టిఆర్ ఎస్ హుజూరాబాద్ ఊరుకులాటకు అర్థం ఏమిటి?

(వడ్డేపల్లి మల్లేశము)

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రధానమే. అయితే ఎన్నికలలో రాజకీయ పార్టీలు మాత్రమే పాల్గొనడం అర్థవంతంగా ఉంటుంది.

కానీ దానికి భిన్నంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పాల్గొని ప్రచారాలు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడటం అర్థరహితమే కాదు.. ప్రమాదకరం కూడా.

అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ , పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా రాయితీలు, వాగ్దానాలు ప్రకటించి ఆశ చూపే కుసంస్కార ధోరణికి పాల్పడుతున్న  రోజులివి.

కాబట్టి ప్రజలను ప్రలోభాలకు గురి చేసే
తప్పుడు విధానాలకు రాజకీయ పార్టీలు పాల్పడకుండా ఉండాలంటే అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ప్రభుత్వ పెద్దలు ఎవరు ప్రచారంలో పాల్గొనకుండా నివారించగలగాలి. ఈ మేరకు ఎన్నికల సంస్కరణ జరగాలి.

ప్రస్తుతం ఎన్నికల చట్టంలో ఆలాంటి నిబంధన ఉంటే కఠినంగా అమలు చేయడం, లేకుంటే ఎన్నికల సంఘం ఈ మార్పు పై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో పాటు న్యాయ వ్యవస్థ ముందు కూడా ఈ ప్రతిపాదన ఉంచాల్సిన అవసరం ఉన్నది.

ఎన్నికలు ఎవరి బాధ్యత?

ఎన్నికల ప్రచార నిర్వహణ కార్యక్రమం తో పాటు అభ్యర్థుల ఎంపిక ,ఖర్చు, ప్రచారంలో పాల్గొనడము అంతా కూడా ఆయా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కొనసాగాలి. ప్రభుత్వాలు జోక్యం లేకుండా ఉంటే ఆ ఎన్నికలు కొంత వరకు సక్రమంగా జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఎన్నికలు ఎవరి బాధ్యత అంటే రాజకీయ పార్టీల బాధ్యత మాత్రమే అని అందరం సగర్వంగా చెప్పగలగాలి.

దానికి భిన్నంగా దేశవ్యాప్తంగా తరచుగా జరుగుతున్న ఎన్నికలలోనూ ఇటీవల పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి, రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు అధికార ఆర్భాటంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.

ఈ విషయం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అందుకే అంబేద్కర్ గారు” ప్రజాస్వామ్యం సఫలం కావాలంటే జాగరూకులైన ప్రజావళి అనివార్యం” అని నొక్కి చెప్పారు
అధికార పార్టీకి సంబంధించి నటువంటి ప్రభుత్వ పెద్దలు ప్రజలకు సేవ చేసే వారుగా మాత్రమే ఉండాలి .కానీ ఎన్నికల్లో ప్రలోభపెట్టే శక్తులుగా మారకూడదు.

తదనుగుణమైన చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. ప్రధానమంత్రి ,రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ప్రచారానికి ఆమడదూరంలో ఉండగలగాలి . నేటి అన్ని అనర్థాలకు ప్రభుత్వ పెద్దల యొక్క అత్యాశ, అధికార దుర్వినియోగం, అధికార కాంక్ష ప్రధాన కారణాలని ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు పశ్చాత్తాపము చెందవలసిన అవసరం ఉన్నది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక పుట్టుకయే కుళ్ళు రాజకీయం

ప్రజలు ఎప్పుడూ తమ పనులను చేసుకుంటూ, శ్రమను నమ్ముకొని ,తమ హక్కులకు రక్షణ కావాలని  ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. వారి ప్రశాంతతను దెబ్బ కొట్టి, లేనిపోని ఆశలు కల్పించి, బానిసలుగా చిత్రీకరించి ప్రలోభపెట్టి పావులుగా మార్చుకొని కుళ్లు రాజకీయాలకు పాల్పడేది రాజకీయ పార్టీలు, ఆపైన అధికారంలో ఉన్న పార్టీలు , పదవిలో ఉన్న ప్రభుత్వ పెద్దలు.

టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా మంత్రిగా పనిచేసి సేవలందించిన అప్పుడు ఈటెల రాజేందర్ గొప్ప నాయకుడని అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఆకాశానికెత్తారు.

అవినీతి ఆరోపణలపై భర్తరఫ్ అయ్యి ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆత్మగౌరవం పేరుతో ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ ప్రకటనలు కుమ్మరి స్తుంటే తట్టుకోని ప్రభుత్వం హుజురాబాద్ అభివృద్ధి చెందలేదని మంత్రులు నాయకులు ఈటెల రాజేందర్ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయలేదని ఇప్పుడు అనడంలో ఏమున్నది? కుళ్ళు రాజకీయం మాత్రమే దాగి ఉన్నది.

ఆరోపణలు చేసి బర్తరఫ్ చేసిన ప్రభుత్వం ఆయన అవినీతి రుజువు అయ్యేదాకా ఆగలేదు. ఆత్మగౌరవ నినాదం పేరుతో టిఆర్ఎస్ పార్టీని అతిక్రమించి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని ఈటెల రాజేందర్ చాటుకోక ముందే మరొక పార్టీలో చేరినప్పుడే నాయకులు రాజకీయ పార్టీలు ఒకరికంటే ఒకరు ఎక్కువ అన్నట్టుగా అవినీతి కంపు లో కూరుకుపోయిన మాట నిజమని రుజువు అయ్యింది.

హుజురాబాద్ ఉప ఎన్నిక ఏదో ప్రజల అభివృద్ధి కోసం, అంతరాలు లేని వ్యవస్థ కోసం, సమసమాజ స్థాపన కోసం ఉపయోగపడుతుందన్న స్థాయిలో రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు పన్నడమే నేటి అవినీతి రాజకీయాలకు అద్దం పడుతుంది.

ఇది కేవలం హుజురాబాద్ కు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సహా దేశమంతా ఇదే తంతు కొనసాగుతోంది.
ప్రభుత్వ పథకాలే గెలిపిస్తయనుకోవడం మూర్ఖత్వం ..వట్టి భ్రమ.:-

అదే నిజమైతే పశ్చిమబెంగాల్లో స్వయాన ప్రధానమంత్రి వచ్చినా ఓటమి తప్పలేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలను పక్కన పెట్టి అక్కడి అవసరాన్ని గుర్తించిన ప్రజలు ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకున్నారు.

జిహెచ్ఎంసి ఎన్నికలలో ప్రభుత్వం వరద బాధితులకు పదివేల రూపాయలు ప్రకటించి అమలు చేసిన బిజెపి ఖాతాలోకి మెజారిటీ ఓట్లు వచ్చి చేరడం అధికార పార్టీలు ప్రజల నాడి గురించి సీరియస్గా ఆలోచించవలసిన అవసరంని నొక్కి చెబుతున్నాయి.

గత ఏడే ళ్లలో ఏనాడు జ్ఞాపకం రాని దళితులు, హుజురాబాద్ ఎన్నికల్లో గెలవడం కోసం అక్కడ మాత్రమే అమలు చేయడానికిదళిత బంధు 500 కోట్లు ఇటీవలనే ప్రభుత్వం మంజూరు చేయడం ఎన్నికల కోసమే కాబట్టి అవినీతి కిందికే వస్తుంది. ఎక్కడ అమలులో లేని పథకాన్ని ఎన్నికల సమయంలో గెలుపు కోసమే ప్రకటించినట్లు అమాయకులు సైతం గుర్తించగలరు.

మంత్రివర్గ సమావేశంలో దళిత బంధు గురించి తీర్మానం చేసినప్పటికీ చట్టసభల్లో ప్రధానంగా నిర్వహించే బడ్జెట్ సమావేశాల్లో చర్చించకుండా, ఆమోదించకుండా, బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రకటించిన రెండు వేల కోట్లకు ఐదు వందల కోట్లు మంజూరు చేయడం ఎన్నికల కోసం కాక మరి దేనికి?

ఒక నియోజకవర్గంలో ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల తో సహా అన్ని వర్గాల ఓటర్లు ఉంటారు. ఎన్నికల సమయంలో ఒక వర్గానికి మాత్రమే నిధులను కేటాయించే ప్రత్యేక పథకాన్ని మంజూరు చేసినప్పుడు మిగతా వర్గాలు కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాయి. హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో వివిధ వర్గాల నుండి డిమాండ్ రావడం ఒక రకంగా ప్రజా చైతన్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.

బీసీ బంధు, మహిళా బంద్, కార్మిక బంధు, మైనారిటీ బంధు పేరుతో డిమాండ్ చేస్తుంటే మరొక అడుగు ముందుకు వేసి కులాల వారిగా రజక బంధు ,ఆదివాసి బంధు, గిరిజన బంధు పేరుతో డిమాండ్ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో అమలుచేయాలని అనేకచోట్ల దీక్షలు కూడా చేస్తున్న విషయాన్ని గమనించాలి మనమంతా.

హుజురాబాద్ ఎన్నిక సందర్భంగా “దళిత బంధు”ప్రకటించిన ప్రభుత్వానికి అక్కడి మిగతా వర్గాలకు సంబంధించి బీసీలు, ఎస్టీలు, ఓసీలు తమకు అదేస్థాయిలో ఆర్థిక సహకారాన్ని అందించాలని లేకుంటే ఎన్నికలను బహిష్కరించదానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు అక్కడక్కడ ప్రకటనలు వస్తున్న విషయాన్ని ప్రభుత్వం హెచ్చరికగా భావించాలి. గుణపాఠాలు గా స్వీకరించాలి.

హుజూరాబాద్ అప్పుడే ప్రచారమా?

ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికీ విడుదల కాకముందే అనేకమంది మంత్రులు తమ పాలనాపరమైన పనుల నుండి తప్పుకొని హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం లో ఎంత అసంబద్ధత దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు.

కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి సభకు కూడా భారీ ఏర్పాట్లను చేయడానికి జన సమీకరణ కోసం మంత్రులు ఇక్కడే తిష్ట వేసుకొని ఉండడం ప్రజాస్వామ్య అమలులోని డొల్ల తనాన్ని తెలియజేస్తున్నది.

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచినా కోటానుకోట్ల ప్రభుత్వ ఖర్చు ,పార్టీ పెట్టుబడి వల్లనే సాధ్యం అయిందనే అపవాదును మూట కట్టుకోక తప్పదు. అంతేకాకుండా అధికార దుర్వినియోగానికి మచ్చుతునకగా మంత్రుల, ముఖ్యమంత్రి తదితరుల సందర్శన కూడా అపవాదుకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా రాజకీయ పార్టీలు ఏవి పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ గెలుస్తుందని విశ్వాసం ఉన్నవారి మాట నిజమైనా, ఎన్ని ప్రలోభాలకు పాల్పడిన అధికార పార్టీ పథకాలేవీ ప్రజల మనసును మార్చలేక పోయినవనే చేదు నిజం అధికార పార్టీని ఇరుకున పెట్టక తప్పదు.

గత్యంతరం ఏమిటి ?

స్వీయ ప్రక్షాళన ముద్దు- అధికార దుర్వినియోగం, ప్రలోభాలు అసలే వద్దు. అధికార పార్టీతో సహా దేశంలోనూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ప్రస్తుత తప్పుడు విధానాలను ప్రక్షాళన చేసుకోవాలి. ఎన్నికల వ్యయానికి చోటు లేని నీతి బద్దమైన ఎన్నికల కోసం నడుం బిగిస్తే ప్రజలు కూడా అవినీతి కంపుకు తప్పకుండా దూరంగా ఉంటారు.

– ప్రలోభాల కోసం ఇష్టం ఉన్నట్లు గా కోటానుకోట్ల అప్పులు చేసే తెలంగాణ రాష్ట్రం లాగా(సుమారు4లక్షలవేలకోట్లు)ఏ
ప్రభుత్వము చేసిన ఆ ప్రభుత్వం హయాంలోనే అదే ప్రభుత్వం తిరిగి చెల్లించే విధానాన్ని చట్టం ద్వారా తీసుకురావాలి. అందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేసి నిరసనలు తెలియ చేస్తే తప్పకుండా అది అమలు అవుతుంది. అంటే ప్రలోభాలు రాయితీలు పథకాల పేరుతో చేస్తున్న దగా అరికట్టడానికి సాధ్యమౌతుంది.

– ఎన్నికలను రాజకీయ పార్టీలే కనుక చూసుకుంటే ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కనుక పరిపాలన పై పూర్తిస్థాయిలో శ్రద్ధ చేసే అవకాశం ఉంటుంది.

హుజురాబాద్ ఉప ఎన్నిక అటువంటి ఫలితాన్ని ఇస్తుందని ఆశిద్దాం.తద్వారా పార్టీలు తమ చిత్తశుద్ధిని చాటుకోవడమే కాకుండా ప్రభుత్వాలు కూడా ప్రజల గురించిన అంచనాను సవరించుకుంటూ టాయి. దానితో ప్రజలు యాచించే బదులు డిమాండ్ చేయడంతో పాటు మెజారిటీ జనాభా ఉన్నటువంటి వర్గం రాజ్యాధికారానికి డిమాండ్ చేసే ఆస్కారం కూడా ఏర్పడుతుంది.

ఇన్ని రకాల గుణపాఠాలకువేదిక అయ్యే అవకాశం ఉన్న హుజురాబాద్ ఉప ఎన్నిక చరిత్రాత్మకం కావాలంటే ప్రభుత్వం చిత్రీకరించిన స్థాయిలో కాకుండా ఓటర్ల వినూత్నమైన నిర్ణయము ద్వారా ప్రభుత్వాలతో సహా అన్ని రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించగలగాలి. దళిత ముఖ్యమంత్రి వంటి ప్రధాన హామీ అమలు సంగతేమిటి?అని దళిత,బహుజన ప్రజానీకం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అప్పటిదాకా దళిత బంధు వద్దని మొండికేస్తే తాడో పేడో తేలిపోతుంది.విలువల కోసం అందరం హుజరాబాద్ ఉప ఎన్నిక వేదిక కావాలని మనసారా కోరుకుందాం.


( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట )

One thought on “టిఆర్ ఎస్ హుజూరాబాద్ ఊరుకులాటకు అర్థం ఏమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *