కడప జిల్లా మైదుకూరు మండలం నల్లమల అడవిలోని మొండి భైరవుడి మొక్కు తీర్చుకునేందుకు వెళ్ళిన భక్తులకు వరదల్లో చిక్కుకుపోయారు. సాధారణంగా ఆదివారం నాడు భక్తులు ఈ భైరవ మొక్కులు తీర్చకుంటుంటారు. ఈ మధ్యాహ్నం భారీగా వర్షాలు కురవడంతో ముదిరెడ్డిపల్లె తండా నుండి బైరవకోన కు వెళ్లే రహదారిలో పలు వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. దీనితో అడవిలోకి వెళ్లినవారంత అటువైపు చిక్కుకుపోయారు.
వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో భక్తులు తిరిగి తమ ప్రాంతాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైదుకూరు ప్రాంత పరిధిలోని భక్తులతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా ఈ వరదల్లో అడవిలో చిక్కుకుపోయారు. తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
బైరవకోనకు తీసుకెళ్లిన ట్రాక్టర్లలతో కూడా వాగులు దాటే పరిస్థితి లేదు. దీంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు . పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు భైరవకోన కు వెళ్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తూ ఉండడంతో నలికిరి సెల నుండి మోట్ల పెద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తోందని, ఇప్పటి ఎటువంటి ప్రాణ నష్టం లేదని మైదుకూరు డిఎస్ పి విజయ్ కుమార్ తెలిాపారు.
మోట్ల పెద్ద వంక అవతల చిక్కుకున్న వారికి ఆహారము మంచినీళ్లు అందిస్తున్నామని, ఎవరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయని ఆయన చెప్పారు.
మొత్తానికి వంక వాగులో చిక్కుకున్న ప్రజలను 35 ట్రాక్టర్లు, 2 బొలెరో లు ఒక స్కార్పియో వాహనాన్ని సురక్షితంగా మోట్ల వంక దాటించారు..
దేవుని దర్శనానికి వెళ్లిన ప్రజలంతా పోలీసుల సహకారంతో సురక్షితంగా గ్రామాలకు చేరుకోవడంతో వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.