(వడ్డేపల్లి మల్లేశము)
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రపంచము నివ్వెరపోయే స్థాయిలో పరిపాలన అందిస్తామని ,వినూత్నమైన చర్యలతో ప్రజలకు చేరువ అవుతామని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనేక సందర్భాలలో హామీ ఇచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు తో పాటు ఆత్మ గౌరవం విషయంలో కూడా వివక్షత తెలంగాణ ప్రాంతానికి జరిగిందని తద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి సమర్థవంతమైన ప్రభుత్వం కావాల్సిన అవసరం ఉందని అన్ని వర్గాలు, ప్రజాసంఘాలు, అఖిల పక్షాలు కూడా ఆనాడు భావించడం జరిగింది.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు టీ. ఆర్.ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంచిన ప్రజానీకం 2014 తోపాటు 2018 లోనూ అధికారాన్ని కట్టబెట్టడం జరిగినది
నాటికీ, నేటికీ ప్రభుత్వం ముందున్న సమస్యలు
2014 లో ఉన్నటువంటి సమస్యలు అలాగే ఇప్పటికి ఉన్నాయి. అంటే మనం ఏమి సాధించలేమని ఒకసారి మననo చేసుకోవాలి. తెలంగాణ ఏర్పడిన నాడు లక్షా ఏడు వేల ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబితే ఇటీవల ప్రభుత్వం, ప్రతిపక్షాలు వెలువరించిన అభిప్రాయం ప్రకారం 1లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తున్నది.
కొత్త ఉపాధి అవకాశాలు లేవు, ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికే వివిధ శాఖల్లో కొనసాగుతున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను ఇటీవల ప్రభుత్వం తొలగించింది. ఇది నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం కాదా?
యువత కు సంబంధించి స్పష్టమైన విధానం లేకపోయిన కారణంగా లక్షలాది మంది నిరుద్యోగులు, ఎంతో మంది విద్యావంతులు పరిశోధకులు కూడా ఉపాధి లేక, భవిష్యత్ కానరాక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కోకొల్లలు.
తెలంగాణ జన సమితి, కాంగ్రెసు, బిజెపి , సిపిఐ, సిపిఎం, తదితర పార్టీలన్నీ కూడా ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ఎన్ని రకాల ఒత్తిడి చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం భర్తీ చేయలేదు. గమ్మత్తు ఏమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన తర్వాత లక్షా ఏడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పబడితే ఏడేళ్ల తర్వాత ఉద్యోగ ఖాళీల సంఖ్య 1,91,000 ఉన్నదంటే ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
దశలవారీగా ఉద్యోగుల తొలగింపు అమానుషం కాక మరేమిటి?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలినాళ్ళలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వ్యవస్థ కాకుండా అందరి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఆ అభిప్రాయానికి కొనసాగింపుగా నాలుగేళ్ల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఇక నుండి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉండదు..
అందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. మిషన్ భగీరథ ,వైద్య శాఖలో అవసరానుగుణంగా నర్సుల నియామకం తో పాటు అనేక శాఖలలో ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ లతోపాటు నియమించబడిన వేలాది మంది ఉద్యోగులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అవసరం తీరగానే ఉద్యోగులను తొలగించిన ట్లు పత్రికలు, టీవీల ద్వారా మనం తెలుసుకున్నాం.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రయత్నం కొనసాగి నియామకం పూర్తయ్యే వరకు కూడా నమ్మకము లేని పరిస్థితులు ఉన్నాయి . అందుకే యువత నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. పుండు మీద కారం చల్లినట్టుగా నిరుద్యోగం తాండవిస్తూ ఉంటే ఉద్యోగాల భర్తీ జరగకపోగా మిషన్ భగీరథ లో పనిచేసిన ఇంజనీర్లు, ఉపాధి హామీ పథకం లో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు, గత సంవత్సరం కరోనా చికిత్స కోసం నియమించుకున్న పదహారు వందల నలభై మంది నర్సులతో పాటు మొత్తం 52,515 మందిని ఉద్యోగాల నుండి తొలగించడం ప్రభుత్వ అమానవీయ చర్యగా అందరూ నిరసిస్తున్నారు. దశలవారీగా గత మూడున్నర ఏళ్లలో వీరిని రోడ్డున పడేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది.
ఆయా శాఖల్లో నియమించుకున్న వారిని రెన్యువల్ చేయకుండా తొక్కి పెట్టడంతో అటు పనుల్లో జాప్యం తో పాటు ఇటు ఉద్యోగాలను కోల్పోవడం పట్ల సమాజం సిగ్గు పడుతుంది. 2018 నుండి ఇటీవలి వరకూ దశలవారీగా వీరిని తొలగించినప్పటికీ కారణం లేకుండా, సమాచారం ఇవ్వకుండా ఉద్యోగాల నుండి కూడా తొలగించడం అనేది ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం నిరుద్యోగ యువత ఉద్యోగాల భర్తీకి సంబంధించి దశలవారీ కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధం అన్నట్టుగా ప్రకటించి ఉన్నది. క్రమంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి గ్రామ కార్యదర్శులకు కూడా పొగ పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రజా సంఘాలు, పౌర సమాజం, ప్రతిపక్షాల బాధ్యత
ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి, పేదరికాన్ని తొలగించి, అంతరాలు అసమానతలు, వివక్షతలను నిర్మూలించిన ప్పుడే సమ సమాజం ఏర్పడి సుపరిపాలన సాధ్యమవుతుంది. ప్రత్యేక ఆకాంక్షలతో అరవై ఐదు సంవత్సరాలకు పైగా తెలంగాణ కోసం పోరాడి 69 లో 370 మంది మలి దశలో 1200 మందికి పైగా విద్యార్థులు యువత బలిదానాలు చేసినప్పటికీ తెలంగాణ గమనం, గమ్యం ఏమిటో, లక్ష్యసాధన ఏమిటో స్పష్టంగా లేదు.అనేక పెండింగ్ సమస్యలపై ప్రజలు, ప్రజా సంఘాలు, అఖిల పక్షాలు, అధికార పార్టీతో సహా అందరం ఆలోచించుకోక పోతే మన తెలంగాణ ఆవిర్భావానికి అర్థమే లేదు. పైగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఒకవైపు కొనసాగుతుంటే, ప్రకృతి విధ్వంసం, భూకబ్జాలు, అవినీతితో రాష్ట్రం అట్టుడికి పోతున్న విషయాన్ని అందరం గమనించాలి.
ప్రధానంగా యువత కు సంబంధించి స్పష్టమైన టువంటి విధానాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించి, ఖాళీలను మొత్తాన్ని భర్తీ చేయడం తో పాటు మిగతా నిరుద్యోగులకు ప్రభుత్వ హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇచ్చేలా ఒత్తిడి చేయాల్సిన అవసరం మనందరి పైన ఉన్నది.
గత ఏడేళ్ల గమనంలో గమ్యం వైపు ప్రయాణం చేయని కారణంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నట్లు తెలుస్తున్నది. సాంప్రదాయ పద్ధతిలో కొనసాగే పరిపాలన మాత్రమే మన రాష్ట్రానికి సరిపోదు. సమస్యలను గుర్తించి, యువతను నిర్వీర్యం పరుస్తున్న టువంటి సామాజిక రుగ్మతలను నిషేధించి, మార్కెట్లో అనారోగ్యానికి కారణం అవుతున్న టువంటి వస్తువుల అమ్మకాన్ని వెంటనే నివారిస్తే తప్ప, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక దృక్పథం ఉందని నమ్మలేము. అందులో ప్రధానమైనది వెంటనే ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు తొలగించిన వారందరినీ తీసుకుని క్రమబద్దీకరిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం పదిమందిలో అప్రతిష్టపాలు కాకుండా ఉంటుంది. ఆ వైపుగా ప్రభుత్వ చర్యలను అన్ని వర్గాలు కోరుతున్నారు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)