(ఇఫ్టూ ప్రసాద్-పిపి)
నేటికి 46 ఏళ్ల క్రితం 1975 ఏప్రిల్ 30నాటి *”సైగాన్ ఎయిర్ లిఫ్ట్”* సంఘటన జరిగింది. అదే తరహాలో నేడు 2021 ఆగస్టు 16 న కాబూల్ లోని ఎయిర్ లిఫ్ట్ జరిగినట్లు అమెరికా, యూరోప్ మీడియాలో ప్రచారం అవుతోంది. పై రెండింటిని స్థూల దృష్టితో తులనాత్మక పరిశీలన చేస్తే, పై రెండూ ఒకటిగానే కనిపిస్తాయి. సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే, వాటి మధ్య ఉప్పు, కర్పూరం మధ్య వుండే తేడాలే కనిపిస్తాయి.
అమెరికా, యురోపియన్ మీడియాలలో నాటి సైగాన్ సంఘటన నేడు కాబూల్ లో యధావిధిగా పునరావృతం అయ్యుందంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. నిజానికి పై రెండు ఎయిర్ లిఫ్ట్ ఘటనల మధ్య బాహ్యంగా పోలికలు ఉన్న మాట నిజమే. ఐతే అవి నిజానికి వేర్వేరు స్థితిగతులలో సంభవించాయి. తులనాత్మక విశ్లేషణ చేస్తేనే, తాజా కాబూల్ ఎయిర్ లిఫ్ట్ వెనక అమెరికా వ్యూహం అర్ధమవుతుంది.
ఆఫ్ఘనిస్తాన్ పై సామ్రాజ్యవాద మీడియా నిందా ప్రచారం :నిజాలు -5
అమెరికా సామ్రాజ్యవాదుల చేత వియత్నామ్ దురాక్రమణ నేపథ్యం తెలిసిందే. ఆ క్రమంలో ఓకే వియత్నాం ని ఉత్తర, దక్షిణ వియత్నాం లుగా అమెరికా ఒక దశలో ప్రజాభీస్తానికి విరుద్ధంగా విడగొట్టింది. తమ మాతృదేశ పునరేకీకరణ రెండు వియత్నాం దేశాల ప్రజల లక్ష్యంగా ఉంది. ఉత్తర వియత్నాం సోషలిస్టు దేశంగా, దక్షిణ వియత్నాం అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వ పాలనలో ఉన్నదేశంగా ఉండేవి. ఉత్తర వియత్నాం అండతో దక్షిణ వియత్నం ప్రజలు తమ అమెరికా దురాక్రమణ వ్యతిరేక సాయుధ పోరాటాన్ని వియత్నాం కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తోంది. అది పతాక స్థాయికి చేరిన సందర్భంలో జరిగిందే సైగాన్ ఎయిర్ లిఫ్ట్ సంఘటన.
దక్షిణ వియత్నాం దేశానికి దక్షిణ అంచున దక్షిణచైనా సముద్ర తీరం ఉంది. దాని సమీపంలోనిదే సైగాన్ సిటీ. అప్పటికే దక్షిణ వియత్నాం సాయుధ గెరిల్లా సేనలు ఓ వైపు గ్రామీణ ప్రాంతాల్ని విముక్తి చేసుకున్నాయి. నాటి ప్రధాన నగరమైన సైగాన్ సిటీ శివార్లకు 1975 ఏప్రిల్ చివర లోఎర్రసేన సమీపిస్తుంది. మరో వైపు నాటి సోషలిస్టు దేశమైన ఉత్తర వియత్నానికి చెందిన ప్రభుత్వ సాయుధ సేనలు రంగప్రవేశం చేశాయి. సైగాన్ రాజధానిగా దక్షిణ వియత్నాం ని పరిపాలిస్తున్న అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వం నాడు తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సైగాన్ నగరం 1975 ఏప్రిల్ 25 నుండి ఎర్రసేనల దిగ్బంధంలో ఉంది. ఓటమి ఖాయమని తేలడంతో సైగాన్ నుండి అమెరికన్లతో పాటు, అప్పటి దాకా వారికి శునక సేవలు చేసిన వియత్నాం విధేయ వర్గీయుల్ని కూడా సురక్షితంగా బయటకు తరలించే పనిలో అమెరికన్ వర్గాలు మునిగాయి. ఏప్రిల్ 27 నుండి 29 మధ్య మూడు రోజులలోనే 400 మంది అమెరికన్లని, 4000 మంది తమ విశ్వాసపాత్రులైన స్థానిక విధేయుల్ని అమెరికా వాయుసేనq తరలించింది. సమీప సముద్రంలో లంగర్ వేసిన సుమారు రెండు డజన్ల నౌకలలోకి హెలికాప్టర్ల ద్వారా అదేపనిగా మూడు రోజులు తరలించింది. ఇంతలో మరో ఉద్రిక్త పరిణామం జరిగింది.
