హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మీద తెలంగాణ కాంగ్రెస్ యుద్ధభేరి మోగించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం మీద నిరుద్యోగులను సమీకరించేందుకు కొత్త పిసిసి అధ్యక్షుడు కార్యాచరణ మొదలుపెట్టారు. కాంగ్రెస్ తొలి పోరాటం ఉద్యోగాలమీద తీసుకోవడం వ్యూహాత్మకయిన నిర్ణయం. ఉద్యోగాల ప్రకటనలు లేక యువకులు, పిల్లలకు ఉద్యోగాలు లేక కుటుంబాల 2014 నుంచి ఎదురు చూస్తున్నాయి. ఈ అసంతృప్తికి ఉద్యమ రూపం తెచ్చేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. కరోనా వల్ల విద్యాసంస్థలు పని చేయనందున, విద్యార్థుల సమీకరణ కష్టం కాబట్టి, రేవంత్ నిరుద్యోగుల మీద దృష్టి పెట్టారు. ఇందులో భాగమే ఆయన వారం రోజులు పాదయాత్ర కూడా. ఇపుడాయన కెసిఆర్ ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాల రిక్రూట్ మెంట్ జరగాల్సిందేనని, వాటికి సంబంధించిన వివరాలను ప్రకటించాలని రేవంత్ రెడ్డి అల్టిమేటమ్ జారీ చేశారు. ఇలా కాని పక్షంలో నిరుద్యోగులతో ఉద్యోగాల విముక్తి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రం ప్రభుత్వంలో ఉన్న 1.91 లక్లలతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలను ప్రకటించాలని ఆయన చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగాలుంటే 50 వేలే భర్తీ చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిొచారు. రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు 2 లక్షల పోస్టులున్నాయని బిశ్వాల్ కమిటీ వెల్లడించిన విషయం గుర్తు చేస్తూ ఆయన సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఉన్న ఖాళీల భర్తీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
‘‘కరోనా తీవ్రంగా ఉన్నపుడు స్టాఫ్ నర్సులను దేవుళ్లని పొగిడావు. ప్రస్తుతం నర్సులు ప్రగతిభవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. స్టాఫ్ నర్సులను విధుల్లో కొనసాగించాలి. డిమాండ్లు నెరవేర్చకపోతే నిరుద్యోగుల తరఫున పోరాటం కొనసాగిస్తాం’’ అని ముఖ్యమంత్రి రాసిన లేఖలో రేవంత్ పేర్కొన్నారు.
రేవంత్ లేఖలోని ముఖ్యాంశాలు:
⦁ ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించి 1600 మంది నర్సుల కుటుంబాలను రోడ్డున పడేశావు.
⦁ ప్రగతి భవన్ కు వస్తే ఐదు నిముషాలు వాళ్ల గోడు వినే తీరిక మీకు లేదా
⦁ ప్రగతి భవన్ ప్రజల కష్టాలు విని, కన్నీళ్లు తుడవాల్సిన కార్యాలయమా లేక కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కార్యాలయమా ?
⦁ 2018 లో ఎంపికైన ఎఎన్ఎంలకు ఇప్పటికీ పోస్టింగులు ఎందుకు ఇవ్వడం లేదు?
⦁ 50 వేల ఉద్యోగాల భర్తీ పై మీరు చేసిన ప్రకటన చీటింగ్ “వన్స్ మోర్” లాగా ఉంది ?
⦁ ప్రభుత్వ కార్పొరేషన్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ సంగతి ఏమిటో స్పష్టం చేయండి.
⦁ స్టాఫ్ నర్సులను యథాతథంగా విధుల్లో కొనసాగించాలి.
⦁ 2018 ఎఎన్ఎం అభ్యర్థులకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలి.