ఇపుడు తెలంగాణకు కావలసింది ’సకల జనుల బంధు’

(జోగు అంజయ్య)

తెలంగాణ ప్రజలలో  పెరిగిన వ్యతిరేకతను  మన పాలకులు సరిగా అర్థం చేసుకుంటే ‘సకల జనుల బంధు’ పథకం పెట్టేవారు. అప్పుడు ఇంత అపనమ్మకం ఇన్ని విమర్శలు వచ్చేవి కావు.

దళితులు సమాజంలో భాగమే. ప్రజలందరు కష్టంలో ఉన్నప్పుడు దళితులు కూడా అవే కష్టంతో ఉంటారు. కులవివక్షత అనేది దళితులు అదనంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఇది ఆ కులంలో పుట్టిన వారికి తప్ప మిగతా వారికి అంతగా అర్థం అమానుష సంప్రదాయం. అర్థం అయినా కూడా దానిని ఉపరితల సమస్యగానే చూస్తారు. అందుకే రిజర్వేషన్ల పై నిందలు వేస్తారు. నోటితో మెచ్చుకుని నొసటితో వెక్కిరిస్తారు.

ఇప్పుడు ప్రవేశ పెడుతున్న ’దళిత బంధు‘ పథకం ఆర్దిక సమానత్వం సాదించేటంతటి పెద్దది కాదు. శాంపిల్ గా  కొందరిని సెలెక్ట్ చేసి మొత్తం దళిత జాతిని ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకుంటారు. గతంలో జరిగినది ఇదే. ఇప్పుడు జరిగేది అదే.

రాజకీయ విమర్శల జోలికి పోకున్నా వాస్తవంలో నిగ్గు తేలేది ఇదే.ఈ ప్రచారంతో దళితులకు ప్రయోజనాలు నెరవేరకపోగా  నష్టమే జరుగుతుంది. దళితులను సమాజంలో సమభావంతో చూడడం లోపిస్తుంది. కావున ప్రభుత్వాలు పథకాలను సామూహిక దృష్టితో ప్రవేశ పెట్టాలి.

అన్ని కులాలలో దుర్భర జీవితం గడుపుతున్న వారికి యుద్ధ ప్రాతిపదికన  సేవలు అందించండి. విద్య వైద్యం ఉచితంగా అందించండి. వీటి కోసం ప్రజలు అప్పుల పాలు  అవుతున్నారు. లక్షల కోట్లు పెడుతామంటున్న పాలకులు ఈ దిశగా ఆలోచనలు చేయండి.

ఊరికో బడి అన్నట్లుగా ఊరికో ఆసుపత్రి అవసరమయ్యే పరిస్థితులు రాబోతున్న రోజులు కనబడుతున్నాయి. పెరుగుతున్న రోగాలు ఇవే చెబుతున్నాయి. లక్షలాదిమంది నిరుద్యోగులు  ఆశగా చేస్తున్న విన్నపాలు పట్టించుకోండి. తక్కువ వేతనంలో అయినా సరే అందరికీ గౌరవప్రదమైన జీవనాన్ని ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రంలో కనీసం వంద గజాల స్థలం లేని వారిని వారికి పట్టాలు ఇవ్వండి. ప్రభుత్వాల మాటలు నమ్మాలంటే అవిచేసిన హామీల పట్ల నిజాయితీ కనబరచాలి.

ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వార్తలు వినుటకు టీవీలు పెడితే”దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి “హామీ ఏమైయిందని చిన్నపోరడి నుండి పెద్దోళ్ల వరకు అందరూ ప్రశ్నలు వేసుడు, విమర్శలు చేయడం చేస్తున్నారు. ముందు  వీటికి జవాబు చెప్పండి లేదా తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పండి.ఈ విమర్శలు రాకుండా చూడండి. అన్ని రాజకీయ పక్షాలతో సఖ్యతగా మెలిగి ఆచరణ సాధ్యమైన పథకాలకు రూపకల్పన చేయండి. అధికారంలోకి రావడానికి చేసిన హామీలు కొన్ని నెరవేర్చలేకపోతున్నామని తెలంగాణ పౌర సమాజాన్ని కోరండి. అర్థం చేసుకుంటారు.

మూడు ఎకరాలు అన్నకాడ కనీసం ఎకరమైనా ఇవ్వగలమా అని ఆలోచించండి. ఒక కమీషన్ వేసి మూడు నెలల్లో తేల్చండి. చివరి రెండు సంవత్సరాల కైనా మీ పార్టీలో నుండి ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయండి.

 

అందరిదీ అనుకున్న తెలంగాణ కొందరిదిగా మారిపోవడం ఊహించని పరిణామం. ప్రజలు దీనిని జీర్ణించుకోలేక పోతున్నారు.

 

ఇది మీరు తలుచుకుంటే ఐదు నిమిషాల పని. ఏ కులం వారు ముఖ్యమంత్రి అయినా కూడా సమాజంలో గౌరవం పెరగాలంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సామూహిక దృక్పథంలో నుండి చూడాలి. ప్రత్యేక పథకాలు కొన్ని సందర్భాలలో అవసరమే. వాటిని ఎన్నికలతో ముడి పెట్టినప్పుడు అనుమానాలకు దారితీస్తుంది.

దళిత బంధు పథకం రాజకీయ చదరంగంలో గెలుపు గుర్రం కావాలని అనుకుంటున్నట్లుగా ఉన్నప్పుడు  దాని ఉద్దేశ్యం  ఆచరణ శంకించబడుతుంది. గవన్ని చేయనోడు గివ్వన్ని ఎట్ల చేస్తడు అని నలుగురు అనుకోవడం సహజమే కదా?. దళితుల వద్ద ఉన్న అస్సైన్డ్ భూములకు శాశ్వత హక్కుదారులను చేయుటకు చట్టం చేయండి. ఇచ్చి గుంజుకునే పద్ధతులకు స్వస్తి పలకండి. తన కుటుంబ అవసరాలక కోసం తనకు

ఎదురైన కష్టాల నుండి బయటపడటానికి  అవి ప్రభుత్వం తీర్చలేనివిగా  ఉన్నప్పుడు ఆ భూములను అమ్ముకునే స్వేచ్ఛ కూడా  దళితులకు ఉండాలి. ఇప్పుడున్న నిబంధనలు వాటికి ప్రతిబంధకంగా ఉన్నవి. గోటితో పోయేదానికి గొడ్డలితో పరిష్కారం వెతికితే కొన్ని అనర్థాలు ఉంటాయనే పెద్దల మాట గుర్తు చేసుకోవాలి.

కొన్ని సమస్యలు తీర్చడానికి ధనము కంటే ముందు మనసు ఉండాలి. ఖాళీలు ఉన్నప్పటికీ ఉద్యోగ ప్రకటనలకు ఏడేండ్లు సాగదీయడము వెనుక పాలకుల నిర్దయ కనిపిస్తూనే ఉంది. స్వరాష్ట్ర పాలకులపై వెల్లువెత్తుతున్న  ప్రజా నిరసనలకు అసలు కారణం నిజాం లాంటి నియంతృత్వ భావనలు తమపై  దాడి చేస్తున్నాయని ప్రజల గమనములోకి వచ్చింది. అందుకే ఇంతటి ఆత్మావలోకనం చేసుకుంటున్నారు.

అందరిదీ అనుకున్న తెలంగాణ కొందరిది అన్నట్లుగా మారిపోవడం ఊహించని పరిణామం. ప్రజలు దీనిని జీర్ణించుకోలేక పోతున్నారు.

ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఒక ఎత్తు అయితే ప్రజా వ్యతిరేక చర్యలు మరో ఎత్తుగా కనిపిస్తున్నాయి. ప్రజాభిప్రాయాలను  గౌరవించలేని స్థితి పాలకుల నుండి ఎదురైతే  అది ప్రభుత్వాలకు పెను ముప్పుగా మారుతుంది. అప్పుడు ప్రజలు  తమ మనసులో తీర్పును రాసి పెట్టుకుంటారు. అధికార మార్పిడిని అనివార్య చర్యగా చూపెడుతారు. ఓట్ల పెట్టెలో తమ అభిప్రాయాలను పదిలంగా వేస్తారు. తెలంగాణ ఉద్యమంలో  ఐక్యతగా కదిలిన శక్తులన్నింటిని ద్రోహులుగా చిత్రీకరించిన ఫలితం ఊరికే పోదు. ఏదో ఒకనాడు జన సమూహాన్ని కూడగట్టి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమై ఆత్మాభిమానపు జెండాను నిలబెడుతాయి.

(జోగు అంజయ్య, జనగామ. సెల్. 8008957480 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *