(రాఘవ శర్మ)
దాని పేరు గుర్రప్ప కొండ. ఆ కొండ నిండా వన సంపద! రకరకాల చెట్ల రూపాలు! చెట్లపై వివిధ రకాల పక్షులు! అనేక రూపాలలో బండ రాళ్ళు!చూడముచ్చటైన ఎత్తైన పచ్చని కొండ. అది ఆకాశాన్ని ముద్దాడుతున్నట్టుంది.
తిరుపతికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది. గుర్రప్ప కొండను చూడాలని ట్రెక్కర్లంతా ముచ్చటపడ్డారు. గంగుడుపల్లి గ్రామస్తులతో మాట్లాడి కొండ ఎక్కడానికి భూమన్ ఏర్పాట్లన్నీ చేశారు.
జులై 18వ తేదీ ఆదివారం ఉదయం తిరుపతి నుంచి దాదాపు 50 మంది ప్రకృతి ప్రియులం ద్విచక్రవాహనాలలో బయలు దేరాం.
మాలో రెండు ట్రెక్కింగ్ గ్రూపులు ఉన్నాయి. ఒకటి మధు ట్రెక్కింగ్ గ్రూపు, మరొకటి బాలు ట్రెక్కింగ్ గ్రూపు. మధ్యలో అటవీ అధికారులు, సిబ్బంది, మాలాంటి వాళ్ళం.ఉదయం తిరుపతి నుంచి బైపాస్ రోడ్డులో చంద్రగిరి వైపు సాగడం మా యాత్ర మొదలయింది.
కుడివైపు చంద్రగిరి, ఎడమ వైపున మల్లయ్యపల్లి రోడ్డు. ఆ దారిలో మల్లయ్యపల్లి తోపాటు దోర్నకంబాల, మంటపం పల్లె దాటితేనే గంగుడుపల్లె. పేరుకు పల్లెలేకానీ, సగం పైగా నగరాన్ని తలపించే ఘనమైన ఇళ్ళు. ఆ పక్కనే రాతి కూసాలపై గడ్డివాములు. ఎంత పశు సంపద! రోడ్డుకు ఇరువైపులా ఎత్తైన కొండలు. మధ్యలో పచ్చని పొలాలు, తోటలు.
ఆకాశం నిండా మబ్బులు కమ్మాయి. ఎంత సుందర ప్రదేశం!ఎంత చక్కని వాతావరణం!
వింత వింత రూపాల చెట్లుగుంగుడుపల్లెకు ఉదయం ఎనిమిది గంటలకు చేరాం. అక్కడి నుంచి దాదాపు కిలో మీటరు దూరంలో ఉన్న గుర్రప్పకొండ సానువులకు బయలుదేరాం. మా వాహనాలు కొండ సానువుల దగ్గర పెట్టి కొండెక్కడం మొదలు పెట్టాం.
కొందరు ముందరే వెళ్ళారు. ఆకాశమంతా మబ్బులు కమ్మాయి. సన్నని చినుకు మొదలైంది. తడిస్తే ఏమైపోతాం!? మొక్కమొలిచిపోం కదా, విత్తనాల్లాగా. కొండంతా దట్టమైన అడవి.
కొంత దూరం వెళ్ళాక అసలు ఆకాశమే కనిపించ లేదు. ప్రవాహంలా కొండపై నుంచి వచ్చిపడ్డ వర్షపు నీటికి దారులు ఏర్పడ్డాయి. ఒక్కొక్క మనిషి మాత్రమే వెళ్ళగలిగిన దారి. అంతా రాళ్ళు రప్పల తో నిండి ఉంది.
కొండను నిట్టనిలువునా ఎక్కుతున్నాం. ఒకరిద్దరికి తప్ప గుర్రప్పకొండ అందరికీ కొత్తే. కొలంబస్ లాగా ఎవరికి వారు దారి కనుక్కుంటూ ముందుకు సాగుతున్నాం. కొంత దూరం వెళ్ళాక అర్థమైపోయింది దారి సరిగా లేదని, దారి తప్పామని. అడ్డదిడ్డంగా కొండ ఎక్కుతున్నాం. బాగా అలిసి పోతున్నాం.చెమటతో బట్టలన్నీ తడిసిపోయాయి. కాసేపటికి మాకు అర్థమైపోయింది. మేమంతా దారితప్పిన కొలంబస్‌లు అయిపోయాం.
గ్రామస్తులలో ఒకరికి భూమన్ ఫోన్ చేశారు. ‘దారి చూపించడానికి వస్తున్నాం సార్ ‘ అన్నారు. మా పాటికి మేం ముందుకు సాగుతున్నాం. మొత్తానికి ఆ గ్రామస్తులొకరు వచ్చారు, అడ్డంగా కొమ్మలుంటే నరకడానికి కత్తిపుచ్చుకుని.
అప్పటికే కొండ ఎక్కలేక అలసిపోయాం. అయినా సగం పైగా కొండ ఎక్కేశాం. పక్షుల పలకరింపులు ఎంత ఆహ్లాదంగా ఉందో వాతావరణం! వాటి పలుకులకు ఉబ్బితబ్బిబ్బయిపోయాం. అవి పలకరింపులో, హెచ్చరికలో తెలియదు. మమ్మల్ని చూసి వెక్కిరింపులో తెలియదు!
దారి పోడవునా రకరకాల చెట్లు. రకరకాల రూపాలతో కొమ్మలు, ఊడలు. వాటిని చూసి ఒక్కొక్కరూ ఒక్కొక్క రకంగా ఊహించుకున్నారు. అక్కడక్కడా ఘుమఘుమలాడే అడవి కరివేపాకు.
దూరంగా రెండు కొండలను కలుపుతూ కట్టిన చిన్న చెక్ డాం. దాన్ని ‘దోసెల వంక చెరువు’ అంటారు. ఆ చెరువు కింద పచ్చని పంట పొలాలు. ఆపసోపాలు పడుతూ రెండు గంటలు నడిచి మొత్తానికి గుర్రం కొండ ఎక్కాం.
వేసుకున్న బట్టలన్నీ చెమటతో తడిసిపోయాయి. దారి తప్పడం వల్లే కానీ, ఇంత ప్రయాస ఎప్పుడూ పడలేదు. కొండ ఎక్కగానే ఎదురుగా ఆ గ్రామస్తులు వేసుకున్న పెద్ద రేకుల షెడ్డు. ఆ షెడ్డు పక్కన చిన్న శాలలో వంటలు తయారవుతున్నాయి. కాసేపు సేదదీరి గురప్ప కొండను ఒక చుట్టు చుట్టాలనుకున్నాం.
ఎదురుగా కొండ పైనుంచి పారుతున్న సన్నని సెల ఏరు. ఆ సెల ఏటిని ఒడిసి పట్టుకునే టట్టు , కిందికి వెళ్ళిపోకుండా ఆనకట్ట కట్టి, చిన్న తటాకాన్ని తయారుచేశారు. ఆపక్కనే బావి తవ్వారు.
ఎదురుగా కనుచూపు మేరలో ఊడలు దిగిన చెట్టు కింద గ్రామ దేవుడు గుర్రప్ప. ఆ దేవుడికి ఆలయం అంటూ ఏమీ లేదు.
ఆ చుట్టుపక్కల గ్రామస్తులంతా ఏడాది కొకసారి ఈ కొండ ఎక్కి గుర్రప్పను కొలుస్తారు. పిల్లలకు పుట్టెంటికలు కూడా ఇక్కడే తీయిస్తారు. మేక పోతులను, కోళ్ళను బలిస్తారు. గొర్రెలను బలివ్వరు.
ఆగ్రామ దేవుడికి మొక్కుగా గుర్రబొమ్మలను, ఏనుగు బొమ్మలను సమర్పిస్తారు. ఆదేవుడి చుట్టూ లెక్క లేనన్ని బొమ్మలు పడి ఉన్నాయి. కొండను ఒక చుట్టుచుట్టి రావాలని బయలుదేరాం. కొండపైన అడవి దారిలో ముందర పడమర దిశగా బయలు దేరాం.
కొండపైన మేకలను మేపుతుంటారు. మేక పిల్లలను రోజూ కొండ ఎక్కి దించడం కష్టం. మేకపిల్లలను అక్కడే కాపాడడం కోసం రాళ్ళతో కట్టి ‘మేకల పొది’ని ఏర్పాటుచేశారు. ఆ పొదిలో మేక పిల్లలను పెట్టి పైన కప్పేస్తారు. అలా చేయడం వల్ల వేరే జంతువులేవీ మేక పిల్లలను తినేయలేవు.
మా కళ్ళకు ఒక వింత దృశ్యం. ఒక పెద్ద రాతి బండ. ఆ బండకు మధ్యలో లొట్టపోయినట్టు లోతైన ప్రాంతం. నీళ్ళు నిండిన ఆ నీటి చెలమను ‘పందిటి బావి ‘అంటారు. ఆ రాళ్ళలోనే ఒక చెట్టు మొలిచి ఆ నీటి చెలమపై వాలిపోయింది. అది ఆరుమట్ల లోతుంటుంది. మట్టు అంటే 6 అడుగులు.
వివిధ రూపాలలో ఎన్ని బండ రాళ్ళు! కాస్త ముందుకు వెళితే ‘జాగల గుండు’ చాలా వింత గా ఉంది. ఒక పెద్ద బండ రాయి ఒక పక్క వర్షానికి తలదాచుకునే గూడులా ఉంది. మేకలను మేపడానికి వచ్చిన వాళ్ళు వర్షం వస్తే ఈ ‘జాగల బండ’ కిందే తలదాచు కుంటారు. ఆ బండకు అభిముఖంగా ఎత్తైన రాతి కొండ.
రెండు వేరువేరు చెట్లు పాముల్లా పెనవేసుకుపోయాయి. రెండు వైపులా కమ్మేసినట్టున్న చెట్లు, వాటి మధ్యలో దారి. కొన్ని చెట్ల ఊడలు గజిబిజిగా అల్లుకుపోయి, పిచ్చి గీతల్లా కనిపిస్తున్నాయి.
మళ్ళీ వెనుతిరిగొచ్చాం.ఈ తడవ పడమటి వైపు నుంచి కొండను చుట్టు చుట్టాం. ఎన్ని కొండ రూపాలో! జారుడు బండ లాంటి కొండను జారుకుంటూనే ఎక్కాం. ఆ వైపు నుంచి ఈ వైపునకు తిరిగి వచ్చాం.
ఒకప్పుడు మేకలను మేపిన శంకరరెడ్డి మాకు దారి దీపమయ్యాడు. చుట్టూ ఉన్న కొండలకున్న పేర్లన్నీ చెప్పాడు. ఫారెస్టుల కోన, నేలబండలు… ఇలా అనేక పేర్లు.
దూరంగా రాయలచెరువు కనిపిస్తోంది. గుర్రప్ప కొండ పైనుంచి చూస్తే చుట్టూ పచ్చని కొండలే. అంతా కొండలమయమే! మధ్యలో కాస్త మైదానం. ఆమైదాన ప్రాంతంలోనే పల్లెలు, పంటలు. గంగుడుపల్లికి చెందిన బి. విజయకుమార్ మాకు ఆతిథ్యమిచ్చారు.
భోజనాలు ముగించుకుని షెడ్డులోను, చెట్ల కింద కాస్త సేదదీరాం. మధు ట్రెక్కింగ్ గ్రూపు, అటవీ సిబ్బంది రాత్రికి కొండపైనే బస చేసేందుకు నిర్ణయించుకున్నారు. బాలు ట్రెక్కింగ్ గ్రూపుతో కలిసి మేం మధ్యాహ్నం మూడు గంటలకు తిరుగు ప్రయాణమయ్యాం.
వచ్చిన అనుభవంతో దారి తప్పకుండా గుర్రప్ప కొండ దిగాం. ఎక్కేటప్పుడు రెండు గంటలు పట్టింది.తిరుగు ప్రయాణంలో గంటలో దిగేశాం.
దారి పొడవునా కబుర్లు. ఎక్కేటప్పుడు మధు ట్రెక్కింగ్ గ్రూపులో సభ్యులు ఎన్ని సరదా కబుర్లో! దిగేటప్పుడు శామ్‌సంగ్ ప్రాంతీయ అధికారి రవి, అశోక్, ట్రెక్కింగ్ శ్రీనివాసు తదితరులు చాల సరదాగా కబుర్లాడారు.
డెబ్భై రెండేళ్ల భూమన్ అలుపు సొలుపు లేకుండా యువకుల తో కలిసి నడపడం నిజంగా విశేషం.గుర్రప్ప కొండ ట్రెక్కింగ్ ఇలా చాలా ఆహ్లాదంగా సాగింది. (Pics credit: Raghava Sarma)
(ఆలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)