కారంచేడు సంఘటనకి 36 ఏళ్లు

( కారంచేడు సంఘటన జరిగి 36 ఏళ్లు పూర్తయిన సందర్భంగా)

(వడ్డేపల్లి మల్లేశము)

ప్రపంచంలోని చాలా దేశాల్లో ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా తో పాటు ఇంగ్లాండ్ వలస దేశమైన అమెరికా లో కూడా శతాబ్దాల క్రితం బానిసత్వం ప్రాతిపదికగా నల్లజాతి ,తెల్లజాతి పేరుతో వివక్షత కొనసాగింది. దక్షిణాఫ్రికాలో జాతి వ్యతిరేకతకు నిరసనగా నెల్సన్ మండేలా నాయకత్వంలో జరిగిన పోరాటము నెల్సన్ మండేలాను దేశాధ్యక్షునిగా తీర్చిదిద్దడం వెనుక ఆ జాతి చైతన్యం ఎంతగానో పనిచేసింది అనేది చారిత్రక సత్యం .అది అన్ని దేశాలకు వర్తిస్తుంది.

కుల వ్యవస్థ ప్రధానంగా ఉన్న భారతదేశంలో అనాదిగా ఆర్యుల కాలము నుండి సామాజిక అంతరాల తో కూడిన అసమానతలు కొనసాగుతూ వర్గ వైషమ్యాలను పెంచి పోషిస్తున్న నేపథ్యంలో కుల నిర్మూలన కోసం ఈ దేశంలో అనేకమంది పోరాటం చేశారు. అందులో పూలే, అంబేద్కర్ ,పెరియార్ వంటి మహామహులు ఎందరో.

దళితులపై దాడులు

దళితులు అనే పదం షెడ్యూలు కులము
లకు ప్రత్యేకంగా వాడుతున్నప్పటికీ అణచి వేయబడిన వర్గాలు అని విశాల అర్థంలో విజ్ఞులు అన్వయించడాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ క్రమంలోనే అనాదిగా అస్పృశ్యులుగా చూడ పడుతున్న వర్గం వారిని ఉన్నత వర్గాల వారు శారీర,క మానసిక, ఆర్థిక, రాజకీయంగా అణచి వేయడానికి నిరంతరము ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ప్రతిఘటించిన చోట భంగ పడినప్పటికీ
ఆధిపత్యం, అహంకారం , స్వార్థం కారణంగా ఉన్నత వర్గాల లోని కొద్ది మంది తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి భౌతిక దాడులకు పాల్పడి అనేక మందిని చంపేసిన సంఘటనలు భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా జరిగినవి.
అధికారంలో ఉన్న వారితో సహా అన్ని పార్టీల యొక్క నాయకత్వం కూడా ఉన్నత వర్గాల చేతిలో ఉండటం దీనికి ప్రధానమైనటువంటి బలమైన కారణం.

వర్గ చైతన్యముతో, సామాజిక స్పృహతో అణచివేతలో ని అంతరార్థాన్ని బలంగా గుర్తించి ఉమ్మడిగా ప్రకటిస్తే తప్ప అట్టడుగు వర్గాలు ఈ దాడుల నుండి తమను తాము రక్షించుకోలేవు.

కారంచేడు  పరిణామాలు

1985 జూలై 17 వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామములో దళిత కుటుంబాల పైన జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. దేశమంతా ఉలిక్కిపడింది.

అట్టడుగు వర్గాలు చైతన్యమై అగ్రవర్ణాల ఆధిపత్య విధానాన్ని ఎండగట్టడానికి అగ్రవర్ణాలు చేస్తున్నా కుట్రలో భాగంగా జరిగిన ఈ దాడిని మనం గుర్తించవలసి ఉంటుంది. చట్టాలు ఎన్ని ఉన్నా ఉన్నత వర్గాలు పాలకుల అండతో ప్రతిసారి దళితులు, అట్టడుగు వర్గాలు ,ఆదివాసీలు మాత్రమే మోసపోతున్నారు.

గ్రామములో గల రెండు మంచినీటి చెరువుల్లో ఒకటి దళితులు వాడుకో గా మరొకటి అగ్రవర్ణాలు వాడుకునే ఆచారం కొనసాగుతోంది. దళితులకు ప్రత్యేకంగా ఒక చెరువా? అనే అహంకారంతో దానిని కలుషితం చేయడానికి ప్రయత్నించిన అగ్రవర్ణాల వారి ఆగడాలను అడ్డుకోవడం ఈ మారణకాండకు కారణమయ్యింది.

ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రధాన నిందితుడు సీఎం వియ్యంకుడు దగ్గుబాటి చెంచురామయ్య ఈ దాడికి సూత్రధారి, పాత్రధారి గా గుర్తించి దళితులు అనేక ఉద్యమాలు నిర్వహించారు. 17 జూలై నాడు జరిగిన ఈ సంఘటనలో తేళ్ల ముత్తయ్య, తేళ్ళ మోషే, తేళ్ల ఎహాషువా, దుడ్డు అబ్రహం హతమై పంటచేలలో రక్తం ఏరులై పారింది. అంతేకాక దళిత కుటుంబాలకు చెందిన వందలాది మంది గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.

దళితులపై హత్యాకాండ తదనంతర
పరిణామాలు

ఈ సంఘటనతో అభద్రతకు గురైన దళితులు అట్టడుగు వర్గాల వారు ఆత్మరక్షనార్థమై ప్రతిఘటన ధోరణిలో ఆగస్టు 15వ తేదీన చీరాలలో కారంచేడు బాధితుల సభ విప్లవ సంఘాల కార్యకర్త డానీ నాయకత్వంలో జరిగింది.

అగ్రవర్ణాల ఆధిపత్య ధోరణిని అంతం చేయడానికి సభ ప్రతిజ్ఞ చేసింది. ఈ మారణకాండకు నిరసనగా దళితులకు మద్దతుగా నాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బందుకు జులై 31వ తేదీన పిలుపునివ్వడంతో ఆ సంఘటన పతాక శీర్షికకు ఎగబాకింది. అంతేకాకుండా అక్టోబర్ 6వ తేదీన విజయవాడలో దళిత మహాసభ ఆధ్వర్యంలో జరిగిన చైతన్య సభలో ఆ సంస్థ అధ్యక్షులు కత్తి పద్మారావు ప్రసంగం కూడా దళితులను కదిలించి ఆలోచింపజేసింది.

ఆత్మగౌరవంతో బతకాలంటే అణచివేతను ప్రతిఘటించకుంటే భవిష్యత్తు శూన్యం అనే విషయాన్ని ఆ నాటి దళిత ప్రజానీకం గుర్తించడానికి ఈ సంఘటన పరోక్షంగా దోహదపడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విప్లవ ఉద్యమం బలంగా నడుస్తున్న ఆ కాలంలో దళితులను దారుణంగా హతమార్చిన ఈ సంఘటన పట్ల కలత చెందిన నాటి పీపుల్స్వార్ 1989 ఏప్రిల్ నెలలో ప్రధాన సూత్రధారిగా ఆరోపించబడిన దగ్గుబాటి చెంచురామయ్య ను హతం చేయడం ఈ సంఘటనకు మరింత ప్రాధాన్యత చేకూర్చి నట్లు అయినద నడంలో అతిశయోక్తి లేదు..

పునరావాస కార్యక్రమాలు, బుజ్జగింపులు

ఒక మారుమూల పల్లెలో జరిగినటువంటి ఈ మారణకాండ సామాన్య విషయం కాదు. అగ్రవర్ణ- దళితుల మధ్య గల భావావేశాన్ని, అవమానకర ధోరణులను, వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక తమ ఉనికి ప్రశ్నార్థకం కాకూడదని దళిత ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడడంతో నాడు తెలుగుదేశం ప్రభుత్వం దళిత సంఘాల డిమాండ్కు దిగి రాక తప్పలేదు.

దళిత సంఘాల ప్రతినిధులతో అనేక సార్లు చర్చలు జరిపిన అనంతరం మృతుల కుటుంబాలకు నివాస గృహాలను కట్టించడమే కాకుండా పునరావాసానికి కొన్ని
చర్యలు ప్రకటించింది. 436 దళిత కుటుంబాలకు ఇల్లు కట్టించి కాలనీని ఏర్పాటు చేసి కొన్ని కంటితుడుపు చర్యలు ప్రకటించినది.

తదనంతర సంఘటనలు

సంఘటన జరిగిన తర్వాత 24 ఏళ్లకు గాని ఈ కేసు పరిష్కారానికి నోచుకోలేదు. మారణకాండలో ని వాస్తవాలను గుర్తించిన సర్వోన్నత న్యాయస్థానం కుల భేషజాలకు అతీతంగా దోషులకు శిక్షలు ఖరారు చేసింది.
కోర్టు తీర్పు వెలువడే నాటికి నిందితుల్లో చాలామంది చనిపోవడంతో తీర్పు నీరుగారి నప్పటికీ మిగిలిన వారిలో ఒకరికి జీవిత ఖైదు, 29 మందికి మూడేళ్ల శిక్ష నామమాత్రంగా అమలు జరిగింది.

అయితే నేo కారంచేడు సంఘటన జరిగిన తర్వాత దళిత జాతి లో చైతన్యం వెల్లివిరిసింది. ప్రతిఘటన బావుటా ఎగుర వేయడం తో పాటు దళిత జాతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ మరొకవైపు అగ్రవర్ణాల వారికి పక్కలో బల్లెంలా వణుకు పుట్టించారు.

అంతేకాకుండా కొన్ని ప్రధానమైన డిమాండ్లు, ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందు సవాల్ విసరడంతో ఎస్సీ ఎస్టీ వర్గాల రక్షణ కోసం, అగ్రవర్ణాల దాడిని తిప్పి కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం 1989 లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని అమలులోనికి తేవడం ఉద్యమ విజయంగా భావించవచ్చు.

ఈ సంఘటన అనంతరం ఆభద్రతకు గురవుతున్న టువంటి సమాజంలోని అనేక వర్గాల వారు ముఖ్యంగా ఆదివాసీలు ,వెనుకబడిన తరగతుల వారు, మహిళలు, మైనారిటీ వర్గాల వారి అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్న వి. తద్వారా ఆయా వర్గాల వారి యొక్క హక్కులను బలపరుస్తూ, కర్తవ్యాలను గుర్తుచేస్తూ, ఆలోచనలకు పదును పెట్టే విధంగా అస్తిత్వ సాహిత్యం కూడా ఉబికి రావడం వర్గ సంఘర్షణల నివారించి అంతరాలు కొంత తగ్గించడానికి కృషి చేసినట్టు గా మనం భావించవచ్చు.

అయితే రాజ్యాధికారం ఉన్నత వర్గాల చేతుల్లో ఉన్న కారణంగా క్రింది స్థాయి వర్గాలు ఆయా పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగా మిగిలిపోవడం తో ఏదో రకంగా అణచివేతకు గురి అవుతూనే ఉన్నారు. ఈ తరుణంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ ఆదివాసి వర్గాల వారు సమైక్య ఉద్యమం ద్వారా రాజ్యాధికారంలో తమ వాటాను దక్కించుకోవడానికి కృషి చేస్తూ ఆత్మవిశ్వాసంతో ఉద్యమాలకు మరింత పదును పెట్టవలసిన అవసరం ఉంది. మన సమైక్య ఉద్యమమే చుండూరు ,కారంచేడు సంఘటనలో హతులైనవారికి నివాళి అర్పించి నట్లు అవుతుంది.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు, కవి, రచయిత, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *