–ఇఫ్టూ ప్రసాదు (పీపీ)
ఆధునిక యుగంలో మూడు అగ్రరాజ్యాల్ని చిత్తుగా ఓడించిన ఘన రాజకీయ చరిత్ర ఆప్ఘనిస్థాన్ దేశ ప్రజలకు వుంది. ప్రాచీనయుగంలో సైతం ప్రపంచ విజేత అలెగ్జాండర్ జైత్రయాత్రను తమ నేల మీద అడుగు పెట్టనివ్వని చరిత్ర ఆప్ఘనిస్థాన్ ప్రాంత ప్రజలకు వుంది. అందుకే కాబోలు, 1850వ దశకంలోనే వ్యాసంలో ఆఫ్ఘనిస్తాన్ జాతి స్వాతంత్ర్య ప్రియత్వంతో కూడిన చారిత్రిక సాంప్రదాయ విశిష్టతల్ని మార్క్సిస్టు మహోపాధ్యాయ ఎంగెల్స్ ప్రత్యేక ప్రశంస చేశారు.
అట్టి చరిత్ర గల ఆప్ఘనిస్థాన్ లో అగ్రరాజ్యం అమెరికా నేడు ఓడి అవమానకరంగా నిష్క్రమించే వేళ యిది. ఈ కీలక సమయం లో పరాజిత అగ్రరాజ్యమైన అమెరికాకు అనివార్యంగా ప్రపంచ ప్రజల కళ్లెదుట ఓ కృత్రిమ మానసిక యుద్ద దృశ్యాన్ని ప్రదర్శించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
ప్రపంచ ప్రజల కళ్ళు కప్పి, వారి దృష్టిని దారి మళ్ళించే ఓ కృత్రిమ రసవత్తర మానసిక రాజకీయ క్రీడని ప్రపంచ ప్రజా రంగస్థలం పై ప్రదర్శించాల్సిన అనివార్యమైన ఓ అవసరం అమెరికాకి ఏర్పడింది.
అది ఒకే గుండుకు మూడు పిట్టల్ని కొట్టే లక్ష్యం గలది. అట్టి మూడు అవసరాలు ఏమిటో చూద్దాం.
ఆఫ్ఘనిస్తాన్ పై రొచ్చుకుంట నిందా ప్రచారం : నిజాలు-3
*A* -అమెరికా ఓ అగ్రరాజ్యం. ప్రపంచాన్ని వందసార్లు బూడిద పాలుచేసే సామర్థ్యం గల పెద్ద అణ్వస్త్ర రాజ్యం. ప్రపంచం నలుమూలలా సైనిక స్దావరాలు గల ఉగ్రరాజ్యం. తనకు లొంగని సార్వభౌమాధికార దేశాల్ని ఏలే ప్రభుత్వాల్ని కూల్చే విధ్వంసకర రాజ్యం. అట్టి అగ్ర రాజ్యమైన అమెరికా తాను దురాక్రమణ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ని గత ఇరవై ఏళ్ళుగా కాబూల్ రాజధానిగా పాలిస్తోంది. ఆ కాబూల్ సైతం తన నుంచి చేజారిపోతున్నది. ఆదివాసీ తెగ స్వభావం గల ఓ వెనకబడ్డ ఆప్ఘనిస్థాన్ ప్రజల చేతుల్లో
*”ప్రపంచ సూపర్ పవర్”* నేడు ఓడిపోతున్నది. గొర్రెలు, పశువుల మందల్ని కాచుకునే వెనకబడ్డ జాతి చేత *”ప్రపంచ పోలీసు”* చిత్తుగా ఓడిపోతోంది. నేటికీ ఆదిమ ప్రవృత్తి గల ఓ చిన్న రాజ్యం చేతుల్లో కుహనా ఆధునిక నాగరిక మహా రాజ్యం ఓటమి పొందబోతోంది. చలిచీమల చేతుల్లో ఓ మహా సర్పం ఓటమి పొందుతున్నది. చిట్టెలుక వంటి ఆప్ఘనిస్థాన్ దేశ ప్రజల చేతిలో మదపుటేనుగు వంటి అమెరికా సామ్రాజ్యవాద రాజ్యవ్యవస్ధ ఓడిపోతున్నది. అది అమెరికాకి నేడు నిర్ణయాత్మక ఓటమిగా; ఆఫ్ఘనిస్తాన్ ప్రజకి నిర్ణయాత్మక విజయంగా మారుతోన్న కాలం యిది.
