-(వడ్డేపల్లి మల్లేశము)
రాజకీయ పార్టీలకు భారత దేశంలో కొదవలేదు. ప్రజా సేవ లక్ష్యంగా రాజకీయ స్రవంతిలోకి వచ్చిన పార్టీలు కొన్ని ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆంగ్లేయులతో పోరాటం చేస్తున్న సందర్భంలో ఏర్పడినటువంటి పోరాట ప్రజా ఉద్యమ వేదిక మాత్రమే. క్రమంగా అది రాజకీయ పార్టీగా మారి భారతదేశాన్ని 60 సంవత్సరాల పైగా ఏలింది అదొక చరిత్ర.
కానీ చిన్న పార్టీలు ప్రాంతీయ అవసరాల పేరు చెప్పుకొని అధికారం కోసం మాత్రమే ప్రజలను మభ్యపెట్టి ప్రజా ఆస్తులను కొల్లగొట్టడానికి అనేక రాజకీయ పార్టీలు పుట్టుకు వస్తున్నావి. అందులో సందర్భం కాదు. సహేతుకం కాదు ఏ రకంగా చూసినా స్థానం లేనటువంటి పార్టీ షర్మిల పెట్టిన కొత్త పార్టీ అని చెప్పక తప్పదు.
ప్రాంతీయ ఆకాంక్షల మేరకు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కి ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకత్వం తో కూడిన పార్టీ తెలంగాణలో ఆశాస్త్రీయము. ఆ సందర్భము. షర్మిల ఏర్పాటు చేసిన పార్టీకి తెలంగాణలో స్థానం కల్పించడం మరి అవివేకం.
రాజకీయ పార్టీలు- ప్రజలు
రాజకీయ పార్టీలు అంటే ప్రజా పాలన కు సంబంధించి సమగ్రమైన అవగాహన తో, సిద్ధాంత ప్రాతిపదికన సేవా దృక్పథంతో, పనిచేసే ఒకే భావజాలం కలిగే నటువంటి కొందరి సమూహము. రాజకీయ పార్టీగా ఉండి ప్రజల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి అనేక పార్టీలు గతంలో భారతదేశంలో ప్రజలను తప్పుదోవ పట్టించి, ప్రజలను వంచించి ప్రజలకు బదులు పాలకులు తామే ప్రభువులమని విర్రవీగిన సందర్భాలు అనేకం. ఆ పార్టీలకు పతనం తప్పలేదు.
ఓట్ల కోసమే ప్రజలను వాడుకొని వారి అవసరాలను గుర్తించక, వారికి ప్రాతినిధ్యం కల్పించక వాగ్దానాలు ,ప్రలోభాలతో మభ్యపెట్టి ప్రశ్నించకుండా మత్తులో ఉంచి పాలకులు రాజకీయ పార్టీలు అధికార పక్షాలు ముఖ్యంగా పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడిన వి. తెలంగాణ ఇందుకు మినహాయింపు కాదు.
జాతీయ పార్టీలు దేశమంతటా ప్రచారంలోనూ, పాలనలోనూ ఉండే ఆస్కారం ఉంటే ప్రాంతీయ పార్టీలకు 1,2 రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాదనలేము. కానీ ముఖ్యంగ తెలంగాణ ప్రత్యేక ఆకాంక్ష మేరకు ఏర్పడినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివక్షతకు గురైనదని పోరాడి స్వయంప్రతిపత్తిని సాధించుకున్న తర్వాత తిరిగి ఆంధ్ర పార్టీ యొక్క అవసరం ఇక్కడ ఏముంది? పార్టీని పెట్టే వారికి ఆకాంక్షలు, కోరికలు, ఆశయాలు లేకపోయినా ప్రలోభాలకు గురి చేయాలనే తలంపు ఉండవచ్చు. కానీ మద్దతిచ్చే ప్రజలకు విజ్ఞత ఉండాల్సిన అవసరం ఉంది కదా!
ఏడేళ్ల తెలంగాణ ఏమిచ్చింది?
ప్రధాన వాగ్దానాలతో పాటు అనేక హామీలు కూడా అమలు కాని కారణంగా ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పై అనేక రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన ప్రశ్నలు సంధిస్తున్నవి.ముఖ్య0గా దళిత ముఖ్యమంత్రి,దళితులకు 3ఎకరాలభూమి మాటతప్పిన ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేకపోవడం తెలంగాణ పరువును తీసింది.
నిరుద్యోగ సమస్య మరింత పెరగడం రెండు లక్షలకు పైగా ఖాళీలు ఇప్పటికీ ప్రజానీకాన్ని పాలకులను ఎక్కిరిస్తున్నవి.
రైతుబంధు పేరుతో బడా భూస్వాములకు లాభం చేకూర్చిన కారణంగా సామాన్య బక్కచిక్కిన పేద రైతులకు కౌలు రైతులకు ప్రయోజనం జరగలేదు గనుక రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగినవి.
భూములు ఉన్నవారికి రైతుబంధు పేరుతో వందల ఎకరాలు ఉన్నవారికి లక్షలాది రూపాయలు కట్టబెడుతూ ఉంటే భూమి లేనటువంటి నిరుపేదలకు ప్రభుత్వపరంగా ఏమి సాయం అందినట్టు? అనేక మంది వేస్తున్న ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెప్పగలరా?
పేదరిక నిర్మూలన , సమానత్వ స్వావలంబన సాధన, ఆత్మగౌరవం వంటివి కనీసం కానరావు. ప్రశ్నించే కవులు కళాకారులు మేధావులు జర్నలిస్టులు జైలు పాలే. నిరసన తెలిపే హక్కు ను వంచించి ఇందిరాపార్కును మూసివేసి ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఏ ప్రయోజనాలు నెరవేరినట్లు?
ప్రకృతి విధ్వంసాన్ని ఆపడానికి, ప్రజలకు ఆత్మగౌరవాన్ని అందించడానికి హామీ ఇచ్చిన ప్రభుత్వం గత ఐదేళ్లలో ఆత్మగౌరవాన్ని వంచించి అనేక మందిని పార్టీ నుంచి తొలగించిన దాఖలాలు కనపడటం లేదా? ప్రకృతి గుట్టల విధ్వంసాన్ని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, శాసనసభ్యులే కొనసాగిస్తుంటే మన హామీలు పాలనా విధానం ఏమైనట్లు?
పాలనా వైఫల్యాలు విమర్శకులకు అస్త్రాలు
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యామ్నాయం బీజేపీ అని ఇటీవలి కాలంలో అనేక ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బిజెపి పార్టీ ప్రభుత్వ పాలనా విధానాలను ఎత్తిచూపి ఎండగట్టిన సందర్భం తెలుసు .మరొక అడుగు ముందుకేసి నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటీవల పార్టీ యొక్క నాయకత్వాన్ని కేంద్రం మార్చగా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు తీసుకోగానే రైతులు, నిరుద్యోగుల సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీయడం మే కాకుండా పాదయాత్ర కు కూడా పూనుకోవడం ప్రభుత్వ వైఫల్యాలు కావా?
టిఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులు, ఉద్యమ నేత పార్టీని అనుక్షణం కాపాడిన టువంటి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను అవినీతి పేరుతో బర్తరఫ్ చేసిన సందర్భం ఆత్మగౌరవం అనే పదాన్ని ఇటీవలి కాలంలో బాగా తెరపైకి తెచ్చింది .. తెలంగాణ ఉద్యమం లో పనిచేసి టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నటువంటి అనేకమందిని పార్టీ నాయకత్వం తొలగించి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారి పైన దాడి చేసిన వాళ్ళు ఇవ్వాలా ప్రభుత్వంలో కొనసాగడం ఎంత విడ్డూరం! ఆకాంక్షలు ఏమేరకు నెరవేరినవో, బుద్ధిజీవులు విద్యావంతులు, సామాన్య ప్రజానీకం ఆలోచించవలసిన అవసరం ఉంది.
ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్షాలకు అవకాశం అవుతున్న ఈ సందర్భంలో మన అవసరాలను మనము పరిష్కరించుకునే సత్తా ఉన్న నేపథ్యంలో ఆ విజ్ఞతను మరచి రాజకీయ పార్టీలు ఇంటి సమస్యను బజారున వేసుకున్నట్లు గా ప్రచారం జరుగుతుంటే పరాయివాళ్ళు రాక ఏం చేస్తారు?
షర్మిల పార్టీ ఆలోచన విధానము తెలంగాణకు అవసరమా?
గత కొన్ని నెలలుగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలను సమీకరించి షర్మిల నిన్న అనగా 8 జూలై నాడు వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీని ప్రకటించడం తెలంగాణ రాజకీయ పార్టీలకు ప్రభుత్వానికి గుణపాఠం రావాల్సిన అవసరం ఉంది.
అట్లని షర్మిల పార్టీ ప్రకటించిన విధానాన్ని ఎవరు సమర్థించరు. సమర్థించకూడదు. రాజశేఖర్ రెడ్డి మాకు ఆదర్శమని వారి ఆకాంక్షల మేరకే మా విధానం ఉంటుందని ప్రకటించడం హాస్యాస్పదమే కాదు ఆందోళనకరం కూడా. మరొకవైపు కెసిఆర్ మోసగాడు అంటూ రైతుబంధు అమలు అవుతున్నప్పటికి రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి ?అని సూటిగా ప్రశ్నించడం కూడా మనలో ఆలోచనలు రేకెత్తించిన ట్లే!
మన రాష్ట్రాన్ని మనం ఏ లుకునే సత్తా మనకుంది .అనేక ఆకాంక్షలతో 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే తిరిగి వాళ్ళ పెత్తనం ఏమిటి అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. కానీ అవమానకరమైన విషయం ఏమిటంటే అనేకమంది ప్రజలు, కళాకారులు,బుద్ధిజీవులు షర్మిల పార్టీలో చేరి తెలంగాణకు ద్రోహం చేయడాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోమారు తాకట్టు పెట్టడమే అవుతుంది.
ఈ పార్టీ ఏర్పాటు ద్వారా ముఖ్యంగా అధికార పార్టీ ప్రభుత్వంలో కదలిక రావడమే కాదు. అనేక మార్పులతో కూడినటువంటి ప్రజల కోణంలో తెలంగాణ ఆకాంక్షలను సాధించే క్రమంలో పరిపాలన చేయడంతో పాటు ఇటీవల వచ్చినటువంటి భూదందాలు ,ఆక్రమణలు, నిర్బంధం జర్నలిస్టులపై అనుచితవైఖరి వంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలు అయినటువంటి కాంగ్రెస్, బిజెపి, సిపిఐ సిపిఎం మిగతా చిన్న పెద్ద పార్టీల యొక్క అభిప్రాయాలను నిరంతరము గౌరవిస్తూ ఉన్నతమైన టువంటి విధంగా పరిపాలన కొనసాగించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇంటి పోరు తో పాటు బయట పోరు ఈ ప్రభుత్వానికి తప్పదు సుమా!
ఇక రాజశేఖర్రెడ్డి విధానాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగిస్తామని షర్మిల తన విధానాన్ని ప్రకటించడం సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం ఉంది. నక్సలైట్ల సమస్య పైన చర్చలు జరిపి ఆ తర్వాత చిన్న పెద్ద నాయకులను హత్య చేయించి ప్రజా ఉద్యమాలను నాశనం చేసిన చరిత్ర రాజశేఖర్రెడ్డిది. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసి విద్యా, వైద్య రంగాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించే బదులు రియంబర్స్మెంట్ పేరుతో ప్రైవేటు సంస్థలను పెంచి పోషించిన టువంటి స్వార్థపరుడు గా కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వారి యొక్క ఆకాంక్షలను షర్మిల పార్టీ విధానంగా ప్రకటించడం మరొక్క మారు తెలంగాణ రాష్ట్రాన్ని బానిస రాష్ట్రంగా మార్చడమే అవుతుంది.
అయినా మన ఇంటి సమస్యలు మనం పరిష్కరించుకునే సత్తా మనకుంది.
బుద్ధి జీవులు, మేధావులు ,కవులు, కళాకారులు, రచయితలు ,ప్రొఫెసర్లు, పౌరహక్కుల నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలు, అఖిల పక్షాలు అన్నీ కలిసి ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయడం ద్వారా ఒకవైపు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రభుత్వ పాలనా విధానాన్ని సరైన దారిలో పెట్టడానికి కొత్త సంస్కరణ వాదాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉంది. తద్వారా సమాజంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాలకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సరైనటువంటి ప్రాతినిధ్యం వహించే విధంగా
సంస్కరణలు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తీసుకుని రాకుంటే ప్రత్యామ్నాయ దిశగా ప్రజలు ఆలోచిస్తారు. అలాంటి ప్రమాద ఘంటికలు మ్రోగక ముందే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ప్రజల గురించి ఆలోచించాలి.
ప్రధానంగా అధికారపార్టీ ప్రతిపక్షాలకు చెందిన టువంటి రాజకీయ నాయకులు శాసన సభ్యులు మంత్రులు అందరిపైనా వచ్చినటువంటి అవినీతి ఆరోపణలపై సమగ్రమైన న్యాయ విచారణ నడిపించడానికి ముఖ్యమంత్రి గారు పూనుకొని ఆదేశించాలి. గవర్నర్ గారు ఈ ఆరోపణల పైన జరిగే విచారణకు నాయకత్వం వహించవలసిన దిగా ప్రజలు కోరుకుంటున్నారు. అప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుతాయి. రాష్ట్ర ఆవిర్భావము నాడు ఆశించిన లక్ష్యాలు ఆకాంక్షలు నిజమౌతాయి. షర్మిల వంటి ఇతర రాష్ట్రాల పార్టీలు ఈ రాష్ట్రం లోకి ప్రవేశించడానికి ధైర్యం కూడా చేయవు. ఆ పరిస్థితుల కోసం ప్రజలందరూ కూడా చైతన్యంతో ఐక్యమై ప్రభుత్వాల పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయులు ఉద్యమ నాయకులు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ)