భారతదేశంలో గాలి ఎలెక్ట్రిక్ వాహనాల వైపు మళ్లింది. ఎలెక్ట్రిక్ కార్లింకా మార్కెట్ లోకి పెద్దగా రాకపోయినా, టూ వీలర్లను ప్రోత్సహించేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోజుకు రోజుకు పెరుగుతున్న పెట్రోలు ధరల వల్ల ప్రజలు కూడా ఈ పెట్రోలు, డీజిల్ వాహానాలను మానేసి కరెంటు కార్లు, కరెంటు స్కూటర్ల గురించి ఆలోచించాల్సి వస్తున్నది. ఇంతవరకు భారతదేశంలో 88107 ఎలెక్ట్రిక్ వాహనాలను విక్రయించారు. దీనివల్ల రోజు 57,802 లీటర్లు ఇంధనం పొదుపు అవుతున్నది. రోజుకు 131543 కెజీల కార్బన్ డయాక్సైడ్ విడుదల తగ్గుతున్నది.
భారతదేశంలో పెట్రోలు డీజిల్ ధరలు ఆగకుండా పెరగడం వెనక ప్రజలను ఎలెక్ట్రిక్ వాహనాలవైపు మళ్లించే ప్రయత్నం కూడా ఉందని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ పాలిటిక్స్ లో ఏదయినా సాధ్యమే. ఎందుకంటే, ఇపుడు తక్షణం ప్రజలు ఎలెక్ట్రిక్ వాహనాలు కొనేందుకు పరుగులు తీయాలని రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. భారత ప్రభుత్వంకూడా ఫాస్ట్ (FAST: Faster Adoption and Manufacturing of Hybrid and Electric Vehicles) స్కీమ్ ను ప్రకటించింది. 2019 FAST 1 వచ్చింది.ఇపుడుFAST 2 అమలులో ఉంది. కరెంటు వాహనాలను తయారుచేయడం, కొనుగోళ్లను ప్రొత్సహించడం కోసం ఉద్దేశించిన FAME స్కీం 2024 దాకా అమలులో ఉంటుంది.
దీనిని దృష్టిలో పెట్టుకునే అనేక రాష్ట్రాలు ఎలెక్ట్రిక్ వెహికిల్ (EV Policies) పాలసీలను ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకంటే ముందున్నాయి. మిడ్ స్పీడ్ (మధ్యరకం స్పీడ్) ఎలెక్ట్రిక్ ద్విచక్ర వాహానాలు కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు భారీ సబ్సిడీలు ప్రకటించాయి. దీనితో హీరో ఎలెక్ట్రిక్ స్కూటర్లు ధరలు విపరీతంగా తగ్గాయి. ప్రజలు ఈ వాహానాలు కొనేందుకకు తొందరపడేలా ఈ ప్రోత్సాహకాలు ఉంటున్నాయి.
గుజరాత్ ప్రభుత్వం కిలో వాట్ అవర్ (kwh) బ్యాటరీ కెపాసిటిని బట్టి రు. 10వేల దాకా సబ్సిడి ప్రకటించింది. మాగ్జిమమ్ సబ్సిడీ రు. 20 వేల దాక ఉంటుంది. ఈ సబ్సిడీతో గుజరాత్ లో కరెంటు స్కూటర్లు కారు చౌక అయ్యాయి. ఈ సబ్సిడీ మొదటి లక్ష పదకొండు వేల వాహనాల అమ్మకాలకే వర్తిస్తుంది. ఆలసిస్తే ఆశాభంగం అని చెప్పడమే కదా.
ఇక ఎనిగ్మా ఆటోమొబైల్స్ (Enigma Automobiles) 2021లో కరెంటు స్కూటర్ల అమ్మకాల టర్నోవర్ 5 కోట్లు చేసింది. దీనిని రు. 15 కోట్లకు పెంచాలని ధ్యేయంగా పెట్టుకుంది. బోపాల్ మార్కెట్ లో 30 శాతం వాటా ఈ కంపెనీదే.
మంగళవారం నాడు చెన్నై లో జరిగిన ఇన్వెస్ట్ మెంట్ కాంక్లేవ్ -2021 TVS iQubeat ఎలెక్ట్రిక్ స్కూటర్ ను ప్రదర్శించింది. దీని ధర రు. 1.15లక్షలు. దీనికి 4.4 ఎలెక్ట్రిక్ మోటర్ ఉంటుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్ చేసినపుడు ఈ స్కూటర్ మాగ్జిమమ్ స్పీడ్ గంటకు 78 కి.మీ.
రాజస్థాన్ ప్రభుత్వం కూడా EV Policy 2021 ను ప్రకటించి మహారాష్ట్ర, గుజరాత్ ల క్లబ్ లో చేరిపోయింది. EV టూ వీలర్, త్రీవీలర్ లకు సంబంధించి రాజస్థాన్ ప్రకటించిన సబ్సిడీలు ఇతర రాష్ట్రాల కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. బ్యాటరీ కెపాసిటీని బట్టి టూ వీలర్లకు రు. 5 వేల నుంచి రు. 10 వేల దాకా సబ్సిడీ ఉంటుంది. త్రీవీలర్స్ కు రు. 10 వేల నుంచి రు. 20 వేల దాకా ఉంటుంది. అయితే, వాహనాలను తప్పనిసరిగా రాజస్థాన్ లోనే కొనాలి. ఇది 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 దాకా అమలులో ఉంటుంది.
ఊపందుకుంటున్న కరెంటు కార్ల సేల్స్
ఇక కార్లకు సంబంధించి టాటా నెక్సాన్ (TATA Nexon EV) 2020-21లో అత్యధిక కరెంటు కార్లను విక్రయించింది. 2020 జనవరిలో లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా ఈ కంపెనీ 5,500 కార్లను విక్రయించింది. అందునా 2021 జూన్ లో అత్యధికంగా 650 యూనిట్లు అమ్ముడు పోయాయి. మే నెలలో 486 యూనిట్లు అమ్ముడు పోయాయి. కంపెనీ సెల్స్ ఒక్క నెలలో 33 శాతం పెరిగాయి.
మారుతి సుజుకి కూడా కరెంటు కార్లను విడుదల చేసేందుకు పరుగులు పెడుతున్నది. నిజానికి మొదట వ్యాగన్ ఆర్ (Wagon R) EV 2021లోనే విడుదలవుతుందనుకున్నారు. ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు. దీనితో ఎంజి, మహింద్ర, టాటా, హ్యుందయ్ ల కంటే మారుతి సుజుకి వెనకబడి పోయిందనక తప్పదు. అయితే, సుజుకి ఇవి 2025లో భారత్ లో కరెంటు కారును విడుదల చేయాలనుకుంటున్నది. ఇండియలో విడుదల చేశాకే ఈ ఈ కంపెనీ ఈ కారుని యూరోప్, జపాన్ లలో విడుదల చేస్తుంది.