(రాఘవ శర్మ)
ఆకాశం నుంచి టపటపా రాలుతున్నాయి..!కొండ అంచుల నుంచి జలజలా రాలుతున్నాయి..! పైనుంచి విసిరేసినట్టు , నీటి ముత్యాలు విష్ణుగుండంలోకి వచ్చిపడుతున్నాయి!
ఆ గంగాభిషేకానికి ఆ గుండం ఉబ్బితబ్బిబ్బైపోతోంది. ఉప్పొంగిపోయి ముందుకు సాగిపోతోంది. శేషాచలం కొండల్లో ఎవరి కంటా పడకుండా విష్ణుగుండం ఒంటరిగా ఇలా ఉండి పోయింది.
ఎంత ఎత్తైనదీ కొండ..! ఎంత విశాలమైనదీ ప్రాంతం ..! ఎంత లోతైనదీ విష్ణుగుండం..! ఈ జలపాతాన్ని చూడ్డానికి చుట్టుముట్టిన ఆ కొండలకు కళ్ళు చాలడం లేదు. మా కళ్ళను వాటికి తోడి చ్చా ము.
శనివారం శేషాచలం కొండల్లోని అడవిలోకి ట్రెక్కర్లంతా బయలుదేరాం.మధు ఆధ్వర్యంలోని డేర్‌డెవిల్ ట్రెక్కర్లు, శ్రీరాం ఆధ్వర్యంలోని భక్తి ట్రెక్కర్లు కలిశారు. ఒక్క చెన్నైకి చెందిన శ్రీరాం తప్ప విష్ణుగుండాన్ని మాలో చూసినవారెవరూ లేరు.
అటు హైదరాబాదు నుంచి, ఇటు చెన్నై, బెంగుళూరు నుంచి చాలా మంది వచ్చేశారు. తిరుపతి నుంచి ఇక చెప్పనవసరం లేదు.అరవైమందికి పైగా ప్రకృతి ప్రియులను భూమన్ ఏకం చేశారు.అటవీ అధికారులతో మాట్లాడి పచ్చజెండా ఊపారు.
శనివారం ఉదయం తిరుపతి లో బయలుదేరి మామండూరు చేరాం.చిత్తూరు, కడప జిల్లాల సరిహద్దులోని కుక్కల దొడ్డి దాటాం. ఎడమ వైపునుంచి పడమరకు అడవిలోకి సాగాం. గుర్రపు బండ్ల కోసం ఎప్పుడో బ్రిటిష్ కాలంలో వేసిన అటవీ రహదారి అది.
తిరుపతి జ్ఞాపకాలు-43
దట్టమైన అడవిలోంచి మెలికలు తిరుగుతూ ఆ రహదారి సాగిపోతోంది.ఆకాశమంతా మబ్బులు కమ్మాయి. సన్నని చినుకు మొదలైందిఈ మెలికల మధ్య దిక్కులెటో తెలియడం లేదు. దారి పొడవునా రకరకాల చెట్లు. ఆలయాలలో ధ్వజస్తంభాలకు వాడే నార్యేపీ చెట్లు. బలమైన కొయ్యకు చిరుమాను చెట్లు. స్త్రీల సమస్యలకు దుసార తీగ. ఆవుల కాళ్ళిరిగినప్పుడు కట్టే బందారు ఆకు చెట్లు. దువ్వెన్నల తయారీకి నల్ల బలుస.పాలుపడడం కోసం శతావరి గడ్డలు. పాత కాలం వీటిని అలా వాడే వారు. అడుగడుగునా చెప్పనలవి కాని ఎర్రచందనం.
వీటితోపాటు అడివంతా అల్లుకుపోయిన అల్లి, కొమ్మి, సార పొదలు. ఎంత అటవీ సంపద!
కుక్కల దొడ్డినుంచి ఉదయం 8.30కి బయలుదేరి, గంటకల్లా సిద్దలేరు బేస్ క్యాంపు నకు వచ్చాం. కాస్త ముందుకు వెళితే కుడివైపు ఆరిమాను బండలకు వెళ్లే మరొక దారి చీలుతుంది. నేరుగా మా వాహనాలు మరో గంటకల్లా కంగుమడుగు చేరాయి.
నిత్యం ప్రవహించే ఒకపెద్ద ఏరు ఇది. ఇందులోకి దిగి ఈదే వాళ్ళు ఈ దారు. ఎంత దట్టమైన అడవీ! చెట్లన్నీ ఎగబాకి, ఆకాశాన్ని కనబడనీయకుండా చేశాయి. చుట్టూ దట్టమైన వెదురు పొదలు. వెదురు పొదల్లోంచి వీస్తున్న గాలి వింత శబ్దాలను వినిపిస్తోంది. మరో గంటకు మూడేర్ల కురవకు వచ్చేశాం.మూడేర్ల కురవ అంటే మూడు ఏర్లు కలిసి ఒకే ఏరుగా సాగే ప్రాంతం.
నీళ్ళు కనిపిస్తే చాలు ట్రెక్కర్లకు పూనకం వచ్చేస్తుంది. మూడేళ్ళ కురవలో దూకారు. మునకలేసి ఈదులాడారు. ఆ ఏరు వచ్చే ఎడమ వైపునకు వెళితే నారాయణ తీర్థం.
గత ఏప్రిల్ లో నారాయణ తీర్థాన్ని (తిరుపతి జ్ఞాపకాలు-31)సందర్శించాం . అప్పుడు మూడు నాలుగు నీటి గుండాలను ఈదుకుంటూ వెళ్ళాం. ఇప్పుడైతే వర్షాలకు ప్రవాహం పెరిగింది. లెక్కలే నన్ని నీటి గుండాలను ఈదుకుంటూ వెళ్ళాలి. అక్కడే భోజనాలు ముగించాం.
మధ్యాహ్నం ఒంటిగంటకు మూడేర్ల కురవలో వచ్చిపడే మరొక నీటి పాయవెంట బయలుదేరాం.
ఇరువైపులా ఎత్తైన కొండలు. మధ్యలో వెడల్పైన ఏరు ప్రవహించిన ఆనవాళ్ళు. నీటి ప్రవాహానికి కొట్టుకొచ్చిన రాళ్ళు నునుపు దేలి ఉన్నాయి. మధ్యలో పెద్ద పెద్ద బండ రాళ్ళు పడి ఉన్నాయి. చుట్టూ దట్టమైన అడవి. బండ రాళ్ళు ఎక్కుతూ దిగుతూ సాగుతున్నాం. ఇరు వైపులా కొండ అంచులు ఎన్ని రూపాలో! ఏటిలో అక్కడక్కడా సెల ఏర్లు. అక్కడక్కడా స్థిరమైన నీటి మడుగులు.
ఆ నీటి అద్దంలో ఆకాశం తనను తాను చూసుకుని మురిసిపో తోంది. ఒక్కో చోట ఏరుపై కప్పేసిన చెట్ల కొమ్మలు, వేలాడుతున్న తీగల తోరణాలు. ఆ వాగు అలా సాగుతూనే ఉంది. ఎంత దూరం నడిచినా దాని అంతు తెలియడం లేదు. విష్ణుగుండాన్ని శ్రీరామ్ తప్ప మాలో ఎవరూ చూడలేదు.
‘ఇదిగో విష్ణుగుండం. మేము చూసి వస్తాం ‘ అంటూ డేర్ డెవిల్ ట్ర క్కర్లు ఏరులో ఎడమ వైపునకు కొండల్లోకి వెళ్ళారు. పెద్ద పెద్ద బండ రాళ్ళు ఎక్కుతూ ముందుకు సాగారు. కొండల పై నుంచి పెద్ద నీటి ప్రవాహం వచ్చిపడిన ఆనవాళ్లే తప్ప గుండమూ లేదు, నీటి జాడా లేదు. వారు తిరిగొచ్చేశారు. ఇది విష్ణుగుండం కాదు.
దీనికి ఒక పేరు పెడితే బాగుంటుంది అంటూ మాలో ఒక చర్చ. మళ్ళీ ముందుకు సాగుతున్నాం. ఏరు ఎడమవైపునకు మళ్ళింది. రెండు కొండలు దగ్గరవుతున్నాయి. ఒక్కొక్క దగ్గర చెట్లు కమ్మేశాయి. ఎత్తైన రాతి కొండల మధ్యలో నీటి ప్రవాహం.
కెమెరాలు, సెల్ ఫోన్లను ప్లాస్టిక్ కవర్లలో పెట్టుకుని, చేతులు ఎత్తి పట్టుకుని నీళ్ళలో కి దిగాం. నడుం లోతు నీళ్ళు, కొందరికి బుజాల వరకుకు వచ్చాయి. కొందరు బ్యాలెన్స్ తప్పి నీళ్ళలో పడుతున్నారు. లేవలేక అవస్థలు పడుతున్నారు. ఆనీటిలో విరిసిన నవ్వుల పువ్వులు. సెల్‌ఫోన్లను కవర్లలో పెట్టి ఒక చెట్టు కొమ్మకు తగిలించి ముందుకు సాగాం. కొందరు సెల్ఫీ స్టిక్కులను ఎత్తిపట్టుకుని ఈదుకుంటూ వెళ్ళారు. పొరపాటున తడిస్తే అవి ఎందుకూ పనికి రావు.
సన్నని నీటి దారిలో ఈదుకుంటూ ముందుకు వెళితే ఒక మహాద్భుత దృశ్యం! ఒక వెడల్ఫైన నీటి గుండం. ఆ లోతైన నీటి గుండాన్ని తమ బాహువుల్లో బంధించినట్టు చుట్టూ కొండలు కమ్మేశాయి. ఆ గుండంలో ఈదుకుంటూ ముందుకు పోయి ఎడమ వైపు నకు తొంగి చూశాం. కొండల మాటున ఓహ్.. !
ఒక మహాద్బుతమైన జలపాతం! ఈదుకుంటూ వెళ్ళి జలపాతం కింద రాళ్ళు జారిపోతున్నా, గట్టును పట్టుకున్నాం. టపటపా మంటూ తలపై నీటి ముత్యాలు రాలుతున్నాయి. తలెత్తి చూస్తే అవి ఆకాశాన్నుంచే రాలుతున్నట్టున్నాయి. నలువైపులా కొండలు ఆకాశపు అంచుల్ని తాకుతున్నట్టున్నాయి. భక్తి ట్రెక్కర్లు దేవుణ్ణి కీర్తిస్తూ పెద్దగా స్తోత్రపాఠాలు చదువుతున్నారు.
పెద్ద పెట్టున నినాదాలతో జీవితం ధన్యమైందని మురిసిపోతున్నారు. డేర్ డెవిల్ ట్రెక్కర్లు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. సెల్పీ స్లి స్టిక్కులకు తగిలించిన సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు.
భూమన్ కూడా జలపాతం కింద తలపై నీటి తలంబ్రాలు పోసుకున్నారు. ఆ గుండంలో ఈదుకుంటూ ఎప్పటిలాగే యువకుడైపోయారు. గంగావతరణంలో ‘ ఆకాశంబున నుండి, శంబుని శిరంబందుండి’ గుర్తుకొచ్చింది. రాళ్ళలో ఎక్కుతూ, దిగుతూ రెండున్నర గంటల పాటు నడిచిన మా అలుపు ఆ నీటి గుండంలో ఆవిరై పోయింది. అలాగే ఉండి పోవాలనిపిస్తుంది.
ఎంత సేపుంటాం, కాలం తరుముకొస్తుంటే!? మళ్ళీ శక్తిని కూడగట్టుకున్నాం. ఈ విష్ణగుండానికి మళ్ళీ వస్తామో , లేదో!? ఆ జలపాతాన్ని తనివితీరా చూశాం. కొందరు దణ్ణాలు పెట్టుకున్నారు.
అలుపంతా తీరిపోయి, ఒక్కొక్కరికీ ఏనుగంత బలం వచ్చినట్టుంది. ఒక్కొక్కరం నీటిలోంచి భారంగా అడుగులు వేస్తూ బైటకొస్తున్నాం. మళ్ళీ వచ్చిన దారిన నడకసాగించాం. వచ్చినప్పుడు చూసినవన్నీ మననం చేసుకుంటున్నాం. ఆకాశం నిండా మబ్బులు కమ్మాయి.
వాన చినుకులు పడుతున్నాయి. సంధ్యపొద్దు గుంకుతున్నట్టుంది. కానీ,మధ్యాహ్నం మూడుగంటలే. ఏరులో రాళ్ళపై కొంత సేపు, కొండ అంచుల్లో కొంత సేపు మానడక. కొండ అంచుల్లో కొమ్మల్ని తొలగించుకుంటూ సాగుతున్నాం.
కొన్ని కొమ్మలు మా చొక్కాలు పట్టుకుని లాగుతున్నాయి. కొన్ని కొమ్మలు మా ఫ్యాంట్లను తగులుకొని లాగుతున్నాయి.’ అప్పుడే వెళ్ళిపోతారా !’ అన్నట్టు, తీగలు కాళ్ళకు అడ్డం పడుతున్నాయి.! వాటి ప్రేమకు కింద పడుతూ లేస్తూ సాగిపోతున్నాం. మూడేళ్ళ కురవకు తిరిగొచ్చాం. అడవిలో వేడి వేడి టీలు.
మా వాహనాలు మళ్ళీ వెనక్కి మళ్ళాయి. ఆ రాత్రికి అక్కడే బస చేయాలనుకున్నాం.కిలోమీటరు వెళ్ళాక ఎడమ వైపున ముడేర్ల కురవలోకి కొండ అంచుల నుంచి దిగాం. రెండు కొండల నడుమ ఒక విశాలమైన బండ. వందల మంది బసచేయవచ్చు. బండకు వారగా కొండ అంచున ఒక సెల ఏరు పారుతోంది. అనేక నీటి గుండాలలోపడి ముందుకు సాగితోంది.
తిరుపతి నుంచి తెచ్చుకున్న భోజనాలు మధ్యాహ్నం చేశాం. రాత్రికి నలభీములు వంటలు మొదలుపెట్టారు. చీకటి పడుతోంది. ఆ లోయలో బండపైన నలువైపులా కొయ్యలు అమర్చారు. పవర్ బ్యాంకులతో లైట్లు ఏర్పాటు చేశారు. కొందరు గుడారాలు వేసుకున్నారు.
రకరకాల కూరగాయ ముక్కలు వేసి ఘుమ ఘుమలాడే సాంబారు. రసం(చారు), వేడివేడి అన్నం. అడవిలో కూడా ఒడియాలు వేయించారు. పెళ్ళి భోజనం కాదు కదా!
రాత్రి నిద్రకు పక్కలు పరుచుకున్నారు. మా వెర్రితనాన్ని చూట్టానికి చందమామ వస్తున్నాడు. అందులో నిండు పౌర్ణమి. ఆ బండపైనే అంతా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెన్నెట్లో వన భోజనాలు చేశాం. అలసిసొలసిన మా శరీరాలకు ఆ భోజనం మహా అమృతం! ఎనిమిది గంటలనుంచి చలి మొదలైంది.
రాను రాను ఒణికెత్తిస్తోంది. రాతి కొండ అంచులో రెండు రాళ్ళ మధ్యన పొయ్యిలాగా ఉంది. అటవీ ఉద్యోగి మణి ఎండుకొయ్యలు ఏరుకొచ్చి నా పక్కనే మంట వెలిగించాడు. అప్పుడప్పుడూ పక్షుల శబ్దాలు. ఆ లోయలో సెల ఏటి ప్రవాహ గానం.వణికించే చలిలో ఆ సంగీతం వింటూ, దుప్పట్లు ముసుగేసి, వెచ్చని చలిమంట దగ్గర నిద్రలోకి ఎప్పుడు జారుకున్నానో తెలియదు. కొందరు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు.
నిప్పు ఆరిపోకుండా మణి మంటను వెలిగిస్తూనే ఉన్నాడు. తెలతెలవారే వరకు మాకు మెలకువ రాలేదు.
తెల్లారాక నలభీములు కిచిడీచేశారు. వేడివేడి కిచిడీ తింటుంటే ఎంత బాగుందో! వందల మందికైనా ఆశ్రయమిచ్చేట్టుంది ఆ లోయ. ముందు రోజు సాయంత్రం మాలో ఒక పదిమంది వెనుతిరిగారు. ఆ లోయలో యాభైమందికి పైగా మిగిలాం. వివిధ రంగాలకు చెందిన వారు. బెంగుళూరు నుంచి ఇస్రో శాస్త్రవేత్త హరినారాయణ వచ్చారు. పాతికేళ్ళుగా ట్రెక్కింగ్ చేస్తున్నారు. చెన్నైలోని ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ రంగ నిపుణుడు శ్రీరాం. సాఫ్ట్‌వేరే కాకుండా వివిధరంగాలకు చెందిన వృత్తి నిపుణులు, ఉద్యోగులు వచ్చారు.
భిన్న ఆలోచనలు, భిన్న దృక్ఫథాలు, భిన్న రంగాలకుచెందిన వారి సమ్మిళితం. ట్రెక్కర్ల కు మార్గదర్శకులు సుబ్బరాయుడు, రాధయ్య, డేర్ డెవిల్ ట్రెక్కంగ్ సారథి మధు, టీటీడీ అటవీ రేంజర్ ప్రభాకర రెడ్డి, ఇటీవల కాలంలో ట్రెక్కింగ్ ను ఒక ఉద్యమంగా సాగిస్తూ, ట్రెక్కింగ్ గ్రూపులను ఏకం చేస్తున్న భూమన్ తదితరులను శ్రీరాం ఆ లోయలోనే సత్కరించారు.
శ్రీరాం మూడు భాషల త్రిసంగమం. తమిళం, తెలుగు, ఇంగ్లీషు కలబోసి అతను మాట్లాడడం చాలా తమాషాగా ఉంటుంది. ఆదివారం ఉదయం తొమ్మిది అవుతోంది.
ఈ ట్రెక్కింగ్ అనుభవాలను, విష్ణు గుండం అనుభూతులను, లోయలో సెల ఏటి సంగీతం వింటూ, ఆ చలిలో నిద్రించిన పౌర్ణమిరాత్రిని మనసులో మననం చేసుకుంటూ భారంగా వెనుతిరిగాం.
(ఆలూరు రాఘవ శర్మ,సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)