తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగంలో భాగంగా మూడవ రోజైన ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా జప-తర్పణ-హోమాలు నిర్వహించారు.
ఈ యాగం జూలై 24వ తేదీ వరకు ఆన్‌లైన్ వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నారు.
ఇందులో బాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారిని వేంచేపు చేశారు.
టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో 210 మంది ఋత్వికులు చతుష్టార్చన, కోటి కుంకుమార్చనలో ఒక ఆవర్తి,హోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించారు. ఇందులో ప్రధానంగా 120 మంది కోటి అర్చన, 36 మంది హోమం, 12 మంది శ్రీ భాష్యం, రామాయణం, భాగవతం, మహాభారతం పారాయణం, 12 మంది జపం, 12 మంది ఆవు పాలతో తర్పణం నిర్వహిస్తున్నారు.
ప్రతిరోజూ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు ఈ మహాయాగాన్ని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.