విదేశీ ప్రభుత్వాలకు, కంపెనీలకు, మహిళలకు క్షమాబిక్ష(General Amnesty)పెడుతున్నామని ప్రకటించిన రెండు రోజుల్లోనే తాలిబన్లు జర్మనీ వార్తా సంస్థ దాయ్ చు వెలా (Deutsche Welle)కు పనిచేస్తున్న ఒక విలేకరి బంధువును హత్య చేశారు. ఈ విషయాన్ని వార్త సంస్థయే ప్రకటించింది.
విదేశీ వార్త సంస్థలకు పనిచేస్తున్న జర్నలిస్టులను ఏరివేసే కార్యక్రమాన్ని తాలిబన్లు మొదలు పెట్టారనేందుకు ఈ సంఘటన ఉదాహరణ. పెద్దఎత్తున తాలిబన్లు జర్నలిస్టుల ఇళ్లను సోదా చేయడం (targeted-door-to-door searches) మొదలుపెట్టారు. దాయ్ చు వెలా జర్నలిస్టును ఇంటిని మొదట సోదా చేశారు. అయితే, ఆయన కనిపించలేదు. దీనితో వాళ్లు బంధువుల మీద దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారని ది నేషనల్ న్యూస్ రిపోర్టు చేసింది.
పైకి క్షమాభిక్ష ప్రకటించినా అమెరికాకు, నాటో దళాలకు పనిచేస్తున్న వ్యక్తుల కోసం గాలింపు మొదలుపెట్టారని ఐక్య రాజ్యసమితి తాజా నివేదికలో పేర్కొన్నారు. కాబూల్ విమానాశ్రయ దారిలో వెళ్లే వారందరిని సోదా చేస్తున్నారని నార్వేజియన్ సెంటర్ ఫర్ గ్లోబల్ ఎనాలిసెస్ పేర్కొంది. ఇపుడు దేశం విడిచి పోవాలంటే కాబూల్ విమానాశ్రయం ఒక్కటే మార్గం. ఇలా పారిపోవాలనుకుంటున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆషనిస్తాన్ జర్నలిస్టులకు, వారి బంధువుకు పొంచి ఉన్న ముప్పును తమ ఉద్యోగి బంధువుల హత్య వెల్లడిస్తుందని డాయ్ మూ వెలా డైరెక్టర్ పీటర్ లింబోర్డ్ చెప్పారు. తమ సంస్థకు చెందిన మరొక ముగ్గురు జర్నలిస్టుల ఇళ్లన కూడా తాలిబన్లు సోదా చేశారని ఆయనవెల్లడించారు.
ఇప్పటికే ఆఫ్గన్ ప్రభుత్వం నడిపే టివిచానెల్ లోకి మహిళా ఉద్యోగులను తాలిబన్లు ఇంటికి పంపించేశారు.