడా అంటూ హడావిడిగా పారిపోవాల్సిన ఘోరదుస్థితి అమెరికాకి ఉంది. నేడు అట్టి అ వత్తిడి పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికాకి ఎదురు కాలేదు.

👉🏿వియత్నాంలో అప్పటికి అమెరికాకి చెందిన కొన్ని కీలక అధికార వర్గాలు సైతం సైగాన్ నగరంలో చిక్కుబడి ఉన్నాయి. వాటిని యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయాల్సిన తీవ్ర వత్తిళ్ళు నాడు అమెరికా పై ఉన్నాయి. నేడు ఆఫ్ఘనిస్తాన్ లో అట్టి తీవ్ర వత్తిడి పరిస్థితి లేదు.

👉🏿1975 ఏప్రిల్ 30న మరో గంటకో, రెండు గంటలకో ఎర్ర సైన్యాలు సైగాన్ లోని అమెరికా రాయబార కార్యాలయం వైపు దూసుకొస్తున్న పరిస్థితి ఉంది. కొద్ది ఆలస్యం జరిగినా, వాటిచే బందీలుగా చిక్కుతామనే తీవ్ర భయం ఆనాడు ఉండేది. నేడు ఆఫ్ఘనిస్తాన్ లో ఆ భయం లేదు.

👉🏿అప్పటికే సైగాన్ లోని విమానాశ్రయం చేజారింది. ఇక విమాన రాకపోకలకు అవకాశం లేదు. తన అత్యవసర లక్ష్యం కోసం తన స్వంత రాయబార కార్యాలయం పై నిర్మించుకున్న హెలిపాడ్ మాత్రమే ఆనాడు తరలింపుకు ఏకైక వనరుగా మిగిలి ఉంది. కాబూల్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 31వరకి అమెరికా నియంత్రణలొనే ఉంటుంది.

👉🏿వియత్నాంలో ఒక్కొక్క హెలికాఫ్టర్ ట్రిప్పుకి కొద్దిమంది ని తరలించే సామర్థ్యమే ఉంది. నాలుగు హెలికాప్టర్లు మాత్రమే తరలించే పనిని చేపట్టగలవు. ఆగస్టు16న కాబూల్ ఎయిర్ పోర్టు దుస్సంఘటన తర్వాత కూడా మరో రెండు వారాల పాటు ప్రతిరోజూ వేలాది మంది ని తరలించే సామర్థ్యం కర్జాయ్ విమానాశ్రయానికి ఉంది.

👉🏿ఈ ట్రిప్పులో హెలికాఫ్టర్ ఎక్కలేకపోతే, మరో ట్రిప్పు అది వస్తుందో రాదో అనే భయం నాడు నిరీక్షకులలో ఉంది. అది ఒకవేళ రాకపోతే, వియత్నాం నుంచి బయటపడలేమనే భయోత్పత స్థితి నాడు ఉంది. ఈ ట్రిప్పు కాకపోతే, మరో ట్రిప్పు, లేదంటే మరునాడైనా లేదా తదుపరి వారంలో కూడా అవకాశం ఉన్న పరిస్థితి నేడు ఆఫ్ఘనిస్తాన్ లో వుంది.

👉🏿నాడు సైగాన్ నుంచి ఎన్ గూఎన్ పారిపోయిన తర్వాత అక్కడి విదేశీ పౌరులకి రక్షణ కల్పించే సామర్థ్యం అమెరికాకి లేకుండా పోయింది. కానీ ఘనీ కాబూల్ నుంచి పారిపోయినా, తాలిబన్ల తో ఒప్పందం ప్రకారం ఆగస్టు 31 వరకూ అమెరికాకి సాధికారికంగానే అట్టి హక్కు, సామర్ధ్యాలు ఉన్నాయి.

👉🏿సైగాన్ నగరంలో నాడు ఏవీధిలోకి ఏక్షణంలో ఎర్రసైన్యం ప్రవేశిస్తే, ఆ క్షణం నుంచి ఆయా చోట్ల కొత్త ప్రభుత్వ పాలన ప్రారంభమవుతుంది. కాబూల్ లోకి తాలిబన్ల ప్రవేశం జరిగినా, ఒప్పందం ప్రకారం వారి పాలన ఆగస్టు 31 వరకు అధికారికంగా ఏర్పడదు. ఆగస్టు 31 వరకూ దేశదేశాల పౌరుల్ని విమానాల ద్వారా తరలించుకునే హక్కు, స్వేచ్ఛల్ని అమెరికా కలిగిఉంది.

👉🏿నాడు సైగాన్ లో మిగిలి ఉన్న అమెరికా సైనికుల్ని ఆఖరి హెలికాప్టర్ ద్వారా తరలించే బిజీలో అమెరికా ఉంది. ఇతర సమస్యల్ని గూర్చి ఆలోచించే పరిస్థితి అమెరికాకి లేదు. కానీ నేడు కాబూల్ లో 6000 మంది అమెరికన్ సైనికులు వున్నారు. మరో 900 మంది బ్రిటన్ సైనికులు కూడా వున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది ప్రధానంగా కాబూల్ ఎయిర్ పోర్టు నుండి నిస్క్రమితుల్ని తరలించే పనిలో నిమగ్నమై వున్నారు.

నాటి 30-4-1975 సైగాన్ ఎయిర్ లిఫ్ట్ ప్రోగ్రామ్ కీ, నేటి 16-8-2021 కాబూల్ ఎయిర్ లిఫ్ట్ ప్రోగ్రాం కీ మధ్య పైన పేర్కొన్న మౌలిక తేడాలు వున్నాయి. ఐనా రెండూ ఒకటిగా పోల్చి చెప్పడంలో దాగిన ఆంతర్యం ఏమిటి?

నాడు ఆఖరి హెలికాఫ్టర్ ఎక్కి తప్పించుకుందామనే మానసిక భయంతో కూడిన వత్తిడి నిష్క్రమితుల్లో యదార్ధంగానే ఉంది. దక్షిణ వియత్నాంలో అమెరికా రాయబార కార్యాలయం అధికారి ఎంబసీ భవనం పై హెలికాఫ్టర్ ఎక్కబోతుండగా జరిగిన ఓ ఉత్కంఠభరిత సన్నివేశం అందుకో నిదర్శనం. ఆ ట్రిప్పులో ఆయన హెలికాఫ్టర్ లో వెళ్లిపోతే, అది మరో ట్రిప్పు రాదనే భయంతో ఆయన్ని కాళ్ళూ, వేళ్ళూ పట్టుకొని ఏడ్చుతూ కదలనివ్వకుండా ఆపిన దృశ్యం ఒకటుంది. ఆ కారణంగా “సైగాన్ మూమెంట్” ఎలాంటిదో అర్ధమవుతుంది. ఆ పరిస్థితి కాబూల్ లో లేదు.

అమెరికా ప్రోత్సాహంతో నాటో కూటమిని కలుపుకొని అది దురాక్రమణకు దిగింది. ఆ తర్వాత కీలుబొమ్మ సర్కార్ ని స్థాపింపజేసింది. కాబూల్ గ్రీన్ జోన్ కేంద్రంగా అమెరికా అక్కడ వాస్తవాధికారాన్ని తానే చేలాయించింది. అదే అమెరికా ఆ తర్వాత ఇండియా సహా దేశదేశాలతో కాబూల్ లో రాయబార కార్యాలయాల్ని తన రక్షణ బాధ్యతతో ఓపెన్ చేయించింది. లాభదాయక వాణిజ్య, వ్యాపార, మైనింగ్ కాంట్రాక్టుల్ని ప్రధానంగా తన చేతిలో ఉంచుకొని, అట్టి తన వాణిజ్య కారిడార్ల, హైవేల, భవనాల నిర్మాణ కాంట్రాక్టుల్ని ఇండియా వంటి దేశాలకు అప్పగించింది. గేదెకు గడ్డి వేసే బాధ్యతల్ని ఇండియా వంటి దేశాలకు అప్పగించి, పొదుగు నుండి పాలు పిండుకునే కీలక బాధ్యతల్ని తాను చేపట్టింది. తన రక్షణ హామీతో ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన దేశదేశాల కాంట్రాక్టర్లు, ఏక్సిక్యూటివ్ లు, కంపెనీల హెడ్డులు, సూపరువైజర్లు, మేనేజర్లు, విదేశీ రాయబార కార్యాలయాల సిబ్బంది, వర్తక, వ్యాపార, వాణిజ్య వర్గాలకు చెందిన ప్రతినిధులతో పాటు ఇంకోవైపు చిరు ఉద్యోగులు, దుబాసీలు, కాంట్రాక్ట్ ఏజెన్సీల క్రింద పని చేసే పొట్టకూటి రోజు కూలీలు, పేద కార్మికుల్ని కూడా తరలించే బాధ్యతలు అమెరికా మీదే ఉన్నాయి. తాలిబన్లతో ఒప్పందం ప్రకారం కూడా ఆ అందరి తరలింపు బాధ్యత అమెరికా మీదే ఉంది. కానీ అట్టి బాధ్యతల్ని అమెరికా నిజంగా చేపట్టిందా? అది నిజంగానే నిర్వహిస్తే, 16-8-2021నాటి మానవ విపత్తు జరిగేదా? అది తదుపరి ఎనిమిదవ భాగంలో చూద్దాం.

***

*గమనిక* :–రైతాంగ ఉద్యమ విస్తరణ, పటిష్టత వంటి వివిధ అంశాలపై చర్చించి భవిష్యత్ కర్తవ్యాల్ని రూపొందించుకునే ఉద్దేశ్యంతో రేపు, ఎల్లుండి (26, 27 ల్లో) ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలో అఖిల భారత సదస్సు జరుగుతోంది. దానికి కార్మికరంగం నుండి హాజరయ్యే ప్రతినిధివర్గంలో నేనొకడిని. నిన్న రాత్రి నుంచి ట్రైన్ జర్నీలో వున్నా. రెండు రోజుల సదస్సు తర్వాత మరో మూడు రోజులు రైతు ఉద్యమ శిబిర సందర్శన వంటి పనులు ఉన్నాయి. ఈ కారణంగా రేపటి నుండి 31 వరకు ఈ సీరియల్ ని నిలిపి వేస్తున్నాను. సెప్టెంబర్ 1 నుంచి పునప్రారంభిస్తాను. గమనంలో ఉంచుకుంటారని ఆశిస్తున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *