పోలీసులు అనుకుంటే ఏమైనా చేయగలరు? చట్ట ప్రకారం కేసులు పెట్టగలరు, చట్టం లేకపోయినా పెట్టగలరు. ఈ రోజు సుప్రీం కోర్టు దృష్టికి రెండో క్యాటగరి పరిశీలనకు వచ్చింది. రాజ్యాంగ వ్యతిరేకమని, చెల్లదని సుప్రీంకోర్టు ఎపుడో 2015 లోనే కొట్టేసిన ఒక సెక్షన్ ప్రకారం వేల కొలది ఎఫ్ ఐఆర్ లు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ నారిమన్ దారుణం జరిగిపోతున్నది (Amazing, That’s all that I can say. Shreya Singhal is a 2015 judgment. What is going on is terrible) అని వ్యాఖ్యానించారు.
ఈ సెక్షన్ ఏంటటే ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టలోని 66A. శ్రేయ సింగల్ కేసులో ఎపుడో 2015లోనే సుప్రీంకోర్టు ఈ సెక్షన్ కొట్టి వేసింది.
అసలు విషయం ఏంటంటే…
సుప్రీంకోర్టు కొట్టి వేసిన సెక్షన్ కింద పోలీసులు ఏడా పెడా కేసులు పెడుతున్నందున, కోర్టు స్పషమమయిన ఆదేశాలివ్వాల్సిన అవసరం ఉందని పియుసిఎల్ (People’s Union for Civil Liberties) కోర్టును ఆశ్రయించింది.
జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పరిశీలించింది. పియుసిఎల్ తరఫు సీనియర్ అడ్వకేట్ సంజయ్ పారిఖ్ 66A సెక్షన్ ని కొట్టేసినా దేశమంతా ఈ సెక్షన్ కింద కేసులు పెడుతున్న విషయాన్ని కోర్టు దృష్టి తీసుకువచ్చారు.
దీనితో “ఇది షాకింగ్ ,మేము ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నాం” అని జస్టిస్నారిమన్ పేర్కొన్నారు.
ఈ సెక్షన్ కొట్టేసినా, యాక్ట్ (bare Act) లో ఇంకా ఈసెక్షన్ కొనసాగుతూ ఉందని, కాకపోతే ఫుట్ నోట్ లో మాత్రమే ఈ సెక్షన్ కొట్టివేసినట్లు రాశారని అటర్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వివరించే ప్రయత్నం చేశారు.
దీని మీద జస్టిస్ నారిమన్ రియాక్టవుతూ పోలీసులు ఫుట్ నోట్ ని చూడరా అని ప్రశ్నించారు.
దీని మీద కోర్టు ఏదో ఒకటి చేస్తుందని చెబుతూ అఫిడవిట్ వేయాలని కేంద్రాన్ని ఆదేశించారు.కేసు విచారణను రెండువారాలకు వాయిదా వేశారు.
శ్రేయ సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసేమిటి?
ఈ కేసు పిటిషన్ 2012లో దాఖలయింది. దీని మీద జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రోహింగ్టన్ ఫాలి నారిమన్ 2015 మార్చి 4న ఈ సెక్షన్ రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు ఇచ్చారు.
ఈ సెక్షన్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని 66A. శ్రేయ సింగ్ ల్ కేసులో ఎపుడో 2015లోనే సుప్రీంకోర్టు ఈ సెక్షన్ చెల్లదని కొట్టి వేసింది.
ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66A ని దుర్వినియోపరుస్తున్నారని చెబుతూ 2012 లో శ్రేయ సింగల్ అనే న్యాయ శాస్త్ర విద్యార్థి సుప్రీంకోర్టులో పిల్ (PIL) వేశారు.
మహారాష్ట్రంలో శివసేన నేత బాల్ థాకరే చనిపోయినపుడు ఆ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపును వ్యతిరేకించినందుకు ఇద్దరు విద్యార్థినుల మీద పోలీసులు కేసుపెట్టారు.
బంద్ ను వ్యతిరేకిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టినందుకు ఒకరిని, దానిని లైక్ చేసినందుకు మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇది నేరపూరిత పోస్టుఅని, ఐటియాక్ట్ సెక్షన్ 66A కింద వారి మీద కేసు పెట్టారు.ఈ సెక్షన్ కిందనేరం చేస్తే జరిమానాతో మూడేళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది.
2000 సంవత్సరంలో ఐటియాక్ట్ తయారయినపుడు ఈసెక్షన్ లేదు. 2009లో చట్టాన్ని సవరించినపుడు ఈ సెక్షన్ వచ్చి చేరింది. 27.10.2009 నుంచి ఇది అమలులోకి వచ్చింది.
దీనిని జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ నారిమన్ ధర్మాసనం కొట్టివేసింది.” Section 66A of the Information Technology Act, 2000 is struck down in its entirety as being violative of Article 19(1)(a) and not saved under Article 19(2). అని వారు తీర్పు చెప్పారు. అయినా పోలిసులు ఈ సెక్షన్ ని ప్రయోగిస్తూనే వున్నారు. ఎంత మంది జైల్ కు పోయారో.