ఈ రోజు జూలై 31. ఈ రోజుకు భారత దేశ చరిత్రలో, ముఖ్యంగా భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో చాలా ప్రాముఖ్యం ఉంది.
ఈ రోజే మహాత్మాగాంధీ గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమాన్ని వదిలేసి వెళ్లిపోయారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చే దాకా ఆశ్రమంలో కాలుపెట్టనని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
దీనికి కారణం, సహచరులంతా అరెస్టయి జైలు కెళ్లడంతో ఆశ్రమం బోసి పోయింది. ఇది ఆయనను కలచివేసింది. అహింసా మార్గంలో ఉద్యమం చేస్తున్నవారందరిని బ్రిటిష్ ప్రభుత్వం జైళ్లలోకి తోసేసింది. ముఖ్యంగా గాంధీ సహాయ నిరాకరణోద్యమ ప్రారంభించంగానే బ్రిటిష్ ప్రభుత్వం సుమారు 60 వేల మందిని దేశ వ్యాపితంగా అరెస్టు చేసింది.
ఆశ్రమం స్వాతంత్య్రోద్యమానికి డెన్ లాగా పనిచేస్తున్నదని బ్రిటిష్ ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది.
ఆశ్రమాన్ని వెంటనే వెనక్కి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం సమ్మతించలేదు. దీనితో ఆయన ఇక ఆశ్రమాన్ని వదిలివెళ్లాలని నిర్ణయించుకున్నారు. 1933 జూలై 22న తన మనసులో ఉన్న మాట వెల్లడించారు. ఆయన జూలై 31న ఆశ్రమం వదిలేసి వెళ్లిపోయారు. సాధారణం ఉద్యమంలో లేనపుడు, జైలులో నుంచి బయటికి వచ్చాక ఆయన ఇక్కడ ఇక్కడే గడిపేవారు. లేదంటే ఆయన వార్ధాసమీపంలోని మరొక ఆశ్రమంలో గడిపేవారు. ఈ రెండు గాంధీజీ ఇళ్లలాంటివి.
బ్రిటిష్ అణచివేతకు నిరసనగా స్వాతంత్య్రం సాధించే దాకా మళ్లీ ఆశ్రమం వైపు కన్నెత్తి చూడనని, ఆశ్రమంలో కాలుమోపనని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయారు. స్వాతంత్య్రం వచ్చింది. ఆయన ఆశ్రమానికి విజయగర్వంతో రావలసి ఉంది. అయితే, 1948 జనవరి 30న గాడ్సే తుపాకి గుళ్లకు బలయ్యారు.