(మలసాని శ్రీనివాస్)
అబద్ధాలు, తప్పుడు భాష్యాలు, ద్రోహం, మోసం ఈ అనుభవాలన్నీ కేంద్రంలో గత ఏడేళ్ళ బీజేపీ పాలనలో ప్రజలకు ముఖ్యంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ, ముస్లింలు చవిచూశారు. తప్పు చేసి అదే ఒప్పు అని, ప్రజలకు అదే మేలు అని ప్రచారం చేసుకోవడంలో బీజేపీ ప్రభుత్వం గత పాలకుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ అని ఏడేళ్ళ అనుభవం చెబుతోంది.
నిన్న, మంగళవారం, లోకసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన “127వ రాజ్యాంగ సవరణ-2021” బిల్లు గురించి ఆ పార్టీ ఐ.టి.యంత్రాంగం సోషల్ మీడియా ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారం చూస్తే…బీసీలను మరీ అమాయకులుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
వివరాల్లోకి వెళితే…బిజెపి మొదటి ఐదేళ్ళ పాలన చివరిలో 2018 ఆగస్టులో నేషనల్ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించే “102వ రాజ్యాంగ సవరణ” బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా మోదీ ఈ బిల్లు చట్టం రూపం ధరించటం బీసీల జీవితం లో చారిత్రాత్మకమైన ముందడుగు అని చాలా గంభీరంగా ప్రకటించారు. కమిషన్ కు రాజ్యాంగ హోదా మంచిదే, కానీ అది ఎప్పుడు? ఆ కమిషన్ కు బీసీ అభివృద్ధికి సంబంధించి ఉన్న ఆటంకాలు, సమస్యలు ఏమిటి అని అధ్యయనం చేయమని కమిషన్ కు బాధ్యత అప్పగించినపుడు, బీసీ లకు అభివృద్ధికి ఏ చర్యలు చేపట్టాలో నివేదిక తయారు చేయాల్సిందిగా అడిగనప్పుడు ఆ 102వ సవరణ జరిగి మూడేళ్ళ కాలం గడిచినా ఇప్పటివరకూ ఆ కమిషన్ బీసీల అభివృద్ధికి చేసింది సున్నా.
మూడేళ్ళ క్రితం 102వ రాజ్యాంగ సవరణ పేరుతో చేసిన తప్పు (కుట్ర)ను సరిదిద్దుకోవడానికే 127వ రాజ్యాంగ సవరణ బిల్లు
అది మాత్రమే కాకుండా ఈ బిల్లు ద్వారా బీజేపీ పాల్పడిన కుట్రను ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. బిల్లు లో బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించే అంశంతోపాటు రాజ్యాంగంలోని రెండు ఆర్టికల్స్ కు అదనంగా రెండు సబ్ క్లాజ్ లను జతచేస్తూ బిల్లును పార్లమెంటులో చట్టంగా ఆమోదింప చేసుకుంది.
ఈ బిల్లు చర్చ సందర్భంగా అప్పుడు ప్రతిపక్షాలు అదనంగా జత చేసిన ఈ రెండు సబ్ క్లాజ్ లు రాజ్యాంగంలో ఉన్న నిబంధనల కు వ్యతిరేకమైనవని, దేశం లో ఉన్న రాష్ట్రాల అధికారాలు, సమాఖ్య వ్యవస్థకు నష్టం అని గొడవ చేశాయి. గొడవకు కారణమైన రెండు సబ్ క్లాజ్ లు ఏమిటంటే…అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ద్వారా కేంద్ర జాబితాకు ఒబిసి లను గుర్తిస్తూ వస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ద్వారా రాష్ట్ర జాబితాకు బీసీ లను గుర్తిస్తూ వచ్చాయి. దేశంలో ఎ ఒక్క వెనుకబడిన సమూహాన్నైనా బీసీ గా గుర్తించాలన్నా, ఏ ఒక్క బీసీ సమూహాన్నైనా బీసీ జాబితా నుంచి తొలగించాలన్న అధికారం 102 సవరణలోని ఈ క్లాజ్ ల ద్వారా రాష్ట్రపతికి కట్టపెట్టింది.
రాష్ట్రపతి కి అంటే అది పరోక్షంగా కేంద్రం ప్రభుత్వానికేనన్నది మనక తెలిసిందే. మరీ అరుదైన సందర్భాల్లో మినహా రాష్ట్రపతి స్వతంత్రంగా వ్యవహరించలేరు.
కేంద్ర క్యాబినెట్ సిఫార్సులనే రాష్ట్రపతి ఆమోదించాల్సివుంటుంది. అప్పటి వరకు ఉన్న రాష్ట్రాల అధికారాలు తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం దేశంలో మొత్తం బీసీ సమూహాలను తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా బీసీ జాబితాలో చేర్పులూ, మార్పులూ చేసి, బీసీల్లో అంతర్గత కల్లోలం సృష్టించి వారి మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించి తద్వారా చీలికలు తెచ్చి అప్పటి సందర్భాన్ని బట్టి బలమైన లేదా బలహీనమైన సమూహాలను తనకు అనుకూలంగా మలచుకోవాలన్నది అసలు కుట్ర సింద్ధాంతం.
కమిషన్ కు రాజ్యాంగ హోదా అని బీసీ లను మురిపించి అధికారాలిచ్చిన కమిషన్ కు ఏ పని చేయని పరిస్థితి కల్పించడం ఒక కుట్ర. దానికి మించి ఈ 102వ సవరణ చట్టం లో బీసీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గురించి రాజ్యాంగంలో లిఖితంగా ఉన్న రెండు 338, 342 ఆర్టికల్స్ కు వ్యతిరేకమైన రెండు సబ్ క్లాజ్ లు 338కి క్లాజ్ B , 342కి A చేర్చడం జరిగింది.
ఈ రెండు క్లాజ్ లే వివాదం సృష్టించాయి. ప్రతిపక్షాలు నిరసన లెక్క చేయకుండా అప్పటి 102సవరణ బిల్లు ఆమోదించారు. ఇటీవల మహారాష్ట్ర లో మరాఠాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించిన కేసు రెండు నెలల క్రితం మే నెలలో సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు 102వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కేసు విచారణకు సంబంధం ఉండటంవల్ల దానిపై కూడా విచారించి తీర్పు వెలువరించింది.
బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించే 102 సవరణ రాజ్యాంగబద్ధమేనని పేర్కొంటూనే, రాష్ట్రాలకు అప్పటి వరకు తమతమ రాష్ట్రాలలో బీసీ లకు సంబంధించిన విషయాలపై రాష్ట్రాలకున్న అధికారాలను 102 సవరణలో చేర్చిన రెండు క్లాజ్ లు హరిస్తున్నాయని, ఇది రాజ్యాంగంలో చెప్పిన సమాఖ్యా స్పూర్తికి (Federal structure) (రాష్ట్రాల కలయికతో రూపుదిద్దుకున్న ఇండియా) వ్యతిరేకమైనందున రాజ్యాంగబద్ధంకాని ఆ క్లాజ్ లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు గత మే నెలలో తీర్పు ఇచ్చింది.
బీసీలపై తమ కుట్ర సింద్ధాంతం అమలుకు ఎదురుదెబ్బ తగిలిందని భావించి ఎలాగైనా రెండు క్లాజ్ లు కొనసాగాలనే ప్రయత్నాలలో భాగంగా సుప్రీం తీర్పు పై మోదీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ కోర్టు లో దాఖలు చేసింది. దీన్నీ కోర్టు ధర్మాసనం తిరస్కరించింది.
ఇదిగో ఈ నేపథ్యంలో నిన్న …. మోదీ ప్రభుత్వం సరిగ్గా మూడేళ్ళ క్రితం 102వ రాజ్యాంగ సవరణ పేరుతో చేసిన తప్పు (కుట్ర)ను సరిదిద్దుకోవడానికి లోకసభలో 127వ రాజ్యాంగ సవరణ బిల్లు ను ప్రవేశపెట్టింది.
‘చేయి కింద పడినా నాదే పై చేయి’ అన్న చందాన బీజేపీ నేతలు “ఈ 127వ సవరణ రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వాలనే సత్ససంకల్పంతో చేస్తుందని, మోదీ ప్రభుత్వం బీసీ అభివృద్ధికి ఈ చర్య ఎంతో మేలు చేస్తుంది” అని సభలో కోతలు కోశారు.
తప్పు చేసింది ప్రభుత్వం, పైగా ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని మేధావులు, ప్రతిపక్షాలు హెచ్చరించినా మూర్ఖంగా అప్పట్లో బిల్లుకు చట్ట రూపం తెచ్చింది. చివరికి కోర్టు ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని ఖరాఖండిగా చెప్పడంతో 102వ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి దాఖలు పడిన అధికారాలు తొలగిస్తూ, రాష్ట్రాలకు గతంలో మాదిరిగా నే ఉన్న హక్కులను పునరుద్ధరిస్తూ 127వ సవరణ బిల్లు లోకసభలో పెట్టింది.
ప్రభుత్వం బీసీలపై చేయలనుకున్న కుట్రను వెనక్కి (తప్పనిసరి పరిస్థితుల్లో) తీసుకునే బిల్లు కాబట్టి బీసీల నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, డి.ఎం.కె.,జె.డి.యు, బీఎస్పీలు ఈ బిల్లు ను సమర్ధించాయి. అందుకే ఇటీవల ఎప్పుడు లేనట్టు లోకసభలో ఈ బిల్లు ఒక్క ఓటు కూడా వ్యతిరేకంగా పడకుండా ఏకగ్రీవంగా ఆమోదంపొందింది. ఇలాంటిదే పైగా బీసీలకు సంబంధించినదే మరో పరిణామం జరిగింది.
1993 నుంచి 15 ఏళ్ళ పాటు పెండింగులో ఉన్న మండల్ సిఫార్సు లు అమలలో భాగంగా 2007లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా సంస్థలు, శాస్త్ర, సాంకేతిక పరిశోధనా సంస్థలలో 27 శాతం సీట్లను బీసీలకు కేటాయిస్తూ అప్పటి యు.పి.ఏ.ప్రభుత్వం చట్టం చేసింది. రాష్ట్రాల సీట్లలో సెంట్రల్ పూల్ పేరుతో 15 శాతం మెడికల్ సీట్లు తీసుకుంటూ వాటిలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని డి.ఎం.కె. పార్టీ కోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని గత నెలలో కోర్టు తీర్పు చెబుతూ…అమలుకు ఏ చర్యలు తీసుకుంటుంది చెప్పాలని కోర్టు కోరింది. కేంద్రం స్పందన తగిన విధంగా లేకపోవడంతో కోర్టు ధిక్కారం కింద పరిగణించాల్సివస్తుందని హెచ్చరించింది.
దీంతో హడావిడిగా రిజర్వేషన్లు అమలకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై మోదీ బీసీ ల పట్ల బీజేపీ ఎంత అంకిత భావంతో ఉందో బోధపడుతుందన్నాడు.
ఆఖరి మాట: పై వాస్తవాలు అలా ఉండగా బీజేపీ ఈ 127 సవరణ బిల్లు ద్వారా బీసీ లను చాలా ఉద్ధరించేస్తోందని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడాన్ని ఏమనాలి ‘సిగ్గు లేనితనం’ అనడం మినహా.
(మలసాని శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు)