త్వరలో హుజూరాబాద్ లో కెసిఆర్ బహిరంగ సభ

హుజూరాబాద్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా పర్యవేక్షించాలనుకుంటున్నట్లు తెలిసింది. రెండు పరిణామాలు దీనికి కారణంటున్నారు.

ఒకటి: అక్కడ బిజెపి నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి బాగా రాజకీయానుభవం ఉండి, ధన,జనబలం రెండు సమానంగా ఉన్న ఈటెల రాజేందర్. ఆయన మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు.  మాటల తూటాలు పేల్చడంలో  కెసిఆర్ కు ధీటైన నాయకుడు.  పార్టీలో ఉన్నపుడే   తిరుగుబాటు భాష వాడి రెబెల్ అనిపించుకున్నవాడు.  ఇలాంటి వ్యక్తి పొరపాటున గెలిస్తే,  పార్టీలో  కనిపించకుండా ఉన్న రెబెల్స్ కు ధైర్యం వస్తుంది. అందువల్ల ఈటెల తరహా రెబెలియన్  అనేది ఏ మాత్రం తలెత్తకుండా నరికేయాలి. దీనికి ఈటెల రాజేందర్ ను ఘోరంగా ఓడించాలి.

రెండు: రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు కావడం. రేవంత్ కి యూత్ లో ఫాలోయింగ్ ఉంది. ఎవరెన్ని మాటలు చెప్పినా జనంలో రేవంత్ కు యాక్సెప్ట బిలిటీ ఉంది. క్రేజ్ ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో  ముఖ్యమంత్రి కెసిఆర్ మీద,  ఆయన వారుసుడు, మంత్రి  కెటిఆర్ మీద ఏ మాత్రం సాఫ్ట్ కార్నర్ లేని కాంగ్రెస్ నేత రేవంతే.   ఈ ఎన్నికలో గెలవడం కెసిఆర్ కంటే, రేవంత్ కు చాలా ముఖ్యం. కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోయినా, రెండో స్థానంలోనైనా నిలబడితేనే రేవంత్ కు పార్టీలో నైతిక మద్దతు లభిస్తుంది. ఆయన పిసిసి నాయకత్వం సజావుగా సాగుతుంది.

అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి  మూడో స్థానంలో పడిపోతే, రేవంత్ కు ముందున్నదంతా ముళ్ల బాటే ఉవుతుంది. పిసిసిలోనే కాదు, అధిష్టానం దగ్గిర కూడా ఆయన పొజిషన్ వీక్ అవుతుంది.  బయటి పార్టీ నుంచి వచ్చిన రేవంత్ కు  టికెట్ ఇవ్వడమేమిటని ఇప్పటికే సీనియర్లు గుర్రు మంటున్నారు. అయితే, టిఆర్ ఎస్ లోకి గాని, బిజెపికిలోకి వెళ్ల లేని పరిస్థితి . ఫలితంగా  ప్రస్తుతానికి రేవంత్ నాయకత్వాన్ని అంగీకరిస్తారు. దాడి చేసేందుకు అదనుకోసం  ఎదురు చూస్తారు.  వీళ్ల కోసమేనా అన్నట్లు హుజూరాబాద్ ఎన్నిక వస్తుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రేవంత్ ఎఫెక్ట్ కనిపించక పోతే రేవంత్ కు నష్టం. కనిపిస్తే, టిఆర్ ఎస్ కు ఇక కునుకు కరువుతుంది.  అందువల్ల రేవంత్  తెలంగాణ రాజకీయాల్లో చెలరేగకుండా ఉండాలంటే హుజురాబాద్ లోనే అడ్డుకట్ట వేయాలి.

ఈ ద్విముఖ వ్యూహంతో హుజూరాబాద్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించాలనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆయన  తొందర్లో నియోజవర్గం వెళ్లి ఒక భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపింది.

నాగార్జున సాగర్ లో కూడా ఆయన ఇలా గే చేశారు.ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు ముందు ఒక సారి,  పోలింగ్ కు ముందు రెండో సారి వెళ్లి బహిరంగ సభలో మాట్లాడారు. ఇది బాగా పనిచేసింది. కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నాయకుడు జానారెడ్డి ఓడిపోవలసి వచ్చింది.

పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జూలై నెలలోనే ఆయన  హజూరాబాద్ లో ఒక  బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *