ఒలింపిక్ చోద్యాలు: జాతి కోసం పరిగెత్తిన ‘జెస్సీ’

టోక్యో 2020 బాటలో…

 



 

తన జాతి వారి కోసం పరిగెత్తిన క్రీడాకారుడు, గొప్ప మనసున్న మనిషి జెస్సీ ఓవెన్స్.

1936 బెర్లిన్ ఒలింపిక్స్ లో అధ్భుతమైన విజయం తర్వాత “నాకు పరిగెత్తటం అంటే ఇష్టం.” అని రేడియో సందేశం పంపిన నల్లజాతి క్రీడా వజ్రం జెస్సీ ఓవెన్స్. అమెరికన్ నీగ్రోల దయనీయ పరిస్థితి కి కుంగిపోకుండా, తెల్లవారి పట్ల ద్వేషాన్ని పెంచుకోకుండా, జాతి వివక్షత, అనారోగ్యం, పేదరికం వంటి ఎన్నో కష్టాలను అధిగమించి క్రీడారంగంలో అత్యున్నత శిఖరాలను చేరిన జెస్సీ ఓవెన్స్ జీవితం ఎందరికో స్ఫూర్తి.
1936 బెర్లిన్ ఒలింపిక్స్ ని   “ఆర్య జాతి సూపిరియారిటీ ని చాటుకునేందుకు వాడుకోవాలనుకున్న హిట్లర్ జాత్యహంకారాన్ని ” తుత్తునియలు చేశాడు.

అంత వరకు ఎవరూ సాధించని ఒక అధ్భుతాన్ని సాధించి రికార్డు సృష్టించాడు. 100 మీటర్స్, 200 మీటర్స్, లాంగ్ జంప్, 4×100 మీటర్స్ రిలే విభాగాల్లో ఏకంగా 4 బంగారు పతకాలు సాధించి కీర్తి పతాకాన్ని ఎగరేశాడు. బెర్లిన్ ఒలింపిక్స్ లో  ఆయన రిలే టీమ్ 4X100 రిలేని 39.8 సెకండల్లో పూర్తి చేసి ఒక కొత్త రికార్డు సృష్టించింది. దానిని  మరొక 20 సంవత్సరాలు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.

(1984 లాస్ ఏంజలెస్ ఒలింపిక్స్ లో కార్ల్ లూయీస్ నాలుగు విభాగాల్లో బంగారు పతకాలు సాధించాడు. అంతవరకూ జెస్సీ రికార్డును ఎవరు చేరుకోలేకపోయారు)

జెస్సి జీవితం ఎన్నో కష్టాల సమాహారం. దానికి తోడు పేదరికం, శారీరక దౌర్బల్యం, అనారోగ్యం. బ్రాంకైటిస్, న్యుమోనియా అతన్ని వెంటాడాయి.
అలాంటి వ్యాధులను, కష్టాలను అధిగమించి ఉన్నత శిఖరాలకు చేరగలిగాడు అంటే, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడమే కారణం. పైగా నల్ల వారు కూడా ప్రతిభావంతులే అని ప్రపంచానికి తెలియజేయాలన్న లక్ష్యం కూడా అతన్ని విజయతీరాలకు చేర్చింది. “సగం అవకాశమిచ్చిన అద్భుతాలు చేయగల శక్తి, పట్టుదల నల్ల వారికి ఉన్నాయి” అని తరచూ చెప్పే జెస్సీ క్రీడలు అనే కాకుండా, జీవితంలోనూ ఎందరికో స్పూర్తినిచ్చేలా ఉండడం విశేషం.

ఎంత సాధించిన అతని జీవితంలో మార్పు ఏమీ లేదు. అతని మాటల్లోనే చెప్పాలంటే ” బెర్లిన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాకు మార్పేమీ కనిపించలేదు. ఇప్పటికీ బస్సులో వెనక సీట్లోనే కూర్చుంటున్నాను. నాకైతే హిట్లర్ జర్మనీ కి, అమెరికాకి  పెద్దగా తేడా కనిపించడంలేదు,” అని ఆయన ఆవేదన చెందాడు.

1984 లో జెస్సీ ఓవెన్స్ టెలివిజన్ బయోపిక్ “The Jesse Owens Story” తీయడం జరిగింది. దీనికి Emmy అవార్డ్ కూడా వచ్చింది. ఇది మన దూరదర్శన్లో కూడా ప్రసారమైంది.

ఒలింపిక్స్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ క్రీడాకారుల్లో కచ్చితంగా జెస్సీ ఓవెన్స్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది.

(సలీమ్ బాషా,  స్పోర్ట్స్ జర్నలిస్టు, హోమియో వైద్యుడు, 93937 37937)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *