* రైల్వేలకు రూ.703 కోట్లు బకాయి పడ్డ రాష్ట్ర ప్రభుత్వం
* ఆలస్యమవుతోన్న రైల్వే ప్రాజెక్టులు
తెలంగాణ ప్రభుత్వం రైల్వేకు రూ.703 కోట్లు బకాయి పడిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. అక్కన్నపేట-మెదక్, మనోహరాబాద్-కొత్తపల్లి, భద్రాచలం-కొవ్వూరు కొత్త లైన్లు, ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టులను తెలంగాణ, రైల్వే శాఖ ఉమ్మడిగా నిర్మిస్తున్నాయని, ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించ లేదని కేంద్రమంత్రి తెలిపారు.
ఇవాళ కరీంనగర్ ఎంపీ, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఇచ్చిన లిఖితపూర్వకంగా సమాధానంలో తెలంగాణలో రైల్వేల పురోగతికి టీఆర్ఎస్ సర్కార్ సహకరించడం లేదని చెప్పకనే చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఈ ప్రాజెక్టులు జాప్యమవుతున్నాయి. భాగ్యనగరవాసులకు చవకైన రవాణా అందించే ఎంఎంటీఎస్ ఫేజ్-2 ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో ప్రజలకు సేవలందించలేకపోతుందని అర్థమవుతోందని బండి సంజయ్ కుమార్ అన్నారు.
2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో రైల్వేలు గొప్ప పురోగతి సాధించాయి. 2014-21 కాలంలో తెలంగాణలోని రైల్వే మౌలిక వసతులు, భద్రతా చర్యలు మొదలైన వాటి కోసం రూ.10,206 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22లో రూ.2420 కోట్లు మంజూరయ్యాయి.
తెలంగాణలో రూ.30,351 కోట్ల విలువ గల 2495 కి.మీ కొత్త లైన్ ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో రూ.17,013 కోట్ల విలువ గల 1071 కి.మీ పొడవుతో 9 కొత్త లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇందులో 155 కి.మీ మేర కొత్త లైన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. రూ.14,268 కోట్ల విలువ గల 1424 కి.మీ పొడవుతో 7 డబ్లింగ్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఇందులో 63 కి.మీ అందుబాటులోకి వచ్చింది. మోదీ హయాంలో 321 కి.మీల కొత్త లైన్, ఇందులో 177 కి.మీ కొత్త లైన్ ప్రాజెక్టులు, 144 కి.మీ డబ్లింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇది గత యూపీఏ హయాం కన్నా 164 శాతం ఎక్కువ. టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించి సకాలంలో బకాయిలు చెల్లిస్తే తెలంగాణలో రైల్వేలు మరింతగా అభివృద్ధి చెందేవి. ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరేవి.
టీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి శాపంగా మారింది. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించి, మరిన్ని రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేయించుకునేందుకు చొరవ చూపాలని బిజెపి తెలంగాణ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.