(గార్లంక భగవాన్)
తుంబురు తీర్ధం ట్రెక్ పూర్తయింది, నేనెంత ఊహించుకున్నానో అంతకు నాలుగు రెట్లు ఆనందానుభూతి, ఎన్నో రోజులకు సరిపడా మధురానుభవాల నిధి వెంట తీసుకువచ్చాను. ఎన్నిసార్లు విన్నానో పలుచోట్ల తోటి ట్రెక్కర్స్ తుంబుర తీర్ధం గురించి ప్రత్యేకంగా చెబుతున్నప్పుడు ,ఎప్పుడు వెళతానో కదా అనిపించేది. హిమాలయ యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన వెంటనే తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ వారి కబురు, ట్రెక్ కు అనుమతి లభించిందనీ ఆదివారం సిద్ధమవ్వాలనీ ,కేవలం మార్చి నెలలో అదీ ఫౌర్ణమి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే పాపనాశనం నుంచి అనుమతించే ఈ కాలినడక యాత్రకు ప్రత్యేకంగా అనుమతి పొందటం మధు సూధన్, విశ్వనాథ్ అనే ఇద్దరు యువకులు సాధించారు.
తమ ఊరు తిరుపతిలో శేషతీర్ధం నారాయణ తీర్ధం , మలయప్పతీర్ధం ఇలా నూట ఎనిమిది తీర్ధాలనూ దర్శించాలనీ తమతో పదిమందికి అవకాశం కల్పించాలనే ఉదార స్వభావులు వీరిద్దరూ, అత్యంత సమర్ధవంతంగా లాభరహితంగా ప్రకృతిపై అవ్యాజ ప్రేమతో ఓ ధార్మిక ప్రేరణతో నిర్వహిస్తున్న క్రమశిక్షణ గల చిన్న క్లబ్ వీరిది.మర్యాద ఆత్మీయతల విషయంలో రాయలసీమ సంస్కృతి వీరిద్దరిలో కనిపించింది.
1కబురందిన వెంటనే మిత్రులు శ్రీనివాస్ బి గారితో కలసి తిరుపతి చేరుకున్నాను.ఒకరోజు ముందుగా చేరుకోవటం వలన మంచి విశ్రాంతి లభించింది, కరకంబాడి రోడ్డులో హోటల్ గది దొరికింది,అక్కడి నుంచే కడప హైవే మీదుగా బైక్ లపై ఆంజనేయపురం చెక్ పోస్ట్ దాటి ఎడమవైపు పంజాబీ దాభా వద్ద అడవుల్లో ప్రవేశించాం ఆరుకిలోమీటర్లు పైగా లోపలికి వెళ్ళాక బైక్ లన్నీ చెట్లమధ్య నిలిపి ఎనిమిది కిలోమీటర్ల తుంబురతీర్ధం ట్రెక్ మొదలుపెట్టాం , అడవి నిద్ర లేవకముందే నడక హుషారుగా సాగుతోంది, రాత్రి కురిసిన మంచు బిందువులతో వృక్షాలూ మొక్కలూ తడిగా చల్లగా జోగుతున్నాయి.
దట్టమైన శేషాచలం అడవుల్లో వెదురుపొదలూ నేరేడు ఎర్రచందనం అడ్డాకుల చెట్లు లెక్కలేనన్ని వున్నాయి, మాకు పేరుతెలియని చెట్లతో అడివంతా క్లిష్టంగా కనిపిస్తోంది, క్రింద ఏవేవో తీగలు భారీ వృక్షాల వ్రేళ్ళు కాళ్ళకు అడ్డం పడుతున్నాయి, నిర్లక్ష్యంగా విస్తరించిన చిన్ని చెట్లు దారికడ్డంగా కొమ్మలు పరిచి కళ్ళను ఢీకొడుతున్నాయి, కొన్ని నెలలుగా ఈ దారిలో ఎవరూ నడవ లేదని తెలుస్తోంది,వాటిని దాటుకుని ముందుకు వెళితే బండరాళ్ళ కఠిన దారి మొదలైంది, ఒకనాడు నది ప్రవహించిన అడ్డంగా తెగినట్లుండే కొండ అంచులతో క్రింద ఎండిన పురాతన నదిగుండా నడక సాగింది
హైదరాబాద్ చెన్నై కడప పుదుచ్చేరి ల నుంచి యువజనం బాగా వచ్చారు , ఫేస్బుక్ లో ట్రెక్ గురించి ప్రకటించటంతో తిరుపతి కుర్రాళ్ళూ కదలి వచ్చారు అంతా కలిపి యాభై మంది తో భారీ సమూహంగా వున్నాం ,
పురాణకాలంలో తుంబురుడు ఓ ఆగ్రహ క్షణాన తన భార్యను భూలోకాన మాంండూక్యమై జన్మించాలని శపించాడనీ ఆపై కోపం తగ్గి ఆమెకు శాపవిమోచన జరగాలంటే అత్యంత విశిష్టమైన పవిత్రమైన తిరుమల గిరుల్లోని ఈ జలపాతాల వద్ద స్నానమాచరిస్తే తిరిగి సహజ రూపం వస్తుందని చెబుతాడు , వశిష్ట మహాముని ఈ ప్రదేశం సంచరిస్తూ తన శిష్యులకు ఈ అంశం వివరించి చెప్పే సమయంలో ఆ జీవధారల గొప్ప లక్షణం గ్రహించి మాండూక్య రూపంలోని తుంబురుని భార్య ఆ వరుస కొలనులో దూకి తన రూపాన్ని తిరిగి పొందిందని కధనం , ఇలాంటి అనేక పురాణ కధనాలు ఇక్కడి జలధార పై దాని ప్రత్యేకతపై వినిపిస్తున్నాయి.
పురాణ కధనాల మాట ఎలావున్నా ఎనిమిది కిలోమీటర్ల కఠిన నడక తర్వాత మనం చేరుకునే ఆ అద్భుతమైన పర్వత చీలికల మధ్య మార్గం అచ్చెరువొందింస్తుంది.బ్రహ్మాండమైన ఆ నిట్టనిలువు పర్వత శిఖరాలను రెండుగా చీలిన మార్గంలో లోపలికి చొచ్చుకుపోతూ రెండువైపులా కొండ అంచులతో మధ్యలో వరుసగా చల్లని నీటి కొలనులతో రోజంతా ఈత కొట్టినా తనివితీరదు .
తుంబురుని చక్కటి చిన్న విగ్రహం ఓ వైపు ఆకర్షిస్తుంది.ఒక్కో కొలనూ దాటుకుంటూ మొలలోతు నీటిలో అవతలివైపు వెళ్ళటం గమ్మత్తుగా వుంటుంది.ఉదయం ఎనిమిదిన్నర గంటలకే లక్ష్యం చేరుకుని చాలసేపు నీటిలో ఈదులాడి మధ్యాహ్నం అక్కడే రుచికరమైన భోజనం చేసాం , ఈ క్లబ్ సభ్యులు ఎవరి ఆహారం వారు బయటకు తీసి అందరికీ ఉత్సాహంగా పంచటం మాకు ఆసక్తి కలిగించింది,తమ ప్రతి ట్రెక్ ఇలానే కలసిమెలసి వుంటుందని చెప్పారు.తిరుగు పయనంలో తరిగొండ వెంగమాంబ గుహను దర్శించాం , ఆమె ఏకాంతంగా ఇక్కడ జీవించి అడ్డదారిలో అడవులగుండా పయనించి పాపనాశనం దారిలో శ్రీవారి ఆలయంలోకి వెళ్ళేవారని చెప్పుకుంటారు.
మార్చి నెలలో ఫౌర్ణమి రోజున తెలుగు తమిళ ప్రజల ఉధృత సందర్శనతో ఈ ప్రాంతం కిక్కిరిసి వుంటుంది, క్రమశిక్షణలేని భక్తుల అపరిశుభ్ర నిర్లక్ష్య ప్రవర్తన వలన తెలంగాణలోని సలేస్వరం వలె ఇక్కడ కూడా ప్రకృతి ప్రేమికులు ఇబ్బంది పడతారు.
ఇలాంటి అందమైన అపురూప ప్రకృతి విశేషాన్ని అతి తక్కువ సమూహంతో సందర్శన చేయటం ఓ మరపురాని అనుభవం.
మధుసూదన్ విశ్వనాధ్ లు కృష్ణార్జునుల వలె కలసిమెలసి వుంటూ తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ ను పదికాలాలు నిలిపి మరిన్ని అందమైన ప్రదేశాలు అందరికీ చూపాలి.