భద్రాచలం: ప్రపంచంలోనే పూర్తిగా మహిళలే ఉన్న సిఆర్పిఎఫ్ 88 వ బెటాయలియన్ కు చెందిన మహిళా కమాండోలు మావోయిస్టుల వేట కోసం రంగంలోకి దిగారు. మావోయిస్టుల గెరిల్లాల మీదకు మహిళా కమెండోలను దించాలనుకోవడం కొత్త వ్యూహం. సిఆర్ ఎపిఎఫ్ కు చెందిన 6 మహిళా బెటాలియన్ల నుంచి 34 మంది మహిళలను ఎంపిక చేసి వారికి అతి కఠినమయిన కోబ్రా ట్రెయినింగ్ ఇచ్చి వారిని నక్సల్ వేటకోసం పంపించారు. ఆరు మహిళా బెటాలియన్లు ఉన్న పారా మిలిటరీ ఫోర్స్ ఇదొక్కటే.
88వ బెటాలియన్ లోకి తీసుకునే ముందు వీరందరికి మూడు నెలల పాటు కఠిన శిక్షణ ఇచ్చారు. శారీరక ధారుఢ్యాన్ని పెంచుకోవడం, మావోయిస్టు వ్యతిరేక ఎత్తగడలు పసిగట్టడం, అడవుల కష్టాలను తట్టుకుని నిలబడటం, ల్యాండ్ మైన్స్ గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడం, అధునాతన ఆయుధాలను ఉపయోగించడం వంటి విద్యల్లో వారికి తర్ఫీదు ఇచ్చారు.
ఈబెటాలియన్ కు చెందిన 7 మంది ఇప్పటికే విధులను నిర్వహిస్తు అశువులు బాశారు. వారికి ఆశోక చక్రతో పాటు అనేక శౌర్య పతకాలులభించాయి. నక్సలైట్ల్ వంటి గెరిల్లా దళాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కోబ్రా యూనిట్ లో ప్రస్తుతం 12 వేల మంది సభ్యులున్నారు.
మావోయిస్టుల వారోత్సవాల వేళ మహిళా కమాండోలు వాగులు, వంకలు దాటుతూ దూసుకుపోతున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెేవాడ జిల్లాలోని ఇంద్రావతి, కాంగేర్ నదుల పరివాహక దండకారణ్యంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంటుంది.
వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించే ఆ ప్రాంతానికి వానాకాలంలో భద్రతా బలగాలు చేరుకోవడం కష్టం. అందుకే ఆ ప్రాంతాన్ని మావోయిస్టులు సేఫ్ జోన్‌గా చేసుకొని తమ కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు.
ఈ క్రమంలో దంతెవాడ ఎస్‌పీ అభిషేక్ పల్లవ్ నేతృత్వంలో సుశిక్షితులైన డీఆర్‌జీ, దంతేశ్వరి మహిళా కమాండోలు ప్రథమంగా ఈసారి రంగంలోకి దిగి కొండలు, గుట్టలు ఎక్కుతూ ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలు దాటుతూ గాలింపు చేపట్టారు.
ఈ ప్రాంతంలో మావోయిస్టులు ట్రైనింగ్ సెంటర్లు నెలకొల్పి కొత్త రిక్రూట్‌మెంట్స్‌కి శిక్షణ ఇస్తున్నట్లుగా పోలీసు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో ఆ ఏరియాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేలా దంతేశ్వరి మహిళా కమాండోస్, డీఆర్‌జీ జవాన్లకు కఠోర శిక్షణ ఇచ్చి అవసరమైన సామాగ్రి సమకూర్చి అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి బలగాలను రంగంలోకి దింపారు.
ఆ ప్రాంతానికి భద్రతా బలగాలు వెళ్ళడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. మావోయిస్టులు ఈనెల 28 నుంచి ఆగస్టు 3వ తేది వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టుల కంచుకోటలోకి భద్రతా బలగాలు ప్రవేశిస్తుండటంతో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.