చైనా కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవం సందర్భంగా అధ్యక్షుడు చీ జిన్ పింగ్ ప్రసంగం పూర్తి పాఠం
( తెలుగు సేత :డాక్టర్ యస్. జతిన్ కుమార్)
[చైనా కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించిన 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చైనా అధ్యక్షుడు చీజిన్ పింగ్ 2021 జూలై 1న బీజింగ్ లోని తియానన్మెన్ స్క్వేర్ లో ప్రసంగించారు. క్సిన్హువా న్యూస్ ఏజెన్సీ ద్వారా సిసిపి అందించిన పూర్తి ప్రసంగం యొక్క అధికారిక ఆంగ్ల భాషా అనువాదం ఆధారంగా తెలుగు సేత ]
“కామ్రేడ్స్ మరియు స్నేహితులారా !
ఈ రోజు, జూలై మొదటి తేదీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిపిసి), చైనా దేశమూ, రెండింటి చరిత్రలో ఒక ఘనమైన విశిష్టమైన రోజు. పార్టీ సభ్యులు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాచీన,ప్రాదేశిక తెగల [ఎథినిక్ ]సమూహాల ప్రజలు,ఇతర చైనా ప్రజలు కలిసి, పార్టీ శతాబ్దిని జరుపుకోవడానికి మనం ఇక్కడ సమావేశ మయ్యాము. 100 సంవత్సరాలకు పైగా సాగించిన అద్భుతమైన పోరాటాల ప్రయాణాన్నిఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, చైనా దేశపు పునరుజ్జీవం కోసం గల ఉజ్వల అవకాశాలను వీక్షించగలం
మొట్టమొదట,నేను సిపిసి సెంట్రల్ కమిటీ తరఫున పార్టీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
అన్ని విధాలుగా ఒక మాదిరి సంపన్న సమాజాన్ని నిర్మించాలనే మన మొదటి శతాబ్ది లక్ష్యాన్ని, మొత్తం పార్టీ మరియు మొత్తం దేశం యొక్క నిరంతర ప్రయత్నాల ద్వారా సాధించామని, పార్టీ మరియు ప్రజల తరఫున ఈ ప్రత్యేక సందర్భంలో, ప్రకటించడం నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. అంటే చైనాలో సంపూర్ణ పేదరికం సమస్యకు మనం ఒక చారిత్రాత్మక ముగింపు తీసుకువచ్చాం. చైనాను అన్ని విధాలుగా గొప్ప ఆధునిక సోషలిస్టు దేశంగా నిర్మించాలనే రెండవ శతాబ్ది లక్ష్యం దిశగా మనం ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్నాం. ఇది చైనా దేశానికి, చైనా ప్రజలకు, చైనా కమ్యూనిస్టు పార్టీకి ఘనమైన,అద్భుతమైన విజయం!
కామ్రేడ్స్, స్నేహితులారా!
చైనా ఒక గొప్ప దేశం.5,000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన చైనా, మానవ నాగరికత పురోగతికి చెరగని సహకారం అందించింది. అయితే 1840 నాటి నల్ల మందు యుద్ధం తరువాత చైనా క్రమంగా- పాక్షిక వలసవాద, పాక్షిక భూస్వామ్య సమాజం గా దిగజారిపోయింది. మునుపెన్నడూ లేనంతగా వినాశనాన్ని ఎదుర్కొంది. దేశం తీవ్రమైన అవమానాన్ని భరించింది, ప్రజలు చాలా బాధలకు గురయ్యారు, చైనా నాగరికత అంధకారం లో మునిగి పోయింది. అప్పటి నుండి, జాతీయ పునరుజ్జీవనం సాధించటం చైనా దేశమూ, ప్రజలూ కంటున్నగొప్పకల.
దేశాన్ని ప్రమాదం నుండి కాపాడటానికి, చైనా ప్రజలు సాహసోపేతమైన పోరాటాన్ని చేశారు. ఉదాత్త మైన దేశభక్తులు దేశాన్నినిలిపి వుంచడానికి ప్రయత్నించడంతో, తైపింగ్ హెవెన్లీ కింగ్డమ్ ఉద్యమం, 1898 సంస్కరణో ద్యమం, యిహెటువాన్ ఉద్యమం, 1911 విప్లవం, ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. జాతీయ మనుగడను నిలబెట్ట టానికి వివిధ ప్రణాళికలు రూపొందించబడ్డాయి, కాని ఇవన్నీ విఫలమయ్యాయి. దేశాన్నికాపాడే ఉద్యమానికి నాయకత్వం వహించడానికి, విప్లవ శక్తులను ఒక నూతన సంస్థ చుట్టూ సమీకరించడానికి, చైనాకు అత్యవసరంగా కొత్త ఆలోచనలు అవసరమయ్యాయి.
1917 లో రష్యా అక్టోబర్ విప్లవం యొక్క విజయాలతో, మార్క్సిజం-లెనినిజం చైనాకు వచ్చింది . ఆ తర్వాత 1921లో చైనా ప్రజలు, చైనా దేశం గొప్ప మేల్కొలుపుకు లోనవుతుండగా, మార్క్సిజం-లెనినిజం చైనా కార్మికుల ఉద్యమంతో సన్నిహితంగా సమ్మిళితం చేయటంతో , చైనా కమ్యూనిస్టు పార్టీ పుట్టింది. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన ఒక నూతన యుగాన్ని సృష్టించే సంఘటన, ఇది ఆధునిక చైనా చరిత్ర గతిని తీవ్రంగా మార్చింది. చైనా ప్రజల, దేశం యొక్క భవిష్యత్తును మార్చింది. ప్రపంచ అభివృద్ధి దృశ్యాన్నే మార్చివేసింది.
స్థాపించిన రోజు నుండి, చైనా ప్రజలకు సంతోషాన్ని, దేశానికి పునరుజ్జీవాన్ని సాధించడమే పార్టీకున్న ఆకాంక్ష, ఆశయం. గత వందేళ్లుగా పార్టీ ఐక్యంగా, చైనా ప్రజలకు నాయకత్వం వహించి చేసిన పోరాటం, త్యాగం, సృష్టి అన్నీ చైనాకు గొప్ప పునరుజ్జీవాన్ని తీసుకువచ్చే ఒక అంతిమ లక్ష్యంతో ముడిపడి ఉన్నాయి.
జాతీయ పునరుజ్జీవాన్ని సాకారం చేసుకోవడానికి, పార్టీ చైనా ప్రజలను ఐక్యం చేసి, నడిపించి దేనికీ లొంగని సంకల్పబలంతో నెత్తుటి పోరాటాలు చేసింది. నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేసింది.
ఉత్తర యాత్ర [నార్తర్న్ ఎక్స్పెడిషన్], వ్యవసాయ విప్లవ యుద్ధం [ అగ్రేరియన్ రివల్యూషనరీ వార్], జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రతిఘటన యుద్ధం, విముక్తి యుద్ధం ద్వారా, మేము సాయుధ ‘ప్రతి-విప్లవాన్ని’ సాయుధ విప్లవంతో పోరాడాము. సామ్రాజ్యవాదం, ఫ్యూడలిజం మరియు బ్యూరోక్రాట్-పెట్టుబడిదారీ విధానం అనే మూడు పర్వతాలను పడగొట్టాము.”పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా“ను స్థాపించాము.ఇది ప్రజలను దేశానికి యాజమానులను చేసింది. ఆ విధంగా మేము మా దేశ స్వాతంత్ర్యాన్ని పొందాము. మా ప్రజలను విముక్తి చేశాము.
నూతన ప్రజాస్వామ్య విప్లవ విజయం చైనాలోని అర్ధ వలస, అర్ధ భూస్వామ్య సమాజ చరిత్రకు ముగింపు పలికింది. పాత చైనాలో ఉన్న అనైక్యతకి, విదేశీ శక్తులు దేశంపై విధించిన అన్ని అసమాన ఒప్పందాలకు, చైనాలో సామ్రాజ్యవాద శక్తులు అనుభవించిన అన్ని ప్రత్యేక సౌకర్యాలకు, హక్కులకు ముగింపు పలికింది. ఇది జాతీయ పునరుజ్జీవాన్ని సాధించడానికి కావలసిన ప్రాథమిక సామాజిక పరిస్థితులను సృష్టించింది.
దృఢమైన పోరాటం ద్వారా, పార్టీ మరియు చైనా ప్రజలు లేచి నిలబడ్డారని, చైనా దేశం ఇతరుల బెదిరింపులకు, వారి దుర్వినియోగానికి గురయ్యే సమయం శాశ్వతంగా అంతరించి పోయిందని ప్రపంచానికి చూపించారు.
జాతీయ పునరుజ్జీవాన్ని సాకారం చేసుకోవడానికి, పార్టీ ఐక్యమై, సోషలిస్ట్ విప్లవం, నిర్మాణంలో గొప్ప విజయాన్ని సాధించడం ద్వారా, స్వావలంబన స్ఫూర్తితో, బలమైన చైనాను నిర్మించడానికి చైనా ప్రజలను నడిపించింది.
సోషలిస్టు విప్లవాన్ని చేపట్టడం ద్వారా, వేలాది సంవత్సరాలుగా చైనాలో కొనసాగుతున్న దోపిడీ మరియు అణచివేతల భూస్వామ్య వ్యవస్థను తొలగించాము. సోషలిజాన్ని ప్రాథమిక వ్యవస్థగా స్థాపించాము. సోషలిస్టు నిర్మాణ ప్రక్రియలో, సామ్రాజ్యవాద, ఆధిపత్య శక్తులు చేసిన విచిన్నాన్ని, విధ్వంసాన్ని,కూలదోసె కుట్రలనీ, వారు సాయుధంగా రెచ్చగొట్టడాలని అధిగమించి, చైనా దేశ చరిత్రలో అత్యంత విస్తృతమైన, లోతైన సామాజిక మార్పులను తీసుకువచ్చాం. తూర్పుదేశాలలో పెద్ద సంఖ్యలో జనాభా కలిగిన, ఒకపేద, వెనుకబడిన దేశం గా వున్న స్థాయినుంచి సోషలిస్టు దేశంగా చైనా మారింది. ఈ మహత్తర మార్పులు, జాతీయ పునరుజ్జీవాన్ని సాకారం చేయడానికి అవసరమైన ప్రాథమిక రాజకీయ పరిస్థితులను, సంస్థాగత పునాదులను నిర్దేశించాయి .
దృఢమైన పోరాటం ద్వారా, పార్టీ మరియు చైనా ప్రజలు పాత ప్రపంచాన్ని నిర్మూలించడమే కాదు , కొత్త ప్రపంచాన్ని నిర్మించగలరని, సోషలిజం మాత్రమే చైనాను కాపాడగలదని, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం మాత్రమే చైనాను అభివృద్ధి చేయగలదని ప్రపంచానికి చూపించారు.
జాతీయ పునరుజ్జీవాన్ని సాకారం చేసుకోవడానికి, పార్టీ ఐక్యమై, చైనా ప్రజలను, వారి మనస్సును విముక్తం చేసి ముందుకు సాగడానికి, సంస్కరణలలో గొప్ప విజయాన్ని సాధించడానికి, ఓపెన్[ open up] విధానాలు అవలంబించ డానికి, సోషలిస్టు ఆధునికీకరణ సాధించటానికి నాయకత్వం వహించింది.
సోషలిజం యొక్క ప్రాథమిక దశకు పార్టీ యొక్క ప్రాథమిక మార్గాన్ని నిర్ధారించాము. దృఢ నిశ్చయంతో సంస్కరణలను అభివృద్ధి చేశాము. బాహ్య ప్రపంచానికి మా వాకిలి తెరచి వుంచాము. ప్రతి దిశ నుండి వచ్చిన ప్రమాదాలు మరియు సవాళ్లను అధిగమించాము, చైనా లక్షణాలతో సోషలిజాన్ని స్థాపించాము. దాన్ని సమర్థించాము, రక్షించాము, అభివృద్ధి చేశాము. తద్వారా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించబడి నప్పటి నుండి పార్టీ చరిత్రలో సుదూర ప్రాముఖ్యతగల ఒక ప్రధాన మలుపు వచ్చింది. అతిగా కేంద్రీకృత మైన ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థ నుండి శక్తి వంతమైన సోషలిస్టు మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు; ఎక్కువగా వేర్పాటుగా వుంచబడిన దేశం నుండి, బాహ్య ప్రపంచానికి తెరిచి ఉన్న దేశంగా మార్పు చెందటానికి దోహదపడింది. సాపేక్షంగా వెనుకబడిన ఉత్పాదక శక్తులు ఉన్న దేశం నుండి ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చారిత్రాత్మక ముందంజను సాధించడానికి ; తన ప్రజల జీవన ప్రమాణాలను కేవలం కనీస జీవనాధారం అన్న స్థాయి నుండి, మొత్తం సమాజాన్ని ఒక సాధారణ శ్రేయస్సుగల స్థాయికి పెంచడం, ఆపైన అన్ని అంశాలలోనూ ఒక మాదిరి సంపన్నత కు చేరుకునే చారిత్రాత్మక పరివర్తన చేయడానికి ఇది చైనాకు వీలు కల్పించింది. ఈ విజయాలు కొత్త శక్తితో నిండిన వ్యవస్థాగత పునాదులు ఏర్పరచడం ద్వారా, వేగవంతమైన అభివృద్ధికి భౌతిక పరిస్థితులను కల్పించడం ద్వారా జాతీయ పునరుజ్జీవ పురోగమనానికి ఇంధనం సమకూర్చాయి.
దృఢమైన పోరాటస్పూర్తితో పార్టీ మరియు చైనా ప్రజలు సంస్కరణను కొనసాగించడం, బాహ్య ప్రపంచానికి దేశాన్ని తెరచి వుంచడం, చైనాను అభివృద్ధి చేయడంలో కీలకమైన చర్యలు అని ప్రపంచానికి చూపించారు, చైనా తన పెద్ద పెద్ద అంగలతో కాలగతిని అందుకుని దూసుకు వెళుతోంది.
జాతీయ పునరుజ్జీవనాన్ని సాకారం చేసుకోవడానికి, పార్టీ చైనా ప్రజలను ఐక్య పరచి ఒక గొప్ప పోరాటాన్ని, గొప్ప ప్రణాళికని, గొప్ప గమ్యాన్ని అందుకోవడానికి, ‘ఆత్మవిశ్వాసం-స్వావలంబన-నూతన ఆవిష్కరణ’ల స్ఫూర్తి ద్వారా ‘కొత్త యుగంలో చైనా లక్షణాలతోకూడిన కొత్త శకపు సోషలిజం“ విజయవంతం కావడానికి నాయకత్వం వహిస్తోంది.