ఇది మొన్న ఆగస్టు 14, 15ల నాటి స్థితి! మరికొన్ని గంటల్లో సాయిధ తిరుగుబాటు శక్తులు కాబూల్ రాజ్యపీటం పై ఆసీనులు కాబోతున్న క్షణాలవి. నామమాత్రంగా ఓ కీలుబొమ్మ సర్కార్ ని అడ్డం పెట్టుకొని, గత ఇరవై ఏళ్ళు అగ్రరాజ్యం గ్రీన్ జోన్ కేంద్రంగా ఆసీనురాలై పాలించింది. అట్టి కాబూల్ రాజ్య పీఠం మరికొన్ని గంటల్లో స్ధానభంశం చెందనున్నది. అట్టి క్షణాల్లో అగ్రరాజ్య ఓటమి వార్త మరికొన్ని గంటల్లో గుణాత్మక ప్రాచుర్యం పొందనున్నది. అది ప్రపంచ ప్రజలో చర్చనీయాంశం గా మారనుంది. తద్వారా అమెరికా ఓ “కాగితపు పులి” గా ప్రపంచంలో బట్టబయలు కానున్నది. సరిగ్గా అట్టి కీలక సమయంలో ప్రపంచ ప్రజల కళ్ళుకప్పి, వ్యూహాత్మకంగా దృష్టిని దారి మళ్ళించాల్సిన ఆవశ్యకత నేడు అమెరికాకి ఏర్పడింది. అట్టి ఆవశ్యకతని నెరవేర్చే నాటక సన్నివేశాన్ని సృష్టించాల్సిన అవసరం నేడు అమెరికాకి ఏర్పడింది. ఆగస్టు 15 నాటికి ఆ నాటక ప్రదర్శనకి ముహూర్తం ముంచుకొచ్చింది.
B) గత ఇరవై ఏళ్లుగా నాలుగు కోట్లమంది ఆప్ఘనిస్థాన్ దేశ ప్రజల పై అమెరికా బుల్ డోజర్ పాలన సాగించింది. దేశప్రజల కన్నీళ్లు, రక్తంతో ఆఫ్ఘనిస్తాన్ నేల తడిసింది. లక్షలమంది దేశ ప్రజల శవాల కుప్పలపై తన కీలుబొమ్మ ప్రభుత్వం ద్వారా అమెరికా దౌర్జన్య పాలన సాగించింది. ఊరూరా మృత దేహలతో దేశం శోకించింది. గ్రామాలకు గ్రామాలే తగలబెట్టి బూడిద పాల్జేసింది. పల్లెల్ని నేల మట్టంచేసింది. ఊళ్లకు ఊళ్ళని నిర్బంధ శిబిరాలుగా మార్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆఫ్ఘనిస్తాన్ ని అమెరికా ఓ వల్లకాడుగా మార్చింది. విదేశీ దురాక్రమణ సైనిక బలగాల భీభత్సానికి తాళలేక లక్షల మంది దేశప్రజలు పొట్ట చేత పట్టుకొని మాతృదేశం విడిచి పొరుగు దేశాలకి కాందిశీకులు గా తరలి వెళ్ళారు. నాలుగు కోట్లమంది దేశ ప్రజలకి విదేశీ పాలన శాపంగా మారింది. సహజంగానే ఇంతకాలం వెలుగు చూడని ఆఫ్ఘనిస్తాన్ దేశప్రజల రక్తసిక్త కన్నీటి విషాద గాధలు ప్రపంచ ప్రజలకి రేపటి నుండి వెలుగు చూసే పరిస్థితి వుంది. ఇరవై ఏళ్ళ అమెరికా పాలనలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజల ఘోర బాధలు బహిర్గతమైతే, వారి పట్ల ప్రపంచ ప్రజలు కళ్ళు చెమర్చబోతున్న కొత్త భౌతిక పరిస్థితి ఏర్పడబోతోంది. వారి పట్ల ప్రపంచ ప్రజల్ని కన్నీళ్లు కార్చనివ్వకుండా ఓ కుట్రను పన్నాల్సిన కొత్త అవసరం అమెరికాకి ఏర్పడింది. వారికి పోటీగా ఓ కృత్రిమ నాటకీయ బాధిత ప్రజా సమూహాన్ని ఆఫ్ఘనిస్తాన్ లొనే సృష్టించి, వారి కోసం ప్రపంచ ప్రజలతో కౌంటర్ కన్నీళ్ళను కార్పించాల్సిన అవసరమది. ఓ నాటకాన్ని ప్రపంచ ప్రజా రంగస్థలం పై ప్రదర్శించి, రక్తికట్టించాల్సిన ఆవశ్యకత కూడా అమెరికాకి ఏర్పడింది. అట్టి రంగస్థల నాటక ప్రదర్శనకి తగు పరిస్థితి మొన్నటి ఆగస్టు 15 నాటికే పరిపక్వం కాసాగింది.
C)ఇరవై ఏళ్ళ అమెరికా, నాటో సైనిక దురాక్రమణ పర్వం ముగుస్తున్నది. అమెరికా సైనిక బలాల ఉపసంహరణ తర్వాత ఆప్ఘనిస్థాన్ లో అమెరికాకి ఇక చోటు వుండని ప్రతికూల స్థితి ఏర్పడింది. పైగా నేటి ప్రపంచ భౌగోళిక రాజకీయ వ్యూహంలో అమెరికాకి ముఖ్యపోటిదారుగా చైనా నిలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ లో కొత్తప్రభుత్వ హయాంలో రేపు చైనా లాభపడబోతున్న తొలి సంకేతాలు వెలుగు చూసే వేళ యిది. ఒకవేళ రేపటి కొత్త సర్కార్ చైనాకి వ్యూహాత్మకంగా దగ్గరైతే, అమెరికా ప్రపంచ వ్యూహానికి ఎక్కువ ప్రమాదం. చైనాను చుట్టుముట్టే అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహంలో భాగంగా తాలిబన్లపట్ల మరింత విద్వేష ప్రచారం అది చేయక తప్పదు. తాలిబన్లపై నేడు ఎంత ఎక్కువ విద్వేషాన్ని సృష్టించగలిగితే, రేపు ప్రపంచ దేశాల, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ఇరుగు పొరుగు దేశాల మద్దతు కూడగట్టే అవకాశం అమెరికాకి వుంది. వాటిని చైనాకు ఎక్కువ దూరం చేయొచ్చు. రేపు చైనా పట్ల తన విద్వేషం కక్కడానికి తాలిబన్ల పై నేడు సృష్టించే విద్వేషం ఓ శక్తివంతమైన సాధనమౌతుంది. ఆచరణలో అమెరికా భౌగోళిక వ్యూహానికి అది వుపకరిస్తుంది. అందుకే తాలిబన్ల పొరపాట్లని నేరాలు గా; వారి నేరాల్ని పరమఘోర నేరాలుగా; చిత్రించి భూతద్దం లో చూపించాల్సిన రాజకీయ ఆవశ్యకత నేడు అమెరికాకి వుంది. తాలిబన్ శక్తుల ప్రగతి వ్యతిరేక రాజకీయ ప్రవృత్తి అందరికీ తెలిసిందే. వారు నేరాల్ని చేయని వాళ్లే కాదు. తాలిబన్ల పట్ల అట్టి భ్రమలు ఎవరికీ వుండనక్కర లేదు. ఐతే స్థలకాలాదులతో సంబంధం లేకుండా, తాలిబన్ల నేరాల్ని అసందర్బంగా భూతద్దంలో చూపించడం వెనక అంతకంటే పరమ ఘోర సామ్రాజ్యవాద నేర వ్యవస్థను కప్పిపెట్టే ఓ కుట్ర ఉండటం గమనార్హం.
కాబూల్ లో పాలనా పగ్గాలు స్వీకరించే నాటికే తాలిబన్లను *”ప్రపంచ విలన్లు”* గా చిత్రించి తీరాల్సిన అవసరం అమెరికాకి ఏర్పడింది. ఈ వ్యూహానికి ఉపయోగపడే ఓ నాటకీయ సన్నివేశాన్ని సృష్టించే కుట్ర అమెరికాకి అవసరమైనది. అట్టి కుట్ర పన్నడానికి మొన్న ఆగస్టు 15 నాటికే తగిన సుముహూర్తం సమీపించింది.
పై నేపధ్య పరిస్థితుల్లోనే 16-8-2021న కాబూల్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా ఓ గంట పాటు రసవత్తరమైన, గొప్ప నాటకీయ సన్నివేశం జరిగింది. గత ఇరవై ఏళ్లుగా నాలుగు కోట్లమంది ఆఫ్ఘనిస్తాన్ దేశ ప్రజల రక్తసిక్త కన్నీటి బాధల గూర్చి ఏనాడూ పట్టించుకోని సామ్రాజ్యవాద మీడియా తన యజమానిరాలి డైరెక్షన్ లో ప్రచార పన్నాగం పన్నింది. కాబూల్ ఎయిర్ పోర్ట్ లో గంట నిడివిగల ఓ కన్నీటి నాటకాన్ని అది చిత్రీకరించింది. దాన్ని ఏడు వందల కోట్ల మంది ప్రపంచ ప్రజలకి ప్రత్యక్షప్రసారం చేసింది. అది ప్రపంచ ప్రజలతో బావురుమని ఏడిపించింది. అదేమిటో రేపటి నాలుగో భాగంలో తెలుసుకుందాం.