30-4-1975 ఏప్రిల్ 30న సూర్యోదయ సమయంలో కమ్యూనిస్టు సాయుధ సేన సైగాన్ నగర ఉత్తరదిక్కు నుండి అంతిమ నిర్ణయాత్మక దాడిని ప్రారంభించింది. ఎర్రసేనలు విజయ ధ్వానాలతో ముందుకు కదులుతున్నాయి. శతఘ్నులు, మరఫిరంగులతో సైగాన్ నగరం దద్దరిల్లుతోంది. నగరం మధ్య వైపుకు అది దూసుకొస్తోంది. అట్టి ఉద్రిక్త భరిత వాతావరణం లో *”సైగాన్ ఎయిర్ లిఫ్ట్”* ను అమెరికా హడావుడిగా చేపట్టింది.
సైగాన్ నగర దక్షిణప్రాంతం లో అమెరికా రాయబార కార్యాలయం ఉంది. అప్పటికే విమానాశ్రయం కీలుబొమ్మ ప్రభుత్వం నుంచి చేజారింది. నగరంలో ఇంకా మిగిలివున్న అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వ విధేయ వర్గాలు భయంతో దక్షిణ భాగం నుండి అమెరికా రాయబార కార్యాలయం వైపు హడావుడిగా తరలుతున్నాయి. నాటి స్థితిలో వారికి అదొక్కటే రక్షణ ప్రాంతం. అక్కడకు చేరిన వారిని ఏప్రిల్ 30న అమెరికా హెలికాఫ్టర్ తమ రాయబార కార్యాలయం భవనం మీది నుండి సమీప సముద్రంలో నిలిచివున్న అమెరికా నౌకల లోకి ఎయిర్ లిఫ్ట్ ద్వారా తరలించే పనికి దిగింది. ఇది 46 ఏళ్ళ క్రితం సైగాన్ నగరంలో జరిగింది.
ఒక్కమాటలో నాటి సైగాన్ సంఘటన గూర్చి క్రింది విధంగా చెప్పొచ్చు.
సైగాన్ నగరం ఉత్తర దిక్కు నుండి సాయుధ ఎర్రసైన్యాలు దక్షిణానికి దూసుకొస్తున్నాయి. విమానాశ్రయం చేజారడం వల్ల విమాన రవాణా స్తంభించింది. ఈ ట్రిప్పు హెలికాఫ్టర్ వెళ్లిపోతే, అది మరో ట్రిప్పు వస్తుందో లేదో తెలియని సందిగ్ద స్థితి అక్కడి నుండి నిస్క్రమన చేసే వారిలో వుంది. తమ తరలింపులో ఒక్క గంట ఆలస్యం జరిగినా, ఎర్రసేనల చేజిక్కుతామనే భయాందోళన నిరీక్షకులలో ఉంది. అట్టి ఉత్కంఠభరిత, ఉద్రిక్తభరిత క్షణాలలో 46 ఏళ్ళ క్రితం సైగాన్ ఎయిర్ లిఫ్ట్ జరిగింది. ఆ భౌతిక స్థితిగతుల్లో సీటింగ్ కంటే రెట్టింపు మంది హెలికాఫ్టర్ లోకి ఎక్కారు. అది గాలిలోకి ఎగిరే సమయంలో కూడా దాని లోపలా, బయటా కిక్కిరిసి వేలాడారు. కొందరు క్రిందపడిపోయారు. ప్రాణ నష్టం జరిగింది. నాడు అదో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సంఘటన!
పైన పేర్కొన్నట్లు నాటి సైగాన్ సంఘటనే యధావిధిగా నేడు కాబూల్ లో జరిగిందా? నాటి భౌతిక పరిస్థితులే నేడు కూడా యధాతథంగా వున్నాయా? అప్పటి వలెనే యాదృచ్చికంగా నేటి కాబూల్ సంఘటన కూడా జరిగిందా? లేదా అమెరికాయే వ్యూహాత్మకంగా ఈ ఘటనను సృష్టించిందా? రేపటి ఆరవ భాగంలో తెలుసుకుందాం.