ఈ ఫోటో బీహార్ సమస్తిపూర్ జిల్లాలో ఖుదీరామ్ బోస్ పూసా రైల్వే స్టేషన్ ది. ఇదేమంతముఖ్యమయిన స్టేషన్ కాదు. దీనిని అసలు పేరు వైని (Waini). మనం తెలుసుకోవలసినంత ప్రాముఖ్యం వూరేం కాదిది. అయితే,వైని రైల్వే స్టేషన్ వెనక ఒక ఒక కథ ఉంది. ఆస్టేషన్ ఖుదీరామ్ బోస్ పూసాగా ఎలా మారిందనేది ఆసక్తికరమయిన కథ. దీనికి ఆగస్టు 11 కు సంబంధం ఉంది. భారతీయులంతా తెలుసుకోవలసిన ఒక చిన్న, ఉత్తేజకరమయిన స్వాతంత్య్ర సమర ఘట్టం ఇక్కడ ముగిసింది. అదేంటో చూద్దాం.
ఈ ఫోటోలో ఉన్న కుర్రవాడికి పట్టమని ఇరవైయేళ్లుండవు. చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు. కాని బ్రిటిష్ వాళ్లు చాలా ప్రమాదకరమయిన వ్యక్తిగా భావించారు. ఆగస్టు 11, 1908 ఆయనను ఉరితీసి, హమ్మయ్య! పెద్ద ప్రమాదం తప్పిందనుకున్నారు. ఉరి శిక్ష అమలయ్యే నాటికి ఆయన వయసు 18 సంవత్సరాల 8 నెలలు. కాని ఈ ఉరిశిక్ష బ్రిటిష్ వాడిని మరొక 40 యేళ్లు వెంటాడింది. చివరకు దేశం నుంచి తరిమేసింది. అది వేరేకథ.
ఈ కుర్రవాడి పేరేంటో తెలుసా? ఖుదీరామ్ బోస్.
భారత స్వాతంత్య్ర సంగ్రామ విప్లవవీరుడు. బెంగాల్ ప్రాంతానికి చెందిన వాడు. బ్రిటిష్ వాళ్లను తరిమేయాలన్న పగతో రగిలిపోతున్న కొంతమంది యువకులు ఏర్పాటు చేసుకున్న విప్లవ సంస్థ అనుశీలన్ సమితి సభ్యుడు. అధికారులను హతమారిస్తే బ్రిటిష్ వాళ్లు దేశం విడిచిపోతారని భావించారేమో, వారి మీద నాటు బాంబులద దాడులకు పూనుకున్నారు.
బోస్ మరొక మిత్రుడితో కలసి బ్రిటిష్ జడ్జి డౌగ్లాస్ కింగ్స్ ఫోర్డ్ ను అంతమొందించాలనుకున్నాడు. సహచరుడు ప్రఫుల్ల చాకితో కలసి బాంబు దాడి పథకం వేశాడు. ఒక రోజు డౌగ్లాస్ ప్రయాణిస్తున్న గుర్రపు బండిమీద బాంబులు విసిరారు. తీరా ఆ తెల్లదొర అందులో లేడు. మరొక బండిలో వస్తున్నాడు. బోస్ విసిరిన బాంబుల వల్ల ఇద్దరు బ్రిటిష్ మహిళలు చనిపోయారు. వాళ్ల మీద ముజఫర్ పూర్ బాంబు కుట్ర కేసు పెట్టారు. బాంబు దాడి హింస అని , ఇద్దరు మహిళలు చనిపోవడం విచారకరమని మహాత్మగాంధీ అసమ్మతి వ్యక్తం చేశారు. బాలగంగాధర తిలక్ మాత్రం తన కేసరి పత్రికలో ఈ దాడిని విప్లవోద్యమంగా వర్ణించారు.
ఒకసారి కింగ్స్ ఫోర్డ్ మీద దాడి జరిగింది. దీనితో ఆయనను కలకత్తా నుంచి ముజఫర్ పూర్ కు భద్రతకోసం బదిలీ చేశారు. ప్రఫుల్ల, బోస్ ఆయన్ని వదలిపెట్టేలాలేరు. ముజఫర్ పూర్ వెళ్ళారు.
ఆరోజు (1908 ఏప్రిల్ 29) ఒక క్లబ్బులో భార్యాపిల్లలతో బ్రిడ్జ్ ఆడుతూ ఆయన రాత్రి ఎనిమిదిన్నరదాకా గడిపాడు. రెండు బళ్లలో బయలు దేరారు. ఒక బండిలో భార్య, కూతురు ఉన్నారు. మరొక బండిలో కింగ్స్ ఫోర్డ్ ఉన్నాడు. రెండు బళ్లు ఒక లాగే ఉన్నాయి. దీనితో బోస్ బృందం భార్య కూతురు ఉన్న బండిమీదికి బాంబువిసిరారు. వారిలో భార్య అదే రోజు చనిపోయింది. కూతురు మే 2న చనిపోయింది. అరెస్టు కాకుండా తప్పించుకుని పారిపోతూ 25కిలో మీటర్లు నడుచుకుంటూ బోస్ వైని (Waini) రైల్వే స్టేసన్ చేరుకున్నాడు. అక్కడే పోలీసులకు దొరికాడు. దీనికి గుర్తుగా వైని రైల్వే స్టేషన్ ని ఖుదీరామ్ బోస్ పూసా (Khudiram Bose Pusa Station)అని పేరు మార్చారు.
ఈ కేసులో 1908 జూలై 13 న ఆయన కు మరణశిక్ష విధించారు. ప్రఫుల్ల బ్రిటిష్ వారికి చిక్కకుండా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆగస్టు 11, ఉదయం 6 గంటలకు ఉరితీశారు. ఆయన నిటారుగా నిలబడి, చెదరని చిరునవ్వుతో ఉరికంబానికి నడిచాడని అప్పటి పత్రికలు రాశాయి.
ఖుదీరామ్ బోస్ మీద పెట్టిన కేసు Khudiram Bose versus Emperor, 1908 గా పేరు పొందింది. ఈ కేసు గురించి వివరంగా తెలుసుకుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.