విశాఖ ఉక్కు “బచావో” బిజెపి “హటావో” నినాదంతో ఉద్యమిస్తాం!
1) “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అన్న నినాదంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించడం దుర్మార్గమని కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులునవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఏర్పాటు చేసి తిరుపతిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం 32 మంది బలిదానాలతో,సుమారు 33 వేల ఎకరాలలో,30 వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ లక్షలాది కుటుంబాలు విశాఖ ఉక్కు కర్మాగారం పై ఆధారపడి జీవిస్తున్నారు, ఇలాంటి కర్మగారాన్ని భంగపరిచే చర్యను తాము తిరుపతి నుంచి వ్యతిరేకిస్తామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత బిజేపి ప్రభుత్వం ఏపీ కి ప్రత్యేక హోదా,కొత్త పరిశ్రమలు ఇవ్వకపోగా 1971 లో కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ పునాది రాయి వేసి ప్రారంభించిన విశాఖ ఉక్కు పరిశ్రమను “తూకం” వేసి అమ్మే కుట్రను ఢిల్లీలోని రాష్ట్ర ఎంపీలు, రాజ్యసభ సభ్యులు బీజేపీని ప్రశ్నించకపోవడంపట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ పార్లమెంటు, రాజ్యసభ సభ్యులు సొంత వ్యాపారాలపై చూపే శ్రద్ధ విశాఖ ఉక్కు అమ్మకం ప్రక్రియ నిలపడంలో ఎందుకు చూపడం లేదని ఆయన విమర్శించారు.
ఆంధ్రా ఢిల్లీ ఎంపీ లకు “ఆంధ్రుల ఆర్తనాదాలు,కార్మికుల నినాదాలు” వినపడటం లేదా? అని ప్రశ్నించారు.
బీజేపీ వైఖరికి నిరసనగా ఏపీ లోని పార్లమెంటు సభ్యులంతా పార్టీలకు అతీతంగా ప్రధాని ఇంటిముందు శాంతియుత మౌన దీక్ష చేయాలి, అవసరమైతే విశాఖ ఉక్కు కోసం మీ పదవులకు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని బిజెపి నాయకులవి ఉత్తర కుమారుని ప్రగల్భాలు అని చెబుతూ కేంద్ర పదవుల కోసం గుంట నక్కళ్ళా కాచుకుని ఉన్నారని ఆయన అన్నారు.
బిజెపి అనాలోచిత నిర్ణయం ఉపసంహరించుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి పై ఒత్తిడి తీసుకురావాలని నవీన్ డిమాండ్ చేశారు.