(ఇఫ్టూ ప్రసాదు -పీపీ)
ఏడువందల కోట్లమంది ప్రపంచ ప్రజల రక్త, మాంసాల మీద వటవ్రృక్షంగా తెగబలిసిన మట్టికాళ్ళ రాక్షసి వంటి సామ్రాజ్యవాద వ్యవస్ధపై కేవలం నాలుగు కోట్లమంది ఆప్ఘనిస్థాన్ బాధిత ప్రజలు తమ అశేష ప్రాణార్పణలు, రక్తతర్పణలతో చారిత్రాత్మక రాజకీయ విజయం సాధించారు. అది సామ్రజ్యవాదానికి ఈ శతాబ్దంలో ఒక పెద్ద ఓటమి. అలాంటి రాజకీయ ఘన విజయానికి ప్రధానంగా ఆప్ఘనిస్థాన్ ప్రజల ప్రాణ త్యాగాలే కారణం. అయినా రాజకీయ సారంలో అది ప్రపంచ పీడిత ప్రజల విజయం!
ఆప్ఘనిస్థాన్ ప్రజల సుధీర్ఘ జాతీయ విమోచనోద్యమం ఎట్టకేలకు ఫలించింది. అది దేశ ప్రజల శవాల కుప్పలపై స్వాతంత్రోద్యమ విజయపతాకాన్ని ఎగరవేసుకున్న రాజకీయ మధుర క్షణాలివి.
ఈ రాజకీయ ఘనవిజయాన్ని తమ విజయంగా ప్రపంచ పీడిత ప్రజలు స్వంతం చేసుకుని నిండు మనస్సుతో స్వాగతించాల్సిన సమయమిది. నాలుగు కోట్లమంది ఆప్ఘనిస్థాన్ ప్రజలు తమ ఇరవైఏళ్ళ రక్తతర్పణల, ప్రాణార్పణల , త్యాగఫలాన్ని ఆహ్వనించాల్సిన సమయమిది.
అలాంటి కీలక ఘడియలలో తాలిబన్లను బూచిగా చూపించి దేశ ప్రజలు సాధించిన చారిత్రాత్మక విజయం మీద సామ్రజ్యవాద మీడియా బండెడు బురద జల్లుతుంది. అది నిందలు, నిష్ఠూరాలు, అసత్యాలు, వక్రీకరణలతో దుమ్మెత్తి పోస్తున్నది.
ఈ నిందాప్రచార దుమారంలో ప్రపంచ పీడిత ప్రజలూ; వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని రాజకీయ శక్తులు సైతం ఎంతోకొంత కొట్టుకుపోతున్న పరిస్థితి వుంది. దీన్ని చూస్తే బూర్జువా మీడియా గూర్చి విప్లవ కవి శ్రీశ్రీ చెప్పిన వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి .
ఈ నిందాప్రచార గాలిదుమారంలో వాస్తవాలు దూది పింజలా ఎగిరి పోతున్నాయి. ప్రపంచ ప్రజల (ముఖ్యంగా ఇరాక్, ఆప్ఘనిస్థాన్ వంటి దురాక్రమిత దేశాల ప్రజల) రక్తమాంసాలను జుర్రుకుని తెగబలిసిన సామ్రజ్యవాద వ్యవస్థ యొక్క చెప్పుచేతుల్లోని మీడియా సాగించే నిందాప్రచారం అంతా ఇంతా కాదు.
ఇది దాన్ని బహిర్గతం చేసే రైటప్ కాదు. అదో పెద్ద ప్రాజెక్టు వర్కు. ప్రస్తుతం అట్టి కర్తవ్యాన్ని చేపట్టడం లేదు.
కానీ ప్రగతిశీల శక్తులు, వామపక్షవాదులు, ప్రజాతంత్రశక్తులు, వాస్తవిక వాదులు, తమతమ పద్దతుల్లో సాధారణ ప్రజల్ని వాస్తవాల ఆధారంగా చైతన్య పరిచేందుకు ఉపయోగపడే ఓ చిన్న ప్రయత్నమిది. ఈ వెలుగులో ఆలోచనలను రేకిత్తించే (Thought provoking) కొన్ని చిన్న అంశాల (Little bits) అధారంగా ఒక సీరియల్ గా అందిస్తున్నాను.
నేటికి 40రోజుల క్రితం 06-07-2021న “ఆప్ఘనిస్తాన్ నాడు పులిలా దురాక్రమించి, నేడు పిల్లిలా పారిపోతున్న అమెరికా ఘోర పరాజయాన్ని కప్పిపెట్టే సామ్రజ్యవాద కుట్ర పరిధిని దాటి, ప్రపంచ గమనాన్ని పరిశీలిద్దాం.” అనే శీర్షికతో నేనొక వ్యాసం రాసాను.
దానిని అప్పుడే సోషల్ మీడియా ద్వారా మిత్రలోకానికి అందించాను. అది రాజకీయ విషయ ప్రస్తావనతో ఉంది. అందులో వ్యక్తం చేసిన అంచనాలు సరైనవని తాజాపరిణామాలు రుజువు చేస్తున్నాయి. మరోసారి వాటి ప్రస్తావనలోకి వెళ్ళడం లేదు.
గత వారం రోజులుగా పర్యటనలో ఉన్నాను. ఇది మరో వారం రోజులు కొనసాగుతుంది. ప్రస్తుతం నేనున్న పరిస్ధితుల్లో ఈ సీరియల్ భాగాల్ని క్రమం తప్పకుండా వరసగా ప్రతిరోజూ అందించ లేకపోవచ్చు. వీలున్న మేరకు ప్రయత్నిస్తాను. అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
(ఇందులోని అభిప్రాయాల రచయిత వ్యక్తిగతం)