(రాఘవ శర్మ)
కొండల మాటున ముళ్ళ పొదల్లో చిక్కుకున్నట్లు పెద్ద పెద్ద రాతి మండపాలు. మండపాలపై చెక్కిన చక్కని చిక్కని శిల్పాలు. గుప్తనిధుల అన్వేషణలో తీవ్రంగా గాయపడ్డ శిథిల ఆలయాలు.
శతాబ్దాల చరిత్రకు ఆనవాళ్ళుగా తాటికోన శిథిలాలపై చక్కని శిల్పసంపద. తిరుపతికి పదిహేను కిలోమీటర్ల దూరంలో, చంద్రగిరికి కూతవేటు దూరంలో పురావస్తు శాఖ కంటికి ఆనకుండా ముళ్ళ చెట్ల మధ్య దాగిన మన వారసత్వ సంపద.
ఆగస్టు 15, ఆదివారం సాయంత్రం తాటికోనకు బయలు దేరాం.నేను, భూమన్, ట్రెక్కింగ్ శ్రీనివాస్,సుశీల, ఆమె ఇద్దరు సంతానం; ఇంతే గుప్పెడు మనుషులం.
తిరుపతి నుంచి చంద్రగిరి వైపు బైపాస్ రోడ్డులో మా వాహనాలు సాగాయి. చంద్రగిరి వంతెన వచ్చేసరికి ఎడమ వైపున సన్నని రోడ్డులోకి మళ్ళాం. రెండు గ్రామాలు దాటి మూడు కిలోమీటర్లు వెళ్ళగానే, ఆ రోడ్డులో చిట్టచివరి గ్రామం తాటికోన (Tatikona) గిరిజన ఆవాసం. తాటికోన చుట్టూ పచ్చని కొండలు ఎంత అందంగా ఉన్నాయో! ఆ రహదారి అక్కడితో ముగిసింది.
సన్నని కాలి బాటలో ముందుకు సాగాం.
ఎదురుగా ఏకశిలా రాతికొండ. ఏటవాలుగా ఉన్న ఆ రాతి కొండను ఎక్కాం. దానిపైన ఒక చిన్న పురాతన శిధిల శివాలయం. తాటికొండ గిరిజనులు ప్రతి శివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు జరుపుతారు. చుట్టూ పచ్చని కొండలు. అంతా ఏకాంతం! ఆ రాతికొండపై చుట్టూ రాళ్ళు పేర్చి, ఆ పేర్చిన రాళ్ళపై ఒక వెడల్పాటి పెద్ద బండను పెట్టారు.
ఆ బండ కింద పురాతన మానవుడు చెక్కిన అక్షరాలు, గుర్తులు ఉన్నాయి. ఇది క్రీస్తు పూర్వం అనేక శతాబ్దాలనాటిదై ఉండవచ్చు.
ఇలాంటి పురాతన నిర్మాణాల ఆనవాళ్ళు అనేకం శిథిలమై కనిపించాయి. ఈ రాతికొండపై మట్టితో కట్టిన గోడ ఆనవాళ్ళూ కూడా ఉన్నాయి. చంద్రగిరి దుర్గం నిర్మించక ముందు ఇక్కడ మట్టితో కట్టిన ఒక కోట గోడ ఉండి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. ఈ మట్టి గోడ శిథిలమయ్యాకే చంద్రగిరి దుర్గాన్ని నిర్మించినట్టు ఒక అంచనా.
సమీప తాటికోన గిరిజన ఆవాసం నుంచి ఈ రాతి కొండపైకి జంటలు జంటలుగానవదంపతులు, ప్రేమికులు వస్తుంటారు. ఈ ఏకాంతంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు.మేము అక్కడికి చేరుకునే సరికి కొత్తగా పెళ్ళైన ఒక యువ జంట ప్రేమ చిహ్నంగా చేబోమ్మతో నిలబడి ఉంది. ఆఇద్దరి చేతులు కలిసిన చోట గడ్డిపూలు పెట్టి, ఆ ప్రేమ చిహ్నం వెనుక రాతి గుండుపై ఆలయ శిఖరం కనిపించేలా సెల్ఫోన్లో ఫొటోలు దిగుతూ సంబరపడిపోతున్నారు. సాయం సమయంలో ఈ పచ్చని కొండల మధ్య ఎంత సృజనాత్మకం!
కొండ దిగి ముందుకు సాగితే ఎదురుగా పురాతనమైన ఒక పెద్ద కోనేరు. కోనేరుకు కుడివైపు కొండ పై ఒక పెద్ద రాతి బండపై ఆలయ గోపురం. ఆ పెద్ద బండపైకి ఎక్కడం అసాధ్యం. అంత పెద్ద బండపై ఆ గోపురాన్ని ఎలా నిర్మించారో?
తిరుపతి జ్ఞాపకాలు-42
ఆ పెద్ద బండపై పునాదులు లేకుండా కట్టిన ఆ గోపురం శతాబ్దాలపాటు గాలి వాన, తుఫానుల ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని ఎలా నిబడింది!?
ఆ గోపురం ఉన్న వైపు సాగుతున్నాం. దానికి దారి డొంకా లేదు. అక్కడి నిర్మాణాలను చూడాలన్నదే మా అన్వేషణ.
ముళ్ళ పొదలు, మనిషెత్తు ఎదిగిన బోదను చీల్చుకుంటూ పూడిపోయిన కాలిబాటలో సాగుతున్నాం. ఎదురుగా ఒక చిన్న శిథిల మండపం. ఆ మండపం లోంచి లోనికి ప్రవేశించాం. అదొక పెద్ద సుందరమైన మండపం. ఉనట్లుండి వూడిపడిన మమ్మల్ని పల్కరిస్తున్నట్లు అక్కడక్కడా చెక్కిన శిల్పాలు. పెద్ద పెద్ద బండరాళ్ళను ఆనుకుని ఉన్న మండపం గుప్త నిధుల వేటగాళ్ల దాడిలో బాగా గాయపడింది. ఎక్కడ చూసినా ఈ గోతులే.
రెండు పెద్ద పెద్ద బండ రాళ్ళ మధ్యనుంచి అతి కష్టంపైన లోనికి ప్రవేశించాం. ఈ కొండల మధ్య, ముళ్ళ మొదల్లో ఏమిటీ నిర్మాణాలు!? గర్భగుడిలో విగ్రహాలు లేవు. అంతా తవ్వేశారు. ఇదొక పెద్ద శివాలయం. ఒక బండపై వినాయకుడి విగ్రహం చెక్కి ఉంది. దాని కింద చూస్తే లోతైన బావి ముళ్ళ పొదలతో కప్పేసి ఉంది. పొరపాటున కాలు జారిందా ముళ్ళ కంపలలోంచి లోతైన బావిలోకి జారుకుంటాం.
ఎన్ని శిథిల మండపాలు! చుట్టూ నిర్మాణాల శిథిలాలు. శతాబ్దాల క్రితం రాజుల నివాసమై ఉండవచ్చు. ఎలాగైనా గుడిగోపురం ఉన్న బండ ఎక్కాలని విఫల యత్నం చేశాం. దాని దరిదాపుల్లోకి మాత్రం వెళ్ళగలిగాం. ఆ బండ చుట్టూ శిథిల నిర్మాణాలే!
ఇలాంటి చారిత్రక నిర్మాణాలను తవ్వి తీయాల్సిన పురావస్తు శాఖ ఉనికి కనిపించడం లేదు. పురావస్తు శాఖ ఆనవాళ్ళ కోసం భవిష్యత్తులో తవ్వకాలు జరపాల్సి వస్తుందేమో!? ఇది తాటి కోన. ఈ కోనలో తాటి వనం ఉండవచ్చు. ఇక్కడ రెండో మూడో తాటి చెట్లు తప్ప ఇప్పుడు తాటి వనం లేదు.
చుట్టూపచ్చని కొండలు. మధ్యలో ఒంటరిగా ఈ శిథిల సౌందర్యం. దాని సమీపంలో నిర్మలమైన గిరిజన నివాసం.
ఓ తాటి కోనా..
నీ సహజ సౌందర్యానికి తన్మయులమై పోయామ్.
నీ ముందు తలవంచక తప్పదు.
(ఆలూరు రాఘవశర్మ,సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)