(సలీమ్ బాషా)
1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో ఐదుగురు అథ్లెట్లు పురుషుల పోల్ వాల్ట్ క్రీడలో చివరి దశకు చేరుకున్నారు. 4.25 మీటర్లు క్లియర్ చేయడంలో విఫలమైన తరువాత, యుఎస్ కు చెందిన బిల్ గ్రాబెర్ మొదట తప్పుకున్నాడు. మరొక అమెరికన్ ఎర్లే మెడోస్ 4.35 మీటర్లు క్లియర్ చేసి బంగారు పతకాన్ని సాధించాడు.
మిగతా ముగ్గురు క్రీడాకారులు రజత, కాంస్య పతకాల కోసం పోటీ పడ్డారు. ఒకరు అమెరికన్, మిగతా ఇద్దరు జపనీస్.
అమెరికాకు చెందిన బిల్ సెఫ్టన్, మొదటి ట్రయల్ లో బార్ ను క్లియర్ చేయడంలో విఫలమయ్యాడు. ఇద్దరు జపనీస్ పోటీదారులు విజయం సాధించారు, అంటే ఇద్దరికీ పతకం లభిస్తుంది. కానీ ఎవరికి ఇది లభిస్తుంది? అనే దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.
యువకులు ఇద్దరూ విద్యార్థులు. వాసేదా విశ్వవిద్యాలయంలో షుహీ నిషిదా చదివేవాడు. అలాగే కీయో విశ్వవిద్యాలయంలో ఓయే చదివేవాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరూ స్నేహితులు. అందువల్ల అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ – వారు ఇక పోటీ చేయడానికి నిరాకరించారు. వారు పతకాలను సమానంగా పంచుకోవాలనుకున్నారు. అయితే వారి అభ్యర్థనను తిరస్కరించారు. ఎవరైనా ఒకరు కాంస్య, మరొకరు రజతం తీసుకోవాలని చెప్పారు. రెండవ స్థానంలో ఎవరు, మూడవ స్థానంలో ఎవరు ఉండాలనే దానిపై జపాన్ జట్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం , మొదటి ప్రయత్నంలో 4.25 మీటర్ల ఎత్తును క్లియర్ చేసిన నిషిదా రెండో స్థానం,(రజతం) ఓయే మూడో స్థానం ( కాంస్యం ) తీసుకోవాలని నిర్ణయించారు. ఆ ప్రాతిపదికన పతకాలు ప్రదానం చేశారు. కానీ ఇద్దరు అథ్లెట్లు ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు.
జపాన్ కు తిరిగివచ్చిన తర్వాత వారు తాము అనుకున్నట్లే పతకాలను సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు రెండు పతకాలను సగానికి కట్ చేసి, రెండు-హైబ్రిడ్ పతకాలుగా చేశారు. సగం రజతం, సగం కాంస్యం. అలా ఆ పతకాలను “స్నేహ పతకాలు” (The medals of friendship) అని పిలవసాగారు. ఓయే 1941 లో యుద్ధంలో మరణించాడు; నిషిదా 1997 లో మరణించాడు. ఓయే పతాకం ప్రైవేట్ చేతుల్లోనే ఉంది, కాని నిషిదా పతాకం వాసెదా విశ్వవిద్యాలయం లో జాగ్రత్తగా ఉంచారు.ప్రతి సందర్భంలో, విచిత్రమైన ఈ పతకాలు శాశ్వతమైన గొప్ప స్నేహానికి మరపురాని జ్ఞాపికలు ఉపయోగపడతాయి. అంతే కాకుండా, హిట్లర్ జర్మనీ లోని ద్వేషపూరిత వాతావరణంలో సైతం,, ఒలింపిక్ క్రీడలు యువత ను కేవలం క్రీడా ప్రావీణ్యం కన్నా (athletic excellence) అద్భుతమైన, అజరామరమైన స్నేహాన్ని ప్రదర్శించేలా చేశాయి అన్న విషయం కూడా పదే పదే గుర్తు చేస్తాయి. అలా ఆ ఇద్దరు మిత్రుల కథ ఒలంపిక్స్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.
(సలీమ్ బాషా, స్పోర్ట్స్ జర్నలిస్టు,హోమియో వైద్యుడు, సెల్ నెం 93937 37937)