పార్టీ 18వ జాతీయ కాంగ్రెస్ తరువాత, చైనా లక్షణాలతోకూడిన సోషలిజం ఒక కొత్త శకంలోకి ప్రవేశించింది. ఈ కొత్త యుగంలో, మనము పార్టీ యొక్క మొత్తం నాయకత్వాన్ని సమర్థించాము మరియు బలోపేతం చేసాము, ఐదు రంగాల సమీకృత ప్రణాళిక మరియు నాలుగు ముఖాల సమగ్ర వ్యూహాన్ని సమన్వయంగా అమలు చేసేలా నిర్ధారించాము, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం వ్యవస్థను సమర్థించాము, మెరుగు పరిచాము, చైనా వ్యవస్థను మరియు పాలనా సామర్థ్యాన్ని ఆధునీకరించాము, పార్టీ నిర్వహణ లో నియమబద్ధ పాలనను ఉపయోగించడానికి కట్టుబడి ఉన్నాము’ పార్టీ లోపలి నిబంధనల అమలుకు బలమైన వ్యవస్థను అభివృద్ధి చేసాము. మనము అనేక ప్రమాదాలు చిక్కు ముళ్ళు అధిగమించాము, మొదటి[పార్టీ ఆవిర్భావ] శతాబ్ది లక్ష్యాన్ని నెరవేర్చాము. రెండవ [ప్రజ రిపబ్లిక్ ఆవిర్భావ ] శతాబ్ది లక్ష్యాన్ని సాధించడానికి వ్యూహాత్మక చర్యలను నిర్దేశించాము. పార్టీ మరియు దేశం యొక్క లక్ష్యంలో అన్ని చారిత్రాత్మక విజయాలు, మార్పులు, మరింత బలమైన సంస్థలు, బలమైన భౌతిక పునాదులు గొప్ప చొరవ తీసుకోవడానికి ప్రేరణ గా నిలుస్తున్నాయి.
దృఢమైన పోరాటం ద్వారా, చైనా దేశం నిలబడటం మరియు సంపన్నంగా ఎదగడం, బలీయమైన శక్తిగా మారడం వరకు అద్భుతమైన పరివర్తనను సాధించిందని, చైనా జాతీయ పునరుజ్జీవం చారిత్రక అనివార్యతగా మారిందని పార్టీ మరియు చైనా ప్రజలు ప్రపంచానికి చూపించారు.
గత వందేళ్లుగా, పార్టీ చైనాదేశం యొక్క వేవేల సంవత్సరాల చరిత్రలో అత్యంత అద్భుతమైన అధ్యాయాన్ని వ్రాయడంలో చైనా ప్రజలను ఏకం చేసింది మరియు నడిపించింది, మావో జెడాంగ్ “అమరవీరుల త్యాగం తలచుకొని మన గుండెలు మరింత సుదృఢంగా మారతాయి, సూర్యుడు, చంద్రుడు కొత్త ఆకాశంలో ప్రకాశించేలా చేయడానికి తెగించి పోరాడుతాయి ” అని రాసినప్పుడు వ్యక్తీకరించిన నిర్భయస్ఫూర్తిని పార్టీ విస్తృతం చేస్తోంది . మనము మార్గదర్శకం చేసిన గొప్ప మార్గం, మనము చేపట్టిన గొప్ప లక్ష్యం, గత శతాబ్దంలో మనము సాధించిన గొప్ప విజయాలు చైనా దేశం మరియు మానవ నాగరికత అభివృద్ధి చరిత్రలో ప్రముఖ స్థానం పొందుతాయి
కామ్రేడ్స్ మరియు స్నేహితులారా!
వంద సంవత్సరాల క్రితం, చైనాలో కమ్యూనిజం యొక్క మార్గదర్శకులు చైనా కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. పార్టీ యొక్క గొప్ప వ్యవస్థాపక స్ఫూర్తిని అభివృద్ధి చేశారు, ఇది ఈ క్రింది సూత్రాలను కలిగి ఉంది: సత్యాన్ని మరియు ఆదర్శాలను నిలబెట్టడం, మన అసలు ఆకాంక్ష మరియు వ్యవస్థాపక లక్ష్యానికి కట్టుబడి ఉండటం, త్యాగశీలంతో, భయం లేకుండా ధైర్యంగా పోరాడటం, పార్టీకి విధేయంగ, ప్రజలకు నమ్మకమైన వారిగా ఉండటం. ఈ స్ఫూర్తి పార్టీ బలానికి మూలం.
గత వందేళ్లుగా పార్టీ ఈ గొప్ప వ్యవస్థాపక స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్ళింది. దాని దీర్ఘకాలిక పోరాటాల ద్వారా, ఇది చైనా కమ్యూనిస్టులకు స్ఫూర్తిదాయక సూత్రాల పరంపరను అభివృద్ధి చేసింది. ఒక విలక్షణమైన రాజకీయ స్వభావాన్ని కలిగించింది. చరిత్ర ముందుకు సాగడంతో, పార్టీ స్ఫూర్తి తరతరాలకూ సంక్రమించింది. మనము ఆ అద్భుతమైన సంప్రదాయాలను ప్రోత్సహిస్తాము. మా విప్లవాత్మక వారసత్వాన్ని కొనసాగిస్తాము. తద్వారా పార్టీ యొక్క గొప్ప వ్యవస్థాపక స్ఫూర్తి ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుతాము మరియు ముందుకు తీసుకు వెళతాము .
కామ్రేడ్స్ మరియు స్నేహితులారా!
గత వందేళ్లలో మనము సాధించినదంతా, చైనా కమ్యూనిస్టులు, చైనా ప్రజలు, చైనా దేశం యొక్క సంఘటిత ప్రయత్నాల వల్లనే సాధ్యమయ్యింది. అందుకు మేము వారికి ఎంతో ఋణపడివున్నాము. కామ్రేడ్లు మావో జెడాంగ్, డెంగ్ జియావోపింగ్, జియాంగ్ జెమిన్, మరియు హు జింటావోలు తమప్రధాన ప్రతినిధులుగా చైనా కమ్యూనిస్టులు, తమ దేశం పునరుజ్జీవం పొందడానికి అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన సహకారం అందించారు. వారిపట్ల మేము మా అత్యున్నత గౌరవాన్ని వ్యక్తం చేస్తాము.
చైనా విప్లవం, నిర్మాణం, సంస్కరణకు, చైనా కమ్యూనిస్టు పార్టీ స్థాపన, ఏకీకరణ, అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన కామ్రేడ్లు మావో జెడాంగ్, జౌ ఎన్లై, లియు షావోకి, జు డే, డెంగ్ జియావోపింగ్, చెన్ యున్, ఇంకా ఇతర అనుభవజ్ఞులైన విప్లవకారుల జ్ఞాపకాలను గౌరవించడానికి ఈ క్షణాన్నివినియోగిద్దాము . పీపుల్స్ రిపబ్లిక్ ను స్థాపించడానికి, రక్షించడానికి మరియు అభివృద్ధి చేయడానికి ధైర్యంగా తమ ప్రాణాలను అర్పించిన విప్లవ అమరవీరుల జ్ఞాపకాలను మనం ఆదరిద్దాము. తమ జీవితాలను సంస్కరణకు, వోపేన్ విధానానికి, సోషలిస్టు ఆధునికీకరణకు అంకితం చేసిన వారి జ్ఞాపకాలను మనం గౌరవించుదాం ; జాతీయ స్వాతంత్ర్యం కోసం, ఆధునిక కాలంలో ప్రజల విముక్తి కోసం గట్టిగా పోరాడిన స్త్రీ పురుషులందరి జ్ఞాపకాలను మనం ఆదరిద్దము. మన మాతృదేశానికి, వారు అందించిన గొప్ప సేవలు చరిత్రపుటలలో అమరంగా నిలిచి పోతాయి.వారి ఉదాత్త స్ఫూర్తి చైనా ప్రజల హృదయాలలో శాశ్వతంగా జీవిస్తుంది.
ప్రజలు నిజమైన హీరోలు, ఎ౦దుక౦టే వారే చరిత్ర సృష్టికర్తలు. సిపిసి కేంద్ర కమిటీ తరఫున, దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు, రైతులు మరియు మేధావులకు నేను అత్యున్నత గౌరవాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఇతర రాజకీయ పార్టీలకు, పార్టీ అనుబంధం లేని ప్రజా ప్రముఖులకు, ప్రజా సంస్థలకు, సమాజంలోని అన్ని రంగాలకు చెందిన దేశ భక్తులకు; పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, పీపుల్స్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, పబ్లిక్ సెక్యూరిటీ పోలీస్, మరియు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సభ్యులందరికీ; సోషలిస్టు శ్రామిక ప్రజలందరికీ; మరియు యునైటెడ్ ఫ్రంట్ సభ్యులందరికీ, హాంగ్ కాంగ్, మకావ్ ప్రత్యేక పరిపాలనా ప్రాంతాలతోపాటు, తైవాన్తోపాటు, విదేశీ చైనీయులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చైనా ప్రజలతో స్నేహంగా మెలిగిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేకులకు , స్నేహితులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను
కామ్రేడ్స్ మరియు స్నేహితులారా!
మన పార్టీ వ్యవస్థాపక ఆశయం నిర్వచించడం సులభమే అయినప్పటికీ, ఈ ఆశయానికి మనం కట్టుబడి ఉండేలా చూడటం మరింత కష్టమైన పని. చరిత్ర ను౦డి నేర్చుకోవడ౦ ద్వారా, అధికారశక్తులు ఎ౦దుకు పెరుగుతాయో, ఎ౦దుకు పడిపోతాయో మన౦ అర్థ౦ చేసుకోవచ్చు. చరిత్ర అనేఅద్దం ద్వారా, మనం ప్రస్తుతం ఎక్కడ నిలబడి వున్నదీ తెలుసుకోవచ్చు, భవిష్యత్తులోకి తొంగి చూచే దార్శినికతను పొందవచ్చు. పార్టీ యొక్క వంద సంవత్సరాల చరిత్రను తిరిగి చూస్తే, గతంలో మేము ఎందుకు విజయవంత మయ్యామో, భవిష్యత్తులో మనం ఎలా విజయాలను కొనసాగించ గలమో చూడవచ్చు. ఇది మన వ్యవస్థాపక లక్ష్యానికి మరింత అంకిత భావంతో కట్టుబడి ఉండటానికి, మన ముందున్న కొత్త ప్రయాణంలో భవిష్యత్తును ఇంకా మెరుగు పరచుకోవటానికి మరింత సంకల్పబలంతో వ్యవహరించేలా చూస్తుంది.
ఉజ్వల భవిష్యత్తును సృష్టించడానికి చరిత్ర నుండి నేర్చుకోవడానికి మనం మనస్ఫూర్తిగా కృషి చేస్తున్నప్పుడు, ఈ క్రింది విషయాలని మనస్సులో పెట్టుకోవాలి:
పార్టీ దృఢమైన నాయకత్వాన్ని మనం సమర్థించాలి. చైనా విజయం పార్టీపై ఆధారపడి ఉంది. చైనా దేశం యొక్క 180 సంవత్సరాలకు పైగా ఆధునిక చరిత్ర, పార్టీ యొక్క 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర, మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క 70 సంవత్సరాలకు పైబడిన చరిత్ర- ఇవన్నీ ఒక విషయాన్ని రుజువు చేస్తున్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా, నవ చైనా గాని, చైనా జాతీయ పునరుజ్జీవం గాని వుండేవి కావు. పార్టీని ప్రజలు ఎంచుకున్నారు. చరిత్ర ఎంచుకున్నది. పార్టీనాయకత్వమనేది చైనా లక్షణాలతో కూడిన సోషలిజం అనే వ్యవస్థ కొక నిర్వచన లక్షణం. ఈ వ్యవస్థ యొక్క గొప్పబల సంపన్నతను అది కలిగి ఉంది. అది పార్టీ మరియు దేశం యొక్క పునాది, ప్రాణాధార రక్తము. చైనా ప్రజలందరి ప్రయోజనాలు, వారి శ్రేయస్సు ఆధారపడిన కీలక అంశం ఇది.
ప్రయాణం ముందుకు సాగడానికి,అన్నీ విషయాలలోనూ పార్టీదే నాయకత్వమని ఎత్తిపట్టాలి.నాయకత్వాన్ని మెరుగు పరచు కోవటం కొనసాగించాలి. లోతైన రాజకీయ స్పృహతో రాజకీయ సమగ్రతను కాపాడుకోవాలి. స్థితిని స్థూలంగాను, విశాలం గాను అర్ధం చేసుకోవాలి. ప్రధాన నాయకత్వాన్ని అనుసరించడం, కేంద్రపార్టీ నాయకత్వ పంథాకి అనుగుణంగా ఉండాల్సిన అవసరం గురించి లోతుగా అర్ధం చేసుకోవాలి. చైనా లక్షణాలతో కూడిన సోషలిజం అనే లక్ష్యం యొక్క మార్గం, సిద్ధాంతం, వ్యవస్థ ,సంస్కృతి పట్ల మనం పూర్తి విశ్వాసం కలిగి వుండాలి. పార్టీ కేంద్ర కమిటీలోనూ, మొత్తం పార్టీలోనూ ప్రధాన కార్యదర్శి, ప్రధాన స్థానాన్ని మనం సమర్థించాలి. కేంద్ర కమిటీ అధికారాన్ని, దాని కేంద్రీకృత, ఏకీకృత నాయకత్వాన్ని నిలబెట్టాలి. దేశం యొక్క అత్యంత ప్రాథమిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పటిష్టమైన, ప్రజాస్వామిక, చట్టఆధారిత పాలనను నిర్వహించడానికి పార్టీ సామర్థ్యాన్ని మెరుగు పరచాలి. సమగ్రమైన నాయకత్వాన్ని అందించడంలో మరియు అన్ని వైపుల నుండీ జరిగే ప్రయత్నాలను సమన్వయపరచడంలో పార్టీ తన ప్రధానపాత్రను పూర్తిగా పోషించేలాచూడాలి.
మెరుగైన జీవితం కోసం నిరంతరాయంగా కృషి చేయడానికి మనం చైనా ప్రజలను ఏకం చేయాలి,వారిని నడిపించాలి. ఈ దేశం అంటే దేశంలోని ప్రజలే. ప్రజలు అంటే దేశమే.దేశం పై మా నాయకత్వాన్ని స్థాపించడానికి, స్థిరీకరించడానికి మేము పోరాడుతున్నాము. అంటే దానర్థం ప్రజల మద్దతును సంపాదించడానికి ,దాన్ని స్థిరంగా నిలబెట్టుకోవడానికి పోరాడుతున్నాము. పార్టీ మూలాలు ప్రజలలోనే వుంటాయి. పార్టీకి ప్రాణాధారమూ, దాని శక్తికి మూలమూ కూడా ప్రజలే. పార్టీ ఎల్లప్పుడూ చైనా ప్రజలందరి ప్రాథమిక ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది;వారి చిన్నా పెద్దా విషయాలన్నింటా వారితో నిలబడుతుంది. వారితో ఉమ్మడిగా విధిని పంచుకుంటుంది. పార్టీకి దాని స్వంత ప్రత్యేక ప్రయోజనాలంటూ ఏమీ లేవు. పార్టీ ఎప్పుడూ, వ్యక్తిగత ప్రయోజనాల పట్ల ఆసక్తి గల వ్యక్తుల సమూహం, అధికార సమూహం లేదా ప్రత్యేక మైన సౌకర్యాలు కోరే తరగతులకు ప్రాతినిధ్యం వహించలేదు.ప్రజల నుండి పార్టీని విడగొట్టటానికి లేదా ప్రజలను పార్టీకి వ్యతిరేకంగా నిలబెట్టటానికి చేసే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుంది. 9.5 కోట్లకు పైగా పార్టీ సభ్యులు గానీ, 140 కోట్లకు మించిన చైనా ప్రజలు గాని అటువంటి పరిణామాలు ఎన్నడూ అనుమతించరు.
రాబోయే ప్రయాణంలో, చరిత్రను సృష్టించడానికి మనం ప్రజలపై సన్నిహితంగా ఆధారపడాలి. ప్రజలకు హృదయపూర్వకంగా సేవ చేసే పార్టీ ప్రాథమిక ఉద్దేశ్యాన్ని సమర్థిస్తూ, మనము ప్రజలతో దృఢంగా నిలబడతాము, పార్టీ యొక్క ప్రజాపంథా ను అమలు చేస్తాము, ప్రజల సృజనాత్మకతను గౌరవిస్తాము. అభివృద్ధి లో ప్రజా కేంద్రిత తత్వాన్ని ఆచరిస్తాము. మనము అన్నీ ప్రక్రియలలో సంపూర్ణంగా ప్రజల ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తాము, సామాజిక నిష్పాక్షికతను, న్యాయాన్ని కాపాడతాము. అభివృద్ధిలో అసమతుల్యతలు మరియు లోపాలను, ప్రజలకు చాలా ఆందోళన కలిగించే అత్యంత తీవ్రమైన ఇబ్బందులు మరియు సమస్యలను పరిష్కరిస్తాము. అలా చేయడం ద్వారా, అందరికీ చక్కటి మానవ అభివృద్ధిని, మరియు ఉమ్మడి సంపన్నతను సాధించే దిశగా మనం మరింతగా గుర్తించదగిన, గణనీయమైన పురోగతిని సాధిస్తాము.
మార్క్సిజాన్ని చైనా సందర్భానికి అనుగుణంగా మార్చుకోవడం కొనసాగించాలి. మార్క్సిజం అనేది మన పార్టీ స్థాపనకీ, దేశ ఆవిర్భావానికి కారణమైన ప్రాథమిక మార్గదర్శక భావజాలం. ఇది మన పార్టీ యొక్క ఆత్మ . ఆ పతాకం క్రిందే మన కృషి సాగుతుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిజం యొక్క ప్రాథమిక సిద్ధాంతాలను, వాస్తవాల నుండి సత్యాన్ని వెలికితీసే సూత్రాన్ని సమర్థిస్తుంది. చైనా లోని వాస్తవాల ఆధారంగా, మనము ఎప్పటికప్పుడు వున్న పోకడలపై నిశితమైన అంతర్దృష్టిని అభివృద్ధి చేస్తాము. చారిత్రక చొరవను అంది పుచ్చుకున్నాము. శ్రమతో కూడిన అన్వేషణలు చేసాము. ఈ విధంగా మనం మార్క్సిజాన్ని చైనా సందర్భానికి, మన కాలపు అవసరాలకు అనుగుణంగా మార్చగలిగాము. మన గొప్ప సామాజిక విప్లవాన్ని ముందుకు తీసుకు వెళ్ళడంలో చైనా ప్రజలకు మార్గనిర్దేశం చేయగలిగాము. ప్రాథమిక స్థాయిలో, మన పార్టీ సామర్థ్యం మరియు చైనా లక్షణాలతో కూడిన సోషలిజం యొక్క బలాలు మార్క్సిజం పనిచేస్తుందనే వాస్తవానికి ఆపాదించదగ్గవి.
రాబోయే ప్రయాణంలో, మనం మార్క్సిజం-లెనినిజం, మావో జెడాంగ్ ఆలోచన, డెంగ్ జియావోపింగ్ సిద్ధాంతం-[ ది థియరీ ఆఫ్ త్రీ రిప్రజెంట్స్ అండ్ సైంటిఫిక్ అవుట్ లుక్ ఆన్ డెవలప్ మెంట్ -మూడు ప్రాతినిధ్యాల సిద్ధాంతం అభివృద్ధి పై శాస్త్రీయదృష్టి ] సమర్థించడం కొనసాగించాలి. కొత్త శకం కోసం చైనీస్ లక్షణాలతో సోషలిజం అన్న ఆలోచనను పూర్తిగా అమలు చేయాలి. మార్క్సిజం యొక్క ప్రాథమిక సిద్ధాంతాలను చైనా యొక్క నిర్దిష్ట వాస్తవాలు మరియు దాని చక్కని సాంప్రదాయ సంస్కృతికి అనుగుణంగా మనం కొనసాగించాలి. మన కాలపు ధోరణులను పరిశీలించడానికి, అర్థం చేసుకోవడానికి , నడిపించడానికి మరియు సమకాలీన చైనా యొక్క మార్క్సిజాన్ని అభివృద్ధి చేయడానికి 21 వ శతాబ్దంలో అభివృద్ధిని సాధించడానికి మనము మార్క్సిజాన్ని ఉపయోగిస్తాము.
చైనా లక్షణాలతో కూడిన సోషలిజాన్ని మనం సమర్థించాలి,అభివృద్ధి చేయాలి. మనం మన స్వంత మార్గాన్ని అనుసరించాలి- ఇది మన పార్టీ యొక్క అన్ని సిద్ధాంతాలు మరియు ఆచారాలకు మద్దతు ఇచ్చే పునాది. అంతకు మించి, గత శతాబ్దంలో మన పార్టీ తన పోరాటాల నుండి తీసుకున్న చారిత్రక ముగింపు ఇది. చైనా లక్షణాలతో కూడిన సోషలిజం అనేది పార్టీ మరియు ప్రజల ప్రాథమిక విజయం, అసంఖ్యాక మైన కష్టాలు మరియు గొప్ప త్యాగాల ద్వారా రూపొందించబడింది, మరియు జాతీయ పునరుజ్జీవనాన్ని సాధించడానికి ఇది మనకు సరైన మార్గం. మనము చైనా లక్షణాలతో కూడిన సోషలిజాన్ని సమర్థించాము మరియు అభివృద్ధి చేసాము.భౌతిక, రాజకీయ, సాంస్కృతిక-నైతిక, సామాజిక మరియు పర్యావరణ రంగాలలో సమన్వయ పురోగతిని నడిపించాము, మనము ఆధునికీకరణకు ఒక కొత్త మరియు ప్రత్యేకమైన చైనా మార్గాన్ని మార్గదర్శకం చేసాము. మానవ పురోగతికి ఒక కొత్త నమూనాను సృష్టించాము.
ముందుకు చేసే ప్రయాణంలో, మనం పార్టీ యొక్క ప్రాథమిక సిద్ధాంతం, లైన్ మరియు విధానానికి కట్టుబడి ఉండాలి .ఐదు రంగాల సమీకృత ప్రణాళిక మరియు నాలుగుముఖాల సమగ్ర వ్యూహాన్ని అమలు చేయాలి. మనం సంస్కరణను మరింత గాఢం చేయాలి మరియు అంతటా తెరవాలి, అభివృద్ధి యొక్క ఈ కొత్త దశలో మన పనిని నేల మీది నుంచి ఆరంభించాలి. కొత్త అభివృద్ధి తత్వాన్ని పూర్తిగా,విశ్వాసంతో అనువర్తింపజేయాలి. అభివృద్ధి యొక్క కొత్త నమూనాను పెంపొందించాలి. మనం ఉన్నత మైన నాణ్యత గల అభివృద్ధిని ప్రోత్సహించాలి. సైన్స్ టెక్నాలజీలో మన దేశ బలాన్ని పెంచుకోవాలి. దేశాన్ని నడుపుతున్నది మన ప్రజలే, చట్టబద్ద పాలన ఆధారంగా పరిపాలన కొనసాగించడం, ప్రధాన సోషలిస్టు విలువలను నిలబెట్టడం మనం చూసుకోవాలి. అభివృద్ధిలో ప్రజల పాత్రను ను మనం నిర్ధారించాలి, పెంపొందించాలి, మానవాళికి, ప్రకృతికి మధ్య సమన్వయం పెంపొందించాలి, మన ప్రజలను సుసంపన్నం చేయడం, మన దేశాన్ని బలమైనదిగా, అందంగా తీర్చిదిద్దే దిశగా సమన్వయంతో కూడిన చర్యలు తీసుకోవాలి.
చైనా దేశం 5,000 సంవత్సరాలకు పైగా చరిత్రలో అద్భుతమైన నాగరికతను పెంపొందించింది. గత వంద సంవత్సరాల పార్టీ కృషిలో, 7౦ సంవత్సరాలకు పైగా పాలనలో పార్టీ అపారమైన అనుభవ సంపదను కూడా పొందింది. అదే సమయంలో, ఇతర సంస్కృతుల విజయాల నుండి మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోగలమో తెలుసుకోవడానికి, సహాయకరమైన సూచనలు,నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతించడానికి కూడా మనము ఆసక్తిగా ఉన్నాము. అయితే, మనకు ఉపన్యాస౦ ఇచ్చేహక్కు తమకుందని భావి౦చేవారి పవిత్రమైన ప్రవచనాలు మన౦ అ౦గీకరి౦చము. పార్టీ మరియు చైనా ప్రజలు మన కోసం మనం ఎంచుకున్న మార్గంలో విస్తృత పురోగతిలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాము, చైనా అభివృద్ధి మరియు పురోగతి యొక్క భవిష్యత్తును మన చేతుల్లో స్థిరంగా ఉండేలా చూస్తాము.
జాతీయ రక్షణ, సాయుధ దళాల ఆధునికీకరణను మనం వేగవంతం చేయాలి. బలమైన దేశానికి బలమైన సైన్యం ఉండాలి, ఎందుకంటే అప్పుడు మాత్రమే అది దేశ భద్రతకు హామీ ఇవ్వగలదు. హింసాత్మక పోరాటంలో నిమగ్నమైన సమయంలో, పార్టీ తుపాకీని ఆజ్ఞాపించి, తన సొంత ప్రజల సైన్యాన్ని నిర్మించాలనే తిరుగులేని సత్యాన్ని గుర్తించింది. పార్టీ తరఫున, ప్రజల తరఫున పీపుల్స్ మిలిటరీ చెరగని విజయాలు సాధించింది. ఇది మన సోషలిస్టు దేశాన్ని కాపాడటానికి మరియు జాతీయ గౌరవాన్ని కాపాడటానికి బలమైన స్తంభం, మరియు మన ప్రాంతంలోను వెలుపలా శాంతిని రక్షించడానికి బలమైన శక్తి.
ముందుకు సాగే ప్రయాణంలో, కొత్త యుగంలో సైనిక బలాన్ని, అలాగే కొత్త శకం కోసం మన సైనిక వ్యూహాన్ని బలోపేతం చేయడంపై పార్టీ ఆలోచనను పూర్తిగా అమలు చేయాలి. ప్రజల సాయుధ దళాలపై పార్టీ సంపూర్ణ నాయకత్వాన్ని కొనసాగించాలి, సైనిక అభివృద్ధికి చైనాతనమార్గాన్ని అనుసరించాలి. సాయుధ దళాల రాజకీయ విధేయతను పెంపొందించడానికి, సంస్కరణ మరియు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాటిని బలోపేతం చేయడానికి మరియు సమర్థులైన సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి, చట్టానికి అనుగుణంగా వాటిని నడపడానికి మేము సమగ్రమైన చర్యలు తీసుకుంటాము. మన జాతీయ సార్వభౌమత్వాన్ని, భద్రతను, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడటానికి మరింత సామర్థ్యం, మరింత విశ్వసనీయమైన మార్గాలను కలిగి ఉండటానికి మనము ప్రజల సాయుధ దళాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు పెంచుతాము.
భాగస్వామ్య భవిష్యత్తుతో మానవ సమాజాన్ని నిర్మించడాన్ని ప్రోత్సహించడానికి మనం కృషి చేయడం కొనసాగించాలి.’ శాంతి, సమన్వయం,సామరస్యం’ అనేవి చైనా దేశం 5,000 సంవత్సరాలకు పైగా అనుసరించిన ఇంకా ముందుకు తీసుకెళ్లిన ఆలోచనలు. చైనా దేశపు జన్యువుల్లో దూకుడు లేదా ఆధిపత్య లక్షణాలు లేవు. పార్టీ మానవాళి భవిష్యత్తు గురించి శ్రద్ధ వహిస్తుంది, మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రగతిశీల శక్తులతో కలిసి ముందుకు సాగాలని కోరుకుంటుంది. ప్రపంచ శాంతిని కాపాడటానికి, ప్రపంచ అభివృద్ధికి దోహదపడటానికి మరియు అంతర్జాతీయ క్రమాన్ని కాపాడటానికి చైనా ఎల్లప్పుడూ కృషి చేసింది.
ముందుకు సాగే ప్రయాణంలో శాంతి, అభివృద్ధి, సహకారం, పరస్పర ప్రయోజనాలను పెంపొందించడానికి, శాంతికి సంబంధించిన స్వతంత్ర విదేశాంగ విధానానికి, శాంతియుత అభివృద్ధి మార్గానికి మనం కట్టుబడి ఉంటాము. ఒక కొత్త రకమైన అంతర్జాతీయ సంబంధాలను నెలకొల్పడానికి, భాగస్వామ్య భవిష్యత్తు గల మానవ సమాజాన్ని నిర్మించడానికి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్[BRI] తో, ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఉన్నత నాణ్యతా ప్రమాణాలు గల అభివృద్ధిని ప్రోత్సహించడానికి, అభివృద్ధిలో చైనాసాధించే కొత్త విజయాలను ఉపయోగించుకోవడానికి ప్రపంచానికి కొత్త అవకాశాలను అందించడానికి మనము కృషి చేస్తాము. శాంతి, అభివృద్ధి, నిష్పాక్షికత, న్యాయం, ప్రజాస్వామ్యం మరియు స్వేచ్ఛ యొక్క భాగస్వామ్య మానవ విలువలను ప్రోత్సహించడానికి శాంతిని ప్రేమించే అన్ని దేశాలు మరియు ప్రజలతోకలిసి పార్టీ పనిచేస్తూనే ఉంటుంది. మేము ఘర్షణల కంటే సహకారానికి, మా తలుపులు మూసివేయడం కంటే తెరచి వుంచడానికి,’సున్నా-మొత్తం’ వంటి వ్యవహారాలకు బదులు పరస్పర ప్రయోజనాలపై దృష్టి సారిస్తాము. మనము ఆధిపత్యాన్ని,ఆధిపత్య రాజకీయాలను వ్యతిరేకిస్తాము. చరిత్ర చక్రాలను ప్రకాశవంతమైన క్షితిజాల వైపు నడిపించటానికి కృషి చేస్తాము.
మనము చైనీయులం న్యాయాన్ని సమర్థించే ప్రజలం. బలదర్పం తో చేసే బెదిరింపులకు భయపడము. ఒక దేశంగా మనకు గర్వం ,బలమైన విశ్వాస భావనలు వున్నాయి . మనము మరే ఇతర దేశ ప్రజలను ఎన్నడూ బెదిరించలేదు, అణచివేయలేదు లేదా లొంగదీసుకోలేదు, మనము అలా ఎన్నడూ చేయము. అదే సమయంలో, ఏ విదేశీ శక్తి కూడా మనల్ని బెదిరించడానికి, అణచివేయడానికి లేదా లొంగదీయటానికి ప్రయత్నించటం ఎన్నడూ అనుమతించము. అలా చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే 140 కోట్లకు పైగా చైనా ప్రజలతో ఏర్పడిన ఉక్కు గోడకు తల మోదుకోక తప్పదు.
అనేక సమకాలీన అంశాలపై మనం గొప్ప పోరాటాన్ని చేపట్టాలసివుంది . పోరాడటానికి ధైర్యం మరియు గెలవగలమనే విశ్వాసం కలిగి ఉండటం మన పార్టీని అజేయంగా చేశాయి. మన గొప్ప కలను సాకారం చేసుకోవడం కోసం కష్టపడి పనిచేయడం, పట్టుదల కలిగి వుండటం అవసరం అవుతుంది. ఈ రోజు, మనం జాతీయ పునరుజ్జీవన లక్ష్యాన్ని అందుకోవడానికి మునుపెన్నడూ లేనంత దగ్గరగా వున్నాము. మరింత ఆత్మవిశ్వాసంతో మరింత సామర్థ్యంతో ఉన్నాము. అయితే అక్కడికి చేరుకోవడానికి గతంలో కంటే కూడా ఎక్కువ కష్టపడటానికి మనం సిద్ధంగా ఉండాలి.
రాబోయే ప్రయాణంలో, మనం మరింత పటిష్టమైన జాగరూకతను ప్రదర్శించాలి. ప్రశాంతమైన సమయాల్లో కూడా, ప్రమాదం సంభవించే అవకాశం వుందని ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. జాతీయ భద్రత విషయంలో, అభివృద్ధి-భద్రతా అనివార్యతలను సమతుల్యం చేసే ఒక సంపూర్ణ విధానాన్ని మనం అవలంబించాలి. శతాబ్దాని కోసారి జరిగే మార్పులతో ఈ ప్రపంచం మారిపోతున్న విస్తృత సందర్భం గమనిస్తూ మనం జాతీయ పునరుజ్జీవ వ్యూహాన్ని అమలు చేయాలి. చైనా సమాజంలో ప్రధాన వైరుధ్యం మారడం వల్ల ఉత్పన్నమయ్యే కొత్త లక్షణాలు, ఆవశ్యకతల గురించి, సంక్లిష్టమైన అంతర్జాతీయ వాతావరణం వల్ల ఉత్పన్నమయ్యే కొత్త సమస్యలు, సవాళ్ల గురించి -మనం పూర్తి అవగాహనను పెంపొందించుకోవాలి. మన పోరాటాన్ని నిర్వహించడానికి, కొత్త మార్గాలను రూపొందించడంలో అన్ని ప్రమాదాలను,సవాళ్లను అధిగమించడానికి అవసరమైన కొత్త వంతెనలు నిర్మించడంలో మనం ధైర్యమూ నైపుణ్యమూ కలిగి ఉండాలి.
చైనా ప్రజలలో వున్న గొప్ప ఐక్యతను మనం బలోపేతం చేయాలి. గత శతాబ్దంలో మన పోరాటాల సమయంలో, పార్టీ ఎల్లప్పుడూ ఐక్య సంఘటనకు చాలా ప్రాముఖ్యతగల స్థానం ఇచ్చింది. సాధ్యమైనంత విస్తృతంగా ఐక్య సంఘటనను సంఘటితం చేసి, అభివృద్ధి చేసాము. ఐక్యం కాగల అన్ని శక్తులను ఏకం చేసాము. సమీకరించగల అన్ని సానుకూల శక్తులనూ సమీకరించాము. సమిష్టి ప్రయత్నాలకు సాధ్యమైనంత ఎక్కువ బలాన్ని సమీకరించాము. జాతీయ పునరుజ్జీవం లక్ష్యం వెనుక-చైనా దేశపు కుమారులు,కుమార్తెలందరినీ= స్వదేశంలోనూ విదేశాలలోనూ- ఏకం చేయడానికి దేశభక్తి ఐక్యసంఘటన అనేది పార్టీకి ఒక ముఖ్యమైన మార్గం.
ముందుకు సాగడానికి, మనం గొప్ప ఐక్యత,సంఘీభావం కలిగి వుండాలి. సాధారణత్వం- వైవిధ్యాల మధ్య సమతులనం నిర్ధారించుకోవాలి . మనం సైద్ధాంతిక, రాజకీయ మార్గదర్శకాలను బలోపేతం చేయాలి, విస్తృత ఏకాభిప్రాయాన్ని నిర్మించాలి. ప్రకాశవంతమైన మేధస్సులను ఒకచోట చేర్చాలి, ఉమ్మడి ప్రాతిపదికను విస్తరించాలి ప్రయోజనాల ఏకీకరణపై కేంద్రీకరించాలి. తద్వారా స్వదేశంలోను,విదేశాలలోను వున్న చైనా ప్రజలందరూ , తమ శక్తి యుక్తులను ని ఒకే లక్ష్యంపై కేంద్రీకరించి, జాతీయ పునరుజ్జీవాన్ని సాకారం చేయడానికి ఒక బలమైన శక్తిగా కలిసి రాగలరు.
పార్టీ నిర్మాణమనే గొప్ప కొత్త ప్రాజెక్టును మనం ముందుకు తీసుకు వెళ్ళాలి. చైనా కమ్యూనిస్ట్ పార్టీని ఇతర రాజకీయ పార్టీల నుండి వేరు చేసే ఒక చిహ్నం స్వీయ సంస్కరణను చేపట్టడంలో పార్టీకి గల ధైర్యం. అనేక పరీక్షలు, కష్ట నష్టాలు సంభవించినప్పటికి పార్టీ చాలా సజీవంగా,శక్తివంతంగా ఉండటానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఇది సమర్థవంతమైన స్వీయ పర్యవేక్షణను అమలు చేస్తుంది. కఠినమైన, సంపూర్ణమైన స్వీయ పరిపాలనను ఆచరిస్తుంది. ఈ విధంగా పార్టీ వివిధ చారిత్రక దశలలో ఎదురైన కష్టాలకు, కాలపరీక్షలకు తగిన విధంగా ప్రతిస్పందించ గలిగింది. అందుకే లోతైన మార్పులు ప్రపంచ పటాన్ని తుడిచిపెట్టుకు పోతున్నప్పటికీ ఇది ఎల్లప్పుడూ కాలానికి ముందు వరసలో నిలబడింది. స్వదేశంలోను, విదేశాలలోను ఎదురైన వివిధ సవాళ్లను తీర్చే ప్రక్రియలన్నిటా దేశానికి వెన్నెముకగా స్థిరంగా వ్యవహరించింది .
ముందుకు సాగే ప్రయాణంలో, మంచి ఉక్కును తయారు చేయడానికి మంచి కమ్మరి అవసరమనే పాత సామెతను మనం దృఢంగా గుర్తుంచుకోవాలి. సంపూర్ణమైన, కఠినమైన స్వీయ పాలన అనేది ఎప్పటికీ అంతం కాని ప్రయాణం అనే వాస్తవం గుర్తించి మనం మరింత రాజకీయ అవగాహనను ప్రదర్శించాలి. రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడం విస్తృత సూత్రంగా, కొత్త యుగంలో పార్టీ నిర్మాణమనే గొప్ప కొత్త ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళడం కొనసాగించాలి. పార్టీ సంస్థాగత వ్యవస్థను కఠినతరం చేయాలి, నైతిక సమగ్రత, వృత్తి పరమైన సామర్ధ్యం ఉన్న ఉన్నత స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వడానికి కృషి చేయాలి, పార్టీ ప్రవర్తనను మెరుగు పరచడానికి, సమగ్రతను నిలబెట్టడానికి, అవినీతిని ఎదుర్కోవటానికి కట్టుబడి ఉండాలి. పార్టీ యొక్క అధునాతన స్వభావం మరియు స్వచ్ఛతలకు హాని కలిగించే ఏఅంశాల నైనా,దాని ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ఏ వైరస్ల నయినా పెకలించి వేయాలి. పార్టీ తన సారాన్ని, రంగును, స్వభావాన్ని కాపాడుకునేలా చూడాలి. కొత్త యుగంలో చైనా లక్షణాలతో కూడిన సోషలిజాన్ని నిలబెట్టడం, అభివృద్ధి చేయడంలో అది ఎల్లప్పుడూ బలమైన నాయకత్వ కేంద్రంగా పనిచేసేలా మనం చూడాలి.
కామ్రేడ్స్ మరియు స్నేహితులారా
“ ఒక దేశం రెండు వ్యవస్థలు” అనే సూత్రీకరణను చిత్తశుద్ధితో అమలుచేయడంలో మనం అక్షరాలా ఆ స్పూర్తికి కట్టుబడి వుంటాము . ఈ అవగాహనతోనే హాంగ్ కాంగ్ ప్రజలు హాంగ్ కాంగ్ను, మకావో ప్రజలు మకావోను అధిక స్థాయి స్వయంప్రతిపత్తితో నిర్వహిస్తారు. హాంగ్ కాంగ్ మరియు మకావ్ల పై, మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తన అధికార పరిధిని ఈ స్పూర్తితోనే వినియోగించుకుంటుంది. జాతీయ భద్రతను కాపాడటానికి రెండు ప్రత్యేక పరిపాలనా ప్రాంతాలకు న్యాయ వ్యవస్థలను వాటిని అమలు చేసే యంత్రాంగాలను వినియోగిస్తాము. చైనా సార్వభౌమత్వాన్ని, భద్రతను, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడుతూ, హాంగ్ కాంగ్, మకావ్ లలో సామాజిక స్థిరత్వాన్నినిలబెడతాము. రెండు ప్రత్యేక పరిపాలనా ప్రాంతాల్లో చిరకాలం శ్రేయస్సు, స్థిరత్వాలను కాపాడుతాము.
తైవాన్ సమస్యను పరిష్కరించడం, చైనా యొక్క సంపూర్ణ పునరేకీకరణను సాధించడం ఒక చారిత్రక కర్తవ్యం. ఇది చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అచంచల నిబద్ధత. ఇది చైనా దేశం యొక్క కుమారులు, కుమార్తెలందరి సమష్టి ఆకాంక్ష కూడా. మేము ఒకేచైనా సూత్రాన్ని,1992 ఏకాభిప్రాయాన్ని సమర్థిస్తాము. శాంతియుత జాతీయ పునరేకీకరణను ముందుకు తీసుకువెళతాము. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న మనమందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగాలి. “తైవాన్ స్వాతంత్ర్యం” దిశగా ఏ ప్రయత్నాన్నైనా పూర్తిగా ఓడించడానికి మనం దృఢమైన చర్య తీసుకోవాలి. జాతీయ పునరుజ్జీవనానికి ఉజ్వల భవిష్యత్తును సృష్టించడానికి కలిసి పనిచేయాలి. చైనా ప్రజలు తమ జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే సంకల్పాన్ని,సామర్థ్యాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయకూడదు.
కామ్రేడ్స్ మరియు స్నేహితులారా
భవిష్యత్తు యువతకు చెందినది, మన ఆశలు కూడా వారిపైనే ఉన్నాయి. ఒక శతాబ్దం క్రితం, యువ అభ్యుదయవాదుల బృందం మార్క్సిజం అనే దివిటీని ఎత్తి పట్టుకుని, చైనా దేశాన్ని పునరుజ్జీవింపజేయడానికి మార్గాల కోసం ఆ చీకటి సంవత్సరాలలో శ్రద్ధానిష్టలతో శోధించింది. అప్పటినుండి, చైనా కమ్యూనిస్ట్ పార్టీ పతాకం కింద, తరతరాలుగా యువ చైనీయులు తమ యవ్వనాన్ని పార్టీ మరియు ప్రజల కోసం అంకితం చేశారు, దేశాన్ని పునరుజ్జీవింప జేయడానికి ముందువరుసలో నడుస్తున్నారు..
కొత్త యుగంలో, మన యువకులు జాతీయ పునరుజ్జీవనానికి దోహదపడటం తమ లక్ష్యంగా చేసుకోవాలి. సగర్వంగా, ఆత్మవిశ్వాసంతో, చైనా ప్రజలుగా వారికున్న గుర్తింపులో భరోసాతో జీవించటం ఆశించాలి, తద్వారా వారు యువతచేసే వాగ్దానాలకి, మన కాలం, మన పార్టీ, మన ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించగలరు.
కామ్రేడ్స్ మరియు స్నేహితులారా
ఒక శతాబ్దం క్రితం, పార్టీ స్థాపించబడిన సమయంలో, చైనా కమ్యూనిస్ట్ పార్టీ కేవలం 50 మందికి పైగా సభ్యులను కలిగి ఉంది. నేడు 140 కోట్లకు పైగా ప్రజలు ఉన్న దేశంలో 9.5 కోట్ల మంది పైగా సభ్యులతో, ఇది ప్రపంచంలో అతిపెద్ద పాలక పార్టీగా ఉంది. అద్భుతమైన అంతర్జాతీయ ప్రభావాన్నికలిగి ఉంది.
ఒక శతాబ్దం క్రితం, ప్రపంచం దృష్టిలో చైనా క్షీణించి పోయి వుంది. అది ఎండి రాలి పోతోంది. నేడు, అది ప్రపంచానికి అందించే చిత్రపటం – పునరుజ్జీవనం దిశగా ఆపలేని వేగంతో ముందుకు సాగుతున్న, అభివృద్ధి చెందుతున్న దేశం
గత శతాబ్దంలో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రజల తరఫున అసాధారణ చారిత్రక విజయాలను సాధించింది. ఈ రోజు, రెండవ శతాబ్ది లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా చైనా ప్రజలను ఒక కొత్త ప్రయాణానికి సమీకరించి నడిపిస్తోంది.
పార్టీ సభ్యులందరికీ,
మన పార్టీ వ్యవస్థాపక లక్ష్యానికి కట్టుబడి ఉండాలని, మీ ఆదర్శాలు మరియు నమ్మకాలలో సుదృఢంగా నిలబడాలని, కేంద్ర కమిటీ మీలో ప్రతి ఒక్కరినీ కోరుతోంది. పార్టీ ప్రయోజనాల కనుగుణంగా వ్యవహరిస్తూ , మీరు ఎల్లప్పుడూ ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలి, సహానుభూతి చెందాలి, వారితో కలసి మెలసి పనిచేయాలి, మంచీ చెడులలో వారితోనే నిలబడాలి. మెరుగైన జీవితం కోసం వారి ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి, పార్టీకి మరియు ప్రజలకు మరింత గొప్ప కీర్తిని తీసుకురావడానికి అవిశ్రాంతంగా పనిచేయడం కొనసాగించాలి.
కామ్రేడ్స్ మరియు స్నేహితులారా
నేడు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ, దాని స్థాపన నుండి వంద సంవత్సరాల తరువాత, ఇప్పటికీ దాని ప్రధాన స్థానంలో ఉంది. చైనా దేశానికి శాశ్వత గొప్పతనాన్ని సాధించడానికి ఎప్పటిలాగే నిశ్చయించుకుంది. మేము ప్రయాణించిన మార్గాన్ని తిరిగి చూస్తే, రాబోయే ప్రయాణం కోసం, పార్టీ యొక్క దృఢమైన నాయకత్వం మరియు అన్ని ఎత్నిక్ సమూహాల చైనా ప్రజల గొప్ప ఐక్యతతో, మేము అన్ని విధాలుగా గొప్ప ఆధునిక సోషలిస్టు దేశాన్ని నిర్మించాలనే లక్ష్యాన్ని సాధిస్తాము. జాతీయ పునరుజ్జీవనం అన్న చైనీయుల కలను నెరవేరుస్తాము.
ఘనమైన, అద్భుతమైన, సరైన మనపార్టీ వర్ధిల్లాలి
ఘనమైన, అద్భుతమైన, వీరులైన మన ప్రజలు వర్ధిల్లాలి “
(ఈ ప్రసంగం ఇంగ్లీష్ అనువాదం ఇక్కడ ఉంది)