(వడ్డేపల్లి మల్లేశము)
నారాయణపేట జిల్లాలో జరిగిందేమిటి?
గత శనివారం రోజున నారాయణపేట జిల్లా కేంద్రానికి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి ఐటి,పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు (కెటిఆర్) వచ్చారు. ఆయనకు అధికారులు స్వాగతం పలకాలనుకున్నారు.
ఇంతవరకు బాగుంది. కాని, అక్కడ కనిపించేదేమిటి. స్వాగతం పలకడానికి అంగన్వాడీ ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున సమీకరించారు. వారి చేతిలో మొక్కల కుండి పెట్టి, పైకెత్తి వందనము చేస్తూ స్వాగతం పలికేలా ఏర్పాటు చేశారు. మహిళల చేత ఇలా చేయించడం చూసేందుకు చాలా వికారంగా ఉంది. అసహ్యంగా కూడా ఉంది, ఈ మహిళల ఆత్మగౌరం,డిగ్నిటీ గురించి భజనపరులైన నిర్వాహాకులు, అధికారులు ఆలోచించినట్లే లేరు. ఇలాంటి సన్నివేశం ఏ రాచరిక వ్యవస్థలో కూడా జరిగి ఉండదేమో.
అంగన్వాడి ఉపాధ్యాయులు తమకు జీతాలు పెంచారనో ప్రేమతో, అభిమానం, గౌరవంతో ,చేసిన పని కాదు ఇది.
అధికారులకు రూలింగ్ పార్టీకి తెలంగాణలో ఏదో అంతర్గత ఒప్పందం ఉన్నట్లుంది. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు సాగిలపడుతున్నారు. మంత్రికి ఇలా ‘గౌరవంగా’ స్వాగతం పలికి ఒక రాచరిక వ్యవస్థను నెలకొల్పాలని అధికారులు తాపత్రయ పడుతున్నారని నారాయణ పేట సంఘటనని చూస్తే అర్థమవుతుంది. పరిపాలనలో విలువల పతనమే.
ఆ ప్రాంత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మంత్రికి ఎలా స్వాగతం పలకాలనే విషయం మీద ఒక రోజు ముందుగానే ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇచ్చారు. స్వాగతమంటే మాటలా. విఐపి రావడానికి ముందే అక్కడికి వచ్చి నిలబడాలి. ఈ సారి చేతిలో పూలకుండి పెట్టారు. మంత్రి వచ్చే దాకా పూలకుండి మోస్తూ ఉండాలి. ఆయన కాన్వాయ్ వెళ్లే దాకా పూలకుండి ఎత్తి పట్టుకుని నిలబడాలి. మంత్రి వచ్చిన శనివారం రోజు రెండు గంటలపాటు వారిలా నిలబడి ఎదురు చూపులతో విసిగిపోయారు. అయినా తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఈ మహిళలంతా మంత్రి కెటిఆర్ కు స్వాగతం పలికారు. ఇధి దేనికి సంకేతం? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా?
ఇటీవల కమలాపూర్ లో ఎంపీడీవో మహిళా అధికారిని రాజకీయ నేతలు, మంత్రులు అవమానించినా, కలెక్టర్లు ముఖ్యమంత్రికి పాదాభివందనం చేసినా ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు పెదవి విప్పిన దాఖలాలు లేవు.ఇది చాలా విచారకరం.
” సాగినంత కాలం నా అంత వారు లేరు, అందరూ సాగక పోయినాడు చతికిలబడి పోదురు” అనే సినిమా పాటను మరిపించే రీతిలో రాష్ట్రంలో కొనసాగుతున్న కొన్ని పరిణామాలు రాబోయే ప్రమాద ఘంటికలకు సంకేతంగా భావించవచ్చునా?
అనేక రాజకీయ పక్షాల నాయకులు, మేధావులు, సామాజిక రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. శనివారం రోజు జరిగిన సంఘటన పైన స్పందించిన స్థానిక సిఐటియు జిల్లా అధ్యక్షులు జి వెంకట్రాంరెడ్డి ,జిల్లా కార్యదర్శి బల్ రామ్ సంఘటన పైన ఘాటుగా విమర్శిస్తూ బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని, వెంటనే అంగన్వాడి ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని, ఈ హేయమైన చర్య వెనుక ఉన్నటువంటి చీకటి ఒప్పందాన్నీ వారు ఖండించిన ట్లుగా తెలుస్తున్నది.
కలెక్టర్లు పాదాభివందనము చేసిన సంఘటన తో మొదలుపెట్టి గత నెల రోజులుగా రోజుకి ఒక సంఘటన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంటే, ప్రభుత్వ పెద్దలు ప్రజలను ఇతర రాజకీయ పక్షాల వారిని ఇష్టం ఉన్నట్టుగా విమర్శిస్తూ ఎన్నికల కోసం మాత్రమే ప్రకటనలు, నిధులను కేటాయిస్తూ ఉంటే ప్రజలు ప్రజాస్వామిక వాదులు ప్రజాసంఘాలు చూస్తూ ఊరుకోవడం సమంజసం కాదు.
రాచరిక వ్యవస్థలో కూడా ఇలాంటి దుశ్చర్యలు ఏనాడు జరగలేదు. ఈ సంఘటన పైన మంత్రి స్పందించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ఒకవేళ మంత్రి ఇలాంటివి అంగీకరించని పక్షంలో స్వాగతం పలికే సమయంలో అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేయవలసి ఉండింది. అలాంటి సంఘటన జరగలేదు. అంటే ఆయనను సంతోషం కలిగించేందుకు చేసిన పని గా, ఆయనకూ ఇష్టమయిన ఏర్పాటుగా భావించవలసి ఉన్నది.
అంగన్వాడీ ఉపాధ్యాయుల సంఘం పక్షాన వెంటనే స్పందించి స్థానిక ప్రాజెక్ట్ ఆఫీసర్ తో పాటు ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తూ పోరాట కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అటువంటి అవసరం ఎంతగానో ఉన్నది.
అప్పుడు మాత్రమే ఉద్యోగుల యొక్క ఆత్మ గౌరవం నిలబడుతుంది. లేకుంటే ఉద్యోగులు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నట్లు లెక్క.
ప్రభుత్వానికి మంచిది కాదు
ఇలాంటి సంఘటనల పై కేవలం ఉద్యోగ సంఘాలు మాత్రమే కాదు అన్ని రాజకీయ పార్టీలు అధికారుల ప్రభుత్వ పెడ ధోరణులను ఖండించ వలసిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉండే అవకాశం ఉన్నది. ప్రజలతో, ప్రజాస్వామిక వాదుల్ అధికారులతో, కలెక్టర్ ఉన్నత స్థాయి అధికారులతో వ్యవహరించే సందర్భంలో శాసనసభ్యులు, మంత్రులతో సహా రాష్ట్ర ప్రభుత్వం చాలా సున్నితంగా వ్యవహరించవలసిన అవసరం ఉన్నది.
విమర్శలు ఎన్ని వచ్చినా పట్టించుకోకపోవడం.. లేకుంటే దురుసుగా వ్యవహరించడం మరొక సందర్భంలో పార్టీ కార్యకర్తలు ప్రజలు అధికారుల పైన దాడి చేయడం వంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆత్మగౌరవం కోసం కోరి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు ప్రజలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో రాజ్యాంగ పరిధికి లోబడి మనిషిని మనిషిగా చూసే సంస్కారయుతంగా ఉద్యోగులను ప్రజలను చూస్తే తప్ప వారి మనుగడ గూడా ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉన్నది. ఇలాంటి వరుస సంఘటనలను విజయాలుగా కాకుండా హెచ్చరికలు ఒక భావిస్తేనే ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది సుమా!
స్వేచ్ఛా , స్వాతంత్య్రా లకు రాజ్యాంగబద్ధ హోదా లభించినప్పటికీ భారతదేశంలో అమలుకావడం కత్తి మీద సాము లాంటిదే. అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి రాజకీయాలు కొనసాగిస్తున్న నేటి కాలంలో ఐదేళ్ల అధికారంలో వీలైనన్ని ఆగడాలకు, అకృత్యాలకు పాల్పడుతున్నారు.
బానిసలుగా బ్రతకాల్సిన టువంటి గడ్డు పరిస్థితులు దాపురించినవి.
ప్రభుత్వాల ఆగడాల ఫలితంగా ఇటీవలి కాలంలో కలెక్టర్లు ముఖ్యమంత్రికి పాదాభివందనం చేయడం, మంత్రి కొడుకు ప్రజలు స్వాగతం పలకడం, ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా నాయకులతోపాటు, మంత్రులతో పాటు, సామాన్య ప్రజానీకం పాలాభిషేకాలకు పాల్పడే దుష్ట సంప్రదాయాలు కొనసాగుతున్నవి. ఈ మధ్య జరిగిన ఒక వికారపు స్వాగతకార్యక్రమాన్ని ప్రజలు ముందుంచడమే ఈ వ్యాసం ఉద్దేశం.
తెలంగాణ లో అనైతిక ధోరణులు
ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వ విధానాలను ప్రజా కోణములో అమలు చేయవలసి ఉంటే అందుకు తగినటువంటి ప్రాతిపదికగా చట్టాల రూపకల్పన చేసేది చట్టసభలు. రాజకీయ అవినీతి మించిపోయిన కారణంగా ఉద్యోగ వర్గం లోనూ అవినీతి పేరుకుపోయి పోలీసులతో సహా కలెక్టర్లు ఉన్నత స్థాయి అధికారులు కూడా గుడ్డిగా ప్రభుత్వ విధానాలను అనుకరించడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఆగడాలకు, దుర్నీతి కి పాల్పడుతున్నారు.
భారతదేశంలో అన్ని రంగాలలో మొదటి స్థానంలో ఉన్నామని గర్వంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల వేతనాలతో పాటు అప్పుల్లో కూడా తెలంగాణ ముందువరుసలో ఉన్నదనే వాస్తవాన్ని అఖిల పక్షాలు , అధికార పార్టీ, ప్రభుత్వ పెద్దలు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజానీకం మర్చిపోకూడదు.
గ్రామీణ పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాల్లో ఇటీవల మహిళా ఎంపీడీవో అధికారిని సామాన్య ప్రజానీకాన్ని కలెక్టర్ తో సహా చులకనగా చేసి మాట్లాడిన విషయాలను మర్చిపోకూడదు. భారతదేశంలో బహుశా ఏ రాష్ట్రంలో కూడా పాలక పక్షం ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడలేదని విశ్లేషకులు రాజకీయ పక్షాల నాయకులు ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తున్నారు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్, సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)