తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 4 నుండి 6వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహించారు.
అర్చకులకు విధుల కేటాయింపునే రుత్విక్‌వరణం అంటారు. యాగకర్మలు, పుణ్యాహవచనం, హోమాలు తదితర వైదిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతలు అప్పగిస్తారు. సాక్షాత్తు స్వామివారి ఆజ్ఞ మేరకు విధులు పొందినట్టు అర్చకులు భావిస్తారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, మేదినిపూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయని, వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితి. ఈ మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.