మంచు ఫ్యామిలీ సినిమాల ప్రమోషన్‌లకు పెద్దదిక్కు చిరంజీవే! ఇండస్ట్రీకి మాత్రం కాదా?

తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయిందంటూ మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు నర్మగర్భంగా ఉన్నాయని పలు చోట్ల రాస్తున్నారు. కానీ, అతను సూటిగానే ఒక విషయాన్ని ఢంకా బజాయించి చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు ఉన్నంతలో చిరంజీవే పెద్ద దిక్కు అని తమ్మారెడ్డి భరద్వాజ, మురళీ మోహన్ వంటి కొందరు ప్రముఖులు అక్కడక్కడా వినిపిస్తున్న వాదనను తాము(మంచు ఫ్యామిలీ) అంగీకరించబోమన్నది అతని వ్యాఖ్యల అంతరార్థం.

వివాదాలకు మారుపేరు, చిరంజీవి ఆధిపత్యాన్ని అడుగడుగునా సవాల్ చేసే మోహన్ బాబు ఇలా తన కుమారుడితో వ్యాఖ్యలు చేయించటం సహజ పరిణామమే కాబట్టి అంతవరకు బాగానే ఉంది. కానీ, ఇక్కడ చిన్న తిరకాసు ఉంది. ఇటీవలికాలంలో మంచు వారు తమ సినిమాలు అన్నింటికీ చిరంజీవితోనే ప్రమోషన్ చేయిస్తున్నారు, మరోవైపు పెద్దదిక్కుమాత్రం అతనుకాదు అంటున్నారు, ఈ మతలబు ఏమిటీ అని అటు ఇండస్ట్రీలోనివారు, ఇటు ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీనిలో నిజంలేకపోలేదు.

ఈమధ్యకాలంలో మంచు ఫ్యామిలీ మొత్తం తమ సినిమాల ప్రమోషన్‌లకోసం చిరంజీవిని ఎలా వాడుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు చిరంజీవికి పరోక్షంగా సవాల్ విసురుతున్న మంచు విష్ణు ఇటీవల హాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తూ ఆంగ్ల, తెలుగు భాషలలో తీసిన ‘మోసగాళ్ళు’ సినిమా ప్రమోషన్‌కు మెగాస్టార్‌నే ఆయన ఆశ్రయించారు. చిరంజీవే ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక సాక్షాత్తూ మోహన్‌బాబు తాజా సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ప్రమోషన్‌కు కూడా చిరంజీవే వారికి కావాల్సివచ్చింది. ఆ సినిమా ట్రైలర్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చారు చిరంజీవి. మంచు మనోజ్ ‘గుంటూరోడు’ సినిమాకు చిరంజీవి నేరేషన్ చేశారు, ఇటీవల ప్రారంభమైన అతని తాజా సినిమా ‘అహం బ్రహ్మాస్మి’కి రాంచరణ్ క్లాప్ కొట్టాడు.

ఏదో ఒక సినిమా ప్రమోషన్‌ను చిరంజీవితో చేయించారంటే – సరే, ఏదో పెద్దమనిషిగా గౌరవించి చేయించారని అనుకోవచ్చు. ఇటీవలి కాలంలో తమ సినిమాలన్నింటికీ చిరంజీవితోనే ప్రమోట్ చేయిస్తున్నారు మంచు ఫ్యామిలీ. మరి ఓ వైపు సినిమాలన్నింటికీ ప్రమోషన్ కోసం చిరంజీవి దగ్గరకు వెళుతూ, మరోవైపు అతను ఇండస్ట్రీ పెద్ద కాదు అని సవాల్ విసరటం ఏమిటో జనానికి అంతుపట్టటంలేదు.

కరోనా సమయంలో సినీ కార్మికులకు చిరంజీవి నిత్యావసర వస్తువులు అందజేయటం, ఉచిత వ్యాక్సిన్లు వేయించటం వంటి ఛారిటీ కార్యక్రమాలపైకూడా మంచు విష్ణు విమర్శలు గుప్పించారు. ఛారిటీ అందరూ చేస్తున్నారని, కాకపోతే కొందరు ‘టామ్‌టామింగ్’ ఎక్కువ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ ఫ్యామిలీకూడా ఎంతో ఛారిటీ చేస్తుందని, కాకపోతే తాము ఎక్కడా చెప్పుకోమని అన్నారు.

మంచు విష్ణు బ్లాక్ మెయిల్ రాజకీయాలు!

ప్రకాష్ రాజ్ ప్యానల్‌లోని కొెందరిపై మంచు విష్ణు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆ ప్యానల్‌లోని కొందరు ఊచలు లెక్కపెడుతూ లోపల ఉండాల్సినవారని, వారు బయట ఉన్నారని అన్నారు. వారు గతంలో పోలీస్ స్టేషన్‌లో అరెస్టయినప్పుడు తాము వెళ్ళి విడిపించామని, ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే ఆ విషయాలన్నీ బయటపెడతామని ధమ్కీ ఇచ్చారు. సరే, విష్ణు చెప్పినట్లు గతంలో అలా అరెస్టయినవాళ్ళు ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో ఉంటే ఉండొచ్చుగాక, అందుకని వారిపై ఇప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడతానని హెచ్చరించటం బ్లాక్ మెయిలింగ్ లాగా ఉందని, మోహన్‌బాబు విలన్ పాత్రలు వేయటం మానినా, విలన్ బుద్ధులు మాత్రం పోలేదని జనం గుసగుసలాడుకుంటున్నారు.

చిరంజీవి, మోహన్‌బాబుల మధ్య శత్రుత్వం ఈనాటిదికాదు. ఇద్దరూ మొదట విలన్ వేషాలతో కెరీర్ ప్రారంభించినవారే. అయితే చిరంజీవి త్వరత్వరగా నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్ళటంతో, వెనకబడిన మోహన్‌బాబు, సమయం, అవకాశం దొరికినప్పుడల్లా ఉక్రోషాన్ని వెళ్ళగక్కుతుండేవారు. అది సందర్భం ఏమిటి అన్నదికూడా చూసుకోరు. చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా సన్మాన కార్యక్రమం జరుగుతుండగా, మోహన్ బాబు వేదికనెక్కి అతనితో తన పాత గొడవలు గుర్తుచేసి విమర్శలు చేయటం, తెలుగు సినీ ఇండస్ట్రీ వజ్రోత్సవాలలో తనకు లెజండ్ హోదా ఇవ్వలేదని రచ్చ రచ్చ చేయటం మొదలైనవి అతని ఉక్రోషానికి ఉదాహరణలు. దానికితోడు చిరంజీవి ఎదుగుదలను భరించలేని ఒక వర్గం మోహన్‌బాబును అతనిపైకి ఉసిగొల్పేది. వాస్తవానికి తెలుగు సినీరంగంలో చిరంజీవి సాధించిన ఘనతలతో పోలిస్తే మోహన్‌బాబు అతనికి ఏమాత్రం సరితూగకపోయినా, అతనేదో చిరుకు సమఉజ్జీ అన్నట్లుగా పోలుస్తూ మాట్లాడుతుండేవారు. స్వతహాగా నెమ్మదస్థుడైన చిరంజీవి ఘర్షణాత్మక వైఖరికి  దూరంగా ఉండేవారు. తనకు అనుకూలంగా లేకపోతే మోహన్ బాబు ఎంతకైనా తెగిస్తాడని తెలిసిఉండటం, అలనాటి హీరోయిన్ జయంతిని పెదరాయుడు షూటింగ్‌లో కొట్టటం, దివ్యభారతి ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరించటం, సాక్షిశివానంద్ చెల్లెలిని కొట్టటం వంటి సంఘటనలు చూసిఉండటంతో చిరంజీవి సామరస్యవైఖరికే మొగ్గుచూపేవాడు. అయితే ఈ మధ్యకాలంలో ఇద్దరిమధ్య సంబంధాలు బాగానే ఉంటున్నాయి. ఆ మధ్య మోహన్ బాబు తనను సభలో పొగడటంతో పొంగిపోయిన చిరంజీవి అతనిని కౌగలించుకుని ముద్దుకూడా పెట్టుకున్నారు. మళ్ళీ మా ఎన్నికలతో ఆ శత్రుత్వం యథాస్థాయికి చేరింది. దీనికితోడు చిరంజీవి అంటే ఒంటికాలిపై లేచే బాలకృష్ణ మోహన్‌బాబుకు తోడయ్యారు. దీనితో మా ఎన్నికల పోరు ఫక్తు తెలుగు కమర్షియల్ సినిమా క్లైమాక్స్‌లా రసవత్తరంగా మారింది.

కొసమెరుపు: గతంలో రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మోహన్ బాబు 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి జగన్ హయాంలో మళ్ళీ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకుని ఆశపడ్డారు. అయితే ఏపీలో ప్రభుత్వం ఏర్పరిచినతర్వాత, జగన్ మంచు ఫ్యామిలీని పట్టించుకోలేదు. చివరికి, చంద్రబాబు హాయాంలో మోహన్ బాబు హడావుడి చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయానికికూడా ఏమీ న్యాయం చేయలేదు. ఏపీ ఫిల్మ్ డెవలెంప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి చూస్తే విజయచందర్ కు ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడిగానైనా నామినేట్ చేస్తారేమోనని ఆశపడినప్పటికీ జగన్ చాలా లైట్ తీసుకున్నారు. దీనితో భంగపడిన మోహన్ బాబు కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీతో ఫోటోలు దిగి మీడియాకు ఇచ్చి తన పలుకుబడి ఏమీ తగ్గలేదని చెప్పటానికి ప్రయత్నించారు.

 

Pics courtesy: Wikipedia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *