కోవిడ్-19 కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ జులై 16 నుండి 24వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగాన్ని టిటిడి తలపెట్టింది. ఇందుకోసం జులై 15న అంకురార్పణ నిర్వహిస్తారు.
ఈ 9 రోజుల పాటు ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో ఉదయం, సాయంత్రం వేళల్లో అర్చనలు, లఘుపూర్ణాహుతి నిర్వహిస్తారు.
చివరిరోజు జులై 24న ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు మహాప్రాయశ్చిత్త హోమం, ఉదయం 11 నుండి 11.30 గంటల వరకు మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు.
రోజుకు 400 కిలోల పుష్పాలతో అర్చన
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో 400 కిలోల పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తారు. ఇందులో ఒక్కపూటకు 40 కిలోల కనకాంబరాలు, 120 కిలోల మల్లెపూలు, 40 కిలోల ఇతర పుష్పాలు ఉంటాయి.
మొత్తం 158 మంది ఋత్వికులు పాల్గొంటారు. టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో ఈ మహాయాగం జరుగనుంది.