ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనాలనుకునేవారికి పండగే! ఒకేరోజు రెండు లాంచ్:అటు ‘ఓలా’, ఇటు ‘ఒన్’

(శ్రవణ్)

ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కొనాలనుకునేవారికి ఇది శుభవార్తే! నిన్న జెండా పండగనాడు ఒకేరోజు రెండు వేర్వేరు కంపెనీలు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను లాంచ్ చేశాయి. ప్రముఖ క్యాబ్ యాగ్రిగేటర్ కంపెనీ ‘ఓలా’ విద్యుత్ వాహనాల రంగంలో ప్రవేశించి తయారుచేసిన మొదటి స్కూటర్‌ను ఆ సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ నిన్న మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ చేయగా, బెంగళూరుకు చెందిన ‘సింపుల్ ఎనర్జీ’ అనే స్టార్ట్ అప్ సంస్థ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌తో ‘ఒన్’ అనే స్కూటర్‌ను నిన్న సాయంత్రం 5 గంటలకు విడుదల చేసింది. ఈ స్కూటర్‌లు రెండూకూడా ధరలోనూ, టెక్నాలజీలోనూ పోటీపడుతుండటం విశేషం. వీళ్ళ పోటీ పుణ్యమా అని ఎలక్ట్రిక్ స్కూటర్‌ల విషయంలో మార్కెట్ బయ్యర్స్‌కు అనుకూలంగా మారటంతో అంతిమంగా వినియోగదారులు/కొనుగోలుదారులు లాభపడనున్నారు.

పర్యావరణానికి మేలుచేసేవిధంగా ఉండటంతోబాటు, అడ్డూ, ఆపు లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు వంటి కారణాలరీత్యా ఇప్పుడు మధ్యతరగతివర్గంలోని అందరిచూపూ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ఉంది. పెట్రోల్ స్కూటర్‌లతో పోలిస్తే వీటికి మెయింటినెన్స్ ఖర్చు దాదాపుగా శూన్యమనే చెప్పుకోవాలి. పెట్రోల్ స్కూటర్‌లలో పెట్రోల్ పోయించటంతోపాటు, ఇంజన్ ఆయిల్, సర్వీసింగ్ వంటి అనేక ఖర్చులు ఉంటాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో బ్యాటరీ ఒక్కటే ఖర్చు. ఇది భారీ ఖర్చుకూడా. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్‌ల తయారీదారులు అందరూ బ్యాటరీలపై దాదాపుగా 3 సంవత్సరాల వ్యారంటీ ఇస్తున్నారు. పెట్రోల్ వాహనాలలో కిలోమీటర్‌కు దాదాపు రు.2 ఖర్చు అవుతుండగా, విద్యుత్ వాహనాలలో ఆ ఖర్చు సుమారుగా 30పైసలలోపే ఉంటుందికాబట్టి 3 లేదా 4 ఏళ్ళకొకసారి బ్యాటరీ మార్చాలని అనుకున్నాకూడా ఎలక్ట్రిక్ వాహనంతో vfm(value for money) గ్యారంటీగా ఉంటుంది, డబ్బులూ ఆదా అవుతాయి.

ఓలా కంపెనీ అధినేత భవిష్ అగర్వాల్ గత కొన్ని రోజులుగా తమ స్కూటర్‌పై మార్కెట్‌లో హైప్ సృష్టిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఎట్టకేలకు నిన్న దాని పూర్తి వివరాలను వెల్లడించారు. తమ వాహనం రెండు మోడల్స్‌లో ఉంటుందని, మొదటి మోడల్ ఎస్ 1 కాగా, రెండో మోడల్ ఎస్ 1 ప్రో అని చెప్పారు. మొదటిదాని ధరను రు.99,000గానూ, రెండవదాని ధరను రు.1,29,999గానూ నిర్ణయించినట్లు తెలిపారు. గరిష్ఠవేగం గంటకు 115 కి.మీ. మొదటిది బేసిక్ మోడల్ కాగా, రెండోదానిలో క్రూజ్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్ వంటి కొన్ని సౌకర్యాలు, ఫీచర్‌లు అదనంగా ఉన్నాయి. రెండింటిలోనూ రివర్స్ గేర్ ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాలకు ఇచ్చే సబ్సిడీతో ఈ స్కూటర్‌ల ధర మరింతగా, సుమారు 10-20వేల రూపాయలదాకా తగ్గుతుంది. అంటే, ఓలా బేసిక్ మోడల్ దాదాపుగా హోండా యాక్టివా ధరకు సమానంగా లభించే అవకాశం ఉంది. డెలివరీలు అక్టోబర్ నెలనుంచి ప్రారంభిస్తామని భవిష్ తెలిపారు. ఇది పదిరంగులలో లభిస్తుంది.

ఎలక్ట్రిక్ వాహనాలలో అతి ముఖ్యమైనవి మూడు విషయాలు – 1. రేంజ్(ఒక్కఛార్జింగుతో వెళ్ళగల అత్యధిక దూరం), 2. బ్యాటరీ 3. కంపెనీ(దీర్ఘకాలం ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఇవ్వగలుగుతుందా లేదా అనే విషయం). ఎస్ 1 మోడల్ గరిష్ఠంగా 121 కి.మీ. రేంజిని, ఎస్ 1 ప్రో మోడల్ గరిష్ఠంగా 181 కి.మీ. రేంజిని ఇస్తుందని చెబుతున్నారు. తమ స్కూటర్‌లలోని బ్యాటరీలు కేవలం 18 నిమిషాలలోనే 75 కి.మీ. రేంజిని ఇవ్వగలిగేటట్లుగా వేగంగా ఛార్జ్ అవుతాయని భవిష్ తెలిపారు. వాస్తవానికి ఈ ఓలా వాహనం డిజైన్, టెక్నాలజీ అంతా నెదర్లాండ్స్‌కు చెందిన ఎటెర్గో బీవీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీసంస్థకు చెందినవి. గత సంవత్సరం ఈ సంస్థను ఓలా కంపెనీ కొనుగోలు చేసి టేకోవర్ చేసింది.

ఇక ఒన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికొస్తే, దీనిని సింపుల్ ఎనర్జీ అనే ఒక స్టార్టప్ కంపెనీ తయారుచేస్తోంది. దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతున్నట్లుగా, అత్యద్భుతంగా ఉన్నాయి. దీనిలో ఒక్కటే మోడల్ ఉంది. ప్రపంచం మొత్తంలోనే ఏ ఎలక్ట్రిక్ వాహనమూ ఇవ్వలేనంతగా దీని రేంజ్ 240 కి.మీ.గా ఉండటం విశేషం. దీనిలో 4.8 కిలోవాట్ల లిథియమ్ అయాన్ బ్యాటరీ ఉంటుంది. గరిష్ఠ వేగం 105 కి.మీ. అని, 2.95 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మీ. వేగానికి చేరుకోగలదని తయారీదారులు చెప్పారు. దీనిలో బ్యాటరీలు రెండు ఉండటం విశేషం. ఒకటి ఫిక్స్‌డ్ బ్యాటరీ, మరొకటి డిటాచబుల్ బ్యాటరీ. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్లలో వెనక చక్రం బెల్టుతో నడుస్తుంటుంది, అయితే ఈ వాహనంలో చైన్‌తో నడవటం మరో విశేషం. దీనివలన సామర్థ్యం పెరుగుతుందని తయారీదారులు చెబుతున్నారు. ఈ స్కూటర్ ధర రు.1,09,999. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీల తర్వాత దీని ధరకూడా మరో పది-ఇరవైవేలదాకా తగ్గుతుంది. త్వరలో మార్కెట్‌లోకి విడుదలయ్యే ఈ స్కూటర్‌ను రు.1,947లు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది నాలుగు రంగులలో లభించనుంది.

రెండు స్కూటర్‌లలో చూస్తే ఓలా బండి చూడటానికి రెట్రో లుక్‌తో క్లాసిక్‌గా ఉండగా, ఒన్ బండి మోడర్న్ లుక్‌తో ఫ్లాషీగా ఉంది. టెక్నికల్‌గా కూడా ఒన్ స్కూటర్ అత్యాధునాతనంగా కనిపిస్తోంది. రెండింటిలో స్పీడో మీటర్ స్థానంలో 7 అంగుళాల టచ్ స్క్రీన్ డాష్ బోర్డ్ ఉంటుంది. దీనిని మొబైల్ ఫోన్ లోని యాప్‌కు లింక్ చేసుకోవచ్చు. ఈ డాష్‌బోర్డ్ లోని ఫీచర్లపరంగా చూస్తే, ఒన్ స్కూటర్‌లో టైర్ ప్రెషర్‌ను చూసుకోగల ఫీచర్ ఉండటం దానికి అదనపు అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు.

ఇక ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో అతి ప్రధానం అంశాలలో ఒకటైన బ్యాటరీ, దాని ఛార్జింగ్ పరంగా చూస్తే ఓలా కంటే ఒన్ స్కూటర్‌లో ఛార్జింగ్ అత్యంత వేగంగా ఉంటుందని దాని తయారీదారుల మాటలనుబట్టి తెలుస్తోంది. ఒన్ స్కూటర్ లోని బ్యాటరీ నిమిషానికి 2.5 కి.మీ. చొప్పున ఛార్జ్ చేయగలదని అంటున్నారు. అయితే ఇది స్కూటర్ యజమానులకు ఇచ్చే హోమ్ ఛార్జర్ ద్వారా కాదు. సంస్థ దేశమంతటా నెలకొల్పే నెట్‌వర్క్ ఛార్జింగ్ స్టేషన్‌ల ద్వారా. ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థా ఇలా దేశవ్యాప్తంగా నెలకొల్పే నెట్‌వర్క్ ఛార్జింగ్ స్టేషన్‌లలో ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉంటుంది. మరి ఈ ఓలా, ఒన్ స్కూటర్ తయారీసంస్థలు దేశవ్యాప్తంగా ఈ ఛార్జింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను ఎంత పకడ్బందీగా ఏర్పాటు చేస్తాయనేదికూడా ఆయా కంపెనీల మోడల్స్ సక్సెస్ అవటానికి కారణమవుతాయి. ఓలాలో బ్యాటరీలు ఫిక్స్‌డ్‌గా మాత్రమే ఉండగా, ఒన్ స్కూటర్‌లో ఉండే బ్యాటరీలు రెండింటిలో ఒకటి ఫిక్స్‌డ్‌గానూ, మరొకటి డిటాచబుల్‌గానూ ఉంటాయి.

ఇక టాప్ స్పీడ్ విషయాన్ని చూస్తే, ఓలా స్కూటర్ 0 నుంచి 40 కి.మీ. వేగం అందుకోవటానికి హైఎండ్ మోడల్‌లో 3 సెకన్లు పడితే, ఒన్ స్కూటర్ 0 నుంచి 40 కి.మీ. వేగం అందుకోవటానికి 2.95 సెకన్లు పడుతుంది. వాస్తవ పరిస్థితుల్లో ఈ రెండు వాహనాలూ ఎలా పనిచేస్తాయో చూడాల్సిఉంది. అందుబాటులో ఉన్న స్పెసిఫికేషన్స్‌ ప్రకారం చూస్తేమాత్రం ‘ఓలా’ కంటే ‘ఒన్’ స్కూటర్ మంచి ఛాయిస్‌గా కనబడుతోంది. ఎందుకంటే రు.1,09,999 లకే ఇది అత్యధికంగా 236 కి.మీ. రేంజిని ఇస్తుందని చెప్పారు కాబట్టి. అయితే డెలివరీల విషయంలో మాత్రం ఓలా ముందంజలో ఉంది. అక్టోబర్ నుంచి డెలివరీలు ఉంటాయని ఓలా యాజమాన్యం చెబుతుండగా, ‘ఒన్’ యాజమాన్యం మాత్రం డెలివరీల విషయంలో ఖచ్చితంగా తేదీని నిన్న ప్రకటించలేకపోయింది. ఏది ఏమైనా మార్కెట్‌లోకి ఈ రెండు స్కూటర్‌లూ వచ్చిన తర్వాత ఆటో మొబైల్ నిపుణులు ఇచ్చే రివ్యూల ఆధారంగా మాత్రమే వీటి విలువను పరిగణించగలుగుతాము. ఈ రెండు స్కూటర్‌ల ఫ్యాక్టరీలూ తమిళనాడులోని హోసూర్ ప్రాంతంలోనే ఉండటం ఒక విశేషం.

మరోవైపు స్ప్లెండర్, ప్యాషన్ వంటి బైకులను తయారుచేసే హీరో సంస్థకూడా తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సిద్ధం చేస్తోంది(హీరో సైకిల్స్ తయారుచేసే వేరే సంస్థ ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్‌లను తయారుచేస్తోందిగానీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు). అటు సుజుకి సంస్థ తమ బర్గ్‌మ్యాన్ స్కూటర్‌లో ఎలక్ట్రిక్ మోడల్‌తో వస్తోంది. ఇప్పటికే బజాజ్, టీవీఎస్ సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను లాంచ్ చేసిఉన్నాయి. ఇక ‘ఏథర్’ అనే స్కూటర్ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లకంటే అత్యుత్తమమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ ప్రీమియం సెగ్మెంట్‌లో(ధర-రు.1.5 లక్షలు) ఆకట్టుకుంటోంది. అటు హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు రూపొందించి విడుదల చేసిన ‘ప్యూర్’ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘వెస్పా’ లాంటి లుక్స్‌తో కనబడుతూ మంచి పేరే సంపాదించుకుంది.

ఏది ఏమైనా రాబోయే పది సంవత్సరాలలో ఎలక్ట్రిక్ స్కూటర్‌లు భారతీయ మార్కెట్‌లో వెల్లువెత్తనున్నట్లు తెలుస్తోంది. వీటివలన కార్బన్ ఉద్గారాలు తగ్గనుండటంతో వాతావరణ కాలుష్యం గణనీయంగా తగ్గనుండటం ఒక మంచి పరిణామం. మరోవైపు తయారీదారుల సంఖ్య పెరగటం వలన కొనుగోలుదారులు లాభపడనుండటం మరో మంచి విషయం. అయితే, ఎలక్ట్రిక్ స్కూటర్‌ల తయారీలో ఉపయోగించే విడిభాగాలు చైనాలో తేలిగ్గా, చౌకగా దొరుకుతున్నందువల్ల ఇండియాలో అనేక ఛోటా మోటా కంపెనీలు రంగంలోకి దిగి ఈ స్కూటర్లను తయారు చేస్తున్నాయి. వీటిలో ఎన్ని నిలబడతాయో, ఎన్ని కనుమరుగైపోతాయో తెలియకుండా ఉంది. కాబట్టి కొనుగోలుదారులు చవకగా వస్తున్నాయనో, ప్రకటనలు ఆకర్షణీయంగా ఉన్నాయనో తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి మంచి కంపెనీని ఎంచుకోవాలి.

శ్రవణ్ బాబు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *