ఈ ఫోటోకి మొన్న జూలై 26 నాటికి యాభైయేళ్లు నిండాయి. అపోలో 15 చంద్రమండల యాత్ర కు సంబంధించిన అరుదైన ఫోటో ఇది. మానవ జాతి చరిత్రలో ఒక తొలి ఫోటో.
అపోలో 15 చంద్రమండల యాత్రను 1971 జూలై26 న ప్రారంభించారు. ఆగస్టు 7న యాత్ర ముగిసింది. జూలై 30,1971న అంతరిక్ష నౌక చంద్రుడి మీద వాలింది. ఇలా చంద్రుడి మీద దిగిన నాలుగో యాత్ర ఇది. చంద్రుడి మీద ఎక్కువకాలం గడిపిన యాత్ర కూడా ఇదే. చంద్రుని మీదికి మరొక వాహనాన్ని తొలిసారి తీసుకెళ్లింది కూడా ఈ యాత్రలోనే. ఈ యాత్రలో ముగ్గురు యాస్ట్రనాట్స్ పాల్గొన్నారు. కమాండ్ మాడ్యూల్ పైలట్ ఆల్ఫ్రెడ్ వోర్డెన్ ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటే కమాండర్ డేవిడ్ స్కాట్, లూనార్ మాడ్యూల్ ఫైలట్ జేమ్స్ ఇర్విన్ చంద్రుని మీద హేడ్లే ఎపెనైన్ (Hadley-Apennine) అనే చోట దిగారు.
వాళ్లిద్దరు అంతరిక్ష నౌక నుంచి 460 పౌండ్లున్న లూనార్ రోవింగ్ వెహికిల్ (LRV) ని కిందికి దించారు. తర్వాత మూడు రోజుల పాటు వాళ్లు చక్కగా చంద్రమండల మీద 17 మైళ్ల దూరంగా ఈ బండిని నడపుకుంటూ పచార్లు కొట్టారు.
తర్వాత లూనార్ మాడ్యూల్ ని కొద్ది దూరంగా దాన్ని పార్క్ చేశారు. అపుడు దీని మీద అమర్చిన టెలివిజన్ కెమెరా లూనార్ మాడ్యూల్ వైపు చూస్తూ ఉంటుంది. దీని వల్ల లూనార్ మాడ్యూల్ భూమి వైపు తిరుగుముఖం పట్టగానే అదంతా భూమికి ప్రసారమవుతుంది.
భూమికి తిరిగి వచ్చేటపుడు LRVని అక్కడే వదలిపెట్టి వచ్చారు. ఈ ఫోటోని అపోలో 15 యాత్ర చివరిరోజున ఆగస్టు 3, 1971 తీశారు. బగ్గీ వైనక వైపు తెల్లగా మెరుస్తూ కనబడుతున్న వస్తువు ఒక రేకు. చంద్రుని చేరుకోవాలన్న యుగయుగాల మనిషి తపనని నిజం చేసేందుకు జరిగిన అంతరిక్ష పరిశోధనల్లో అశువులు బాసిన 14 మంది అమెరికా, సోవియట్ రష్యా యాస్ట్రోనాట్స్, కాస్మొనాట్స్ పేర్లను స్కాట్ దాని మీద లిఖించాారు.
ఇప్పటికీ ఈ మూన్ బగ్గీ (Moon Buggy) అక్కడే చంద్రుడి మీదే ఉంది. అపోలో 15 యాత్ర విశేష మేమంటే భూమికి దూరంగా మరొక నేల మీద తొలిసారి మనిషి ఒక వాహనం నడపడం. అపోలో చంద్రమండల యాత్రల్లో మొత్తం మూడు బగ్గీలను చంద్రుడి మీద వదలిపెట్టి వచ్చారు.ఇది మొదటి బగ్గీ.
చివరిగా మరొక మాట, బగ్గీని అక్కడ వదలిపెట్టి వచ్చేటపుడు ఒక ఎర్రటి పేపర్లో చుట్టిన బైబిల్ ను కూడా స్కాట్ అక్కడ పెట్టేసి వచ్చాడు. బగ్గీ కంట్రోల్ ప్యానెల్ మీద కనిపిస్తున్న వస్తువే ఆ బైబిల్.