అమెరికా ‘ఆఫ్ఘన్ యుద్ధం’ మరో రూపం తీసుకుంటుందా?

ఆప్ఘనిస్థాన్ పై రొచ్చు గుంట నిందాప్రచారం-నిజాలు-4

 

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

సామ్రాజ్యవాద మీడియా గత కాలాల కంటె నేడు అతి ఎక్కువ శక్తివంతమైనది. అది అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ ప్రభావిత శక్తిని కలిగి ఉంది. అది తలుచుకుంటే ప్రపంచ ప్రజల మానసిక అభిప్రాయాన్ని ఒక గంటలోనే సామ్రాజ్యవాద ప్రయోజనాలకు అనుకూలంగా మార్చగలదు. ఈ విషయాన్ని 16-8-2021న కాబూల్ విమానాశ్రయ (ఎయిర్ పోర్టు) ఘటన నిరూపించింది. ఆరోజు జరిగిన ఓ సన్నివేశాన్ని ఆధారం చేసుకుని ప్రచార, ప్రసార సాధనాలు ప్రపంచ ప్రజలను కంటతడి పెట్టించ గలిగాయి. ఆ సమయంలో ప్రపంచ ప్రజల దృష్టి దేనిమీద కేంద్రీకరించాల్సివుందో, దాని మీద లేకుండా చేయగలిగాయి. ఆప్ఘనిస్థాన్ నుండి అమెరికా సైనిక బలగాలు బేషరతుగా వెనక్కి వెళ్ళిపోవాలని ఇరవై ఏళ్ళ నుండి కోరుకునే ప్రపంచ ప్రజల వైఖరిని ఒక్క గంటలోనే మీడియా మార్చగలిగింది. అది ఏ రూపం తీసుకుందో చూద్దాం.

సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయ నిబద్ధ తరగతిలోని కొన్ని శ్రేణుల పూర్వ వైఖరి ఆ ఒక్క గంట దృశ్యాన్ని చూసి పూర్తిగా లేదంటే పాక్షికంగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా సేనలు నేడు నిష్ర్కమించి వుండాల్సింది కాదనే కొత్తవైఖరికి వస్తున్నారు. తమ పూర్వ వైఖరిని కూడా మార్చుకునే స్ధితిని మీడియా కల్పించగలిగింది. 2001లో తాలిబన్ ప్రభుత్వాన్ని గద్దె దింపిన అమెరికా యుద్ధోన్మాద దురాక్రమణ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రగతిశీల భావుకుల్లో కొన్ని శ్రేణులు సైతం 2021లో తమ పూర్వవైఖరిని మార్చుకునే పరిస్ధితిని ఆ ఒక్క గంటలో మీడియా సృష్టించ గలిగింది. నాలుగు కోట్లమంది ఆప్ఘనిస్థాన్ దేశ ప్రజల మీద ఇరవై ఏళ్ళు దౌర్జన్య పాలన సాగించిన ఉగ్ర, అగ్రరాజ్యం తన అనుకూల మీడియాతో ఒకే ఒక్క గంటలో తన సేనల నిష్క్రమణ వల్ల ఆప్ఘనిస్థాన్ ప్రజలకు అన్యాయం జరిగినట్లు ప్రపంచ ప్రజలలో కొత్త భావనని కలిగించగలిగింది. తానే అసలు సిసలు ఆఫ్ఘనిస్తాన్ దేశ ప్రజల ఉద్దారకురాలిగా ప్రపంచ ప్రజల మనస్సుల్లో క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చింది. ఐతే ఆ మార్పు అక్కడే ఆగిపోదు.

2001లో అమెరికా చేసిన “ఉగ్రవాదంపై నిరంతర యుద్దం” పట్ల వ్యతిరేకంగా స్పందించిన ప్రపంచ ప్రజల్ని సైతం పునరాలోచింప చేసి, నాటి యుద్ధోన్మాద విధానానికి నేడు వారిని మానసికంగా సిద్ధం చేస్తుంది. ఇరవై ఏళ్ళ క్రితం ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా చేసిన దుష్ట యుద్దాన్ని తాము ఆనాడు అనవసరంగా వ్యతిరేకించామని ప్రపంచ ప్రజల్ని ఆత్మసంశోధనకి గురి చేస్తుంది. వారిని ప్రాయచ్చిత్తం కూడా చేయిస్తుంది. నిజానికి అది ప్రపంచ ప్రజల పాత వైఖరి ని పునసమీక్ష వరకే పరిమితం కాదు. రేపటి అమెరికా కొత్త యుద్ధోన్మాద వ్యూహానికి కూడా ప్రపంచ ప్రజల మద్దతుని నేడు సమీకరిస్తుంది. అది ఎలాగో కూడా చూద్దాం.

అమెరికా నేడు ఆఫ్ఘనిస్తాన్ భూతల యుద్ధంలో ఓటమి పొందింది. మూడురోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన కూడా దీనినే స్పష్టం చేస్తుంది. నేడు భూతలయుద్ధం చేయలేని అమెరికా బలహీనత ని కప్పిపెట్టుకోవాలంటే, రేపు అది గగనతల యుద్దాన్ని కూడా చేయాల్సి రాచ్చు. దానికి మరో అవసరం కూడా ఉంది. రేపు ఆఫ్ఘనిస్తాన్ కొత్త సర్కార్ పై నియంత్రణ కోసం గగనతల యుద్దాన్ని అమెరికా చేయాల్సి రావచ్చు. భూతల యుద్ధంలో అమెరికా తన సైనికుల్ని కోల్పోవాల్సి వస్తుంది. అట్టి బాడీ బ్యాగుల నుండి బయట పడేందుకు నేడు సైనిక బలాల ఉపసంహరణ తప్పలేదు.

నేడు యుద్దం కొనసాగింపుకు అమెరికా సైన్యంతో పాటు పౌర సమాజం కూడా అంగీకరించే స్థితిలో లేదు. ఇలాంటి నష్టాలు గగనతల యుద్ధంలో ఉండవు. అవతలి వాళ్ళను విధ్వంసం, విచ్చిన్నం, వినాశనం చేస్తూనే తమ స్వంతసేన కూడా తరతమ స్థాయిల్లో నష్టం పోయేదే భూతల యుద్ధం. కానీ తాము నష్టపోకుండా కేవలం అవతలి వాళ్ళను నష్టపరచి అస్థిరం చేయడమే గగనతల యుద్ధం లక్ష్యం. ఐతే భూతల యుద్ధంలో ప్రత్యర్థి భూభాగం మీద కూడా కైవశం అవుతుంది. అది ఆకాశ యుద్ధంలో సాధ్యం కాదు. నేడు తాను వదిలేసిన ఆఫ్ఘనిస్తాన్ భూభాగం పై పట్టు కై పూనుకోవాల్సిన అవసరం అమెరికాకు లేదు. వదిలేసిన ఆఫ్ఘనిస్తాన్ లో కొత్తసర్కార్ తన చెప్పుచేతుల్లోనైనా ఉండాలి. లేదంటే, కనీసం చైనా, రష్యా, ఇరాన్ వంటి ప్రత్యర్థి దేశాలకు దగ్గర కానివ్వకుండానైనా ఉండాలి. అందుకోసం ఆకాశ యుద్ధ ఛాయిస్ కలిగి ఉండాలి. చైనా, రష్యా ల వీటో ల్ని కాదని రేపటి తన గగనతల దాడులకు ప్రపంచ ప్రజల మద్దతు కావాలి. అందుకై పూర్వరంగ పరిస్థితిని సృష్టించుకోవాల్సిన ఆవశ్యకత అమెరికాకి ఉంది. ఆ వ్యూహం లో భాగంగా ఇలాంటి ప్రాచుర్య సంఘటనలని సృష్టించాల్సిన ఆవశ్యకత అమెరికాకు ఉంది. ఇది మన గమనంలో వుండాలి.

ఇక ఇప్పుడు కాబూల్ ఎయిర్ పోర్ట్ సంఘటనలోకి వద్దాం. అది చూసిన ఎవరినైనా కంటతడి పెట్టిస్తుంది. అది మానవత్వం గల మనుషుల హృదయాల్ని ద్రవింప జేస్తుంది. ఐతే దానికి ఎవరు బాధ్యులు?

కాబూల్ ఎయిర్ పోర్టు ఘటన యాదృచ్చికంగా జరిగిందా? లేదంటే అదో ప్రేరేపిత ఘటనా? అది కాకతాలీయ సంఘటనా? లేదంటే స్టేజి కూప్ నా?

ఆధునిక ప్రపంచ చరిత్రలో తొలి మేజర్ స్టేజి కూప్ జర్మనీ లో నాజీ హిట్లర్ ప్రభుత్వంతో ప్రారంభమైనది. అది 1933లో బెర్లిన్ పార్లమెంట్ భవనం దగ్ధ సంఘటన. అట్టి స్టేజి కూప్స్ రాజకీయ సంస్కృతిని రెండో ప్రపంచ యుద్దానంతరం భారీ ఎత్తున అమెరికా అమలు చేస్తోంది. తన స్వంత రాజ్య ఆస్తుల్ని, శక్తుల్ని స్వయంగా తామే విధ్వంసం చేసుకొని, ప్రత్యర్థుల పైకి నెట్టి, వారిపై ప్రతీకార దాడికి వినియోగించేదే స్టేజి కూప్ రాజకీయ సంస్కృతి. దాన్ని దేశదేశాల్లో అమలు చేసే చరిత్ర అమెరికాకి ఉంది. అది నేడు కాబూల్ పునరావృతం అయ్యిందా?

ఔను, కాబూల్ ఎయిర్ పోర్టు సంఘటన పూర్వాపరాలను నిశిత దృష్టితో పరిశీలిస్తే, ఈ సందేహమే కలుగుతోంది. నాటి భౌతిక పరిస్థితులు కూడా ఈ సందేహానికి సాధికారిక బలం చేకూరుస్తున్నాయి.

1975 ఏప్రిల్ చివరలో వియత్నాంలో జరిగిన “సైగాన్ సంఘటన” నేడు కాబూల్ ఎయిర్ పోర్టులో పునరావృతం అయ్యిందా? లేదంటే, లేదంటే ఫ్రాన్స్ చరిత్రను మదింపు చేస్తూ చరిత్ర పునరావృతమైనదని చెప్పే సందర్భంలో మార్క్స్ చెప్పినట్లు చరిత్ర రెండోసారి యధావిధిగా కాక ఓ ప్రహసనం (ఫార్స్) గా పేర్కొన్నాడు. అది సైగాన్ లో వలె యధాతథంగా కాకుండా ఓ ఫార్స్ గా కాబూల్ లో నేడు పునరావృతమైనదా? రేపటి ఐదో భాగంలో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *