హైదరాబాద్:జనజీవన స్రవంతిలోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా తనపై ఉన్న కేసులను ఎత్తేయడం లేదని ప్రజా గాయకుడు గద్దర్ కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన ఈ రోజు కిషన్ రెడ్డిని కలిశారు.
ఈ విషయంలో చొరవ తీసుకోవాలని తన మీద ఉన్న కేసులను ఎత్తేశాలో చూడాలని గద్దర్ కలిసి కోరారు.
దేశవ్యాప్తంగా తనపై ఉన్న కేసుల గురించి కిషన్‌రెడ్డికి వివరిస్తూ తాను జనజీవన స్రవంతిలో కలిశాక కూడా ఆ కేసులను అలాగే కొనసాగించడం సరికాదని ఆయన అన్నారు.
ఈ విషయం గురించి తాను నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కు కూడావిజ్ఞప్తి చేయాలనుకుంటున్నానని, దీనికోసం ఆయనతో అపాయింట్మెంట్ ఇప్పించాలని గద్దర్ కిషన్ రెడ్డిని కోరారు.
తనపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి, న్యాయసహాయం అందించడానికి సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
అప్పటి ప్రభుత్వ పిలుపు మేరకు నక్సలిజాన్ని వదిలి 1990లోనే తాను జనజీవన స్రవంతిలో కలిశానని, 1997 ఏప్రిల్ 6న తనపై హత్యాయత్నం జరిగిందని, వెన్నుపూస దగ్గర ఓ బుల్లెట్ కూడా ఉన్న విషయాన్ని ఆయన కిషన్ రెడ్డికి చెప్పారు.
వీటికి తోడు అనేక అనారోగ్య సమస్యలతో తాను బాధపడుతున్నానని, నిత్యమూ డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటున్నాని చెబుతూ ఈ విషయాన్ని దాచి, తాను ఇంకా పరారీలో ఉన్నానని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు