(వడ్డేపల్లి మల్లేశము)
భారతదేశంలో కుల వ్యవస్థ బలంగా ఉంది. అస్పృశ్యత తో పలు రకాల వివక్షత భారతీయ సమాజానికి ఇంకా పీడిస్తూనే ఉన్నాయి.
కుల వ్యవస్థను అలాగే ఉంచి డబ్బులు పంచే పథకాలు ప్రారంభించి అభివృద్ధి చేస్తున్నామని పబ్బం గడుపుకోవడానికి పాలకులకు ప్రయత్నిస్తుంటారు. వాళ్లకి కుల వ్యవస్థ ఒక రాజకీయ ఆయుధంగా పనిచేస్తే వస్తున్నది.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ‘కుల నిర్మూలన’ (Annihilation of Caste) అనే అంశాన్ని ప్రస్తావిస్తూ కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేము అని కుల నిర్మూలన అంతిమ పరిష్కారం అని హెచ్చరించాడు.
కానీ స్వతంత్ర భారతంలో 75 ఏళ్లుగా అస్పృశ్యత ,వివక్షత, దళితులపై దాడులు నిరంతరం కొనసాగిస్తున్న ఈ సమాజంలో ప్రభుత్వం తన అవకాశం కోసమే ఈ సంఘటనలను ఉపయోగించుకున్నవి తప్ప దళితులపైన ప్రేమతో కార్యక్రమాలు ఇంతవరకు చేపట్టలేదు అనేది నగ్నసత్యం.
దళిత బంధు ప్రారంభోత్సవం కొన్ని నిజాలు
దళితకుటుంబానికి 10 లక్షల రూపాయలు నగదు ఇచ్చే దళిత బంధు పథకాన్ని సోమవారం రోజున హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో గల శాలపల్లె దళితవాడలో ముఖ్యమంత్రి ప్రారంభించారు.
పథకాన్ని ప్రారంభిస్తూ గత సంవత్సరం క్రితమే ఈ పథకం ప్రారంభించవలసి ఉందని గత 25 సంవత్సరాలుగా దళితుల గురించి తాను ఆలోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పడాన్ని దళితుల తో పాటు సమాజం యావత్తూ ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదని మహా ఉద్యమం అని ఆయన చెప్పడంలో విశ్వాసము లేని కారణంగా దశాబ్దము కిందికి తిరిగి వెళ్ళవలసి వస్తుంది.
తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే నని, తాను కావలి కుక్కలా ఉండి ప్రజల కోసం పని చేస్తానని ,దళితులకు 3 ఎకరాల భూమి తప్పనిసరి చేస్తామని, అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సమకూరుస్తామని ఇచ్చిన హామీలను కెసిఆర్ మరచినా,. ప్రజలు, దళిత సంఘాలు, దళిత ప్రజానీకం మరవలేదు సుమా!
హుజూరాబాద్ ఉప ఎన్నిక కారణమైన స్థానిక శాసన సభ్యుడు ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ జాతీయ స్థాయికి చేరుకోవడంతో రాజకీయాలంటే ఏమిటో తెలిసింది. పైగా ఎన్నికల కోసం ఇక్కడి ప్రభుత్వం ఎలా ఆరాటపడుతున్నదో తెలిసిపోతున్నది.
ఈ పథకాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఉపాధ్యాయులు, ఉద్యోగులు లబ్ధిదారులు ప్రజానీకాన్ని పెద్దమొత్తంలో ఈ సభకు తీసుకురావాలని కలెక్టర్ డిఇఓ చేసిన ఆదేశాల లో ఎంత బానిసత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇష్టం ఉన్నట్టుగా ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవడం తో పాటు ఈ కార్యక్రమానికి లక్షల రూపాయలను ఖర్చు చేసినట్టుగా వేదిక నిర్మాణం తదితర ఏర్పాట్లను బట్టి తెలుస్తున్నది.
కార్యక్రమం ముగింపులో వేదికపై నుంచి అనేకమంది సంతోషం లో మునిగి తేలడమే కాకుండా ముఖ్యమంత్రికి పాదాభివందనం చేయడాన్ని స్పష్టంగా గమనించవచ్చు.
ఇటీవల రెండు జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసిన నాడే తెలంగాణ పరువు సముద్రం పాలయింది. ఇక ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం అనే పదానికి చోటు లేకుండా పోయినా దళితుల తో సహా అనేక మంది అనుయాయులు, మంత్రులు, పార్టీల కార్యకర్తలు, శాసనసభ్యులు ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండటం ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క చైతన్య రాహిత్యానికి ప్రతీకగా భావించవచ్చు.
మరి, దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఎక్కడ?
ఏ వర్గాలు కోరకుండానే అనేక హామీలు ఇచ్చిన పరంపరలో భాగంగా దళితులకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని మూడు ఎకరాల భూమితోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సమకూర్చడానికి హామీ ఇచ్చి అమలు చేయకపోవడం విడ్డూరమే కాదు. రాజ్యాంగ ఉల్లంఘన కూడా. ఈ విషయాన్ని మరిచి పోయిన దళిత సంఘాలు, దళిత ప్రజానీకం, దళిత మేధావులు ప్రధాన డిమాండ్ ను పక్కకు పెట్టి పది లక్షల రూపాయలకు ప్రభుత్వo ముందు యాచకులుగా మారడం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే అవుతుంది.
దళిత సంఘాలు ప్రజానీకానికి విజ్ఞప్తి
అనాదిగా అనగారిణ వర్గమైన దళితులకు అనేక సౌకర్యాలు కల్పించడంతోపాటు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడంలో కూడా ఏ వర్గానికి అభ్యంతరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని అనాదిగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలకు ఈ చీలిక వాదం ఆటంకమే అవుతుందని బహుజనుల యొక్క ఆవేదన మాత్రమే. ఇప్పటికి దళిత మేధావులు ఆలోచించి సబ్బండ వర్ణాలను ఏకం చేసి మన ఓటు అనే ఆయుధం ద్వారా రాజ్యాధికారానికి చేరువ కావడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం.
ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ప్రధాన వాగ్దానాలను పక్కన పెట్టడంలో ఔచిత్యం ఏమిటో? ఎందుకు రాజీ పడుతున్నారో? ప్రజానీకానికి సమాధానం చెప్పుకోవలసిన అవసరం ఉన్నది. డిమాండ్ చేసే స్థాయి నుండి యాచించే స్థాయికి దిగజారడం , మౌనంగా ఉండడం పాలకులకు మరింత బలాన్ని చేకూర్చి నట్లు అవుతుంది. దళిత సంఘాలు రాజీ పడడం ద్వారా బహుజన ఉద్య మానికి నష్టం జరిగే అవకాశం ఉంది.
కనుక ఇదే సందర్భంలో ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా ప్రజాధనం లో తమ వాటాను సాధించే క్రమంలో డిమాండ్ చేయడం ద్వారా మాత్రమే మన హక్కులను రక్షించుకోగలo. మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుని ఉమ్మడి ఉద్యమాన్ని బలోపేతం చేయగలము.
కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాలోని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి సమావేశానికి జనాన్ని తరలించే బాధ్యతను అప్పజెప్పడం… ఇటీవల కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల ముందు జనాన్ని అదుపు చేయడానికి ఉపాధ్యాయులను వాడుకున్న దానితో సమానమే.
పాలకులకు బాధ్యత అవసరం లేదా?
తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు ప్రారంభించక ముందే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయడంలో అర్థమే లేదు. పైగా ఈ పథకాన్ని అమలు చేయమని అనడం ద్వారా కుల వివక్షత, అస్పృశ్యతను కొనసాగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు గా మనం భావించవలసి ఉన్నది.
పాలకులకు చిత్తశుద్ధి గనుక ఉంటే సామాజిక స్పృహ ,సామాజిక బాధ్యతతో సమాజాన్ని విశ్లేషించే క్రమంలో మానవ అభివృద్ధి సాధించడానికి మార్గాలను నిపుణులు అయినటువంటి ఆర్థికవేత్తలు, మేధావులతో చర్చించవలసిన అవసరం ఉంది. గతంలో ప్రతిపక్షాలతో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్న ఆచారం లేదా సాంప్రదాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది .కానీ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వంటి భయంకరమైన సందర్భాలు ఉన్నప్పటికీ, కీలక అంశాల విషయంలోనూ ఏనాడు కూడా ప్రతిపక్షాలను సంప్రదించిన దాఖలా లేదు. పైగా ప్రతిపక్షాలు లేని సమయంలో చట్టసభలలో బిల్లులను పాస్ చేసుకోవడం ఎంత అప్రజాస్వామికమో ప్రభుత్వాలు ఆలోచించవలసిన అవసరం అంతగా ఉన్నది.
రాష్ట్రంలో గత ఏడు సంవత్సరాలుగా ఏనాడు కూడా దళితుల యొక్క సాధికారత గురించి ఆలోచించి అమలు చేసిన సందర్భం లేదు. పైగా ఎస్సీ సబ్ప్లాన్ నిధులను కూడా ఖర్చు చేయకుండా దాటవేసి మెజారిటీ ప్రజా అనేకమైన బీసీ వర్గానికి ఏటా 25 వేల కోట్లను బీసీ సబ్ ప్లాన్ కింద ఖర్చు చేస్తానని గత రెండు వేల పదిహేడు లో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈనాటికీ కూడా అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించకపోతే ఎలా?
మరొకవైపు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గల 17 లక్షల దళిత కుటుంబాలకు అమలు చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడంలో విశ్వసనీయత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు జరగనున్న వేల ప్రభుత్వం అతి ఉత్సాహంతో ఎన్నికల కోసమే ఇలాంటి వేర్పాటు పథకాలను అక్కడే ప్రారంభించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుంది.
న్యాయస్థానాలు కానీ గవర్నర్ రాష్ట్రపతి వ్యవస్థ ఇలాంటి విషయాల పట్ల నిర్మోహమాటంగా హెచ్చరించ వలసిన అవసరం ఎంతగానో ఉన్నది .అప్పుడే సామాజిక స్పృహతో ఆర్థిక ప్రాతిపదికన సమాన అవకాశాలను మెరుగు పరి చిసమసమాజ స్థాపన దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేస్తాయి. ప్రశ్నించే వాడే లేకుంటే బానిసత్వం తోని తల ఊపితే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ప్రజల పైన స్వారీ చేస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం.
దళిత బంధు, రైతు బంధు
దళిత బంధు కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రైతుబంధు ఎంత గొప్పదో అంత కంటే గొప్ప పథకమని దీనిని కొనియాడారు. ఇప్పటికే రైతుబంధు కార్యక్రమంలో దళితుల్లో 95 శాతానికి భూమి లేేనందున ఆ ప్రయోజనం ఆ వర్గాలకు చేరడం లేదు.
బీసీ , ఎస్టీ ,మైనార్టీ వర్గాల లో కూడా భూములు ఉన్న వారి శాతం అంతంత మాత్రమే. ఇక రైతుబంధు తో లబ్ధి పొందేది, భూస్వాములు, పెట్టుబడిదారులు వందలాది ఎకరాలు ఉన్నటువంటి వారు మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు.
అలాంటప్పుడు రైతుబంధు సామాన్యుల పథకం ఎలా అవుతుంది?. ఏటా 14 వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతుబంధుకు ఖర్చు చేస్తూ ఉంటే పేద అట్టడుగు వర్గాలకు భూమి లేని కారణంగా ఏమాత్రం అందకపోవడం ప్రభుత్వాలు ఆలోచించాలి. ఇక దళిత బందులో ముఖ్యంగా ఉద్యోగాలు ఉన్న కుటుంబాలతో పాటు సంపన్న వర్గాలకు కూడా ఈ ప్రయోజనం చేకూరుతుందని ప్రకటించడంలో శాస్త్రీయత లేదని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.
సామాజిక హోదాను బట్టి విభిన్న వర్గాలకు సబ్ ప్లాన్ నిధుల కింద ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించడం లో తప్పులేదు. కానీ నగదు బదిలీ ప్రవేశపెట్టి అట్టు నిధులు దుర్వినియోగం అయ్యేవిధంగా దళితులను ప్రలోభ పెట్టడం పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రచార ఆర్భాటం గా మారే అవకాశం ఉంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ )