త్వరలో తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఇందులో ఉద్యోగాల విషయం ప్రధానంగా చర్చకు రావడం విశేషం.
ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపైన మంత్రిమండలి చర్చించి అనేక నిర్ణయాలు తీసుకున్నది. ఇందులో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఒకటి.
ప్రభుత్వం లో ఉన్న అన్నిరకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం ‘వార్షిక నియామక కేలెండర్’ (Annual Recruitment Calendar) ను తయారు చేసి విడుదల చేస్తారు. తర్వాత క్యాలెండర్ కు అనుగుణంగా విధిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిర్వహించాలని కేబినెట్ ఆదేశించింది.
ఉద్యోగ ఖాళీల భర్తీకై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు రేపు కూడా కేబినెట్ సమావేశం కొనసాగనుంది. బుధవారం జరిగే సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని కేబినెట్ ఆదేశించింది.
కాబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు
➧ మందులు, ఆక్సీజన్ లభ్యత, ఇతర మౌలిక వసతులు సౌకర్యాలపై కేబినెట్ చర్చించింది. కరోనా నియంత్రణకు సంబంధించి వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల అనుమతులను ఇచ్చిన నేపథ్యంలో మందులను అందుబాటులో ఉంచడం, జ్వర సర్వేతో సహా అన్నిరకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
➧ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏడు జిల్లాల్లో పర్యటించి వచ్చిన ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు, ఆయా జిల్లాల్లో నెలకొన్న కోవిడ్ పరిస్థితి, తీసుకున్న చర్యలు, నివారణకై ఇచ్చిన సూచనలు, తదితర క్షేత్రస్థాయి పరిశీలనలను, కేబినెట్ కు వివరించారు.
➧ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంకు చేసిన విజ్ఞప్తి మేరకు కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే చేపట్టాలని, ఖాళీల గుర్తింపు మరియు భర్తీ ప్ర్రక్రియ సత్వరమే జరగాలని కేబినెట్ ఆదేశించింది.
➧ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఆయా నియోజకవర్గాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులకు 50శాతం సీట్లను కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ప్రతి నెలా జరిగే సమావేశాలకు స్థానిక ప్రజాప్రతినిధులను విధిగా ఆహ్వానించాలని అధికారులను ఆదేశించింది.
➧ తెలంగాణ పట్టణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో గృహ నిర్మాణాల కోసం అభివృద్ధి చేసే లే-అవుట్లలో, లాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయాలనే అంశంపై కేబినెట్ చర్చించింది. అందుకు సంబంధించిన అవకాశాలను అన్వేషించాలని, విధి విధానాలపై దృష్టి సారించాలని, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించింది.
➧ హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీల పరిధిలో మంచినీటి సమస్యపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా మరో రూ. 1200 కోట్లను మంజూరు చేసింది. నీటి ఎద్దడి నివారణకై తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.
➧ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై కేబినెట్ చర్చించింద. ఈ సందర్భంగా పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖలు కేబినెట్ కు నివేదికలు సమర్పించాయి. వచ్చే నెల రోజుల లోపు, రాష్ట్రంలో నూటికి నూరుశాతం వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రులను, అధికారులను సీఎం ఆదేశించారు.